రేవంత్ కు రెక్కలు...రాజకీయ లెక్కలు?

Update: 2017-10-18 15:30 GMT

కాంగ్రెసు, తెలుగుదేశం, టీఆర్ఎస్ పార్టీల మధ్య తెలంగాణలో రేవంత్ రాజకీయం నడుస్తోంది. ఒక వ్యక్తి కేంద్రంగా ఇంతటి స్థాయి ప్రచారం ఇటీవలికాలంలో ఇదే మొదటిసారి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలామంది సీనియర్ నాయకులు, శాసనసభ్యులు అధికార తెలంగాణ రాష్ట్రసమితిలో చేరిపోయారు. గతంలో తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ అత్యంత కీలకమైన భూమిక పోషించింది. ప్రస్తుతం క్రమేపీ తన ప్రాబల్యాన్ని, ప్రాభవాన్ని కోల్పోతోంది. రాజకీయంగా వచ్చిన మార్పులు, నాయకత్వ అంశాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కొక ప్రత్యేకత ఉంది. వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలు అత్యధిక శాతం ఉన్న రాష్ట్రమిది. జనాభాలో వీరి వాటా 78 శాతం. అదే ఆంధ్రప్రదేశ్ లో ఆయావర్గాల వాటా 65 శాతమే. కులవృత్తులవారీ బీసీలు కూడా అధిక సంఖ్యలో ఉన్న రాష్ట్రంగా నిలుస్తోంది. స్వాతంత్ర్యం అనంతర కాలం వరకూ బ్రిటిషు ఇండియాలో తెలంగాణ భాగం కాకపోవడం వల్ల నైజాం పాలనలో అణచివేత కొనసాగింది. ఒకవైపు నైజాం దురాగతాలు, దోపిడి మరోవైపు గడీల పాలన స్థానిక పెత్తందారుల అమానుషాలు యథేచ్చగా సాగుతుండేవి. జనాభాలో అధికశాతం ఉన్న బడుగుబలహీన వర్గాలను అగ్రవర్ణాలు గుప్పెట పట్టి ఉంచాయనే చెప్పాలి. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు బ్రిటిషు పాలనలోని సర్కారు జిల్లాలతో పోలిస్తే రాజకీయంగా, విద్య, వైద్య పరంగా తెలంగాణ చాలా వెనకబాటుకు గురైంది. దోపిడి నుంచే విప్లవం పుడుతుందన్నట్లు ప్రభువుల ఆరాచకాలకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో కవులు, సామాజిక ఉద్యమకారుల రూపంలో చైతన్యం కూడా తొణికిసలాడుతుండేది. పోలీసు చర్య , నైజాం పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత కూడా రాజకీయాధికారాన్ని ప్రజాప్రతినిధుల రూపంలో పెత్తందారులే చేజిక్కించుకున్నారు. పటేల్, పట్వారీ వ్యవస్థల రూపంలో గ్రామ రక్షణ, రెవిన్యూ వ్యవస్థలపై తమ ఆధిపత్యాన్ని చెలాయించారు.

‘దేశం‘ తెచ్చిన మార్పు...

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపన తెలంగాణలో రాజకీయ మార్పులకు , వెనుకబడిన తరగతుల రాజ్యాధికారానికి కారణంగా నిలిచింది. సినీ గ్లామర్ తో తనకు లభించిన మాస్ ఇమేజ్ ను రాజకీయ పెట్టుబడిగా మలచారు ఎన్టీఆర్. బడుగుబలహీన వర్గాల నుంచి నూతన నాయకత్వాన్ని తెలుగుదేశం ప్రోత్సహించింది. బీసీలకు అధికారం దక్కేలా చూడగలిగింది. పటేల్, పట్వారీ వంటి పెత్తందారీ వ్యవస్థలను నిర్మూలించి, ప్రభుత్వ వ్యవస్థలకు సాధికారత కల్పించింది. అంతవరకూ అణిగిమణిగి ఉన్న సామాజిక వర్గాలు తమకు టీడీపీ ద్వారా లభించిన పొలిటికల్ పవర్ తో నిలదొక్కుకోగలిగాయి. అంతవరకూ అధికారం అనుభవించిన రెడ్డి, వెలమ, ఇతర సామాజిక వర్గాలకు సమ స్థాయిలో ప్రజాస్వామ్య అధికారంలో బీసీలు భాగస్వాములు కాగలిగారు. అందుకే జయాజయాలతో సంబంధం లేకుండా టీడీపీ ఒక ప్రబలమైన శక్తిగా తెలంగాణలో స్థిరపడింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా సాగిన రోజుల్లో సైతం క్యాడర్ ను కాపాడుకోగలిగింది. ప్రజల్లో ఆదరణ తగ్గలేదు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడంతో ఎవరి ప్రయోజనాల కోసం వారు రాష్ట్రాల వారీ పోరాడాల్సిందే. ఉమ్మడి ఆస్తులు, సంస్థల విభజన, నీటి పంపకాలు వంటి అంశాలు వెన్నాడుతున్నాయి. టీడీపీ అధినాయకత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నాయకత్వం వహించడంతో సహజంగానే టీడీపీ అక్కడి ప్రయోజనాలే చూసుకుంటుందనే భావన తెలంగాణ ప్రజల్లో ఏర్పడింది.

అమరావతి అలా కదిలింది...

ఉమ్మడి రాజధానిగా పదేళ్లపాటు హైదరాబాదు నుంచే ఆంధ్రప్రదేశ్ పరిపాలన సాగాలనేది పునర్విభజన చట్టం కల్పించిన వెసులుబాటు. ఉద్యమం ద్వారా రాష్ట్రసాధనలో కీలక పాత్రధారిగా వ్యవహరించిన టీఆర్ఎస్, రాష్ట్ర సాధనను సాకారం చేసిన కాంగ్రెసు పార్టీలకు దీటుగా తెలుగుదేశం 2014 ఎన్నికల్లో సీట్లు, ఓట్లు సాధించింది. బీజేపీకి కూడా అండనిచ్చింది. దీనినిబట్టే తెలుగుదేశం తెలంగాణలో ఎంతటి బలమైన పక్షమో అర్థమవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబునాయుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చేవరకూ తాను హైదరాబాదును విడిచిపెట్టి వెళ్లనని ఒకానొక సందర్భంలో ప్రకటించారు. యువతరానికి ప్రాతినిధ్యం వహించే రేవంత్ రెడ్డి ఒక ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటు కొనుగోలు చేయప్రయత్నించారనే అభియోగంలో వీడియో దృశ్యాల సాక్షిగా దొరికిపోయారు. ఈ విషయంలో పార్టీ అధినేత మద్దతు కూడా ఉందన్నట్లుగా ఫోన్ ఆడియోలో చంద్రబాబు వాయిస్ కూడా రికార్డైంది. దీంతో నైతికంగా టీడీపీ తెలంగాణలో తీవ్రంగా దెబ్బతింది. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతూ కేసులు పెట్టింది. కేంద్రంలో కీలక బాధ్యత నిర్వహించే బీజేపీ పెద్దలు, ఇరువైపులా శ్రేయోభిలాషులు పూనుకుని మద్యేమార్గంలో రాజీ కుదిర్చారనేది రాజకీయ సమాచారం. హైదరాబాదు విషయంలో చంద్రబాబు జోక్యం చేసుకోకూడదని, సాధ్యమైనంత తొందరగా తన సొంత రాష్ట్రం నుంచే పరిపాలన సాగించుకోవాలనేది ఒక రాజీ సూత్రం. అందుకుబదులుగా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఆడియో విషయంలో టీఆర్ ఎస్ ప్రభుత్వం ముందుకు పోకుండా సంయమనం పాటిస్తుందనేది హామీ. ఈ అనధికార ఒప్పందం మేరకు ఆంధ్రప్రదేశ్ పాలన విజయవాడ కేంద్రంగా తరలిపోయింది. నూతన రాజధాని నిర్మాణం పై చంద్రబాబు దృష్టి పెట్టారు. తెలంగాణలో అధికారం వచ్చే వరకూ కదిలేది లేదన్న భీష్మ ప్రతిన వట్టి మాటగా మిగిలిపోయింది.

బలమూ ..బలహీనత... అతడే...

ఇప్పుడు కాంగ్రెసులో చేరతారని విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి బలమూ, బలహీనత కూడా. దుందుడుకుగా, ముందూ వెనకా చూసుకోకుండా ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటుకు నోటు తో తెలుగుదేశం పార్టీ అడ్డంగా బుక్ అయిపోవడానికి రేవంత్ రెడ్డే కారణమని పార్టీలోని సీనియర్ నాయకులు చెబుతుంటారు. అదే సమయంలో కేసీఆర్ వంటి మాటకారిని ఎదుర్కోవడంలోనూ, ప్రభుత్వ బలహీనతలను బయటపెట్టడంలోనూ రేవంత్ కనబరిచే వేగం టీడీపీకి జీవం పోస్తోందని విశ్వసిస్తోంది పార్టీ క్యాడర్. కేసీఆర్ ను వ్యూహాత్మకంగా విమర్శించడంలోనూ, సమస్య ఎక్కడ ఉన్నా దూసుకుపోవడంలోనూ రేవంత్ కీలకంగా వ్యవహరిస్తారు. ప్రధానప్రతిపక్షమైన కాంగ్రెసుకానీ, తెలుగుదేశం పార్టీలోని ఇతర సీనియర్ నాయకులు కానీ ఈ విషయంలో అతనితో పోటీ పడలేరు. అతనికి సమ ఉజ్జీలుగా కూడా నిలవలేకపోతున్నారు. అంతేకాకుండా తెలంగాణలో ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్న రెడ్డి వర్గానికి చెందడం కూడా రేవంత్ కు ఒక అస్సెట్ గా చెప్పుకోవాలి. ఆ సామాజిక వర్గానికి చెందిన యువతరం అతని తీరు పట్ల ఆకర్షితులవుతున్నారు. అధికార పీఠానికి దూరమైన తమ వర్గాన్ని పునరధికారానికి చేరువ చేసే సామర్థ్యం రేవంత్ లో ఉందని రెడ్డి వర్గీయులు విశ్వసిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తన క్యాడర్ ను కాపాడుకోవాలన్నా, రాజకీయ అస్తిత్వాన్ని నిలుపుకోవాలన్నా 2019 ఎన్నికల్లో టీఆర్ ఎస్ తో కలిసి నడవాలనేది కొందరు టీడీపీ నేతల యోచన. ఇదే జరిగితే ఇంతవరకూ కేసీఆర్ కు వ్యతిరేకంగా తాను చేసిన పోరాటం బూడిదలో పోసిన పన్నీరుగా మారుతుందని రేవంత్ ఆవేదన. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ నిర్దిష్టంగా టీఆర్ఎస్ తో పొత్తు ఉండదని తేల్చి చెప్పకపోవడం వల్ల రేవంత్ ప్రత్యామ్నాయాల వైపు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కచ్చితంగా ఆ ప్రత్యామ్నాయ వేదిక కాంగ్రెసు పార్టీనే అనేది జగమెరిగిన సత్యం. గడచిన రెండు సంవత్సరాలుగా తెలంగాణ తెలుగుదేశం రేవంత్ రెడ్డి కేంద్రంగానే కార్యకలాపాలు చేస్తోంది. ఆయన చేస్తేనే ప్రచారం. ఆయన తిరిగితేనే పర్యటన అన్నట్లుగా ఉంది. దాదాపు ఒక ప్రాంతీయ పార్టీ అధినేత స్థాయి ని సంతరించుకున్నాడు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెసు రాజకీయాలను కూడా ఇదే తరహాలో తన చుట్టూ కేంద్రీకృతం అయ్యేలా చేసుకోగలడా? కాంగ్రెసులోని సీఎం అభ్యర్థులంతా చూస్తూ ఊరుకుంటారా? రేవంత్ ఖాళీ చేసిన సీటులో కుదురుకునే టీడీపీ ప్రత్యామ్నాయ నాయకుడు ఉన్నారా? అన్నీ ప్రశ్నలే.

 

- ఎడిటోరియల్ డెస్క్

Similar News