రాహుల్ నీడలు వీరే....!

Update: 2017-11-27 16:30 GMT

త్వరలో ఏఐసీసీ పగ్గాలు అందుకోనున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భవిష్యత్ వ్యూహరచనకు సిద్ధమవుతున్నారు. తన దైన తరహాలో పార్టీని ముందుకు నడిపేందుకు సమాయత్తమవుతున్నారు. ఇందులో భాగంగా తన తరం నేతలతో బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలా అని సీనియర్లను, పార్టీ కోసం జీవితాంతం పనిచేసిన నాయకులను పక్కన పెట్టడం లేదు. వారి సేవలను, అనుభవాలను ఉపయోగించుకుంటూనే యువరక్తంతో పార్టీ ప్రాభవానికి కృషి చేయాలన్నది రాహుల్ అంతరంగం. ఈ దిశగా పావులు కదుపుతున్నారు.

యువరక్తంతో కొత్త టీం....

ఇందులో భాగంగానే ఇటీవల తన బృందాన్ని ఏర్పాుటు చేసుకున్నారు. వీరంతా కొత్తవారేమీ కాదు. పార్టీలోని తన తరం నాయకులే. వీరి తల్లిదండ్రులు పార్టీ కోసం పాటు పడిన వారే. సచిన్ పైలెట్, జ్యోతిరాదిత్య సింధియా, గౌరవ గొగయ్, ఆర్.పి.ఎన్. సింగ్, ప్రియాంక చతుర్వేది తదితరులు రాహుల్ బృందంలోని ముఖ్యులు. అజయ్ మాకెన్, కొప్పుల రాజు, గిడుగు రుద్రరాజు వంటి నేతలు ఇప్పటికే రాహుల్ అనుచరులుగా గుర్తింపు పొందారు. రాజస్థాన్ కు చెందిన సచిన్ పైలెట్ కుటుంబం పార్టీకి సుపరిచితం. పైలెట్ తండ్రి రాజేశ్ పైలెట్ 80వ దశకంలో రాజీవ్ గాంధీ హయాంలో ప్రముఖ నేతగా వెలుగొందారు. రాజీవ్ గాంధీ సన్నిహిత సహచరుడిగా కీలకపాత్ర పోషించారు. ఆయన సమర్థతను గుర్తించిన రాజీవ్ గాంధీ జమ్ము కాశ్మీర్ పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. ప్రత్యేకంగా ఆంతరింగిక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం విశేషం. రాజేష్ పైలెట్ హటాన్మరణంతో ఆయన వారసత్వాన్ని కుమారుడు సచిన్ పైలెట్ అందిపుచ్చుకున్నారు. పైలెట్ ప్రస్తుతం రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో పనిచేశారు. రాజస్థాన్ లోని అజ్మీర్ ఎంపీగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో ఎంపీగా ఓడినప్పటికీ పార్టీలో క్రియాశీలంగా ఉన్నారు. జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కూతురును పెళ్లి చేసుకున్న సచిన్ పైలెట్ దంపతులకు ఇద్దరు పిల్లలు. రాహుల్ బృందంలోని మరో ముఖ్యుడు మధ్యప్రదేశ్ కు చెందిన జ్యోతిరాదిత్య సింధియా. దివంగత మాధవరావు సింధియా కుమారుడే జ్యతిరాదిత్య సింధియా. ప్రస్తుత రాజస్థాన్ ముఖ్యమంత్రి, బీజేపీ అగ్రనేత వసుంధరరాజే ఈయనకు స్వయంగా మేనత్త. 2002లో మాధవరావు సింధియా హఠాన్మరణంతో జ్యోతిరాదిత్య సింధియా తెరపైకి వచ్చారు. హార్వర్డ్ యూనివర్సిటీలో చదివిన జ్యోతిరాదిత్య తండ్రి చనిపోయినప్పటి నుంచి మధ్యప్రదేశ్ నుంచి లోక్ సభకు ఎన్నికవుతూనే ఉన్నారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో కూడా గుణ నియోజకవర్గం నుంచి గెలిచారు. యూపీఏ హయాంలో మన్మోహన్ మంత్రి వర్గంలో పనిచేసిన అనుభవం కూడా ఆయన సొంతం.

తండ్రుల సేవలను గుర్తించి.....

రాహుల్ బృందం మరో ముఖ్యుడు ఈశాన్య ప్రాంతానికి చెందిన గౌరవ్ గొగొయ్. ఈయన అస్సోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ కుమారుడు. నిన్న మొన్నటి దాకా 2001 నుంచి 2016 దాకా సుదీర్ఘకాలం పదిహేనేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. గౌరవ్ 2014లో కలిబోర్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. పార్టీ సోషల్ మీడియా చీఫ్ గా నియమితులైన కర్ణాటకు చెందిన రమ్య పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. కన్నడ, తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన ఆమె రెండుసార్లు ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. 2013లో మండ్యాలో లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో గెలిచారు. 2014 లో కేవలం 5,500 ఓట్ల తేడాతో ఓడిపోయిన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. రాష్ట్రంలో బలమైన ఒక్కలింగ సామాజికవర్గానికి చెందిన రమ్య పార్టీ సోషల్ మీడియా విభాగం అధిపతిగా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. రాహుల్ బృందంలోని మరో ముఖ్యనేత ప్రియాంకా చతుర్వేది. పార్టీ సమాచార విభాగం కార్యకర్తగా నియమితులయ్యారు. ఆమె గతంలో వెబ్ సైట్, పత్రికల్లో కాలమిస్ట్ గా పనిచేశారు. యూపీకి చెందిన ఆర్పీఎన్ సింగ్ కూడా రాహుల్ బృందంలో కీలక సభ్యుడు. 2009లో కుషీనగర్ నుంచి లోక్ సభకు ఎన్నికైన ఆయన 2014లో ఓడినప్పటికీ క్రియాశీలకంగా ఉన్నారు. జార్ఘండ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల ఇన్ ఛార్జిగా ఉన్నారు. ఇప్పటికీ రాహుల్ బృందంలో అజయ్ మాకెన్, రణదీప్ సుర్జేవాలా, జితేంద్ర ఏపీకి చెందిన కొప్పుల రాజు, గిడుగు రుద్రరాజులు ఉన్నారు. అజయ్ మాకెన్ మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ మనువడు. ఢిల్లీ పీసీసీ చీఫ్ గా పనిచేశారు. రణదీప్ ప్రస్తుతం పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. ఏపీకి చెందిన ఎస్పీ నాయకుడుకొప్పుల రాజు మాజీ ఐఏఎస్ అధికారి. జితేంద్ర యూపీకి చెందిన జితేంద్ర ప్రసాద కుమారుడు. జితేంద్ర గతంలో సోనియాపై పార్టీ అధ్యక్షపదవికి పోటీ చేసి ఓడిపోయారు. ఏపీలోని రాజమండ్రికి చెందిన గిడుగు రుద్రరాజు మాజీ ఎమ్మెల్సీ. ఇటీవల ఆయన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల పరిశీలకుడిగా పనిచేశారు.

సీనియర్లనూ విస్మరించకుండా.....

తన తరం నాయకులను చేరదీస్తూ వారికి ప్రాధాన్యం కల్పిస్తున్న రాహుల్ గాంధీ పాత తరం నాయకులను పక్కన పెట్టడం లేదు. మోతీలాల్ ఓరా, గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్, ఆంటోని, చిదంబరం, రమేష్ చెన్నితాల, వీరభద్రసింగ్ వంటి సీనియర్లను విస్మరించాలన్న ఆలోచనలో రాహుల్ గాంధీ లేరని చెబుతున్నారు. సీనియర్ల అనుభవాలను, సేవలను వాడుకుంటూనే యువరక్తంతో పార్టీకి పూర్వవైభవం కల్పించాలన్నది రాహుల్ యోచన సరైనదే. ఇది ఎంతవరకూ ఫలిస్తుందో తెలియాలంటే 2019 ఎన్నికల వరకూ ఆగాల్సిందే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News