రాజా...ది గ్రేట్...!

Update: 2017-11-18 18:29 GMT

సౌదీ అరేబియా.... అరబ్ ప్రపంచంలో అత్యంత సంపన్న దేశం. అత్యంత సంప్రదాయ దేశం కూడా. మతాచారాలు, పద్ధతులు, సంప్రదాయాలను తూచ తప్పకుండా పాటించే దేశం. మహిళలపై అనేక ఆంక్షలనున అమలు చేస్తోంది. ఒకరకంగా వివక్ష ప్రదర్శిస్తోందని కూడా చెప్పొచ్చు. అటువంటి ఈ పశ్చిమాసియా దేశం ఇప్పుడు సంస్కరణల బాటలో ప్రయాణిస్తోంది. ముఖ్యంగా మహిళల స్వేచ్ఛకు పెద్దపీట వేస్తోంది. ఛాందసవిధానాలకు చరమగీతం పాడుతోంది. మహిళలకు వాహనాలు నడిపే అవకాశం కల్పిస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టిస్తోంది. ‘యోగా’ అమలుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం మరో విశేషం. ఈ రెండు నిర్ణయాలు ప్రస్తుతం అరబ్ సమాజంలో విస్తృతంగా చర్చనీయాంశాలయ్యాయి.

ఒక మహిళ చేసిన కృషి....

సాధారణంగా ‘యోగా’ విద్యను భారతీయ వ్యాయామ విద్యగా అందరూ పరిగణిస్తారు. అందువల్లే ఈ విషయంలో భారతీయ ముస్లింలు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అలాంటిది ఒక అరబ్ దేశం ఈ విద్యను అధికారికంగా గుర్తించడం విశేషం. ఈ విషయంలో జెడ్డాకు చెందిన 37 సంవత్సరాల మార్వాయి నీఫ్ అనే మహిళ కృషి, పట్టుదల ఉంది. ఏళ్ల తరబడి మొక్కవోని దీక్షతో ఇందుకోసం ఆమె కృషి చేశారు. యోగాతో పాటు నేచురోపతి జీవన విధానం అవలంబించడం వల్ల రొమ్ము క్యాన్సర్, లూపస్ తదితర వ్యాధుల నుంచి తాము విముక్తి పొందినట్లు నీఫ్ చెబుతున్నారు. యవ్వన దశలోనే ఆమె యోగాపై అధ్యయనం చేశారు. మొదట్లో ఆమె యోగా నేర్చుకునే ముందు మంచి ఉపాధ్యాయుడు దొరకలేదు. అయినప్పటికీ తన ప్రయత్నాన్ని వీడలేదు. పూర్తిస్థాయి అధ్యయనం కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన నీఫ్ అక్కడ ఫిజియాలజీ, అనాటమీలో డిప్లొమా సర్టిఫికేట్ ను పొందారు. అంతేకాక హఠయోగా, ఆయుర్వేదం గురించి కూడా కొంతవరకూ అధ్యయనం చేశారు. అనంతరం భారత్ కు వచ్చి తత్వ శాస్త్రం గురించి, యోగా చికిత్స గురించి తెలుసుకున్నారు. స్వదేశంలో యోగా బోధనకు ప్రయత్నించినప్పుడు నీఫ్ అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. యోగాను సౌదీ ప్రభుత్వం గుర్తించకపోవడంతో పది లక్షల డాలర్లు ఖర్చు చేసినా నేచురోపతి సెంటర్ నిర్వహనకు తాను లైసెన్స్ ను పొందలేకపోయినట్లు నీఫ్ తెలిపారు. నీఫ్ తో పాటు వివిధ వర్గాల నుంచి విజ్ఞప్తులు, అభ్యర్థనల మేరకు ఎట్టకేలకు యోగాను అనుమతించింది. ఈ మేరకు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. యోగా వ్యాప్తికి భారత ప్రభుత్వం చేసిన కృషి కూడా అనన్య సామాన్యం. ఇందుకోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. యోగ, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి తదితర సంప్రదాయ వైద్య విధానాల అభివృద్ధికి కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐక్యరాజ్య సమితి జూన్ 21ని ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ గా అధికారికంగా ప్రకటించడం గమనార్హం.

మహిళలపై ఆంక్షలు తొలగిస్తూ....

మహిళలకు వాహనాలు నడిపే స్వేచ్ఛ కల్పించాలన్న సౌదీ సర్కార్ నిర్ణయం కూడా స్వాగతించదగ్గది. ఈ మేరకుక సెప్టంబరులో సౌదీ రాజు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రపంచంలో ఇలాంటి ఆంక్షలు ఒక్క సౌదీలోనే అమలవుతున్నాయి. వాస్తవానికి మహిళలు వాహనాలు నడిపేందుకు సౌదీ చట్టాలు అభ్యంతరాలు చెప్పడం లేదు. కానీ డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసేందుకు అధికారులు తిరస్కరిస్తున్నారు. మహిళలు ఒంటరిగా వెళ్లకూడదనే అక్కడ నిబంధన. రాజు ఉత్తర్వులతో ఇక్కడి మహిళలకు స్వేచ్ఛ లభించినట్లయింది. 2015లోనే మహిళలకు స్వేచ్ఛ కల్పించే దిశగా సౌదీ అరేబియా చర్యలు ప్రారంభించింది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు, పురపాలక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అప్పట్లోనే సర్కార్ అనుమతించింది. ప్రభుత్వ సానుకూల ధృక్ఫధంతో ఉత్సాహంగా ఉన్న మహిళ హక్కుల కార్యకర్తలు మరికొన్ని హక్కుల సాధనకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం సౌదీ మహిళలు పురుష రక్షణలోనే ఉన్నారు. తండ్రి, సోదరుడు, మామ, భర్త తదితరుల రక్షణలో ఉంటున్నారు. ఈ ఏడాది మేలో దీని నుంచి కొంత మినహాయింపును ప్రభుత్వం కల్పించింది. విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం, ఉద్యోగ ప్రయత్నాలు, సర్జరీ చేయించుకోవడం తదితర విషయాల్లో పురుషుల జోక్యాన్ని నిషేధించింది ప్రభుత్వం.

అయినా ఇంకా ....

ఇప్పటికీ మహిళలపై అనేక ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి అక్కడ. విదేశీ ప్రయాణం పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు, వివాహం, విడాకులు, బ్యాంకుఖాతా ప్రారంభం, ఉద్యోగ ప్రయత్నాలు, వైద్యపరమైన కొన్ని ఆపరేషన్ల విషయంలో మహిళలు కుటుంబ పెద్దల నుంచి అనుమతి పొందడం అనివార్యం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తాను మారాలని సౌదీ అరేబియా ఇటీవల కాలంలో ఆలోచిస్తోంది. ముఖ్యంగా మహిళల విషయంలో అర్థరహిత ఆంక్షలు సరికాదని భావిస్తోంది. ఛాందసవాదాన్ని విడనాడి అభ్యుదయ భావాలతో ముందుకు వెళ్లాలని తలపోస్తోంది. 90 శాతం ముస్లింలు గల సౌదీ సర్కార్ తీసుకుంటున్న చర్యలపై అంతర్జాతీయ సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది. సున్నీ ముస్లింల ప్రాబల్యం గల సౌదీ మహిళల పట్ల మరింత ఉదారంగా ఉండాలన్నదే అందరి ఆకాంక్ష.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News