రాజధాని రాజకీయాలకు చెంపపెట్టు

Update: 2017-11-18 15:30 GMT

ఆశగా ఎదురుచూస్తున్నఅమరావతి రాజధాని నిర్మాణానికి ముందడుగు పడింది. ప్రాంతం ఎంపిక మొదలు రాజకీయ వివాదాలు,విభేదాలతో రాష్ట్రప్రభుత్వం తీవ్రమైన చికాకులను ఎదుర్కొంటోంది. విపక్షం కావచ్చు. లేదా కొందరు పర్యావరణ ఆసక్తి కలిగిన వ్యక్తులు కావచ్చు. అడుగడుగునా ఆటంకాలు సృష్టించేందుకు ప్రయత్నించిన ఉదంతాలు గడచిన రెండేళ్లుగా చూస్తూనే ఉన్నాం. ఎట్టకేలకు గ్రీన్ ట్రిబ్యునల్ పచ్చజెండా ఊపడంతో అధికారపక్షం ఊపిరిపీల్చుకునేందుకు ఆస్కారం ఏర్పడింది. ఈ అనుమతిని అధికారపక్షం సర్వామోదంగా భావిస్తుంటే విపక్షం మరో రకంగా వ్యాఖ్యానిస్తోంది. ఇక్కడ కూడా రాజకీయ ధోరణులే కనిపిస్తున్నాయి. అసలు రాజధాని నిర్మాణానికి గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఏ మాత్రం అభ్యంతరకరంగా వచ్చినా అధికారపక్షాన్ని దుయ్యబట్టడానికి , రాజకీయ అవకాశంగా మలచుకోవడానికి ఎదురుచూసినవారికి నిరాశే మిగిలింది. అదే సమయంలో తమ ఇష్టారాజ్యంగా భూ కేటాయింపులు మొదలు, నిర్మాణ డిజైన్ల వరకూ నిర్ణయాలు తీసేసుకుంటున్న ప్రభుత్వానికి ముందరికాళ్లకు పగ్గం వేసింది గ్రీన్ ట్రిబ్యునల్. భవిష్యత్తు తరాలను, నదీపరీవాహక ప్రాంత సమతుల్యతను దృష్టిలో పెట్టుకోవాలన్న షరతులు అమరావతి ఉజ్వలభవిష్యత్తుకు ఉపకరించేవే. రేపటి తరానికి సతతహరిత, పర్యావరణ హిత నవ రాజధానిని అందించేందుకు గ్రీన్ ట్రిబ్యునల్ సూచనలు శిరోధార్యంగా పాటించాల్సిన అంశాలు.

ఆది నుంచి అష్టకష్టాలే...

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాజధానిని ఎక్కడ పెట్టాలనే విషయమై పెద్ద కసరత్తే సాగింది. కేంద్రప్రభుత్వం శివరామక్రుష్ణన్ కమిటీని నియమించింది. ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కమిటీ తన అధ్యయనం కొనసాగించింది. ఒంగోలు ప్రాంతాల్లో పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో సిఫార్సులు చేసింది. అటు రాయలసీమకు, ఇటు కోస్తా ప్రాంతాలకు అనువైనదిగా ఉంటుందనేది కమిటీ అభిప్రాయం. కానీ చంద్రబాబు సర్కారు దీనిని పట్టించుకోలేదు. వాస్తురీత్యాను, చారిత్రక కారణాలు, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రాంతం కావడంతో అమరావతి లో రాజధాని నిర్మించాలని సంకల్పించారు. 2013 భూసేకరణ చట్టం కొత్తగా దేశంలో ఎక్కడైనా ఏ ప్రాజెక్టుకైనా భూమి సేకరించాలంటే సాధ్యం కాని పరిస్థితిని కల్పించింది. సామాజిక ప్రభావ అధ్యయనాలు, భూమి పరిహారం పెరిగిపోవడం..ఇలా అనేక కోణాల్లో భూమిని తీసుకొనే వెసులుబాటు లేకుండా పోయింది. దీంతో చంద్రబాబు సర్కారు భూసమీకరణ అనే నూతన విధానానికి సంకల్పించి సక్సెస్ అయ్యింది. రాజధాని రాబోతోందన్న భావనతో భూమి విలువ 20 రెట్లకు పైగా పెరగడంతో రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 34 వేల ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించారు. పైసా ఖర్చు లేకుండా భూమిని సంపాదించగలిగింది ప్రభుత్వం. అదే భూమిని పెట్టుబడిగా పెట్టి కొత్త రాజధానికి ఇతర మౌలికవసతులనూ పెంపొందించాలని చూస్తోంది. అంతవరకూ పర్వాలేదు. కానీ నేలవిడిచి సాము తరహా గారడీ ప్రారంభించింది. సింగపూర్ తరహా అభివృద్ధి పేరిట ఆకాశానికి నిచ్చెనలు వేస్తూ గ్రాఫిక్ డిజైన్లతో అరచేతిలో స్వర్గాన్ని ఆవిష్కరించింది ప్రభుత్వం. దీంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లబోతోందని స్వచ్ఛందంగా కొందరు, రాజకీయ కారణాలతో మరికొందరు న్యాయస్థానాలను, గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. ఏడాదిన్నర కాలంగా ఈ వివాదం నడుస్తూ ఉంది. ఈ లోపుగానే రాష్ట్రప్రభుత్వం రాజధాని బ్లూప్రింట్ సిద్ధం చేసేసింది. ఇందులో ఆకాశహర్మ్యాలు, అడ్డగోలు భూ కేటాయింపులు కూడా అంతర్భాగంగా ఉన్నాయి.

ఇష్టారాజ్యానికి ఇక చెల్లు చీటీ ..

రాజకీయ కారణాలతో రాజధాని నిర్మాణాన్నే తప్పు పట్టి అడ్డుకోవాలని చూసిన విపక్షాలకు, అదే సమయంలో అధికారాన్ని దుర్వినియోగం చేసైనా సరే తన మాట నెగ్గించుకోవాలని చూసిన అధికార పక్షానికి కూడా గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పును చెంపపెట్టుగానే చూడాలి. రాజధాని నిర్మాణానికి ఇదే సరైన ప్రాంతమని ట్రిబ్యునల్ తేల్చి చెప్పేసింది. దీంతో ప్రతిపక్షానికి నోట మాటరాని పరిస్థితి. మరో వైపు తనకు నచ్చినట్లు గీతలు గీచి డిజైన్లను రూపొందించుకుంటున్న సర్కారీ స్వైరవిహారానికి కూడా అడ్డుకట్ట వేసింది. కృష్ణానదీ సహజపరీవాహకాన్ని దెబ్బతీయకూడదని స్పష్టం చేసింది. నదీకరకట్టలను పటిష్టం చేయవచ్చు తప్ప వాటిపై నిర్మాణాలు కుదరవని షరతులు విధించింది. కొండవీటి వాగు వంటి ప్రవాహాలను దారి మళ్లించి నీటివనరుల సహజత్వాన్ని దెబ్బతీసేందుకూ ససేమిరా అంది గ్రీన్ ట్రిబ్యునల్. కొన్ని వేల ఎకరాల రక్షిత అటవీ ప్రాంతాలను కాంక్రీట్ జంగిల్ గా మార్చేయాలనుకున్న రాష్ట్రప్రభుత్వ దూకుడుకు కూడా కళ్లెం వేసింది. అటవీ ప్రాంతాలను యథాతథంగా పరిరక్షించాలని స్పష్టం చేసింది. ఇవన్నీ రాజధానికి పచ్చదనాన్ని,ఆహ్లాదాన్ని సమకూర్చే అంశాలే.

షరతులు..సాధికార వరాలు

హోటళ్లు, గెస్టు హౌస్ లు, ముఖ్యమంత్రి నివాసాలతో కృష్ణానది గట్టును కొల్లగొట్టేయాలనుకున్న ప్రభుత్వ యత్నానికి ట్రిబ్యునల్ తీర్పు గండి కొట్టినట్టే చెప్పుకోవాలి. తాజా గా విధించిన షరతుల నేపథ్యంలో రాజధాని నిర్మాణంపై మరో మాస్టర్ ప్లాన్ ను రూపొందించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సౌర విద్యుత్తు వినియోగం, భూగర్భమురుగునీటి పారుదల వ్యవస్థ, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, సంతులన అటవీ సంపద వంటి వన్నీ అమరావతి వరదాయకంగానే చెప్పుకోవాలి. గ్రీన్ ట్రిబ్యునల్ జోక్యం చేసుకోకపోతే ప్రభుత్వం ఇష్టారాజ్యంగా నిర్మాణాలు సాగించి మరో కాంక్రీట్ జంగిల్ గా మార్చేసి ఉండేది. దీనిని తొలి దశలోనే ట్రిబ్యునల్ అడ్డుకోగలిగింది. దేశంలోనే ఒక హరిత రాజధానిగా అమరావతి పేరు తెచ్చుకునేందుకు తాజా షరతులు ఉపకరిస్తాయి. తాను ఎటువంటి ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వాలు సక్రమంగా వాటిని పాటించవన్న విషయం ట్రిబ్యునళ్లకు కూడా తెలుసు. అందుకే అమరావతి విషయంలో తాను విధించిన నిబంధనలు అమలయ్యేలా చూసే బాధ్యతలను పర్యవేక్షక, అమలు కమిటీలకు అప్పగించడం విశేషం. 2019 ఎన్నికల లోపు కనీసం ప్రాథమికమైన నిర్మాణాలైనా చూపాలి అని తపన పడుతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దుస్సాహసానికి పోకుండా ట్రిబ్యునల్ ఆదేశాలను పాటించకతప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో పర్యావరణ హితంగా ఆదర్శ రాజధానికి పునాదిరాళ్లు పడతాయని ఆశింవచ్చు.

-ఎడిటోరియల్ డెస్క్

Similar News