రాజమండ్రి టీడీపీలో ట్విస్టులు.. ఎవ‌రు ఇన్‌... ఎవ‌రు అవుట్‌..!

Update: 2017-12-12 07:30 GMT

ఏపీలో ఏ పార్టీ అయినా అధికారంలోకి వ‌చ్చేందుకు తూర్పుగోదావ‌రి జిల్లా కీల‌కం. ఆ జిల్లాలో మిగిలిన జిల్లాల్లో లేన‌ట్టుగా మొత్తం 19 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల గాలి ఎటు వీస్తే రాష్ట్రంలో అధికారం ఆ పార్టీకే ఉంటుంద‌న్న నానుడి గత మూడు ద‌శాబ్దాల‌న్నర‌గా రుజువ‌వుతోంది. ఈ జిల్లాలో రాజ‌మండ్రి న‌గ‌రం కీల‌కం. ఇక్కడ ప‌ట్టుకోసం అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీ ప్రయ‌త్నాలు చేస్తున్నాయి. 2009లో నియోజ‌క‌వ‌ర్గాల మార్పుతో రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాలు క‌లుపుకుని మొత్తం మూడు నియోజ‌క‌వ‌ర్గాలుగా ఏర్పడ్డాయి. రాజ‌మండ్రి న‌గ‌రం - రాజ‌మండ్రి రూర‌ల్ - రాజాన‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గాలు వ‌చ్చాయి. 2009 ఎన్నిక‌ల్లో టౌన్ నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌద‌రి కేవ‌లం వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోతే ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఇక రాజ‌మండ్రి రూర‌ల్‌, రాజానగ‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ గెలిచింది.

గత ఎన్నికల్లో బీజేపీకి...

గ‌త ఎన్నిక‌ల్లో రాజ‌మండ్రి న‌గ‌రం సీటును బీజేపీకి ఇవ్వగా అక్కడ బీజేపీ గెలిచింది. ఈ సారి రూర‌ల్‌కు మారిన బుచ్చయ్య చౌద‌రి విజ‌యం సాధించారు. రాజాన‌గ‌రంలో టీడీపీ నుంచి పెందుర్తి వెంక‌టేష్ వ‌రుస‌గా రెండోసారి గెలిచారు. ఇక ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల వేళ రాజ‌మండ్రి టీడీపీలో ఆస‌క్తిక‌ర రాజ‌కీయం జ‌రుగుతోంది. టీడీపీ నుంచి సిటీ నియోజ‌క‌వ‌ర్గంలో నాలుగు సార్లు, రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఓ సారి మొత్తం ఐదుసార్లు గెలిచిన బుచ్చయ్యను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌క్కన పెట్టేస్తార‌ని వార్తలు వ‌స్తున్నాయి. బుచ్చయ్యను పార్టీ కార్యక‌లాపాల కోసం వాడుకునేందుకు బాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

బుచ్చయ్యను తప్పించినా...

ఇక బీజేపీతో పొత్తు ఉన్నా లేక‌పోయినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో సిటీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కూడా టీడీపీయే పోటీ చేయ‌నుంది. అయితే ఈ సారి ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ఎవ‌రెవ‌రు పోటీ చేస్తార‌న్నదానిపైనే ఆస‌క్తిక‌ర చ‌ర్చ రాజ‌మండ్రిలో స్టార్ట్ అయ్యింది. బుచ్చయ్యను త‌ప్పించినా రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదో ఒక దానిని క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి ఇవ్వడం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ వ‌ర్గం నుంచి పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న సీనియ‌ర్ నాయ‌కుడు, గుడా చైర్మన్ గ‌న్ని కృష్ణ ముందు వ‌రుస‌లో ఉన్నారు. అదే టైంలో ఎంపీ మాగంటి ముర‌ళీమోహ‌న్‌కు మ‌రోసారి సీటు ఇవ్వని ప‌క్షంలో ఆయ‌న కోడ‌లు రూపాదేవి పేరు అక్కడ విన‌ప‌డుతోంది. రూపాదేవిని కాకుండా మ‌రో వ్యక్తికి రాజ‌మండ్రి ఎంపీ సీటు ఇస్తే రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రూపాదేవి అసెంబ్లీ బ‌రిలో ఉండ‌నున్నారు. ఆమెకు లోకేష్ నుంచి ఏదో ఒక సీటు గ్యారెంటీ అని హామీ వ‌చ్చిందంటున్నారు.

కొత్త ముఖాలేనా?

ఇక ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఫ్యామిలీ కూడా రాజ‌మండ్రి సీటు ఆశిస్తున్నారు. కుదిరితే సిటీ నియోజ‌క‌వ‌ర్గం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. లేనిప‌క్షంలో రూర‌ల్ సీటు అయినా ద‌క్కించుకోవాల‌ని ఆయ‌న గ‌ట్టి ప్రయ‌త్నాలు చేస్తున్నారు. ఆర్థికంగా కూడా బ‌ల‌మైన వ్యక్తి కావ‌డం ఆయ‌న‌కు క‌లిసి రానుంది. అప్పారావు ఎమ్మెల్సీగా ఉండ‌డంతో ఆయ‌నే బ‌రిలో ఉంటారా ? లేదా ఆయ‌న వార‌సుడు వాసు పోటీ చేస్తారా ? అన్నది చూడాలి. అయితే పార్టీ యువ‌నేత‌, మంత్రి నారా లోకేష్ మాత్రం ఆదిరెడ్డి కోడ‌లు, మాజీ మంత్రి ఎర్రన్నాయుడు కుమార్తె అయిన ఆదిరెడ్డి భ‌వానీని పోటీ చేయించే అంశంపై ఆలోచ‌న చేస్తున్నట్టు తెలుస్తోంది. భ‌వానీ పోటీ చేస్తే ఎర్రన్నాయుడి ఎఫెక్ట్, మ‌హిళా కోటా క‌లిసి వ‌స్తుంద‌నేది లోకేష్ ప్లాన్ అని టాక్‌. ఏదేమైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజ‌మండ్రి సిటీ, రూర‌ల్ నియోజ‌క‌వర్గాల్లో టీడీపీ త‌ర‌పున కొత్త ముఖాలే బ‌రిలో ఉండ‌నున్నాయి.

Similar News