రాణీ...ది గ్రేట్...!

Update: 2017-10-25 18:29 GMT

చట్టంముందు అందరూ సమానులేనని భారత రాజ్యాంగం ఉద్భోదిస్తుంది. పారదర్శకత, జవాబుదారీతనం ప్రజాస్వామ్య మూల స్తంభాలు. ఇవన్నీ కాగితాలకే పరిమితమని ఎప్పటికప్పుడు పాలకులు నిరూపిస్తున్నారు. ఆ తర్వాత చెంపలేసుకుంటున్నారు. ఏపార్టీ అధికారంలో ఉన్నా ఇదే తీరు. భారతీయతకు ప్రతిబింబమని చెప్పుకునే బీజేపీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. రాచరికం వంశం నుంచి వచ్చిన బీజేపీ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే వంటి వారు మాత్రం చట్టానికి, రాజ్యాంగానికి తాము అతీతులమని భావిస్తుంటారు. వ్యవహారశైలిలో అడుగడుగునా రాజదర్పం ప్రదర్శించే వసుంధర పారద్శకత, జవాబుదారీతనం వంటివి తనకు సరిపడవని తన చర్యల ద్వారా చెబుతోంది. తద్వారా అహంకార పూరితంగా అభాసుపాలయింది.

అతి క్రూరమైన చట్టం.....

ప్రభుత్వ అధికారులు, న్యాయమూర్తులు, మెజిస్ట్రేట్లపై వచ్చిన ఆరోపణలను ముందస్తు అనుమతి లేకుండా మీడియా ప్రచురించకూడదంటూ ఇటీవల ఒక అత్యవసర ఆదేశాన్ని (ఆర్డినెన్స్)ను రాజస్థాన్ సర్కార్ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం విధినిర్వహణలో భాగంగా చేపట్టిన చర్యలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రస్తుత, మాజీ న్యాయమూర్తులు, మెజిస్ట్రేట్లను ముందస్తు అనుమతి లేకుండా విచారించరాదు. అంతేకాక ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించేంత వరకూ ఆ ఆరోపణలను పత్రికలు కూడా ప్రచురించకూడదు. గతంలో పాలకులు ప్రజాస్వామ్యం, మీడియా గొంతు నొక్కేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఇంత క్రూర చట్టం తీసుకురాలేదని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. తప్పుడు ఆరోపణల నుంచి ప్రభుత్వ అధికారులను, న్యాయవ్యవస్థను కాపాడటానికే ఈ అత్యవసర ఆదేశాన్ని తీసుకు వచ్చామని వసుంధర రాజే చెబుతున్నప్పటికీ అసలు లక్ష్యం మాత్రం అవినీతికి ముసుగు కప్పడం, మీడియా కళ్లకు గంత కట్టడమే నన్న విమర్శలు విన్పిస్తున్నాయి. గత నెలలో జారీ చేసిన ఆర్డినెన్స్ చట్టం చేసేందుకు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నేర చట్టాల (రాజస్థాన్ సవరణ)బిల్లు-2017 ప్రజాస్వామ్య మూల సూత్రాలకు పూర్తి విరుద్ధమైనది. సీఆర్పీసీలోని 156, 190 నిబంధనలను సవరించడం ద్వారా ప్రస్తుత, మాజీ ప్రభుత్వాధికారులు, మెజిస్ట్రేట్లు, జడ్జిలను అనుచిత చర్యలకు రక్షణ కల్పించినట్లయింది. ఈ చట్టానికి విరుద్ధంగా వ్యవహరించినట్లయితే రెండేళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరిస్తోంది. 2013-2017 మధ్య కాలంలో అధికారులపై పెట్టిన కేసుల్లో 73 శాతం సాక్ష్యాధారాలు లేనే లేవని తేలాయని, అందువల్లే ఈ చట్టాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నించినట్లు వసుంధర రాజే సర్కార్ చెబుతున్న వివరణ హాస్యాస్పదం. చట్టం ముందు అందరూ సమానమేనన్న రాజ్యాంగ స్ఫూర్తికి ఇది పూర్తిగా విరుద్థం. ఇలాంటి వెసులుబాటు కల్పించడం ఏవిధంగా సమర్ధనీయమో ప్రభుత్వమే చెప్పాలి. అధికారులు, ప్రభుత్వం కుమ్మక్కయినప్పుడు సాక్ష్యాధారాలు ఎలా వెలుగులోకి వస్తాయి? అసలు అధికారులు వాటిని వెలుగులోకి వచ్చేందుకు ఎలా సహకరిస్తారు? వంటి ప్రశ్నలు ఉత్పన్నమవ్వక మానవు. ఒకవేళ వెలుగులోకి వచ్చినా వాటిని మటుమాయం చేయడం అధికారంలో ఉన్న వారికి చాలా తెలివైన పని. ఇలాంటి వ్యవహారాలు చక్కబెట్టేందుకు ఆరు నెలల ముందస్తు సమయం చట్టంలో కల్పించడం విశేషం.

ఈ చట్టం తేవడానికి కారణాలివే....

వసుంధర సర్కార్ ఈ నిర్ణయానికి రావడానికి బలమైన కారణాలున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్లనున్న వసుంధర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వంలో అన్ని స్థాయుల్లో అవినీతి పెరిగిపోయింది. వందలాది అవినీతి కేసుల్లో దర్యాప్తులు జరుగుతున్నా... శిక్షలు పడుతున్న కేసులు చాలా తక్కువే. అవినీతి ఆరోపణల కారణంగా ఇటీవల ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని అరెస్ట్ చేశారు. ఇవన్నీ ఎన్నకల్లో ఎక్కడ తమ కొంప ముంచుతాయోయన్న భయంతో వసుంధర సర్కార్ హడావిడిగా పావులు కదిపింది. దాని ఫలితమే ఈ అప్రజాస్వామిక నిర్ణయం. వివిధ వర్గాల నుంచి వచ్చిన వ్యతిరేకతను చూసి సర్కారు వెనక్కు తగ్గింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాజస్థాన్ హైకోర్టులో రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలవ్వడంతో కోర్టులో అక్షింతలు తప్పవన్న భయమే వెనక్కు తగ్గడానికి కారణం. దీంతో బిల్లును సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపాలని నిర్ణయించింది. సెలక్ట్ కమిటీకి పంపడం అంటే ఒక రకంగా దీనిని కోల్డ్ స్టోరేజీలో పడేసినట్లే.

వసుంధరే కాదు... గతంలోనూ.....

ఇలాంటి చట్టాలు ఉంటే భోఫోర్స్ కుంభకోణం, 2జీ స్కాం, బొగ్గు కుంభకోణం వెలుగులోకి వచ్చేవి కావు. వేల కోట్ల రూపాయల ప్రజాధనం పక్కదారి పట్టింది ఈ కుంభకోణాల్లో. వీటిని వెలుగులోకి తీసుకురావడంలో మీడియా పాత్ర తక్కువ ఏమీ కాదు. ప్రభుత్వ అనాలోచిత విధానాలను ప్రశ్నించే న్యాయవ్యవస్థకు కూడా రక్షణ కల్పించాలని ప్రయత్నించడం అసంబద్ధమైన చర్య. రాజ్యాంగంలోని ప్రధానాంగాల్లో ఒకటైన న్యాయవ్యవస్థ స్వతంత్ర వ్యవస్థ. తమకు రక్షణలను కల్పించడం వంటి చర్యలను వారు కూడా అంగీకరించరు. వసుంధర నిర్ణయం ప్రజాస్వామ్య ప్రభుత్వ నిర్ణయంలా లేదు. నిరంకుశ చక్రవర్తి నిర్ణయంలా ఉందన్న విమర్శలను కొట్టిపారేయలేం. ఇలాంటి క్రూరచట్టాలను తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన వారిలో వసుంధర రాజే మొదటివారు కారు. చివరి కారు. గతంలో పలువురు పాలకులు ఈ దిశగా పావులు కదిపి చివరికి చేతులు కాల్చుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని నీతులు చెప్పినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పాలకుడు చేసే పని ఇదే. వసుంధర సర్కార్ చ్య భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి అంటూ గళమెత్తుతున్న కాంగ్రెస్ కు కాబోయే సారధి రాహుల్ గాంధీకి తన తండ్రి రాజీవ్ గాంధీ నిర్వాకం తెలియకపోవచ్చు. 1988లో తన తండ్రి తీసుకువచ్చిన పరువు నష్టం బిల్లు గురించి తెలుసుకోవాలి. అప్పట్లో రాహుల్ చిన్న పిల్లవాడు. చివరికి ప్రజా వ్యతిరేకతతో రాజీవ్ వెనక్కు తగ్గారు. యూపీఏ పాలకులు కూడా బ్రాడ్ కాస్టింగ్ బిల్లు పేరిట ప్రసారమాధ్యమాలను నియంత్రించేందుకు ప్రయత్నం చేయకపోలేదు. నాడు దాన్ని వ్యతిరేకించిన బీజేపీ ఇప్పుడు తమ సొంత సర్కార్ నిర్వాకాన్ని ఎండగట్టడంలో, అడ్డుకోవడంలో నీళ్లునమలడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి....? బీజేపీ ప్రవచిత సిద్ధాంతాలకు ఇది విరుద్ధమైన చర్య కాదా....? మొత్తం మీద వసుంధర ఈ నిర్ణయం తీసుకుని రాణి ది గ్రేట్ అని అనిపించుకోవాలనుకున్నారో...ఏమో...?

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News