రాఫెల్...రాహుల్ కు రైఫిల్ దొరికినట్లేనా?....?

Update: 2018-02-12 16:30 GMT

బోఫోర్స్.... భారత రాజకీయాల్లో ఈ రక్షణ ఒప్పందం గురించి తెలియని వారుండరు. 80వ దశకం ద్వితీయార్థంలో నాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఈ రక్షణ కాంట్రాక్టు విపక్షాలకు వరమైంది. ఇందులో అక్రమాలు జరిగాయంటూ విపక్షం ఆరోపణలు గుప్పించింది. కొంతమంది ఎంపీలు రాజీనామాలుకూడా చేశారు. అంతిమంగా 1989 సార్వత్రిక ఎన్నికల్లో రాజీవ్ గాంధీ ఓటమికి దారితీసిన కారణాల్లో ఇది ఒకటి అయింది. చివరికి బోఫోర్స్ ఒప్పందంలో అక్రమాలు జరగలేదని తేలింది. ఈ ఆయుధాలు కార్గిల్ యుద్ధంలో బాగా పనిచేశాయన్న కితాబు కూడా వచ్చింది. అయినప్పటికీ కాంగ్రెస్ రాజకీయంగా భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది.

బోఫోర్స్ మాదిరిగానే....

ఇప్పుడు రాఫెల్ ఒప్పందాన్ని గమనిస్తే బోఫోర్స్ గుర్తుకు రాకమానదు. అప్పుడు విపక్షాలకు బోఫోర్స్ ఎలా అయుధంగా మారిందో ఇప్పుడు కాంగ్రెస్ కు రాఫెల్ రాజకీయంగా ఎన్డీఏ ప్రభుత్వంపై, వ్యక్తిగతంగా నరేంద్ర మోడీపై ధ్వజమెత్తడానికి మంచి ఆయుధంగా మారింది. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అంశం కాంగ్రెస్ కు రాజకీయంగా ఎంత మేలు చేస్తుందో, బీజేపీకి ఎంత నష్టం కలగచేస్తుందో వేచిచూడాలి. రాజకీయంగా లాభనష్టాలను పక్కనపెడితే తమది పారదర్శక ప్రభుత్వమని, అవినీతి మకిలి అంటని ప్రభుత్వమని ప్రచారం చేసుకుంటున్న ఎన్డీఏ పెద్దలకు తలనొప్పి తెప్పిస్తోంది. ఈ ఆరోపణలకు సంతృప్తి కరమైన సమాధానాలు ఇవ్వడం పార్టీకి, ప్రభుత్వానికి అంత తేలిక ఏమీ కాదు. రాఫెల్ ఒప్పందం ఈ నాటిది కాదు. దీనికి దశాబ్దం చరిత్ర ఉంది. కాంగ్రెస్ హయాంలోనే ఈ ఒప్పందం వెలుగు చూసింది. యూపీఏ -1 ప్రభుత్వ హయాంలోనేఈ ఒప్పందం కుదిరింది. ఒక్కొక్కటి 526.1 కోట్ల రూపాయల చొప్పున 126 రాఫెల్ ఫైటర్ జెట్ విమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయాలన్నది ఈ ఒప్పందం సారాంశం. వివిధ కారణాల వల్ల అది రూపుదాల్చలేదు. 2014లో మోడీ అధికారంలోకి వచ్చాక దీనిని రద్దు చేస్తారని భావించారు. కానీ అందుకు భిన్నంగా ఒక్కొక్కటి 1570.80 కోట్ల చొప్పున మొత్తం 36 విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదరింది. 2015లో మోడీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఒప్పందం కుదరింది.

అంత పెద్దమొత్తం పెరగడానికి....

తమ హయాంలో ఒక్కోటి 526.1 కోట్ల చొప్పున కొనుగోలు చేయాలని నిర్ణయించగా ఇప్పుడు అమాంతం1570.80 కోట్లకు పెరగడంలో ఆంతర్యం ఏమిటన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేక బీజేపీ ప్రభుత్వం కిందామీదా పడుతుంది. మోడీ తన మిత్రుల కోసమే ఇలా చేశారన్న ఆరోపణకు జవాబు ఇవ్వలేక పోతోంది. తాజా ఒప్పందం వల్ల అధికంగా లబ్ది పొందేది పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ అన్నది హస్తం పార్టీ వాదన. ప్రభుత్వ రంగ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ను ఒప్పందం నుంచి ఉద్దేశపూర్వకంగా తప్పించి రక్షణ రంగంలో ఏమాత్రం అనుభవం లేని వ్యాపారవేత్తను తీసుకొచ్చిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సూటిగా ప్రశ్నలు సంధిస్తున్నారు. బెంగుళూరు నగరానికి గర్వకారణమైన హిందూస్థాన్ ఏరోనాటిక్స్ ను మోడీ నిర్వీర్యంచేశారని కర్ణాటక కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ ధ్వజమెత్తారు.

సమాధానం చెప్పలేక....

రాహుల్ ఆరోపణలకు సమాధానం ఇవ్వడంలో ప్రభుత్వం ఒకింత ఇబ్బంది పడుతున్నట్లు కనపడుతోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆనందశర్మ రాజ్యసభలో ఈ విషయం ప్రస్తావించినప్పుడు ప్రభుత్వం సంకట పరిస్థితిని ఎదుర్కొంది. భద్రతా విషయాల్లో గోప్యత అవసరమని, అన్ని విషయాలు వెల్లడించలేమని రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ చెబుతున్నారు. ఒప్పందం ప్రకారం అది గోప్యంగా ఉంచాల్సిన విషయమన్న ఆమె వివరణ సంతృప్తి కరంగా లేదు. రాజ్యసభ నాయకుడు, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మరింత ముందుకు వెళ్లి కాంగ్రెస్కు సుద్దులు చెప్పే ప్రయత్నం చేశారు. యూపీఏ హయాంలోని రక్షణ మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, ఏకే ఆంటోనీ పార్లమెంటు వేదికగా మాట్లాడుతూ రక్షణ ఒప్పందాల రహస్యాలను వెల్లడించడం దేశ భద్రతరీత్యా సరికాదని 15 సందర్భాల్లో చెప్పారని గుర్తు చేశారు. గతంలో సీపీఎం సభ్యుడు సీతారామ్ ఏచూరి వంటి సభ్యుల ప్రశ్నలకు కూడా ఇదే సమాధానం లభించింది.

పారదర్శకత అవసరం....

ప్రభుత్వం ఏదైనా పారదర్శకత, జవాబుదారీతనం అవసరం. వేల కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించే విషయంలో ఇది తప్పనిసరి. ప్రభుత్వ రంగ సంస్థ కాకుండా, మరో పారిశ్రామిక వేత్తకు లబ్ది కలిగించే ప్రయత్నం. ధర అమాంతం పెరగానికి గల కారణాలను వెల్లడించడానికి, జాతిభద్రతకు గల సంబంధం ఏమిటో ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. కాలం గడిచే కొద్దీ ధర పెరిగే మాట వాస్తవం అయినప్పటికీ అంత పెద్ద మొత్తం పెరగడం అనుమానాలకు ఆస్కారం కలుగుతుంది. పారదర్శకత మాటల్లోనే కాకుండా చేతల్తో కనపడాల్సిన అవసరం ఉంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News