రాజకీయ సుద్దులు.. ఎన్నికల పద్దులు...!

Update: 2018-02-01 16:30 GMT

ఎన్నికల ఏడాదిలో ఎదురుచూసిన బడ్జెట్ రైలు బహుమతులు మోసుకురాలేదు. బంగారు వరాలూ కురిపించలేదు. కానీ భవిష్యత్తు ఎన్నికల దిశలో పక్కా రూట్ క్లియర్ చేసుకొంది. భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి చక్కని మ్యేనిఫెస్టోలా తయారైంది 2018-19 వార్షిక ఆదాయవ్యయపద్దు. మోడీ సారథ్యంలోని ఎన్డీఏ 2 ప్రభుత్వానికి ఇదే చివరి లెక్కల చిట్టా. చక్కగా ఏర్చి కూర్చినట్లు మధ్యతరగతి వర్గాలను బుట్టలో పడేసే ఎత్తుగడలతొ పొందికగా అమర్చి పెట్టారు. అబ్బబ్బే సంక్షేమం మా పని కాదంటూ ప్రధాని ఎన్నికల ముందు సంకేతాలిచ్చినప్పటికీ కోట్లాది ఓటర్లను ప్రభావితం చేసే పథకాల రచన పక్కాగా సాగింది. సాధ్యాసాధ్యాల సంగతి ఎలా ఉన్నప్పటికీ రెవిన్యూ లోటు, ద్రవ్యలోటును నిర్దేశిత లక్ష్యాల మేరకు నియంత్రించకుండా వదిలేయడంలోనే రాజకీయం తేటతెల్లమైంది. నిజానికి వచ్చే ఏడాది నాటికి ద్రవ్యలోటును కనీసం రెండున్నర శాతానికి పరిమితం చేయాలనేది ఎన్డీఏ లక్ష్యం. కానీ తాజా బడ్జెట్ ప్రతిపాదనల్లో 2017-18 లోటు అయిన 3.2 శాతాన్ని మంచి 3.3 శాతం వరకూ లోటు ఉండొచ్చని అంచనా వేశారు. అందులోనూ ప్రభుత్వ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని 80 వేల కోట్ల రూపాయలకు పెంచిన తర్వాత కూడా ద్రవ్యలోటు పెరుగుతోందంటే ప్రభుత్వం రాజకీయ ప్రస్థానానికే పెద్దపీట వేసినట్లుగా చెప్పుకోవాలి.

ఎన్నికల దిశలో....

సంక్షేమాన్ని ప్రజలు కోరుకోవడం లేదు. అభివృద్ధి చేయడమే మా లక్ష్యమన్నట్టుగా ముందస్తుగానే ప్రకటించారు ప్రధాని మోడీ. తీరా చూస్తే తాను చెప్పిన మాటను ఆచరిస్తూనే.. అదే సమయంలో ప్రజలను ఆకట్టుకోవాల్సిన అవసరాన్ని బ్యాలెన్సు చేసుకొంటూ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లుగా కనిపించింది. పదికోట్ల కుటుంబాలను లక్ష్యంగా చేసుకుంటూ ప్రవేశపెట్టబోతున్న ఆయుష్మాన్ భారత్ నిజానికి దేశానికి చాలా అవసరమైన పథకం. మధ్యతరగతి, పేద ప్రజలు ఆరోగ్య ఖర్చులను భరించలేక తీవ్రమైన ఇబ్బందుల్లో పడుతున్నారు. రుణాల ఊబిలో కూరుకుపోతున్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడితో అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇంచుమించుగా రోజుకు రూపాయి ఖర్చుతో అయిదులక్షల రూపాయల వరకూ ఆరోగ్యబీమా అన్నది ఒక వినూత్నమైన పథకంగానే చెప్పుకోవాలి. దీనిని ఎన్నికల దిశలో ప్రయోగించిన అస్త్రంగా చూసినప్పటికీ ప్రజారోగ్యానికి పూచీకత్తునివ్వగలిగితే ఎన్డీఏ ప్రభుత్వానికి ఆ ఖ్యాతి మిగులుతుంది. ఎనిమిది కోట్ల కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే ప్రతిపాదన ప్రధానంగా పేదవర్గాలను ఉద్దేశించింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఈ తరహా స్కీమ్ కారణంగా బీజేపీ గరిష్టంగా లబ్ధి పొందగలిగింది. దీనిని సార్వత్రిక ఎన్నికలకు వర్తింపచేయాలనే ఉద్దేశంతోనే కేంద్రప్రభుత్వం మార్చి నుంచి ఈ గ్యాస్ సిలెండర్ల పంపిణీ ని భారీగానే చేపట్టేందుకు పథక రచన చేస్తోంది. బీజేపీ శ్రేణులకు ఈ పథకానికి సంబంధించి ముందస్తుగానే సమాచారం చేరింది. నియోజకవర్గాల వారీ పేద లబ్ధిదారుల జాబితాలపై కూడా బీజేపీ చోటామోటా నాయకులు చిట్టాలను తయారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే బీజేపీ సొంతంగా బలపడటానికి కూడా ఈ పథకాన్ని ఒక మార్గంగా ఎంచుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

నెరవేరని కల...తెలుగు వ్యథ...

విభజితమైన రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకించి ఒరగబెట్టిందేమీ లేదని స్థానిక అధికార పార్టీలు రెండూ చెబుతున్నాయి. విభజన చట్టంలో పేర్కొన్న విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలకు అరకొర నిధులు మినహా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ప్రత్యేక కేటాయింపులంటూ పెద్దగా లేవు. ఆదాయ వనరుల రీత్యా దేశంలోనే రెండో స్థానంలో ఉన్న దక్షిణ మధ్య రైల్వే డిమాండ్లను పక్కనపెట్టేశారు. ప్లాట్ ఫారాల విస్తరణ, స్టేషన్లలో సౌకర్యాల వంటి చిన్నాచితక వసతులనే పెద్ద చేసి చూపించారు. ఆంధ్రప్రదేశ్ లోమాత్రం కొన్ని రైల్వే లైన్ల నిధుల కేటాయింపు పెంచారు. అయితే ప్రధానమైన విశాఖ రైల్వే జోన్ అంశాన్ని నామమాత్రంగా కూడా ప్రస్తావించకుండా విస్మరించడం మిత్రపక్షమైన టీడీపీకి రాజకీయంగా ఇబ్బందికరమే. అమరావతి నిర్మాణానికి నిధులు, రెవిన్యూలోటు భర్తీపై స్పష్టత, పోలవరం ప్రాజెక్టు పై పునరుద్ఘాటన వంటివాటిని తెలుగుదేశం పార్టీ ఆశించింది. వీటిపై బడ్జెట్ సందర్బంగా ప్రస్తావనకు వస్తే తెలుగుదేశానికి రాజకీయంగా ఊరట లభించేది . కానీ ప్రధాని మోడీ, అరుణ్ జైట్లీ ఏపీకి సంబంధించిన అంశాలను ఇతర రాష్ట్రాలతో సమానంగానే చూశారు. తెలంగాణ సమర్పించిన పద్దు కూడా పెద్దదే. మిషన్ కాకతీయకు అయిదువేల కోట్ల రూపాయలు, భగీరథకు 20 వేల కోట్ల రూపాయలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాతో పాటు 25 వేల కోట్ల రూపాయల వరకూ నిధుల వంటి డిమాండ్లను కేంద్రానికి సమర్పించారు. ఏ ఒక్క విషయాన్ని కూడా కేంద్రం కనీసం పరిశీలన చేసిన దాఖలాలు కూడా కనిపించలేదు. ఎన్నికల ఏడాదిలో కూడా తెలుగు రాష్ట్రాల కలలు కేంద్రం ముందు కల్లలుగానే మిగిలిపోయాయి.

కరాఖండి...కమలం లెక్క

ఎన్నికలు సమీపిస్తున్న రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాలను సంత్రుప్తి పరచాలన్న ధ్యాస కేంద్ర బడ్జెట్ లో కనిపించిందని పరిశీలకులు చెబుతున్నారు. కర్ణాటక మెట్రో కు 15 వేల కోట్ల రూపాయల వరకూ కేటాయించడం ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. మహారాష్ట్రలో శివసేనతో రచ్చ కారణంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది స్థానిక రాష్ట్రప్రభుత్వం. ఇక్కడ కూడా భారీగానే ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు. గుజరాత్ పైన కూడా ప్రధాని తన ప్రేమ చాటుకున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు కూడా వివిధ పథకాల్లో పెద్దపీట వేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. తమను ఆదరించి అందలమెక్కించిన రాష్ట్రాలను విస్మరించకూడదనే రాజకీయ లెక్కను పరిగణనలోకి తీసుకున్నారని రాజకీయ వేత్తలు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బీజేపీ వాటా అత్యల్పం. ఎన్నివరాలు ప్రకటించినా, ఎంతగా రాష్ట్రప్రభుత్వాలకు సహకారం అందించినా ఇక్కడ పొందే రాజకీయ వాటా నామమాత్రమే. అందుకే ఈ కొత్త రాష్ట్రాలను కూడా పాతపద్దులోనే పెట్టేశారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News