రేవంత్ ... సింగిల్ సింహమేనా?

Update: 2017-10-30 14:30 GMT

సిద్దాంత రాద్ధాంతాలు, నైతిక నియమాలు, మిత్రత్వాలు, శతృత్వాలు వంటి శషభిషలు లేకుండా.. సాగుతున్న పరిణామాలు, సమకాలీన అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోమంటుంది జర్మన్ పొలిటీషియన్ లుడ్విగ్ వాన్ రోచు ప్రతిపాదించిన రియల్ పొలిటిక్ ఫిలాసఫీ. అచ్చంగా అలాగే ఆచరించి చూపించారు రేవంత్ రెడ్డి. అఖిలభారత విద్యార్థి పరిషత్ లో రాజకీయ ఓనమాలు దిద్దుకుని, టీఆర్ఎస్ కార్యకర్తగా రెండేళ్ల పాటు పనిచేసి తర్వాత స్వతంత్ర పంథాను ఎంచుకున్నారు. ఇండిపెండెంటుగానే జెడ్పీటీసీ సభ్యునిగా, ఎమ్మెల్సీగా ఎన్నికై తర్వాత కాలంలో తెలుగుదేశం లో ప్రవేశించారు. పార్టీకి ఉన్న పటిష్ఠమైన క్యాడర్ బేస్ ను ప్రాతిపదికగా చేసుకుంటూ తన వ్యూహనైపుణ్యం జోడించి రాష్ట్రస్థాయి నాయకునిగా ఎదిగారు. ఏ దశలోనూ కాంగ్రెసు పార్టీతో సంబంధం లేకపోయినా, కాంగ్రెసు వ్యతిరేక రాజకీయాలతోనే తన 15 సంవత్సరాల ప్రజాజీవితం ముడిపడి ఉన్నా ఇప్పుడు అదే పార్టీలో భాగస్వామి. కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా పురుడు పోసుకున్నటీడీపీలో ప్రముఖస్థానానికి ఎదిగారు. జాతీయ స్థాయిలో కాంగ్రెసు అనుబంధ ఎన్ ఎస్యూఐ కి వ్యతిరేక వేదిక అయిన ఏబీవీపీలో ప్రస్థానం మొదలు పెట్టారు. 2004 నుంచి 2014 వరకూ కాంగ్రెసు రాష్ట్రంలోనూ, దేశంలోనూ అధికారంలో ఉంది. ఆ పార్టీ అగ్రనేతల్లో ఒకరైన జైపాల్ రెడ్డి రేవంత్ రెడ్డికి సమీపబంధువు. అప్పట్లో కాంగ్రెసులో ప్రవేశిస్తే రాజకీయంగా ఉన్నతపదవులు పొందే అవకాశం కూడా ఉండేది. అయినా తాను కాంగ్రెసును ఎంచుకోలేదు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ తనకు సరైన వేదికగా భావించారు. 2007 లో టీడీపీలోకి ప్రవేశించిన తర్వాతనే ఆయన రాష్ట్రస్థాయి గుర్తింపు తెచ్చుకోగలిగారు. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే సమర్థ నాయకునిగా తనను తాను నిరూపించుకోగలిగారు. కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కోగలగరన్న నమ్మకాన్ని విపక్షాల్లో కలిగించగలిగారు. ఆ సామర్థ్యమే ఇప్పుడు హస్తిన ద్వారాలు తెరుచుకునేలా చేయగలిగింది. కాంగ్రెసు రెడ్ కార్పెట్ స్వాగతానికి కారణంగా నిలిచింది.

సీఎం అభ్యర్థి కాదు....

కాంగ్రెసు పార్టీలో ప్రధానంగా ముఖ్యమంత్రి అభ్యర్థులకు కొరత లేదు. రేవంత్ రెడ్డి వస్తే తమకు ఎక్కడ పోటీగా మారతాడోనని ఇందులో కొందరు మానసికక్షోభకు గురైన పరిస్థితి ఉంది. గడచిన ఆరునెలల కాలంలో రేవంత్ కాంగ్రెసు ప్రవేశానికి సంబంధించి చర్చలు సాగుతున్నాయి. అయినప్పటికీ తెలంగాణకు చెందిన కొందరు నాయకుల అభ్యంతరాలతో నిర్ణయం వాయిదా పడుతూ వచ్చింది. రాను రాను టీఆర్ఎస్ మరింత బలపడుతూ ఉండటం, కాంగ్రెసు నాయకులు రాష్ట్రస్థాయి ప్రభావాన్ని చూపలేని పరిస్థితులపై అధిష్టానం ఒక అవగాహనకు వచ్చింది. ఎవరున్నా లేకున్నా రేవంత్ రాక ఖాయం. మీకు ఇష్టం లేకపోతే పార్టీని విడిచివెళ్లిపోవచ్చన్న కఠిన వైఖరిని అధిష్టానం తీసుకున్న తర్వాతనే కాంగ్రెసు రంగప్రవేశానికి లైన్ క్లియర్ అయ్యింది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అనేకమంది నాయకులు కీలకబాధ్యతల్లో ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు, జానారెడ్డి ప్రతిపక్ష నాయకుడు ఇలా అన్నిస్థాయుల్లోనూ ఈ సామాజిక వర్గమే ప్రాధాన్యం పొందుతోంది. ఎస్సీ సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని మల్లు భట్టి విక్రమార్క కు వర్కింగు ప్రెసిడెంటు హోదా కల్పించినప్పటికీ నియోజకవర్గ స్థాయి నేతగానే మిగిలిపోయారు. దీంతో రాష్ట్రస్థాయి ప్రాబల్యాన్ని సంతరించుకున్న రేవంత్ రంగప్రవేశం పార్టీ అవసరాల దృష్ట్యా తప్పనిసరిగా కాంగ్రెసు అధిష్టానం అంచనా వేసింది. కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసినా పార్టీని అధికారంలోకి తెచ్చే సత్తా లేకపోయిన పాత తరం నేతలు , ప్రత్యేకించి ముఖ్యమంత్రి అభ్యర్థులతో రేవంత్ ను పోల్చలేమని ఒక అగ్రనాయకుడు వ్యాఖ్యానించారు. మిగతా నాయకులతో సరి పోల్చకుండా సింగిల్ గానే చూస్తామంటూ రేవంత్ ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పారు. పదవుల రీత్యా ఇమ్మీడియెట్ గా పెద్ద పీట వేయకపోయినప్పటికీ పార్టీలో ఇప్పుడున్న నాయకులకంటే అధిష్ఠానం వద్ద పలుకుబడికి ఎటువంటి డోకా ఉండకపోవచ్చు.

కొప్పుల కీలక పాత్రధారి....

కాంగ్రెసు పార్టీకి రేవంత్ రెడ్డిని చేరువ చేయడంలో ఏఐసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ కొప్పుల రాజు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. గతంలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా పనిచేసిన రాజుకి రాహుల్ గాంధీతో సన్నిహిత సంబంధాలున్నాయి. రాహుల్ టీమ్ లో కోర్ మెంబర్ గా ఉండటంతోపాటు ఎస్సీ,ఎస్టీ అంశాలపై పార్టీ విధానాల రూపకల్పనలో భాగస్వామ్యం వహిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో హైదరాబాద్ కేంద్రంగా చాలాకాలం పాటు పనిచేశారాయన. దాంతో తెలంగాణ పరిస్థితులపై పూర్తిస్థాయి అవగాహన ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెసు నాయకులు 2019లో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తేవడం సాధ్యం కాదని ఆయన అధిష్టానానికి తేల్చి చెప్పేశారు. తెలంగాణలో కాంగ్రెసుకు అండగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం కూడా ఈ సారి చేజారిపోయే అవకాశం ఉందనేది కొప్పుల రాజు నివేదిక సారాంశం. దీంతో పార్టీకి కొంత ఉత్తేజం, ఉత్సాహం తేవాలంటే రేవంత్ వంటి యువనాయకుని అవసరం ఉందని, రెడ్డి సామాజిక వర్గం కూడా పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని రెండు నెలల క్రితమే రాహుల్ ఒక అంచనా కు వచ్చినట్లు తెలిసింది. ఇటీవల కాంగ్రెసుతో కలిసి తెలంగాణలో టీడీపీ ఉద్యమాలు చేయడంలోనూ రేవంత్ కీలకపాత్ర పోషించారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు కూడా కాంగ్రెసు సిద్ధపడింది. ఈ మేరకు రేవంత్, రమణల స్థాయిలో చర్చలు కూడా నడిచాయి. అయితే బీజేపీతో తలెత్తే ఇబ్బందులు, ఆంధ్రప్రదేశ్ సమస్యల నేపథ్యంలో కాంగ్రెసుతో కలిసి నడవడం ఏ రకంగానూ టీడీపీకి కుదరదని చంద్రబాబు నాయుడు ఇటీవల హైదరాబాద్ సమావేశాల్లో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే పొత్తు సంగతిని పక్కనపెట్టి రేవంత్ ను, టీడీపీలోని ముఖ్యనాయకులను కాంగ్రెసులో చేర్చుకునేందుకు రాహుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తాను ప్రధాన ప్రత్యర్థిగా భావించే కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు గాను రేవంత్ సొంతపార్టీ టీడీపీని వదిలేసి కాంగ్రెసులో కలిసిపోయారు. తాజా పరిణామాన్ని పార్టీగా అటు కాంగ్రెసుకు, వ్యక్తిగా ఇటు రేవంత్ కు ఉభయప్రయోజనదాయకమైన నిర్ణయంగా రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News