రాజీనా...? సర్దుబాటా?

Update: 2018-01-17 15:30 GMT

ఎవరూ వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు సర్వశక్తిమంతులు. స్వతంత్ర నిర్ణయాలు చేయగల ధీమంతులు. ప్రభుత్వాన్నే శాసించగల న్యాయమూర్తులు. ఎవరికి వారే ఒక వ్యవస్థ. ఇప్పుడదే సుప్రీంలో చిచ్చు పెడుతోంది. అటు దేశంలోని న్యాయకోవిదులు, బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు , అటార్నీ జనరల్ వంటి వారెందరో న్యాయమూర్తుల మధ్య విభేదాల సమస్య సమసి పోవాలని కోరుకుంటున్నారు. కానీ తెరపడటం లేదు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తాజాగా సైతం తన ధోరణి తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని కొందరు న్యాయప్రముఖులు చెబుతున్నారు. వివాదం ప్రజల దృష్టిలో పెట్టేశాం. మా పని మేం చేసుకుంటామన్నట్లుగా అసంతృప్తి బావుటా ఎగరవేసిన నలుగురు న్యాయమూర్తులు విధులకు హాజరవుతున్నారు. అంతా టీకప్పులో తుపాను సర్దుకుపోయిందంటున్నారు కొందరు సుప్రీం న్యాయవాదులు. లేదు లేదు..ఇంకా సెటిల్ కావాలని అంతలోనే మాట మార్చేస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే ఇంకా వివాదం రగులుతూనే ఉంది. చీఫ్ జస్టిస్ తాజా నిర్ణయమూ దానికి ఆజ్యం పోస్తూనే ఉంది.

నాలుక కరుచుకున్న ఏజీ ...

‘ఇది సుప్రీం అంతర్గత వ్యవహారం. వివాదం సమసి పోయింది‘. అంటూ ఆర్భాటంగా ప్రకటించారు భారత ప్రభుత్వ అత్యున్నత న్యాయాధికారి అటార్నీ జనరల్ వేణుగోపాల్. 24 గంటలు తిరగకుండానే ‘అబ్బబ్బే నాకేం సంబంధం లేదు. వివాదం ఇంకా ముగిసినట్లు లేదు. రెండు మూడు రోజుల్లో సెటిల్ అవుతుందని బావిస్తున్నాను‘ అంటూ నాలుక కరుచుకున్నారాయన. పైకి ఏదో సాధారణ ప్రకటనగా కనిపించినప్పటికీ దీని వెనక పెద్ద తతంగమే సాగిందని తెలుస్తోంది. చీఫ్ జస్టిస్ పై అసంత్రుప్తి, ఆగ్రహం వ్యక్తం చేసిన సీనియర్ మోస్టు న్యాయమూర్తులతో సమావేశం కాకుండానే విభేదాలకు ఫుల్ స్టాప్ పడిపోయిందని ఎలా ప్రకటిస్తారంటూ వేణుగోపాల్ ను సీనియర్ న్యాయమూర్తులు, న్యాయవాదులు ప్రశ్నించినట్లు సమాచారం. రోగానికి మందేయకుండా అంతా బాగుందంటే మీ ఉద్దేశమేమిటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారంటున్నారు. అదే సమయంలో అసలు న్యాయమూర్తుల లేవెనెత్తిన ప్రశ్నలకు ఇంతవరకూ సీజేఐ నుంచి సమాధానం లభించలేదన్న విషయాన్ని గమనించారా? అని కూడా సహచర న్యాయవాదులు ఏజీని నిలదీసినట్లు తెలిసింది. అటు చీఫ్ జస్టిస్, ఇటు నలుగురు న్యాయమూర్తులు ఎవ్వరూ కూడా వెనక్కి తగ్గే అవకాశం కనిపించకపోవడంతో అత్యుత్సాహాన్ని విడిచిపెట్టి సమస్య గురించి తనకేం సంబంధం లేదన్నట్లుగా అటార్నీజనరల్ ప్రకటించాల్సి వచ్చింది.

ఎంతెంత దూరం...?

కీలక కేసులను పరిశీలించడానికి చీఫ్ జస్టిస్ తీసుకున్న నిర్ణయం మరోసారి అగ్నికి ఆజ్యం పోసింది. సీనియర్ మోస్టు న్యాయమూర్తులను నలుగురినీ పక్కనపెట్టి ముఖ్యమైన కేసులపై నిర్ణయం తీసుకోవడానికి తనతో సహా అయిదుగురు సభ్యుల ధర్మాసనాన్ని నియమించారు. మాస్టర్ ఆఫ్ రోస్టర్ గా తనకున్న విశేషాదికార పరిధిని ఆయన ఈ సందర్బంగా వినియోగించుకున్నారు. సీజేఐ దీపక్ మిశ్రతోపాటు ఏకే సిక్రి, ఏఎం ఖాన్ విల్కర్, చంద్రచూడ్, అశోక్ భూషణ్ లతో ఈ బెంచ్ ను నియమించారు. సాధారణంగా సంప్రదాయం ప్రకారం సీనియర్ మోస్టు న్యాయమూర్తులకు అవకాశమివ్వాల్సి ఉంటుందంటున్నారు. అందులోనూ బెంచీల కేటాయింపు విషయంలోనే న్యాయమూర్తులు మీడియాను ఆశ్రయించారు. అయినప్పటికీ ఆవిషయాన్ని సీజేఐ ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా తన విచక్షణాధికారాన్ని వినియోగించుకోవడం చర్చనీయమవుతోంది. అంటే రాజీకి సీజేఐ సిద్దంగా లేరా? ఒకవేళ తన టర్మ్స్ మేరకే సీనియర్ న్యాయమూర్తులు రాజీకి రావాలని భావిస్తున్నారా? అన్న విషయంలో కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాను తగ్గితే న్యాయమూర్తులకు లొంగిపోయినట్లుగా కనిపిస్తుంది. ఒక్కసారిగా కొలీజియం న్యాయమూర్తులకు సడన్ గా ప్రయారిటీ పెంచితే తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంది.

విభేదాలు తీవ్రంగానే....

అయితే విభేదాలు మాత్రం తీవ్రంగానే ఉన్నట్లు నలుగురితో సీజేఐ మంగళవారం జరిగిన సమావేశం మరోసారి స్పష్టం చేసింది. కేవలం వారితో మాత్రమే కూర్చోకుండా మరో ముగ్గురు న్యాయమూర్తులను కూడా కలుపుకుని సీజేఐ వారితో సమావేశమయ్యారు. మధ్యవర్తులు ఉండటం వల్ల వివాదం తీవ్ర రూపం దాల్చకుండా ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. అయితే సమస్య మాత్రం ఒక కొలిక్కి రాలేదు. విభేదాల తీవ్రత ఎక్కువగా ఉన్నందునే తొలి సమావేశంలో పూర్తి స్థాయి అంగీకారానికి రావడం సాధ్యం కాలేదనేది న్యాయవర్గాల అంచనా. తొందరగా సమస్య పరిష్కారం కావాలంటే ఎవరో ఒకరు రాజీ పడాలి. రాజీ పడ్డారంటే తప్పు చేసినట్లు అంగీకరించినట్లే. రెండు వైపుల నుంచీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రత్యామ్నాయంగా విన్ విన్ సిచ్యుయేషన్ లో సీజేఐ, సీనియర్ న్యాయమూర్తులు సర్దుబాటు చేసుకోవాలి. ఇందుకు ఇరువర్గాలు కొంత దిగి రావాల్సి ఉంటుంది. ఈ దిగిరావడమనేది ఎంతెంత ప్రమాణంలో ఉండాలనేది నిర్ణయించాల్సింది మధ్యవర్తులే. సో... ఈ వివాదం ఒక ముగింపునకు రావాలంటే మధ్యవర్తులైన న్యాయమూర్తులే కీలకం కాబోతున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News