రాష్ట్రాల నోట్లో మోడీ ‘మన్ను’ కొట్టారా....!

Update: 2018-02-03 15:30 GMT

కేంద్రప్రభుత్వ వ్యూహంలో చిక్కి రాష్ట్రాలు విలవిల్లాడుతున్నాయి. బడ్జెట్ దెబ్బతో దిక్కుతోచని అయోమయానికి గురవుతున్నాయి. ఎన్నికల ఏడాది రాష్ట్రప్రభుత్వాలకు కనీస ఊతం దక్కకుండా కేంద్రం విసిరిన బడ్జెట్ పాచిక ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాల పాలిట శాపంగా మారబోతోంది. రాజకీయ విమర్శలు, ఆరోపణలు ఎన్ని చేసినప్పటికీ విపక్షాల మాట చెల్లుబాటయ్యే పరిస్థితి కనిపించడం లేదు. లోక్ సభలో గందరగోళం, రాజ్యసభ ను స్తంభింపచేయడం వంటి చర్యలకు పాల్పడినా చివరికి దక్కేఫలితమూ అంతంతమాత్రమే. లోక్ సభలో ఒంటరిగానే ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)ను గట్టెక్కించుకునే సంఖ్యాబలం బీజేపీకి ఉంది. మిత్రపక్షాల సహకారం కూడా అవసరం లేదు. ఆర్థిక వ్యవహారం కావడంతో రాజ్యసభ ఆమోదంతో నిమిత్తం లేదు. పైకి చూస్తే సంక్షేమాన్ని, అభివృద్ధిని మిళితం చేస్తూ బడ్జెట్ ను రూపొందించినట్లుగా కనిపించినప్పటికీ కేంద్ర గుత్తాధిపత్యానికి బాటలు వేసే వ్యూహాత్మక పంథాని తాజా బడ్జెట్ లో అనుసరించినట్లుగా రాజకీయవేత్తలు, ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదనపు వనరుల కోసం రాష్ట్రాలు పూర్తిగా కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తేవిధంగా బడ్జెట్లో కీలకాంశాలపై లోగుట్టు దాచిపెట్టారంటున్నాయి విపక్షాలు.

పెరుగుట విరుగుట కొరకే...

పధ్నాలుగో ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు కేంద్రం నుంచి రాష్ట్రాలకు లభించే పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచినప్పుడు రాష్ట్రప్ర్రభుత్వాలు చాలా సంతోషించాయి. నరేంద్రమోడీ ప్రభుత్వం రాష్ట్రాల ఆర్థిక పరిపుష్టికి చేయూతనిస్తోందని భావించాయి. నిధుల లభ్యత పెరగడంతో సొంతంగా పథకాలను అమలు చేసుకునేందుకు, రాష్ట్ర అవసరాలను తీర్చుకునేందుకు ఉపయోగకరమవుతుందని ముఖ్యమంత్రులందరూ ముక్తకంఠంతో అభిప్రాయపడ్డారు. కానీ వాస్తవానికి జరిగింది మరొకటి. కుడిచేత్తో విదిల్చి ఎడమచేత్తో నిధులను కోసేశారు. పేదరిక నిర్మూలన, అక్షరాస్యత, ఆరోగ్యం, మౌలిక వసతుల కల్పన, పంచాయతీ రాజ్ సంస్థల పరిపుష్టి వంటి అనేక అంశాలకు సంబంధించిన పథకాలను కేంద్రం అమలు చేస్తూ వస్తోంది. దాదాపు 66 పథకాల ద్వారా రాష్ట్రాలకు చేయూతనిస్తూ వచ్చింది. ఎప్పుడైతే రాష్ట్రాల వాటాను పెంచిందో అప్పుడే కేంద్రప్రాయోజిత పథకాల్లో కూడా కోత పెట్టేసింది. 66 పథకాలను 27 కి పరిమితం చేసేసింది. ఇందులో పది పథకాలకు మాత్రమే కేంద్రం పూర్తిస్థాయిలో నిధులు అందచేస్తోంది. మరో 17 పథకాలకు కేంద్రం 60 శాతం నిధులిస్తుంటే మరో 40 శాతం నిధులను రాష్ట్రాలు భరించాలి. దీంతో రాష్ట్రాలకు ఆర్థిక స్వేచ్ఛ పెంచినట్లు కనిపిస్తూనే భారీగా నిధులను మిగుల్చుకోగలిగింది కేంద్రం. అసలు గుట్టు గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వాలు ఆవేదన వ్యక్తం చేసేటప్పటికే చేతులు కాలిపోయాయి. కేంద్రప్రాయోజిత పథకాలు అటకెక్కేశాయి.

దేహి ‘మాం’..పాహి ‘ప్రభో’..

కేంద్రప్రభుత్వ బడ్జెట్ తర్వాతనే రాష్ట్రప్రభుత్వాలు తమ వార్షిక బడ్జెట్లకు తుది రూపునిస్తుంటాయి. కేంద్రప్రాధాన్యాలు, నిధుల కేటాయింపును గ్రహించి గరిష్టంగా లబ్ధి పొందే రీతిలో తమ పథకాలను పునర్విర్వచించుకుంటాయి. సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో కేంద్రసాయం పొందేందుకు అనుగుణంగా తమ కేటాయింపులు పెంచుకుంటాయి. కొన్ని చోట్ల కోత విధించి మరికొన్ని చోట్ల బడ్జెట్ పద్దులు సవరించుకుంటుంటాయి. కేంద్ర ఖాతాలోని ప్రాయోజిత పథకాల నిధులను రాబట్టుకునేందుకు ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటాయి. బడ్జెట్ తోపాటు ఎంపీలకు, అధికారులకు అందచేసే కూలంకష నివేదికను ఈ సారి జతపర్చలేదు. ఇందులో రాష్ట్రాలకు ఏమేరకు నిధులు, ఎంతమేరకు లభించే అవకాశముందో వివరాలుంటాయి. ఈ దఫా కేంద్రం అటువంటి అవకాశం ఇవ్వలేదు. పెద్ద పద్దులు, పథకాల కేటాయింపులే తప్ప రాష్ట్రాల వారీ నిధుల అంశాల ప్రస్తావన చూపకుండా జాగ్రత్త పడ్డారు. ఈ లోపం కారణంగా నేషనల్ ఇనిస్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ ఫార్మేషన్ ఆఫ్ ఇండియా (నీతి అయోగ్) నిర్ధరించి రాష్ట్రాలకు పథకాల కేటాయింపులు చూడాల్సిందేనన్న భావన ఏర్పడుతోంది. అంటే నిధుల కోసం రాష్ట్ర్ర ప్రభుత్వాలు నీతి అయోగ్ ముందు క్యూ కట్టాలి. ఎన్నికైన ప్రజాప్రభుత్వాలకు ఇది తలవంపు కిందే లెక్క. పైగా నీతిఅయోగ్ కు సాక్షాత్తు ప్రధానమంత్రే అధ్యక్షుడు. గతంలో కూడా ప్లానింగ్ కమిషన్ కు ప్రధాని నేతృత్వం వహించేవారు. కానీ దానికి విస్తృతమైన , విశృంఖలమైన అధికారాలుండేవి కాదు. మార్గదర్శక పాత్ర పోషించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రానికి ప్రణాళిక పరమైన సలహాలు అందించేది. సూచనలు చేస్తుండేది. అవసరమైన సిఫార్సులతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ది పథకాలు, ఆర్థిక సంబంధాల సంతులనానికి దోహద పడుతుండేది. దాని స్థానంలో వచ్చిన నీతి అయోగ్ ఒకరకంగా చెప్పాలంటే పెత్తందారీ పాత్రను పోషిస్తోంది. అదే సమయంలో కేంద్రం పెద్దన్నపాత్రకు సాధనంగా ఉంటోంది.

‘న.మో’నార్క్...

భారతదేశం రాష్ట్రాలతో కూడిన సహకార సమాఖ్య అంటూ ప్రధాని నరేంద్రమోడీ సందర్బం వచ్చిన ప్రతిసారీ నొక్కి చెబుతుంటారు. ప్రధాని, ముఖ్యమంత్రుల కలయిక ‘టీమ్ ఇండియా’ అంటూ మనదంతా ఒకటే జట్టు అని మోడీ ప్రవచిస్తుంటారు. అదంతా మాటల్లోనే అంటున్నారు ప్రతిపక్ష ముఖ్యమంత్రులు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకం మోడీ కేర్ గా పేర్కొంటున్న ఆయుష్మాన్ భారత్ విషయంలో రాష్ట్రప్రభుత్వాలతో కనీసం మాట మాత్రంగా కూడా చర్చించలేదు. ఈ పథకం నిధుల విషయంలో మాత్రం రాష్ట్రాలు కూడా భాగస్వామ్యం వహించాలని కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. రెండు లక్షల కోట్ల రూపాయల మేరకు వ్యయమయ్యే ఈ పథకానికి కేవలం రెండువేల కోట్ల రూపాయలనే బడ్జెట్ పద్దులో చూపించారు. అమలు విషయంలో రాష్ట్రాలు ముందుకు రాకపోతే అటకెక్కించే అవకాశం ఉంది. ప్రచారం కేంద్రానికి దక్కుతుంది. వైఫల్యం పాపాన్ని రాష్ట్రాలకు అంటగట్టేయవచ్చనేది ఇందులోని ఆంతర్యమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం బడ్జెట్ కు ముందు వివిధ రాష్ట్రప్రభుత్వాల నుంచి అవసరాలు, డిమాండ్లు, దీర్ఘకాలిక పథకాలకు సంబంధించిన ప్రతిపాదనలు ఆహ్వానించే సంప్రదాయం ఉంటుండేది. ఈ సంవత్సరం దీనిపై పెద్దగా కసరత్తు చేయలేదనే విమర్శలు వినవస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలు తమంతతామే చొరవ తీసుకుని కొన్ని ప్రతిపాదనలు సమర్పించాయి. కానీ వాటిలో దేనినీ పట్టించుకోలేదు. కేంద్రబడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్బంలో గతంలో ఎన్నడూలేనివిధంగా రాష్ట్రాలపై పూర్తి నిర్లక్ష్యం కనబరిచారనేది ప్రధాన మైన ఆరోపణ. కేవలం విపక్ష పాలిత రాష్ట్రాలకే కాదు. సొంత బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఇదే రకమైన చేదు అనుభవం ఎదురైంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News