రాజమౌళి ..ద కంక్లూజన్

Update: 2017-12-14 16:30 GMT

అంతా అనుకున్నట్లే జరిగింది. చంద్రబాబు చెప్పారని మొహమాటానికి పోయిన రాజమౌళికి ఇది జరగాల్సిందే అంటున్నారు సినీ, రాజకీయ వర్గాల నేతలు. చలన చిత్ర రంగంలో దేశంలోనే రికార్డులు సృష్టించి అద్భుతమైన గ్రాఫిక్ ప్రపంచాన్ని కళ్ల ముందు ఆవిష్కరించిన సినీ దిగ్గజం చిన్నబోవాల్సి వచ్చింది. ఎంతో ఒత్తిడి చేసి లండన్ పంపి రాజధాని డిజైన్లకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టిన చంద్రబాబు చివరికి కరివేపాకు ప్రాధాన్యం కూడా మౌళి ఆలోచనలకు ఇవ్వలేదని తెలుస్తోంది. ముఖ్యమంత్రి సూచనల మేరకు ప్రధాన ఆర్కిటెక్టు అయిన నార్మన్ ఫోస్టర్ కు విభిన్నమైన వూహాచిత్రాలతో కూడిన ప్రజెంటేషన్ ను రాజమౌళి ఇచ్చారు. ఇందులో ప్రధానంగా భారతీయ సంస్కృతి, తెలుగు వైభవం సమ్మిళితం అయ్యేలా కళాత్మకతను చేర్చినట్లు తెలుస్తోంది. భారతీయ ఇతిహాసాలు, పురాణాలు, వాస్తు రీతులపైన కూడా అధ్యయనం చేసిన తర్వాతనే రాజమౌళి లండన్ వెళ్లారు. బాహుబలి సెట్లను తీర్చిదిద్దిన వారి సలహాలు, సూచనలు , డ్రాయింగ్సు సహాయాన్ని కూడా తీసుకున్నారు. అంతా పూర్తి చేసి వచ్చిన తర్వాత తాజాగా సీఆర్డీఏ కి అందించిన రాజధాని డిజైన్లలో రాజమౌళి సూచనలు నార్మన్ ఫోస్టర్ సంస్థ పెద్దగా పట్టించుకోలేదు. ఈ విషయం ముందుగానే గ్రహించిన రాజమౌళి సీఎం ను కలిసి తాను ప్రజెంట్ చేసిన అంశాలను స్వయంగా ఆయన దృష్టికి తీసుకు వచ్చారు. అంతేకాకుండా పూర్తిగా పాశ్చాత్య శైలిలో కంపెనీ ఇచ్చిన డిజైన్లలో తన పాత్ర ఏమీలేదన్న విషయాన్ని కూడా ప్రజలకు తెలియచెప్పాలని భావించారు. అందుకనే ఇందులో తన పాత్రేమీ లేదని మీడియాకు తేల్చి చెప్పేశారు. ఉడతాభక్తిగా తాను ఇచ్చిన డిజైన్లను మీడియా సిటీకి వాడుకుంటామని సీఎం హామీ ఇచ్చారన్నారు.

ఆలు లేదు..చూలు లేదు...

దర్శకుడు రాజమౌళి ఇచ్చిన ఆలోచనలు ఆసక్తిదాయకంగా ఉన్నాయని, ఆ మేరకు డిజైన్లతో నిర్మాణాలు చేపడితే కచ్చితంగా తెలుగు సంస్కృతికి పెద్ద పీట వేసినట్లు అవుతుందని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే భిన్నమైన శైలి కారణంగా రాజమౌళి ఆలోచనలకు కార్యరూపమిచ్చి భౌతిక నిర్మాణాలు చేపట్టాలంటే దీర్ఘకాలం పడుతుంది. చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణం విషయంలో చాలా ఆందోళనగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు కచ్చితంగా అసెంబ్లీ, హైకోర్టుల నిమిత్తం రెండు ఐకానిక్ భవనాలను నిర్మించి తీరాల్సిందేనన్న పట్టుదల ఆయనలో కనిపిస్తోంది. బాహుబలి దర్శకుడు చెప్పిన రీతిలో భవనాలను తీర్చిదిద్దాలంటే కనీసం అయిదు నుంచి ఆరుసంవత్సరాల సమయం పడుతుందని నిర్మాణ నిపుణుల అభిప్రాయం. రాజధాని కి భూ సమీకరణ మినహాయిస్తే మిగిలిన పనులేవీ చంద్రబాబు నాయుడు ఆశించిన రీతిలో సాగడం లేదు. మరోవైపు పోలవరం పూర్తి కావడం లేదు. రాజధాని విషయంలో ఇప్పటికే ఓవర్ హైప్ క్రియేట్ చేసి పెట్టారు. రకరకాల డిజైన్లతో వర్చువల్ గ్రాఫిక్స్ తో ఒక అద్భుతం ఆవిష్కృతమవుతోందన్న భావన రేకెత్తించారు. ఎన్నికల లోపు గ్రౌండ్ లెవెల్ లో చెప్పుకోదగ్గ నిర్మాణం కనిపించకపోతే ప్రభుత్వం అపహాస్యం పాలవుతుంది. చంద్రబాబు నాయుడు, టీడీపీ ఇందుకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో అంతర్జాతీయ ప్రమాణాల వైపే బాబు చూపు కూడా ఉంది. అందుకే రాజమౌళిని నొప్పించకుండా నీ డిజైన్లను మీడియా సిటీకి వాడుకుంటామని బుజ్జగించారు. నిజానికి రాజధానికి గుండెకాయ వంటి అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ శాశ్వత భవనాలే ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు. మీడియా సిటీ ఆలోచన పేరు చెబితేనే కొందరు నవ్వులు వెదజల్లుతున్నారు. ఆలు లేదు, చూలు లేదు ..కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా తయారైందని వ్యాఖ్యానిస్తున్నాయి రాజకీయ పక్షులు.

హర్ట్ అయినా..బయట పడలేదు..

నిజానికి రాజమౌళి సున్నిత మనస్కుడిగా సినిమారంగంలో ముద్ర పడ్డారు. దులుపుకుని పోయే రకం కాదు. సమస్యల పట్ల బాధ్యతతో స్పందిస్తుంటారు. మార్పు కోసం ప్రయత్నిస్తుంటారు. లోక్ సత్తా పార్టీ పెట్టినప్పుడు జయప్రకాశ్ నారాయణకు మద్దతిచ్చి తన సమయాన్ని, ధనాన్నికూడా కొంతమేరకు వెచ్చించారు. సమాజంలో మార్పు రావాలంటూ కమాన్ ఇండియా పేరిట భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు - పరిష్కారాలపై టీవీ మీడియా లో ప్రత్యేక కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు. రాజధాని నిర్మాణంలో తన భాగస్వామ్యాన్ని కూడా ప్రతిష్టాత్మక అంశంగానే తీసుకున్నారు. జానపద, చారిత్రక అంశాలపై అవగాహన ఉన్న తండ్రి విజయేంద్రప్రసాద్ తో చర్చలు జరిపి , పుస్తకాలను కూడా అధ్యయనం చేసిన తర్వాతనే లండన్ వెళ్లి నార్మన్ ఫోస్టర్ తో తన ఆలోచనలను పంచుకున్నారు. కానీ వాటన్నిటినీ బుట్టలో పడేశారు. భారత ఇతిహాసాలు, చరిత్రతో పెద్దగా సంబంధం లేని ఈ కంపెనీ ప్రతినిధులు రాజమౌళి ఆలోచనలను అవగాహన చేసుకోవడంపై ఆసక్తి చూపలేదని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. ఫలితంగా పాపం రాజమౌళి శ్రమ వృథాగా పోయింది. అతని వల్ల అమరావతికి క్రేజ్ వస్తుందని తొలి దశలో చంద్రబాబు నాయుడు భావించారు. అమరావతి అంటే గ్రాఫిక్ పిక్చర్లు, సినిమా సెట్టింగు అన్న విమర్శలు ఎదురయ్యాయి. అందువల్ల రాజమౌళి పాత్రను సాధ్యమైనంతవరకూ కుదించి వేయాలని ప్రభుత్వం కూడా భావించింది. అదే సమయంలో అతని ఆలోచనలు, డిజైన్లు వెంటనే ఆచరణ సాధ్యమయ్యేవి కావని తేలిపోవడంతో పూర్తిగా పక్కనపెట్టేశారు. సినీరంగంలో తొలిదశలోనే అనేక అవమానాలు చవి చూసిన రాజమౌళి ఇంత పెద్ద స్థాయికి ఎదిగిన తర్వాత , సర్కారు స్థాయిలో ఎదురైన చేదు అనుభవాన్ని దిగమింగుకోవాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు వరకూ రాజధాని నిర్మాణంలో ... రాజమౌళి ద కంక్లూజన్ పిక్చర్ ముగిసినట్లే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News