రాహుల్...కష్టకాలంలో ముళ్లకిరీటమేనా?

Update: 2017-10-15 17:30 GMT

గాంధీ కుటుంబంలో నాలుగో తరంలో అయిదో నేత అయిన రాహుల్ గాంధీ అత్యంత దురదృష్టవంతుడు. అటు వ్యక్తిగత జీవితంలోనూ, ఇటు రాజకీయ జీవితంలోనూ అన్నీ ఆటుపోట్లే. యుక్తవయస్సులో తండ్రిని కోల్పోయాడు. అంతకు ముందే నానమ్మను కోల్పోయాడు. వ్యక్తిగత జీవితంలోనూ ఒంటరిగానే మిగిలిపోయాడు. రాజకీయ జీవితం కూడా అంత ప్రభావవంతంగా లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్నప్పటికీ తనదైన ముద్రను చూపలేకపోయారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా పనితీరు కూడా అంత గొప్పగా ఏమీలేదన్న అభిప్రాయం పార్టీ శ్రేణులనుంచి విన్పిస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ పగ్గాలు అందుకోనున్న రాహుల్ కు అనేకసవాళ్లు ఎదురుకానున్నాయి. రాహుల్ కు ముందు...తమ కుటుంబీకులు ఎవరూ ఇంత ఇబ్బందులు ఎదుర్కొన లేదు. ముత్తాత జవహర్ లాల్ నెహ్రూ, నాయనమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ, అధికారంలోనే పుట్టిపెరిగారు. అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని ఒంటి చేత్తో నడిపించారు. తల్లి సోనియా కూడా కాంగ్రెస్ సారధ్యాన్ని సమర్ధంగా నిర్వహించారు. ప్రధాని పదవి చేపట్టనప్పటికీ 2004 నుంచి 2014 వరకూ మకుటం లేని మహారాణిగా వ్యవహరించారు. వీరందరికీ భిన్నంగా సంక్లిష్ట పరిస్థితుల్లో రాహుల్ పార్టీ నాయకత్వ బాధ్యతలను భుజానకెత్తుకోనున్నారు. 132 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో పార్టీ ఏనాడూ ఇంత బలహీనంగా లేదు. అధికారికంగా ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీకి సారథ్యం వహించడం అంత తేలికైన విషయం కాదు. అటు ప్రాంతీయ పార్టీలు, ఇటు జాతీయ పార్టీ అయిన బీజేపీ ధాటికి తట్టుకుని నిలబడటం పార్టీకి శక్తికి మించిన పనిగా మారింది. పలు రాష్ట్రాల్లో పార్టీ నామమాత్రంగా మారింది. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో తొలిసారి రాజ్యసభలో మెజారిటీ కోల్పోయింది. ఇప్పుడు ఎగువ సభలో రెండో అతి పెద్ద పార్టీ మాత్రమే. సంస్థాగతంగా చూస్తే పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం ఆవరించింది. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే నాయకుడు కరువయ్యారు. ప్రజాబలం కలిగిన నాయకులు పార్టీలో పట్టుమని పది మంది లేరు. పార్టీలో ఇంత నిరాశజనక పరిస్థితిని గతంలో ఏ అధ్యక్షుడు ఎదుర్కొని ఉండరు.

ముందున్న ఎన్నికలే గీటురాయి....

అధ్యక్ష పదవి చేపట్టగానే వరుసగా వచ్చే ఎన్నికల్లో రాహుల్ తన సమర్థతను నిరూపించుకోవాల్సి ఉంది. తక్షణం వచ్చే నెలలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. ఈ రెండు చోట్ల పార్టీ పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదన్న వార్తలు వస్తున్నాయి. అవినీతి ఆరోపణలతో కూరుకుపోయిన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ వచ్చే నెల 9న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బతికి బట్ట కట్టడం కష్టమే. అయిదేళ్లకోసారి ప్రభుత్వాలను మార్చడం అక్కడ ఆనవాయితీగా వస్తుంది. మళ్లీ వీరభద్రుడే ముఖ్యమంత్రి అభ్యర్థి అని స్వయంగా రాహుల్ ప్రకటించినప్పటికీ ఆయన పార్టీని ఒడ్డున పడేసే పరిస్థితి లేదు. రెండు దశాబ్దాల క్రితం గుజరాత్ లో అధికారానికి దూరమైన తాజాగా జరగనున్న ఎన్నికల్లో గట్టెక్కగలరన్న ధైర్యం పార్టీలో కనపడటం లేదు. ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సొంత రాష్ట్రమైనందున వారు సర్వ శక్తులను ఒడ్డనున్నారు. మంచి వ్యూహకర్తలైన వారికి అంగబలం, అర్థబలం చేతిలో ఉండటం అదనపు అర్హత. గత నాలుగు ఎన్నికల్లో యాభై నుంచి అరవై సీట్లు సాధించిన కాంగ్రెస్ ఇప్పుడు అదనంగా ఎన్ని తెచ్చుకోగలదన్నది ప్రశ్న. జిల్లా పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన కాంగ్రెస్ అదే ఫలితాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో పొందగలదా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ ఎన్నికల అనంతరం మధ్యప్రదేశ్, ఛతీస్ ఘడ్, కర్ణాటక, రాజస్థాన్, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ తదితర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ జాతీయ పార్టీల మధ్యే పోటీ జరగనుంది. ఈ ఎన్నికల్లో గెలుపోటములు రాహుల్ రాజకీయ భవిష్యత్ ను నిర్దేశిస్తాయి. 2019 లోక్ సభ ఎన్నికలపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి.

కాంగ్రెస్ అనుకూల అంశాలూ.....

రాహుల్ కు కొన్ని ఆశాజనక పరిస్థితులు కూడా లేకపోలేదు. దేశవ్యాప్తంగా పార్టీకి కార్యకర్తలున్నారు. ఓడిపోయినా... ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో పార్టీ బలంగా ఉంది. డీఎంకే, ఎన్సీపీ, సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ వంటి భావసారూప్య పార్టీల మద్దతుంది. వామపక్షాలు కూడా ఆయన పార్టీ వైపే ఉంటాయి. కాంగ్రెస్ నేతృత్వంలో పనిచేసేందుకు అవి సిద్ధంగా ఉన్నాయి. భిన్న విభేదాలున్నప్పటికీ మమత బెనర్జీ కూడా కలిసిరాక తప్పదు. దళిత, ముస్లిం ఓటు బ్యాంకు అండగా ఉంది. హిందువుల్లోని ఉదారవాదులు, తటస్థుల మద్దతు లభించే అవకాశముంది. తల్లి సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వంటి అనుభవజ్ఞులు, శ్రే‍యోభిలాషుల మార్గదర్శకం ఎప్పుడూ ఉంటుంది. ఇంతటి సీనియర్ నాయకుల మార్గదర్శకం గతంలో ఇందిర, రాజీవ్, సోనియా గాంధీలకు కూడా లభించకపోవడం గమనార్హం. పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళితే.. బీజేపీని ఎదుర్కొనడం కూడా అంత కష్టం కాదు. నోట్ల రద్దు చూపే ప్రభావం ప్రజల్లో బాగా ఉంది. జీఎస్టీ తగ్గుదల వంటి అంశాలు పార్టీలోనే చిచ్చురేపుతున్నాయి. అన్నింటికీ మించి రేపు గుజరాత్ లో పార్టీ గెలవకపోతే మోడీ, షాలకు వ్యతిరేకంగా అసమ్మతి భగ్గుమనడం ఖాయం. మోడీలో కూడా ప్రచార మాధ్యమాలు చూపుతున్నంత బలమైన శక్తి ఏమీ లేదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం, 2015 నాటి బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి, ఈ ఏడాది జరిగిన గోవా, , మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయినప్పటికీ ఏకైక పెద్దపార్టీగా అవతరించడం, పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం, బీహార్ లో సింగిల్ డిజిట్ నుంచి 28 స్థానాల్లో గెలవడం, పశ్చిమ బెంగాల్ లో సీపీఎంను తోసిరాజని ప్రధాన ప్రతిపక్షంగా అవతరించడం వంటి పరిణామాలను విస్మరించలేం. నాయనమ్మ ఇందిర 1977లో యూపీలోని సొంత నియోజకవర్గమైన రాయబరేలిలో ఓడినప్పటికీ రెండున్నరేళ్లలోనే మళ్లీ ఢిల్లీ గద్డెనెక్కిన సంగతి రాహుల్ కు తెలియనిది కాదు. ఆ స్ఫూర్తితో పనిచేస్తే ఆశించిన ఫలితాలు రావడం అసాధ్యం కాదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News