రేవంత్ ఈ ఇద్దరినీ డిఫెన్స్ లో పడేశారా?

Update: 2017-11-07 14:30 GMT

కొడంగల్ యువనేత రేవంత్ రాక వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత లాభమో ఎవరికీ ఇప్పటికిప్పుడు తెలియదు. రాజకీయంగా ఎంత ప్రయోజనమో అన్న సంగతిని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేయడం కష్టం. అదే సమయంలో ఆశించిన మేరకు ఆగర్భ శత్రువైన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఎంత వరకూ దెబ్బతీయగలరో అన్న విషయాన్ని ఇప్పటికిప్పుడే అంచనా వేయలేం. రాజకీయంగా జన్మనిచ్చిన టీడీపీకి ఏ మేరకు నష్టపరిచారన్న అంశంపై కూడా అవగాహనకు రావడం తొందరపాటే అవుతుంది. అయితే అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేయడం ద్వారా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కేసీఆర్ లకు చిక్కులు సృష్టించారన్న మాట వాస్తవం. రేవంత్ రాక వల్ల కలిగే రాజకీయ ప్రయోజనాలు, పోక వల్ల ఏర్పడే నష్టంపై అంచనాలు, టీఆర్ఎస్ ను ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎదుర్కోగలరన్న అంచనాల నేపథ్యంలో ఇప్పటి వరకూ ఈ విషయం మరుగున పడింది. ఇప్పుడు రేవంత్ రాజీనామా ఇద్దరు ముఖ్యమంత్రులకూ చికాకులు కల్పించనుంది. సరికొత్త సమస్యలు సృష్టించనుంది. అది ఎలాగన్నది తెలియాలంటే ఒక్కసారి గత మూడేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన, జరుగుతున్న వలసల జోరును విశ్లేషించాల్సి ఉంటుంది.

రెండు రాష్ట్రాల్లోనూ సేమ్ టు సేమ్....

2014 ఎన్నికల్లో అత్తెసరు మెజారిటీతో అధికారాన్ని అందుకున్న చంద్రశేఖరరావు రాజకీయంగా బలపడేందుకు, ప్రత్యర్థులను బలహీన పర్చేందుకు ఎత్తులు వేశారు. మంచి పాలన అందించడంతో ప్రజలను ఆకట్టుకున్నప్పటికీ ప్రత్యర్థి పార్టీలను మానసికంగా, రాజకీయంగా బలహీనపర్చేందుకు, దెబ్బతీసేందుకు వలసలను ప్రోత్సహించారు. ముందుగా తెలుగుదేశం పార్టీపై దృష్టి సారించారు. ఇప్పుడు ఆ పార్టీ ఖాళీ అయింది. ఖమ్మం జిల్లాకు చెందిన సండ్ర వెంకట వీరయ్య, ఎల్బీ నగర్ కు చెందిన బీసీ నాయకుడు, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య మాత్రమే పార్టీలో ఉన్నారు. టీడీపీ నుంచి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి వారికి మంత్రిపదవులు కూడా ఇచ్చి సత్కరించారు. మాధవరం కృష్ణారావు, వివేకానంద తదితర ఎమ్మెల్యేలను నయానో... భయానో పార్టీలోకి రప్పించారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామాలు స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి వద్ద పెండింగ్ లో ఉన్నాయి. వారిపై అనర్హత వేటు వేయాలని స్వయంగా టీటీడీపీ హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించింది. రాజ్యాంగం ప్రకారం స్పీకర్ ను ఆదేశించే అధికారం లేనందువల్ల వీలయినంత త్వరలో రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్ కు సూచించింది. ప్రస్తుతం రాజనామాల వ్యవహారం స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉంది.

మంత్రులగా ప్రమాణస్వీకారం...

ఏపీలో కాస్త ఆలస్యంగా వైసీపీ నుంచి వలసలును ప్రోత్సహించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తానేమీ తక్కువ తినలేదని నిరూపించారు. 22 మంది ఎమ్మెల్యేలను తీసుకున్న ాయన వారిలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టారు. వారి రాజీనామాల అనంతరమే ప్రమాణస్వీకరం చేయించినట్లు గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. తెలంగాణాలో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. తలసాని తన రాజీనామా లేఖను స్పీకర్ కు పంపాకే మంత్రిగా ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించానని గవర్నర్ అప్పట్లో చెప్పారు. అయితే అటు తెలంగాణలో, ఇటు ఏపీలో ఎమ్మెల్యేల రాజీనామాలు నేటికీ స్పీకర్ల వద్ద పెండింగ్ లో ఉన్నాయి. అధికార పార్టీల అడుగులకు మడుగులు వత్తే స్పీకర్లు మధుసూధనాచారి, కోడెల శివప్రసాదరావు ఎటూ తేల్చకుండా రాజీనామాలపై నాన్చుతూ వస్తున్నారు.

రాజీనామా పై తేల్చకుంటే....

ఇక్కడే రేవంత్ రాజీనామా వ్యవహారం రెండు రాష్ట్రాల్లో తెరపైకి వస్తోంది. రేవంత్ టీడీపీకి రాజీనామా చేయడంతో పాటు ఆ పార్టీ ద్వారా సంక్రమించిన శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేసి నైతికంగా సన్మార్గంలో ప్రయాణించారు. తక్షణమే తెలంగాణ స్పీకర్ కు రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపారని రేవత్ చెబుతున్నారు. భద్రతాసిబ్బందిని కూడా సరెండర్ చేశారు. తన వైపు నుంచి ఎలాంటి తప్పులు లేకుండా, ఎవరూ వేలెత్తి చూపని విధంగా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. తద్వారా ఇద్దరు ముఖ్యమంత్రులను ఆత్మరక్షణ ధోరణిలో పడేశారు. పరోక్షంగా వారికి సవాల్ విసిరారు. వారికి సంకట పరిస్థితులను సృష్టించారు. ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రుల పరిస్థితి ముందు నుయ్యి....వెనక గొయ్యి మాదిరిగా మారింది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఇద్దరు చంద్రులకు అంత తేలిక కాదని రాజకీయ విశ్లేషకులు, న్యాయ నిపుణులు అంటున్నారు.

కేసీఆర్ కు ప్రయాస తప్పదా?

ఒకవేళ తెలంగాణ స్పీకర్ మధుసూధనాచారి రేవంత్ రెడ్డి రాజీనామాను ఆమోదించినట్లయితే అదేసమయంలో పాత రాజీనామాలను కూడా ఆమోదించాల్సి ఉంటుంది. తద్వారా వచ్చే ఉప ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఇందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా అన్న ప్రశ్నకు సరైన సమాధానం లభించదు. అదే సమయంలో రేవంత్ రాజీనామాను ఆమోదించకపోతే ఉప ఎన్నికకు టీఆర్ఎస్ భయపడిపోతుందన్న ప్రచారాన్ని... వాదనను ఎదుర్కొనేందుకు కేసీఆర్ ప్రయాస పడాల్సి వస్తోంది. 2014 ఎన్నికల్లో 14 వేలకు పైగా మెజారిటీతో గెలిచిన రేవంత్ ను రాజకీయంగా కొడంగల్ లో నిలువరించడం చెప్పినంత తేలిక కాదన్న విషయాన్ని టీఆర్ఎస్ అంతర్గత సమావేశాల్లో నాయకులే అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రాజీనామాను ఆమోదిస్తే ఇతరుల రాజీనామాలను కూడా ఆమోదిస్తారా? అన్న ప్రశ్నలు ఉత్పన్న మవుతున్నాయి. సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికలకు ముందు నల్లగొండ లోక్ సభ ఉప ఎన్నికపై ఆసక్తి చూపిన టీఆర్ఎస్ అక్కడ బొటాబొటి మెజారిటీతో గెలవడంతో ఇప్పుడు నల్లగొండ ఊసెత్తడం లేదు. ఇక్కడపరిస్థితే ఏపీలోనూ ఉత్పన్న మయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో రేవంత్ రాజీనామాను ఆమోదిస్తే అక్కడ కూడా వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించాల్సి ఉంటుంది. ఆమోదించకపోతే అక్కడ కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. మొత్తం మీద రేవంత్ ఇద్దరు సీఎంలు, స్పీకర్లకు సంకట పరిస్థితి కల్పించారన్నది వాస్తవం. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీలు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తాయో వేచిచూడాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News