యుద్ఢం చేసేది...మోడీ... సారథ్యం మాత్రం...?

Update: 2017-12-28 16:30 GMT

దుర్నిరీక్ష్య అధికారాలతో దూసుకుపోతున్న నరేంద్రమోడీ, అమిత్ షా లు పార్టీ పుట్టి ముంచే ప్రమాదం ఉందని సంఘ్ పరివార్ శక్తులు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నాయి. వాస్తవాల ఆధారమైన అంచనాలతో 2019కి బీజేపీని సన్నద్ధం చేయడంలో ఇకముందు కీలకంగా వ్యవహరించాలని తాజాగా సంఘ్ లోని అగ్రనాయకులు ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. గుజరాత్ లో అంత బలమైన నిర్మాణం ఉన్నప్పటికీ పరాజయం ముంగిట్లో బతికిబట్టకట్టడాన్ని ముఖ్య నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏకపక్ష వైఖరితో వెళుతున్న మోడీ, అమిత్ షా ల కారణంగా భవిష్యత్తులో పార్టీ అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉందని గ్రహించడంతో దిద్దుబాటు చర్యలపై దృష్టి సారిస్తున్నట్లుగా నాగ్ పూర్, న్యూఢిల్లీల నుంచి పార్టీ ఆంతరంగిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. బీజేపీని బలోపేతం చేయడానికి, దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో విస్తరించడానికి ఇప్పుడున్నన్ని అవకాశాలు గతంలో లేవు. అయినప్పటికీ దుందుడుకు నిర్ణయాల కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయనేది సంఘ్ అంచనా.

ఇకపై యుద్ధం వేరు..వ్యూహం వేరు...

విధానపరమైన నిర్ణయాల అమలు, ప్రభుత్వ నిర్వహణ వంటి విషయాల్లో ప్రధాని మోడీకి ఇంతవరకూ సంఘ్ నుంచి ఏరకమైన ఒత్తిడులు రాలేదు. దేశ విశాల హితాన్నిదృష్టిలో పెట్టుకుని స్వతంత్రంగా వ్యవహరించేందుకు ఆయనకు స్వేచ్ఛ లభించింది. 2014 ఎన్నికల తర్వాత వివిధ రాష్ట్రాల్లో శాసనసభ టిక్కెట్ల కేటాయింపు, గెలుపు సాధించే ఎత్తుగడల విషయంలోనూ మోడీ, అమిత్ షా లే నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. కుల, ప్రాంత, మత సమీకరణలతో వీరు పన్నుతున్నవ్యూహాలు మంచి ఫలితాలనే అందిస్తున్నాయి. అందువల్ల సంఘ్ అగ్రనాయకులు కూడా జోక్యం చేసుకోకుండా సర్కారు తమ పని తాము చేసుకునేలా సహకరిస్తున్నారు. అయితే నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి మోడీ తీసుకున్నకొన్ని నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ప్రతికూల ఫలితాలకు కారణం కావచ్చని సంఘ్ సొంతంగా తమ శ్రేణుల ద్వారా జరిపిన సర్వేల్లో తేలింది. 2014లో అనూహ్యమైన విజయం తర్వాత బీజేపీ నాయకులే కాదు, సంఘ్ శక్తులు కూడా దేశంలో పదేళ్లపాటు అధికారానికి ఢోకా లేదనే నమ్మకానికి వచ్చాయి. కానీ పరిస్థితులు అంతగా సానుకూలంగా లేవని క్షేత్రస్థాయి నుంచి అందుతున్న రిపోర్టులు తేటతెల్లం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మోడీ, అమిత్ షా ల నిర్ణయాధికారంలో కొంతమేరకు జోక్యం చేసుకోవాలని భావిస్తున్నారు. దేశంలో రాజకీయాధికారాన్ని కాపాడుకోవడం ద్వారా సంఘ్ అజెండాను కేంద్రంలో అమలు చేసేందుకు వీలవుతుంది. దీనికోసం సీట్లపరంగా,ఓట్ల పరంగా సాధ్యమైనంతవరకూ బలపడాల్సి ఉంటుంది. 2014 విజయంతో ఈ భరోసా ఏర్పడింది. పదేళ్లపాటు అధికారంలో అవిచ్ఛిన్నంగా కొనసాగితే లోక్ సభ, రాజ్యసభల్లో సంపూర్ణ ఆధిక్యంతో పాటు మెజార్టీ రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. దీని వల్ల మూడింట రెండువంతుల ఆధిక్యంతో రాజ్యాంగంలోని ఏ నిబంధనను అయినా మార్చుకొనే వీలు ఏర్పడుతుంది. ఆ దిశలో నడవాల్సిన రాజకీయ అజెండా నుంచి సంస్కరణల పేరిట ఆర్థిక అజెండాను మోడీ ప్రధానం చేయడంతో బీజేపీ దెబ్బతింటోందన్న అభిప్రాయాన్ని కీలక నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇకపై రెండంచెల వ్యూహంతో సంఘ్, బీజేపీ వ్యవహరించనున్నాయి. యుద్ధం చేసేది మోడీ, అమిత్ షా లే. కానీ తెరవెనుక సారథ్యం , వ్యూహరచన బాధ్యతను సంఘ్ పరివార్ శక్తులు తీసుకోబోతున్నట్లు సమాచారం.

ఇబ్బందికరంగానే.. ఈక్వేషన్లు...

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈక్వేషన్లు ఇబ్బందికరంగా మారుతున్నాయి. దక్షిణ భారతంలోని ఆంధ్ర,తెలంగాణ, తమిళనాడు, కేరళల్లో లోక్ సభ స్థానాల్లో ఒకటి కూడా సొంతంగా దక్కుతుందన్న నమ్మకం బీజేపీకి కలగడం లేదు. మరోవైపు యూపీ వంటి పెద్ద రాష్ట్రంలో ఎస్పీ, కాంగ్రెసు, బీఎస్పీలు చేయి కలిపితే 55 నుంచి 60 స్థానాల వరకూ ఈ పార్టీలు దక్కించుకుంటాయని అంచనా. బీజేపీకి 72 వరకూ స్థానాలున్న ఈ రాష్ట్రం ఒక్క దాంట్లోనే యాభై స్థానాలను ప్రత్యర్థులకు వదులుకోవాల్సి వస్తుందంటున్నారు. అంటే బీజేపీ బలం ఇక్కడ 20 నుంచి 22 స్థానాలకు పరిమితమవుతుంది. ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇప్పుడున్న బలం సగానికి చిక్కిపోవచ్చని పొలిటికల్ పండిట్లు ఘంటా పథంగా చెబుతున్నారు. ఏతావాతా 85 నుంచి 105 స్థానాల వరకూ 2019 ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గే చాన్సుందని లెక్కలు వేస్తున్నారు. దీనిని భర్తీ చేయడం అంత చిన్న విషయం కాదు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ బలం 180 నుంచి 210 స్థానాల లోపునకు పరిమితమైతే మిత్రపక్షాల పైనే ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది. ఇది సొంత అజెండా అమలుకు ఆటంకం. సంస్కరణల కంటే ముందుగా తమకు కావాల్సింది సంప్రదాయ విధానాల పరిరక్షణ, హిందూ ప్రవచిత సిద్ధాంతం అమలు అన్న దృఢమైన భావనను సంఘ్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సంస్కరణలు, నోట్ల రద్దు వంటి వాటితో తమకేమీ సంబంధం లేదని కూడా తేల్చేస్తున్నారు. పార్టీ ప్రాబల్య విస్తరణకు ఆర్థిక అజెండా ఆటంకమని భావిస్తే దానిని అటకెక్కించేయాలి తప్పితే పార్టీని బలిపెట్టకూడదని బలంగానే చెబుతున్నారు. మొదట్నుంచీ పార్టీతో కలిసి నడుస్తున్న శివసేన వంటి పార్టీలు కూడా దూరం కావడం మోడీ, అమిత్ షాల నిర్వాకమేనని మెజార్టీ అభిప్రాయం. 2019 నాటికి మిత్రులు దూరమైతే ప్రభుత్వ ఏర్పాటుకు సమస్యలొస్తాయని దానిని అధిగమించేందుకు కొత్త సమీకరణలతో వ్యూహరచన సాగించాలనేది బీజేపీలోని ఒక వర్గం, సంఘ్ శక్తుల ఉమ్మడి కార్యాచరణగా కనిపిస్తోంది.

సంఘ్ కనుసన్నల్లోనే...

నిర్ణయాల విషయంలో మూడేళ్లుగా మోడీ అనుభవించిన స్వేచ్ఛకు ఇక ముందు బ్రేకులు పడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అదే స్వేచ్ఛ కారణంగానే పార్టీ విస్తరణ సాగింది. స్థానికంగా ఉండే కుల,మత సమీకరణలు, ప్రాంతీయ వాదం జోడించి మోడీ,అమిత్ షాలు ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పొలిటికల్ మిరకిల్స్ సృష్టించారు. ఈశాన్యభారతంలో బలమైన పునాదులు వేయడంతోపాటు అస్సాం వంటి రాష్ట్రాలను కమల పరం చేశారు. తమిళనాడు వంటి ప్రాంతాల్లో కూడా తెర వెనక సారథ్యానికి ప్రయత్నించి కొంత మేరకు విజయం సాధించారు. కానీ ద్రవిడ రాష్ట్రాల్లో కమలానికి ప్రజామద్దతు సమీకరించడం సాధ్యం కాదని తేలిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇంతవరకూ సాధించిన విజయాలను సంఘటితపరుచుకుంటూనే మిత్రుల సహకారంతో 2019 గెలుపు గోల్ కొట్టాలని భావిస్తున్నారు. ఈ దిశలో పయనించేందుకు అవసరమైన ఎత్తుగడలపై సంఘ్ భారీ కసరత్తు చేస్తోంది. మోడీ నియంతృత్వ వ్యవహార ధోరణి కారణంగా మిత్రపక్షాలలో అభద్రతాభావం పెరిగిపోయింది. సొంతంగా మెజార్టీ సాధించలేక భారీగా సీట్లు పడిపోతే మిత్రపక్షాల వెన్నుదన్నుతోనే సంకీర్ణప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తుంది. దీనికి అవసరమైన ప్రాతిపదిక, సంప్రతింపులు సంఘ్ కనుసన్నల్లోనే సాగేలా పథక రచన చేస్తున్నారు. జనవరి చివరి వారంలో నాగ్ పూర్ లో ఇందుకు సంబంధించి వరిష్ట నేతల చింతన్ బైఠక్ కు ఏర్పాట్లు సాగుతున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గడ్, కర్ణాటక రాష్ట్రాల శాసనసభ ఎన్నికల వ్యూహంపై ప్రాథమిక కసరత్తు కూడా అక్కడే మొదలు కావచ్చని సమాచారం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News