రాహుల్ కు....మంచి రోజులొచ్చేస్తున్నాయా...!

Update: 2017-11-02 16:30 GMT

‘‘రాహుల్ గాంధీ సమర్థుడైన నాయకుడే..ఆయన ముద్ద పప్పు కాదు. దేశాన్ని నడిపించగల సత్తా ఆయనకుంది’’ఇది కాంగ్రెస్ వందిమాగధుల మాట కాదు. కాంగ్రెస్ అంతేవాసుల భజనకాదు. కనీసం కాంగ్రెస్ అభిమానులు, మద్దతుదారులు, శ్రేయోభిలాషుల మాట కూడా కాదు. ప్రధాని మోడీ మంత్రివర్గ సహచరుడు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడైన రాందాస్ అథవాలే వ్యాఖ్యలివి. ఆయన ఏమీ అమాయకుడు కాదు. ఆషామాషీ నాయకుడు అంతకన్నా కాదు. నాలుగుసార్లు పార్లమెంటుకు ఎన్నికైన అనుభవజ్ఞుడు. రాజకీయాలను కాచి వడబోసిన వ్యక్తి. ‘‘రాహుల్ లో పరిపక్వత కన్పిస్తోంది. భవిష్యత్తులో సమర్థుడైన నాయకుడు కాగలడు. తన వ్యవహారశైలి ద్వారా దేశాన్ని నడిపించగలరన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పిస్తున్నారు.’’ ఇవి కూడా కాంగ్రెస్ ఆశావహుల వ్యాఖ్యలు కావు. గాంధీకుటుంబ మిత్రుల మాట కాదు. కాంగ్రెస్ పార్టీ ఆగర్భ శత్రువైన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన సంచలన వ్యాఖ్యలు. వీరి వ్యాఖ్యలు ఆయా పార్టీల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అధికార భారతీయ జనతా పార్టీలో ఒకింత గుబులు పుట్టిస్తున్నాయి. మొత్తం మీద రాహుల్ గాంధీని రాజకీయ పార్టీలు కొత్త కోణంలో చూడటం వారి వైఖరిలో వస్తున్న మార్పుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పరోక్షంగా రాహుల్ కు ప్రజాదరణ పెరుగుతున్న సంకేతాలుగా ఈ వ్యాఖ్యలను చూడవచ్చు.

ముద్దపప్పు అన్నవారే....

ఈ వ్యాఖ్యల్లో వాస్తవమెంత? నిజంగానే రాహుల్లో మార్పు వచ్చిందా? ఆయన పనితీరు మెరుగుపడిందా. ఆయనలో పరిణితి పెరిగిందా...? తదితర ప్రశ్నలకు కొంతవరకూ సానుకూల సమాధానమే లభిస్తుంది. గాంధీల కుటుంబంలో అయిదోతరం నాయకుడైన రాహుల్ అందరూ అనుకుంటున్నంత అమాయకుడు కాదు. సామాజిక మాధ్యమాల్లో చెబుతున్నంత సామర్థ్యం లేని నాయకుడు కాదు. కొన్ని మీడియా వర్గాలు పరచారం చేసినంత మొద్దబ్బాయి కానే కాదు. ఆయనలోకూడా పరిపక్వత కనిపిస్తుంది. మార్పు వస్తోంది. అవగాహన పెంచుకుంటున్నారు. తనకు తాను తీర్చి దిద్దుకుంటున్నారు. తనపై ప్రజలకు, పార్టీ శ్రేణులకు విశ్వాసం కలిగిస్తున్నారు. రాజీకీయ కుటుంబంలో పుట్టి పెరిగి, గత రెండు దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని అసమర్థుడని భావించడం, ప్రచారం చేయడం హాస్యాస్పదం. శత్రువును తక్కువగా అంచనా వేయడం ప్రధమ పొరపాటని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. బీజేపీ, దాని మిత్రపక్షాలకు ఇవి తెలియని విషయాలు కావు. అయినా అవి రాహుల్ ను తక్కువగా అంచనా వేయడం వాటి అపరిపక్వతకు నిదర్శనంగా చెప్పవచ్చు.

అపజయాలే రాహుల్ ఖాతాలోనా...?

2014 ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న కాంగ్రెస్ ఆ తర్వాత ఎన్నికల్లో కోలుకుంది. పశ్చిమ బెంగాల్ లో సీపీఎంను తోసిరాజని ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. అంతకు ముందు కేవలం 8 సీట్లున్న కాంగ్రెస్ 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 28 స్థానాలను గెలుచుకుంది. పంజాబ్ లో భారీ మెజారిటీతోనూ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. పదిహేనేళ్లుగా మణిపూర్ లో అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకుని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. మెజార్టీకి చేరువలోనిల్చింది. బీజేపీ పెద్దల మాయోపాయం కారణంగా సర్కారును ఏర్పాటు చేయలేకపోయింది. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించి స్వతంత్ర శాసనసభ్యులను తమవైపుకు తిప్పుకోని ఉంటే మణిపూర్ లో మళ్లీ సర్కారును ఏర్పాటు చేసేది. గోవాలో స్వయంగా బీజేపీ ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ ను మట్టికరిపించింది కాంగ్రెస్. కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినా బీజేపీ పాచికలు విసిరి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ వ్యూహాత్మకంగా వ్వవహరించి స్వతంత్ర శాసనసభ్యులను తమవైపు తిప్పుకుంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యేది. ఇటీవల గురుదాస్ పూర్ లోక్ సభ స్థానాన్ని భారీ మెజారిటీతో కైవసం చేసుకుంది. మహారాష్ట్రలోని నాందేడ్ నగరపాలకసంస్థ ఎన్నికల్లో బీజేపీకి చుక్కలు చూపించింది. నిష్పక్షపాతంగా చెప్పాలంటే వెనక రాహుల్ పాత్రను తక్కువగా అంచనా వేయలేం. ఎప్పుడో జరిగిన వైఫల్యాలను రాహుల్ ఖాతాలో వేసినప్పుడు విజయాలను కూడా ఆయన ఖాతాలోనే వేయడం న్యాయం. ఈ సమన్యాయాన్ని పాటించడంలో కొన్ని మీడియా వర్గాలు ఉద్దేశపూర్వకంగానే విఫలమవుతున్నాయి. దీన్ని కాదనడం ఎవరికైనా కష్టమే.

మార్పు కనిపిస్తోంది....

రాహుల్ వైఖరిలో మార్పు వచ్చిన మాట వాస్తవం. ఇటీవల కాలంలో ఈ మార్పు స్పష్టంగా కన్పిస్తోంది. అస్పష్టతకు తావు లేకుండా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ముందే ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించారు. బీజేపీ ఈ పని చేయలేకపోయింది. పంజాబ్ లో ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిగా అమరేందర్ సింగ్ ను ప్రకటించారు. రేపటి హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కూడా వీరభద్ర సింగ్ ను మళ్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. పాత సంప్రదాయాలను పక్కన పెట్టి ప్రజల్లో కలిసి పోతున్నారు. నోట్ల రద్దు సమయంలో స్వయంగా ఏటీఎంల వద్ద క్యూ లైన్లో నిలబడి ప్రజల దృష్టిని ఆకర్షించారు. పార్టీ ఉపాధ్యక్షుడిగా కీలక స్థానంలో ఉన్నప్పటికీ సీనియర్లను గౌరవించి వారి పెద్దరికానికి విలువ ఇస్తున్నారు. మన్మోహన్, మోతీలాల్ ఓరా, కరణ్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ వంటి కాంగ్రెస్ కురువృద్ధుల నుంచి సలహాలు, సూచనలు పొందుతున్నారు. అన్నీ తెలుసున్నట్లు కాకుండా అందరి నుంచి తెలుసుకోవాలన్న ధ్యేయంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలను ఎదుర్కొనడంలో పా్రటీ శ్రేణులను సమన్వయం చేయడంలో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. 2009లో విజయం అనంతర మన్మోహన్ సింగ్ ను బదులు రాహుల్ కు ప్రధాని పదవిని అప్పగిస్తే ఆయన మరింతగా రాటు దేలే వారన్నది రాజకీయ విశ్లేషకుల వాదనను కోట్టిపారేయలేం.

సోనియా కూడా ఇలాగే.....

90వ దశకం ద్వితీయార్థంలో సీతారామ్ కేసరి నుంచి సోనియా ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించినప్పుడు ఆమె శక్తి సామర్థ్యాలపై చాలామంది ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. ఆమె మూగ బొమ్మ అని, ఎవరికీ అర్థంకాని మనిషని, అంతర్ముఖురాలని, అహంభావి అని రకరకాల ప్రచారం జరిగింది. కానీ పార్టీ పగ్గాలు చేపట్టిన ఎనిమిదేళ్లలోనే 2004లో ఢిల్లీ గద్దెపై పార్టీని కూర్చోబెట్టగలిగారు. 2009లో ఆమె నాయకత్వంలోనే పార్టీ మరోసారి అత్యధిక స్థానాలను గెలుచుకుంది. పదేళ్ల పాటు చక్రం తిప్పారు. తెరవెనక నుంచి ప్రభుత్వాన్ని నడిపారు. మకుటుం లేని మహారాణిగా పేరొందారు. కాంగ్రెస్ చరిత్రలో సుదీర్ఘకాలం అధ్యక్షురాలిగా పనిచేసింది సోనియా గాంధీ కావడం విశేషం. నెహ్రూ, ఇందిర, రాజీవ్ లు కూడా ఇంతకాలం పనిచేయలేదు. 1996 నుంచి దాదాపు 21 సంవత్సరాల పాటు పార్టీకై దిశానిర్దేశం చేస్తున్నారు. తల్లి, తండ్రి, తాతమ్మల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటున్న రాహలు్ నిర్మాణాత్మకంగా.. సమన్వయంతో పనిచేసుకుంటూ వెళితే... ఉన్నతశిఖరాలను అధిరోహించడం అనునకున్నంత కష్టమేమీ కాదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News