రేవంత్ నేర్పిన రాజకీయ పాఠం

Update: 2017-10-21 15:30 GMT

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో రాజకీయ రెబల్ స్టార్ గా మారిన రేవంత్ రెడ్డి సీనియర్ నేతలనే శాసిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బెదిరిస్తున్నారు. చంద్రబాబు నాయుడికి తప్ప తానెవరికీ జవాబుదారీ కాదంటూ తేల్చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పార్టీ అధినేతను కూడా పరోక్షంగా భయపెడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో 30,35 సంవత్సరాలుగా తెలుగుదేశం లో ఉంటున్న సీనియర్ నాయకులు రేవంత్ ను అదుపు చేసే అంశంపై సమావేశమయ్యారు. తనకు ఆహ్వానం లేకపోయినప్పటికీ వర్కింగు ప్రెసిడెంటు హోదాలో రేవంత్ సైతం ఇందులో పాల్గొన్నారు. రాహుల్ గాంధీని ఎందుకు కలిశావు? ఎవరి అనుమతి తీసుకున్నావంటూ నిలదీసేందుకు ప్రయత్నించిన ఒకరిద్దరు నేతలకు దిమ్మతిరిగే సమాధానాలిచ్చారాయన. అసలు టీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందంటూ మీరెవరి అనుమతితో ప్రకటించారంటూ పొలిట్ బ్యూరో సభ్యుడైన మోత్కుపల్లి నరసింహులనే ప్రశ్నించారు. ఇదే సందర్భంలో అన్యాపదేశంగా అధిష్టానాన్ని సైతం రేవంత్ హెచ్చరించడం చర్చనీయమవుతోంది. ఓటుకు నోటు సహా అన్ని విషయాలను తాను చంద్రబాబునాయుడుతోనే చర్చిస్తానంటూ ఈ సమావేశంలో కుండబద్దలు కొట్టడంతో నాయకులకు నోట మాట రాలేదు. ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితునిగా కొంతకాలంపాటు రిమాండ్ కు కూడా వెళ్లారు రేవంత్. ఇదే కేసులో చంద్రబాబునాయుడు కీ సంబంధం ఉందని ఆరోపణలు వెల్లువెత్తడమే కాదు. ఛార్జిషీటులో సైతం ఏపీ సీఎం పేరును పలుసందర్బాల్లో ఏసీబీ ప్రస్తావనకు తీసుకొచ్చింది. రాజకీయ అంశాలపై సాగిన పార్టీ అంతర్గత సమావేశంలో ఈ కేసును చర్చకు తీసుకురావడం ద్వారా పార్టీ మొత్తాన్ని రేవంత్ బ్లాక్ మెయిల్ చేయబోతున్నారంటున్నారు. తద్వారా తన జోలికి వస్తే సహించేది లేదనే సందేశాన్ని, సంకేతాలను కూడా ఇచ్చినట్లే భావించాలి.

రేవంత్ గుప్పెట్లో బందీలేనా?

తెలుగుదేశం పార్టీలో అత్యంత వేగంగా ఎదిగిన నాయకుడు రేవంత్. పదేళ్ల క్రితం ఆయనకు, తెలుగుదేశానికి పెద్దగా సంబంధం లేదు. వాక్చాతుర్యం, రాజకీయ నైపుణ్యం, వ్యూహ లాఘవంతో పార్టీలో ప్రవేశించిన కొద్దికాలానికే చంద్రబాబు నాయుడి అభిమానాన్ని, ఆదరణను చూరగొన్నారు. అంతేవాసిగా మారిపోయారు. 2009 ఎన్నికల నుంచీ పార్టీలో చురుకైన పాత్రను పోషిస్తున్నారు. 2009 ఎన్నికల సందర్బంగా జూనియర్ ఎన్టీయార్ టీడీపీకి ప్రచారం చేశారు. ప్రజల్లోకి జూనియర్ వెళ్లడానికి అవసరమైన వ్యూహం, ప్రచార సరంజామా, శిక్షణ,గైడెన్సు రేవంత్ రెడ్డే అందించారు. పొలిటికల్ గైడెన్సు విషయంలో లోకేశ్ సైతం తొలిదశలో రేవంత్ పైనే ఆధారపడ్డారు. రేవంత్ సూచనల మేరకే పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి రూపకల్పన , దానికి కన్వీనర్ గా లోకేశ్ నియామకం కూడా సాగిందని పార్టీ వర్గాలు చెబుతాయి. ఇటువంటి అంశాల ద్వారానే చంద్రబాబుకు చేరువ కాగలిగారు. లోకేశ్ ను ప్రమోట్ చేసే విషయంలోనూ, వ్యక్తిగత స్వార్థం కంటే పార్టీ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తాడనే నమ్మకమూ కలగడంతో రేవంత్ ను చంద్రబాబు చేరదీశారు. అప్పటికే తెలంగాణలో పెద్ద నాయకులుగా ఉన్నవారందరినీ పక్కనపెట్టి మరీ ఆయనకు పెద్దపీట వేయడం ప్రారంభించారు. రేవంత్ పరపతి అధిష్ఠానంలో ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. సహజంగానే మిగిలిన అగ్రనాయకులకు ఈ పరిణామం పెద్దగా రుచించలేదు. అయినా చేసేదేమీ లేక మౌనం వహించారు. 2014 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ను నైతికంగా దెబ్బతీయాలనే ఆలోచనతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటు కోసం ఎరవేయడం రేవంత్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటం జరిగింది. అత్యంత రహస్యంగా జరగాల్సిన ఈ సంప్రతింపుల వ్యవహారాన్ని రేవంత్ కు అప్పగించారంటేనే పార్టీలో ఆయనకున్న ప్రాముఖ్యం తెలుస్తుంది. రేవంత్ అంటే గిట్టని టీడీపీ అగ్రనాయకుల్లోని కోవర్టులే టీఆర్ఎస్ ముఖ్యులకు ఈవిషయం లీక్ చేశారనే అభియోగాలు కూడా ఉన్నాయి. దాంతోనే రేవంత్ దొరికిపోయారని చెబుతారు.

స్వయంకృతాపరాధం......

ఏదేమైనప్పటికీ మరోసారి ఓటుకు నోటు కేసును పైకి తేవడం ద్వారా రేవంత్ ఏం సాధించదలచారన్న విషయం పార్టీలో ప్రకంపనలు స్రుష్టిస్తోంది. ఈ కేసు తెలుగుదేశం పార్టీ, అధినేత ప్రతిష్టకు సంబంధించి చాలా కీలకం. శిక్ష పడుతుందా? లేదా? చంద్రబాబుపై ఛార్జిషీటు వేస్తారా? లేదా? అన్న విషయాన్ని పక్కనపెడదాం. ఇంతవరకూ ఈకేసులో ఏ ఒక్క విషయాన్ని కూడా రేవంత్ బయటపెట్టలేదు. పోలీసులు ఇంటరాగేట్ చేసినా, జైలుకు వెళ్లాల్సి వచ్చినా ఒంటరిగానే ఎదుర్కొన్నాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సీనియర్లు తనపై దాడి చేస్తున్న నేపథ్యంలో ఓటుకు నోటు కేసులో ఎవరెవరి పాత్ర ఎంత అన్న లోగుట్టును బయటపెట్టడం మొదలుపెడితే టీడీపీ రాజకీయంగా చిక్కుల్లో పడుతుంది. టీఆర్ఎస్ తో పొత్తు నేపథ్యంలో కేసుల సంగతి వదిలేసినా రాజకీయంగా జరిగే డ్యామేజీ చాలా ఎక్కువగా ఉంటుంది. నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటు కొనుక్కోవడానికి అడ్వాన్సుగా ఇచ్చిన 50 లక్షల రూపాయలు ఎక్కడ్నుంచి వచ్చాయి? ఎవరిచ్చారు? అసలు ఈ కుట్రలో పాత్రధారులెవరు? మొత్తం వివరాలు తెలిసిన ఏకైక వ్యక్తి రేవంత్. అందువల్ల చంద్రబాబు నాయుడు సైతం ఆచితూచి వ్యవహరించడం తప్ప చేయగలిగిందేమీ లేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. రేవంత్ అప్రూవర్ ట్యాగ్ తగిలించుకుంటే అధినేతకు, లోకేశ్ కు కూడా ఈకేసు చుట్టుకునే ప్రమాదం ఉంది. అయితే అంతవరకూ లాగకపోవచ్చు. ఎందుకంటే ఇది వ్యక్తిగతంగా రేవంత్ కూ రాజకీయంగా విషమ సమస్యలను స్రుష్టించ వచ్చు. ఈ నేపథ్యంలో టీడీపీలో సొంత టర్మ్స్ మేరకు వ్యవహరించేంత స్వేచ్ఛ పొందడం లేదా తన రాజకీయ భవిష్యత్తుకు ఊతమిచ్చే కాంగ్రెసు పార్టీలోకి పూర్తిగా వెళ్లి పోవడం ఏదైనా అతని ఇష్టమే. తెలుగుదేశం పార్టీకి రేవంత్ ఉదంతం రాజకీయ గుణపాఠం. అతిగా ఒక వ్యక్తిపై ఆధారపడటం, అతి స్వేచ్ఛను కల్పించడం, రాజకీయ పర్యవసనాలను గ్రహించకుండా ఓటుకు నోటు వంటి విషయాల్లోనూ ప్రోత్సహించడం తాజా దుస్థితికి కారణం. అధినేత సహా పార్టీ మొత్తం రేవంత్ గుప్పెట్లో ఉన్నట్టే లెక్క. గుట్టు విప్పకుండా చూసుకోవాలంటే ఆయన వ్యవహారాలను చూసీ చూడనట్లు పోవడం మినహా చేసేదేమీ లేదు. పార్టీ బహిష్కరణ వంటి సాహసం కూడా చేయకపోవచ్చంటున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెసులో చేరితే ఆయనతోపాటు వెళ్లేందుకు టీడీపీకి చెందిన 30 మంది వరకూ నాయకులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలుగా చేసిన వారు, జిల్లా స్థాయి పెద్ద నాయకులు కూడా ఉన్నారు. టీటీడీపీకి సంబంధించి ఇదో పెద్ద కుదుపు. పార్టీ అధినాయకత్వం స్వయంకృతం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News