రాహుల్ ఇక చూపించు...!

Update: 2017-12-16 16:30 GMT

పదవులను ఉద్దేశపూర్వకంగానే దూరంగా పెడుతూ, పదేళ్ల అధికార ప్రస్థానంలో ఎక్కడా ప్రలోభాలకు గురి కాకుండా వ్యక్తిత్వాన్ని నిరూపించుకున్న రాహుల్ గాంధీ కొత్త బాధ్యతలను అధికారికంగా చేపట్టారు. స్వాతంత్ర్యోద్యమంలో సమర స్ఫూర్తికి, సంఘటిత శక్తి కి ప్రతీక కాంగ్రెసు. భారత ప్రజాస్వామ్యంలో ఘనతర చరితకు సంకేతం. గంగాజమునా తెహజీబ్ అని నిత్యం స్మరించుకునే దేశ సంస్కృతికి నిలువుటద్దం. అటువంటి సంస్థ ప్రాభవం అడుగంటిపోతుందేమోనన్న ఆందోళన నెలకొన్న దశలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు రాహుల్. కష్ట కాలంలో ఎదురీత. నాయక దక్షతకు పరీక్ష. వందేళ్ల క్రితం ముత్తాత జవహర్ తండ్రి, మోతీలాల్ తొలిసారిగా కాంగ్రెసు పగ్గాలు చేపట్టారు. అదే కుటుంబానికి చెందిన ఆరోవారసుడు రాహుల్. పాన్ ఇండియా గుర్తింపుతో భారత దేశ రాజకీయాలను గుప్పిట పట్టిన పార్టీ పట్టుమని అయిదు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో కొనసాగుతూ అవసాన దశను అనుభవిస్తున్న స్థితిలో అధ్యక్ష పదవి ఆషామాషీ వ్యవహారం కాదు. కమల కాంతులు దేశవ్యాప్తంగా ప్రసరిస్తూ భిన్న రాజకీయ పక్షాలను కకావికలం చేస్తున్న స్థితిలో కాంగ్రెసు అడ్డుచక్రం వేయగలుగుతుందా? పునర్వైభవం సంతరించుకోగలుగుతుందా? బీజేపీ సహా వ్యక్తి కేంద్రంగా రాజకీయాలు పోలరైజ్ అవుతున్న ప్రస్తుత తరుణంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ గత చరిత్ర ఘనతను పునరుద్ధరించాల్సిన బాధ్యత రాహుల్ దే.

ఉద్దేశ పూర్వకంగానే ఉచ్చు...

రాజకీయ ఓనమాలు దిద్దుకుంటున్న దశలోనే రాహుల్ తమ పార్టీకి భవిష్యత్ పోటీదారు అని గుర్తించిన బీజేపీ అసమర్థ వారసత్వ ముద్ర వేసేసింది. స్థానిక పరిస్థితులు, ప్రాంతీయ నాయకుల వైపల్యాలను పక్కనపెట్టి జాతీయ స్థాయిలో ప్రతి పరాజయ ఫలితాన్ని రాహుల్ కు చుట్టేసింది. అందులోనూ మోడీ ప్రధానమంత్రయ్యాక ఈ వ్యూహం మరింత పదునెక్కింది. ఇప్పటికీ ప్రాంతీయ భేదాలకు అతీతంగా కాంగ్రెసు పార్టీ దేశవ్యాప్తమైన ఉనికి కలిగిన పార్టీ. స్వాతంత్ర్యోద్యమంలో దేశాన్ని ఏకతాటిపై నడిపేందుకు కొన్ని దశాబ్దాల పాటు సాగిన పోరాటం కాంగ్రెసు పార్టీ బలమైన ఉనికికి కారణమైంది. బీజేపీకి, ప్రస్తుతం దేశంలో హవా చెలాయిస్తున్న ప్రాంతీయ పార్టీలకు ఇటువంటి అవకాశం లేదు. ఈలోపాన్ని పూడ్చుకొంటే తప్ప కాంగ్రెసు పార్టీకి తాము ప్రత్యామ్నాయం కాలేమన్న అంశాన్ని బీజేపీ గ్రహించింది. తాము కాంగ్రెసు స్థానంలోకి రావాలంటే, అతిపెద్ద జాతీయ పక్షంగా దీర్ఘకాలం మనుగడ సాగించాలంటే కాంగ్రెసును బలహీన పరచాల్సిందే. అసమర్థ వారసత్వంతో ఆ పార్టీ శకం ముగిసిందని నిరూపించాల్సిందే. ఇందులో భాగంగానే రాహుల్ ను తొలి నుంచీ లక్ష్యం చేసుకున్నారు బీజేపీ నాయకులు. పార్టీ పరమైన బలహీనతలను ఉద్దేశపూర్వకంగానే పక్కనపెట్టి రాహుల్ ను కేంద్రం చేసి వేలెత్తి చూపడం ప్రారంభించారు. అంతేకాకుండా రాజకీయంగా రాటుదేలిన మోడీతో పోలిక తెచ్చి రాహుల్ బలహీనుడన్న ముద్ర బలంగా ప్రజల్లోకి వెళ్లేలా చేయగలిగారు. ఈ ఉచ్చులోకి కాంగ్రెసు పార్టీ కూడా పడిపోయి మోడీని రాహుల్ ఎదుర్కొంటారన్న భావనను పార్టీశ్రేణుల్లోకి పంపించారు. నిజానికి బలమైన నిర్మాణం ఉన్న కాంగ్రెసు ప్రాంతీయ నాయకత్వాన్ని తీర్చిదిద్దుకుంటే విజయాల బాట కష్టమేమీ కాదు. బీజేపీ మోడీ మీద ఆధారపడినంతగా రాహుల్ మీద కాంగ్రెసు ఆధారపడాల్సిన పరిస్థితి లేదు. దీనిని తమ చేతల ద్వారా ప్రదర్శించడానికి సాహసించక రాహుల్ ను కేంద్రం చేస్తూ కాంగ్రెసు నాయకులు కూడా తమ రాజకీయానికి సంబంధించి సేఫ్ గేమ్ ఆడుతున్నారు.

ముల్లు కు ముల్లు సరిపోదు...

ముల్లును ముల్లుతోనే తీయాలంటారు. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలంటారు. మనిషి ఎమోషన్స్, సెంటిమెంట్స్, ఆశలు, ఆకాంక్షలు, ప్రాంతీయ,కుల,మత అభిమానాలతో ముడిపడిన రాజకీయాలకు ఇది మొత్తంగా వర్తించదు. మైనారిటీలకు అనుకూలంగా ఉండేలా విధానాలను తీర్చిదిద్దుకున్న కాంగ్రెసు పార్టీ మెజార్టీకి దూరమవుతూ వచ్చింది. ఇందిర వంటి నాయకులపై ఈ ముద్ర పెద్దగా లేదు.అందువల్లనే రాజీవ్ గాంధీ చేసిన రెండు పెద్ద తప్పిదాలు పార్టీని విధానపరమైన ట్రాక్ తప్పించాయి. షాబానో కేసులో సుప్రీం కోర్టు తీర్పును పక్కనపెట్టి ముస్లిం మతవాదులను సంతృప్తి పరిచే నిర్ణయం తీసుకుని రాజ్యాంగాన్నే సవరించడం ద్వారా రాజీవ్ తీవ్రమైన తప్పు చేశారు. మత పరమైన ఒత్తిడికి లొంగిపోతుందన్న బావన ప్రజల్లో కలిగించారు. హిందువుల్లో పార్టీపై నెగటివ్ ధోరణి ఏర్పడుతోందని గ్రహించి అయోధ్య లో నలభై సంవత్సరాలుగా మూతపడిన ప్రాంతాన్ని తెరిచి రామ పూజలకు అనుమతించడం ద్వారా రాజీవ్ మరో సరిదిద్దుకోలేని పొరపాటు చేశారు. దీని కొనసాగింపుగా బాబ్రీ మసీదు కూలిపోతున్నప్పటికీ ఫిడేలు వాయించిన రోము చక్రవర్తిలా మౌనం వహించిన ప్రధాని పీవీ ఆజ్యం పోశారు. దీంతో అటు హిందువులు, ఇటు ముస్లింలు కాంగ్రెసును విశ్వసించలేని పరిస్థితిని స్వయంకృతాపరాధాలతో తెచ్చిపెట్టుకుంది కాంగ్రెసు పార్టీ. లౌకిక ముద్ర చెరిగిపోయింది. అహ్మద్ పటేల్, గులాం నబీ అజాద్ వంటి వారి సలహాలతో బాబ్రీ విధ్వంసానికి ప్రతిగా మైనారిటీలను బుజ్జగించాలనే ప్రయత్నాలు చేయడంతో మెజార్టీ వర్గానికి దూరమైంది. ఈనాటి దుస్థితికి అవన్నీ కారణాలే. మధ్యలో అధికారంలోకి వచ్చినప్పటికీ ప్రతిపక్షాల అసమర్థత, విభేదాలే కారణమయ్యాయే తప్ప కాంగ్రెసు సొంతబలంగా చెప్పలేని పరిస్థితి. తాజాగా గుజరాత్ లో కూడా బీజేపీ విధానాలను మతంతోనే ఎదుర్కోవాలన్నట్లుగా కొత్తగా హిందూ ముద్ర వేసుకోవడానికి రాహుల్ ప్రయత్నించారు. ప్రత్యామ్నాయ విధానాలు, ప్రజాఉద్యమాలు లేకుండా యువతలోని ఆకాంక్షలకు ప్రతీకగా పార్టీని తీర్చిదిద్దుకోకపోతే, మోడీని ఎదుర్కోవడం కష్టసాధ్యంగానే మిగిలిపోతుంది.

రిలక్టెంట్ లీడర్ టు రియల్ పొలిటిక్...

రాహుల్ గాంధీ సీజన్డ్ పొలిటీషియన్ కాదు. రిలక్టెంట్ లీడర్ అంటారు పార్టీ నాయకులు. పదేళ్లపాటు పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కనీసం క్యాబినెట్ మంత్రి పదవి కూడా తీసుకోకుండా సంయమనం పాటించడం చిన్నవిషయమేమీ కాదు. రాజ్యాంగేతర అధికారాలను చెలాయించిన దాఖలాలు కూడా లేవు. ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షునిగా పార్టీ వ్యవహారాలు చూసుకున్నారు. ప్రభుత్వానికి సూచనలు, సలహాలు, మంత్రులతో వ్యవహారాలు సోనియానే నేరుగా పర్యవేక్షించేవారు. ఇది రాహుల్ వ్యక్తిత్వానికి నిదర్శనగానే చూడాలి. పార్టీని ప్రజాస్వామ్యీకరించాలనే యత్నాలు కూడా చేశారు. ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన వారిని ఉపేక్షించాలని చూడలేదు. అపరిమితమైన అధికారాలు ఉన్నప్పటికీ అవినీతిలో భాగస్వామిగా మారిన ఒక్క ఉదంతం కూడా లేదు. ఆర్డినెన్పు ద్వారా రాజకీయ నేర చరితులను కాపాడాలని సొంత ప్రబుత్వం ప్రయత్నిస్తే బహిరంగంగానే నిరసన వ్యక్తం చేయడం పై విమర్శలు వచ్చాయి. అయితే అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేని తన ఆవేదనకు ప్రతీకగానే చూడాలి. ఒక నాయకునిగా పరిణతి చెందుతున్న తీరు కూడా ఇటీవలి కాలంలో స్పష్టమవుతోంది. ప్రజలను ఆకట్టుకునే రీతిలో ప్రసంగాలకు పదును పెంచారు. విధానపరంగా బీజేపీపై దాడి చేసే విషయంలో రాజీపడని ధోరణిని కనబరుస్తున్నారు. అదే సమయంలో కట్టుతప్పితే పెద్ద నాయకులను కూడా సహించమని మణి శంకర్ అయ్యర్ పై వేటు వేయడం ద్వారా పార్టీ శ్రేణులకు గట్టి సంకేతాలే పంపించారు. తప్పులను సరిదిద్దుకునే వినమ్రత తనకుందని నిరూపించుకుంటున్నారు. ఇవన్నీ రియల్ పొలిటిక్ గా మారే క్రమంలో తొలి అడుగులుగానే చూడాలి. నేటికీ కాంగ్రెసు పార్టీ అవసరం దేశానికి ఎంతైనా ఉంది. అన్నివర్గాలకు అసలు సిసలు అవకాశాలు ఇచ్చే పార్టీగా చెప్పుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బలమైన సామాజిక వర్గాలు రాజ్యం చేస్తున్న ఆరోదశకంలోనే దళితుడిని ముఖ్యమంత్రిని చేసేంత సాహసం కాంగ్రెసు మాత్రమే చేయగలదు. సామాజిక న్యాయానికి పట్టం గట్టగలదు. అధికార పక్షంపై అంకుశంగా మారి విధానాలను నిలదీయడం ద్వారానే దేశ మౌఖిక, లౌకిక స్వరూపం పరిరక్షించబడుతుంది. అందుకోసమైనా కాంగ్రెసు బలపడాలి. అధికారమే పరమావధి కాదు, కాకూడదు. ఫలితం గురించే బెంగ పడకుండా.. నీ పని నువ్వు చేయి అని ఉద్బోధించే ..కర్మణ్యేవాధికారస్తే.. మా ఫలేషు కదాచన గీతాసూత్రం రాజకీయాలకూ వర్తిస్తుంది. దానిని అందిపుచ్చుకోవడమే ఇప్పుడు రాహుల్ పని.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News