లాడెన్ సన్ పగ్గాలు చేపట్టాడు

Update: 2017-09-24 17:30 GMT

గత కొద్దికాలంగా బలహీనపడుతున్న ఉగ్రవాద సంస్థలు క్రమంగా బలపడుతున్నాయి. తిరిగి కార్యకలాపాలను కొనసాగించేందుకు సిద్ధపడుతున్నాయి. మరికొన్ని సంస్థలు రాజకీయ రూపం సంతరించుకోవడం మరో తాజా పరిణామం. పశ్చిమ దేశాలపై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమపడుతున్నాయి.

రంగంలోకి దిగిన హమ్జా.....

ఒకప్పుడు అమెరికాపై దాడులతో యావత్ ప్రపంచాన్ని వణికించిన ఒసామా బిన్ లాడెన్ ఆధ్వర్యంలోని ఆల్ ఖైదా మళ్లీ పునరుద్ధానికి సన్నాహాలు చేసుకుంటోంది. లాడెన్ తనయుడు తన తండ్రి స్థాపించిన సంస్థను ముందుకు తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేస్తున్నారని చెబుతున్నారు. న్యూయార్క్ జంట పేలుళ్ల అనంతరం అమెరికా చేతిలో ఒసామా బిన్ లాడెన్ హతమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు లాడెన్ మూడో భార్య కుమారుడైన హమ్జా ఈ బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకున్నట్లు అంటున్నారు. తండ్రి మరణానంతరం బలహీన పడిన సంస్థనున బలోపేతం చేసే పనిలో ప్రస్తుతం హమ్జా ఉన్నాడు. ఆల్ ఖైదా బలహీన పడటంతో ఈసంస్థకు చెందిన కొందరు సభ్యులు ఐఎస్ఐఎస్ తదితర ఉగ్రవాద సంస్థలకు వలస వెళ్లారు. ఇరాక్, సిరియా తదితర ప్రాంతాల్లో వరుస దాడులతో ఇప్పుడు ఐసిస్ ఒకింత బలహీన పడింది. దీంతో అక్కడి సభ్యులు మళ్లీ ఆల్ ఖైదా వైపు చూస్తున్నారు. లాడెన్ ఆధ్వర్యంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడులు జరిగిన సమయంలో చిన్న పిల్లవాడైనా హమ్జా ఇప్పుడు యుక్తవయస్సులో ఉన్నాడు. 28 సంవత్సరాల హమ్జా ప్రస్తుతం పరిస్థితులను అర్ధం చేసుకుంటున్నాడు. దక్షిణాసియా, పశ్చిమాసియా, యూరప్ లలో జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. తన తండ్రి పాత అనుచరులను దగ్గరకు చేర్చుకుంటున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా గల జీహాదీలను ఏకం చేసే ప్రయత్నాల్లో హమ్జా ఉన్నాడు. ఫలితాలు సానుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు.

జీహాదీ సభ్యులతో టచ్ లో.....

సంస్థను ముందుకు నడిపే క్రమంలో భాగంగా హమ్జా తనను తాను తీర్చిదిద్దుకుంటున్నాడు. ఆయుధాల వినియోగంలో మెళుకువలను నేర్చుకుంటున్నాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడికి ముందు లాడెన్ అనుచరులు హమ్జాను తండ్రి నుంచి తీసుకెళ్లారు. ఆ తర్వాత తండ్రిని కలిసింది లేదు. అయినప్పటికీ తండ్రితో పాటు జీహాదీ సభ్యులతో తరచూ ఉత్తరప్రత్యుత్తరాలు జరిపేవాడు. కాబూల్ నుంచి బాగ్దాద్ వరకూ గాంజా నుంచి వాషింగ్టన్, లండన్, పారిస్, టెల్ అనీస్ వరకూ వివిధ ప్రాంతాల్లో గల జీహాదీలు ఏకం కావాలని 2015 హమ్జా పిలుపునిచ్చాడు. ఈ మేరకు ఆయన ఆడియో సందేశాలు విడుదలయ్యాయి. హమ్జా పునరాగమనాన్ని అమెరికా గూఢాచారి వర్గాలు నిర్ధారిస్తున్నాయి.

పాలిటిక్స్ లోకి ఉగ్రవాద సంస్థలు.....

మరోపక్క పాకిస్థాన్ లోని ఉగ్రవాద సంస్థలు రాజకీయ రూపం సంతరించుకోవడం తాజా పరిణామం. సైన్యం ఆశీస్సులతోనే ఉగ్రవాద సంస్థలు ప్రజాక్షేత్రంలోకి అడుగుపెడుతున్నట్లు సమచారం. అంతర్గతంగా ఎలా ఉన్నప్పటికీ కొన్ని సంప్రదాయ రాజకీయ పార్టీలు భారత్ తో సత్సంబంధాలు నెలకొల్పుకోవాలని చెబుతున్న తరుణంలో సైన్యం ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తున్నట్లు రాజకీయ విశ్లేషఖులు భావిస్తున్నారు. ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయ్యద్ ముస్లిం లీగ్ అనే పార్టీని స్థాపించాడు. ఇటీవల లాహోర్ జాతీయ అసెంబ్లీ (ఎన్ఏ 120) స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేశాడు. ఇప్పటి వరకూ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆయనను అనర్హుడిగా ప్రకటించడంతో ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది. ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహరిక్ ఇ ఇనాఫ్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ యస్మీన్ రషీద్ పోటీ చేశారు. పీఎంఎల్ (పాకిస్థాన్ ముస్లిం లీగ్) అభ్యర్థిగా పోటీ చేసిన నవాజ్ షరీఫ‌ భార్య కుల్సుం బేగం విజయం సాధించారు. ఉగ్రవాద సంస్థ అభ్యర్థి యాకుబ్ షేక్ పరాజయం పాలయినప్పటికీ చింతించడం లేదు. ఈ అనుభవం మున్ముందు తనకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాడు. మరో ఉగ్రవాద సంస్థ అన్సర్ అల్ ఉమా అధిపతి ఫజుబుల్ రెహ్మాన్ ఖలీల్ తాను కూడా పార్టీని స్థాపించినట్లు వెల్లడించాడు.

షరీఫ్ పై కుట్ర జరిగిందా?

ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో తమ ప్రమేయమేమీ లేదని సైన్యాధిపతి జనరల్ బజ్వా చెబుతున్నప్పటికీ ఆయన మాటలను విశ్వసించడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో సైన్యాధిపతులందరూ ఇలాంటి ప్రకటనలే చేసినప్పటికీ సమయం వచ్చినప్పుడు పౌర ప్రభుత్వాలను పడగొట్టేందుకు వారు వెనుకాడలేదు. ఆర్మీ చీఫ్ గా 90వ దశకంలో నాటి ప్రధాని నవాజ్ షరీఫ్ ఏరికోరి పర్వేజ్ ముషారఫ్ ను ఎన్నుకున్నారు. చివరకు ఆయనే షరీఫ్ ను పదవీచ్యుతుడిని చేయడం గమనార్హం. ఏడాది క్రితం షరీఫ్ తన మనిషిగా భావించి బజ్వాను ఆర్మీ చీఫ్ గా ఎంపిక చేశారు. ఇటీవలే షరీఫ్ పదవి నుంచి వైదొలగవలసి వచ్చింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు షరీఫ్ ను అనర్హుడిగా ప్రకటించడంతో ఆయన వైదొలిగారు. అయితే ఈ తతంగం వెనక సైన్యం పాత్ర ఉన్నట్లు పాక్ లో ప్రచారం జరుగుతోంది. న్యాయవ్యవస్థ, సైన్యం కుమ్మక్కై షరీఫ్ కు వ్యతిరేకంగా కధ నడిపినట్లు అక్కడి రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏది ఏమైనా ఉగ్రవాద మూకలు మళ్లీ జవసత్వాలు నింపుకోవడం ప్రపంచానికి ప్రమాదకరం. పొరుగున ఉన్న భారత్ వంటి దేశాలకు ఇది మరింత ఆందోళన కల్గించే అంశం.

 

- ఎడిటోరియల్ డెస్క్

Similar News