రాజ్యాంగ భారమా? రాజకీయ బేరమా?

Update: 2018-04-24 15:30 GMT

గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుల ఏకాంత సమావేశం హాట్ హాట్ చర్చకు దారితీస్తోంది. గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద దిక్కు. కేంద్రప్రభుత్వ ప్రతినిధి. అవసరమైన సందర్భాల్లో ప్రభుత్వానికి తగిన సలహాలు , సూచనలు ఇచ్చి దారి తప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉంటుంది. అందువల్లనే ముఖ్యమంత్రులు బడ్జెట్ సమావేశాలు, కీలక నిర్ణయాలు, విదేశీపర్యటనలు చేసే సందర్బాల్లోనూ, తిరిగి వచ్చిన తర్వాత గవర్నర్ ను కలిసి సమాచారం ఇస్తారు. సంప్రదిస్తారు. ఆయన సలహాలను స్వీకరిస్తారు. అటువంటప్పుడు గవర్నర్, ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రత్యేకమైన దృష్టితో చూడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ గా కనిపిస్తోంది. కేంద్రంతో గొడవ వద్దు. హీట్ పెంచవద్దు. ఆలోచించుకోండి. రాష్ట్రప్రయోజనాలకు ఇదేమంత మంచిపరిణామం కాదని గవర్నర్ ఇచ్చిన సలహా చర్చకు దారితీస్తోంది. గవర్నర్ సీఎంతో కలిసిన సందర్భం, అందులోనూ ఎటువంటి ముందస్తు షెడ్యూల్ లేకుండా తానే హడావిడి కార్యక్రమం పెట్టుకుని మరీ విజయవాడలో దిగిన సన్నివేశం ఆసక్తి గొలుపుతోంది.

గత ప్రవర్తనే కారణం...

2014 ఎన్నికల్లో కాంగ్రెసును గద్దె దింపి బీజేపీ కేంద్ర పీఠాన్ని అధిష్టించింది. తర్వాత కాలక్రమంలో కాంగ్రెసు పార్టీ హయాంలో నియమితులైన గవర్నర్లందరూ తమ పోస్టులను దాదాపు ఖాళీ చేసేశారు. కానీ నరసింహన్ మాత్రం కొనసాగుతున్నారు. కేంద్రప్రభుత్వ అపారకరుణా కటాక్షాలతో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అంతగా ఆయనలో కేంద్రప్రభుత్వానికి నచ్చిన అంశాలేమున్నాయనే ప్రశ్న తలెత్తుతుంది. గతంలో బ్యూరోక్రాట్ అయిన నరసింహన్ పౌరసేవల అధికారుల్లో ఉండే సహజలక్షణమైన బాస్ ఈజ్ ఆల్ వేస్ రైట్ అన్న నానుడిని వంటపట్టించుకున్నారు. యూనియన్ గవర్నమెంట్ చెప్పిన మాటను తూ.చ. తప్పకుండా పాటించడంలో ఆరితేరిపోయారు. తనను నియమించిన కాంగ్రెసు హయాంలో సోనియా అండ్ కో కు ఎంత విధేయంగా ఉన్నారో, తాజాగా బీజేపీ హయాంలో మోడీ, అమిత్ షాల ద్వయానికి సైతం అంతే విధేయత కనబరుస్తారనే విమర్శ ఆయనపై ఉంది. అందువల్లనే బీజేపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయినా ఆయన పీఠం కదల్లేదు. సీటు వదలలేదు. పదవీ కాలం ముగిసినా ఆయనే కొనసాగుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీకి అమిత్ర ప్రభుత్వాలే ఉన్నాయి. నిన్నామొన్నటివరకూ బీజేపీ, టీడీపీ కలిసి ఉన్నట్లు నటించినా ఎవరి వ్యూహాలు వారివే అన్నట్లుగా తంతు నడిచేది. ఇటువంటి సమయంలోనే విశ్వాసపాత్రుడైన గవర్నర్ అవసరం కేంద్రానికి ఉంటుంది. అటువంటి అవసరమే నరసింహన్ కొనసాగింపునకు ప్రధాన కారణంగా నిలిచింది. కేంద్రానికి, రాష్ట్రాలకు అనుసంధాన కర్తగా ఆయన కీలకంగానే వ్యవహరించారు. తొలిదశలో బీజేపీ పేరు చెబితే విరుచుకు పడే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రమేపీ తనధోరణిని మార్చుకుని ప్రధాని మోడీకి అనుకూలంగా వ్యవహరించడంలో గవర్నర్ పాత్ర చాలా ఉందనేది రాజకీయ వర్గాల సమాచారం. అలాగే తెలుగుదేశం, బీజేపీల మధ్య పొత్తు ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు ఘర్షణాత్మక వైఖరి ఏర్పడుతూ వచ్చింది. దానిని సర్దిపుచ్చుతూ ఇంతకాలం ఈ పొత్తు కొనసాగేలా చూడటంలోనూ నరసింహన్ రోల్ ఉంది. దీంట్లో వెంకయ్యనాయుడి పాత్ర కూడా ఉంది. వెంకయ్య రాజకీయ తెర నుంచి తప్పుకోవడంతో గవర్నర్ మాట చంద్రబాబు వద్ద పనిచేయడం మానేసింది.

ఉభయకుశలోపరి...

స్వతస్సిద్ధంగా గవర్నర్ శాంతస్వభావుడు. సంఘర్షణ కోరుకునే తత్వం కాదు. అదే ఆయనకు అడ్వాంటేజ్ గా మారింది. రాష్ట్ర విభజనకు నాలుగేళ్ల ముందునుంచే గవర్నర్ గా వ్యవహరించడం కలిసి వచ్చింది. ముఖ్య నాయకులందరితోనూ సంబంధాలు ఏర్పరచుకోగలిగారు. చంద్రబాబునాయుడు, కేసీఆర్ కు సైతం శ్రేయోభిలాషిగా ముద్ర పడ్డారు. అప్పుడప్పుడూ కేసీఆర్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుగుదేశం ఆరోపించినప్పటికీ దానికి తగినన్ని ఆధారాలు చూపలేకపోయింది. కేసీఆర్ మాత్రం ప్రతివిషయంలోనూ గవర్నర్ ను సంప్రతిస్తూ ఆయన వద్ద మంచి మార్కులే కొట్టేశారు. దీంతో కేంద్రప్రభుత్వానికి పంపే నివేదికల్లో తెలంగాణ సర్కారు పనితీరుపై పాజిటివ్ రిపోర్టులే వెళుతుండేవి. కేంద్రమంత్రులు సర్టిఫికెట్లు ఇవ్వడంలోనూ, ప్రధాని సైతం రాష్ట్ర సర్కారు పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేయడంలోనూ గవర్నర్ తనవంతుపాత్ర పోషించారు. చంద్రబాబు నాయుడి విషయంలోనూ నెగటివ్ గా వ్యవహరించారని చెప్పడానికి ఆధారాలేమీ లేవు. అయితే రాజధాని నిర్మాణం, పోలవరం, పట్టిసీమ వంటి విషయాల్లో వచ్చిన ఆరోపణలు, పత్రికా కథనాలను ఎప్పటికప్పుడు కేంద్రసర్కారులోని హోంశాఖకు నివేదించేవారనేది సమాచారం. దీని కారణంగానే ఏపీ ప్రభుత్వ పనితీరుపై మోడీ సానుకూలతనుపెంచుకోలేకపోయారనేది విమర్శ. ఈవిషయంలో నరసింహన్ ను తప్పుపట్టలేం. చంద్రబాబును కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వచ్చేవారు. అయితే కేంద్రస్థాయి మంత్రులు కలిసినప్పుడు గవర్నర్ చెప్పిన విషయాలనే ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావిస్తూ రావడంతో ఈ సమాచార సంధానకర్త గవర్నరే అన్న విషయం చంద్రబాబుకు బోధ పడింది. దీంతో వారిరువురి మధ్య దూరం పెరిగింది.

పవన్ కెందుకంత ప్రాముఖ్యత..?..

పవన్ కల్యాణ్ నిజాయతీ, చిత్తశుద్ధిపై మోడీకి చాలా పాజిటివ్ భావనలే ఉన్నాయి.తెలుగుదేశంతో అవసరార్థపొత్తు మాత్రమే అని మోడీ మొదటి సంవత్సరమే గ్రహించారు. అటువంటి స్థితిలో పవన్ వంటి నాయకుడు తమ పార్టీకి చేరువైతే బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఒంటరిగా వెళ్లగలదని అనుకున్నారు. కానీ ఈవిషయాలను అగ్రనాయకులకు తప్ప నేరుగా పవన్ తో చర్చించలేదు. ఈ బాద్యతను అమిత్ షా తీసుకున్నారు. జనసేన నిర్మాణం అంత సులభం కాదని ఎప్పుడో ఒకప్పుడు పవన్ తమ పార్టీలోకి రావాల్సిందేనని అమిత్ షా ఊహించారు. ఇందుకనుగుణంగా డైరెక్టుగానే పవన్ కు ఆఫర్ ఇచ్చారు. దానిని ఆయన తిరస్కరించారు. అయితే పూర్తిగా బీజేపీ, జనసేనాని మధ్య గ్యాప్ ఏర్పడకుండా సంబంధాల నిర్వహణ బాద్యతను గవర్నర్ తీసుకున్నారు. విందు సమావేశాలకు ఆహ్వానిస్తూ. ప్రత్యేక ప్రాధాన్యతినిస్తూ, సంప్రతింపులతో మంచి సలహాలు ఇస్తూ గవర్నర్ జనసేనానికి శ్రేయోభిలాషిగా మారారు. అదే ఇప్పుడు తెలుగుదేశానికి కంటగింపుగా మారింది. గవర్నర్ రూపంలో బీజేపీ పవన్ కల్యాణ్ ను ఆడిస్తోందని తమకు ప్రత్యర్థిగా ప్రయోగిస్తోందనే అనుమానాలను టీడీపీ వ్యక్తం చేస్తోంది. నిజానిజాల సంగతెలా ఉన్నప్పటికీ నరసింహన్ అడకత్తెరలో పోకచెక్కలా నలుగుతున్నారు. ఆయనపై రాజ్యాంగ పదవిలో ఉన్న రాజకీయ బేరకునిగా ముద్ర వేసేశారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News