మోడీపై భ్రమలు తొలిగిపోతున్నాయా?

Update: 2017-11-01 17:30 GMT

నరేంద్ర మోడీ... గత మూడేళ్లుగా ఈపేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. విదేశాల్లోనూ ఆయన ప్రభ దివ్యంగా వెలిగిపోతోంది. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ తర్వాత గత మూడు దశాబ్దాల్లో అంతటి ప్రజాదరణ చూరగొన్న నేత నరేంద్ర మోడీనేనన్నది నిర్వివాదం. అటు విదేశంలో, ఇటు స్వదేశంలో యువకులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీలు పడతారు. భారత్ భవితను మలుపుతిప్పే భవ్య నాయకుడు అని అందరూ భావించారు. ఆయన వేసే ఎత్తులకు, పై ఎత్తులకు వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీనే కళ్లు తేలేసింది. ఇక చిన్నా చితకా ప్రాంతీయ పార్టీలు సరేసరి. పా్ర్టీలోని పాతతరం ముందే చేతులెత్తేసింది. అయితే ఇదంతా ఇప్పుడు చరిత్ర కానుందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయన వ్యవహారశైలితో ఇటు ప్రజలు, అటు మిత్రపక్షాలు కూడా ఎంతమాత్రం సంతోషంగా లేవు. ప్రస్తుతానికి అవి అంతగా బయటపడనప్పటికీ లోలోన రగిలిపోతున్నాయి. సమయం వస్తే స్పందించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రజలకు కూడా క్రమంగా మోడీపై భ్రమలు తొలుగుతున్నాయి. విదేశాల్లోని నల్లధనాన్ని తెచ్చి తమకు పంచుతారని ఎన్నికల సమయంలో కొందరు అమాయక ప్రజలు భావించారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నేత తమ కష్టాలు కొంతవరకైనా కడతేరుస్తారని ఆశించారు. కానీ అది భ్రమగానే మిగిలిపోయింది. ఇక నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల అద్భుతాలు జరుగుతాయని ఆశించకపోయినా ఏదో గట్టి మేలు జరుగుతుందని విశ్వసించారు. కానీ ఆచరణలో అందుకు విరుద్ధంగా జరుగుతున్న పరిణామాలు మోడీ ప్రతిష్టను మసకబారుస్తున్నాయన్నది విశ్లేషకుల వాదన.

మిత్రులు అవమానాలు దిగమింగుకుంటూ....

ఎన్టీఏ సంకీర్ణంలోని మిత్రులు మోడీ వ్యవహారశైలి పట్ల సంతృప్తికరంగా లేరు. అవమానాలను దిగమింగుకుంటున్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం వచ్చే జరిగే మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్, కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి తేడా వస్తే తోక జాడించేందుకు మిత్రులు సిద్ధమవుతున్నారు. సంకీర్ణ ప్రభుత్వంలోని మిత్రపక్షాలను చులకనగా చూస్తున్నారని, వీలైతే వాటిని మింగేయాలని చూస్తున్నారని వాటి అభియోగం. వీటిని తేలిగ్గా తోసిపుచ్చలేం. చిన్నా చితకా పార్టీలనను పక్కన బెడితే పార్టీ ఆవిర్భావం నుంచి కలిసి ప్రయాణిస్తున్న శివసేన, అకాలీదళ్ వంటి పార్టీలే అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. శివసేన నుంచి వలసలను ప్రోత్సహించడం ద్వారా, మహారాష్ట్ర సంకీర్ణ సర్కారులో దాని ప్రాధాన్యం తగ్గించడం ద్వారా ఆ పార్టీని దాదాపు నిర్వీర్యం చేశారు. బాల్ థాకరే హయాంలో రెండు పార్టీల మధ్య అనుబంధం అద్భుతంగా ఉండేది. సురేష్ ప్రభు వంటి శివసేన సీనియర్ నేతను తమ పార్టీలోకి చేర్చుకోవడం ఏ విధంగా మిత్రధర్మమో ఎవరికీ అర్ధం కాదు. మంత్రివర్గంలో మరికొన్ని పదవులు కేటాయింపు, థాకరేకు భారత రత్న, బాంబే హైకోర్టు పేరును ముంబయి హైకోర్టుగా మార్పు వంటి చిన్నపాటి డిమాండ్లను కూడా మోడీ పట్టించుకోలేదన్న బాధ శివసేన వర్గాల్లో బలంగా ఉంది. ఇటీవల పంజాబ్ లో ఓటమికి, గురుదాస్ పూర్ లోక్ సభ ఉప ఎన్నికల్లో ఓటమికి బాధ్యత అంతా తమపైకి నెట్టేయడాన్ని అకాలీదళ్ జీర్ణించుకోలేక పోతోంది. మిత్రపక్షంగా బీజేపీ పనితీరు బాగుంటే రెండు ఎన్నికల్లో ఇంత ఘోర పరాజయం చెందేవాళ్లం కాదన్న వాదనను అకాలీదళ్ విన్పిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లోనూ....

ఇక ఏపీలోని టీడీపీ పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యిలా ఉంది. ప్రత్యేక హోదా, పాతిక వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ, పదేళ్ల పాటు పెంట్రల్ వ్యాట్, ఇన్ కమ్ ట్యాక్స్ మాఫీ, పోలవరం వంటి ప్రధాన హామీల అమలులో కుప్పిగంతులు వేయడంపై తెలుగు తమ్ముళ్లు గరంగరంగా ఉన్నారు. ఇప్పటికే రెండు పార్టీల మధ్య చిటపటలు విన్పిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి బీజపీ, టీడీపీ పొత్తు కొనసాగుతుందన్నదీ ప్రశ్నార్థకమే. ఏపీ అభివృద్ధికి బీజేపీ సహకరించడం లేదంటూ ఎన్నికల ముందు తెలుగుదేశం విడాకులిచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. నోట్లరద్దు, జీఎస్టీపై అడక్కుండానే మద్దతు ఇచ్చి, అవసరమైతే వచ్చే ఎన్నికల్లో కలిసి ప్రయాణించాలని ఆలోచించిన మరో తెలుగు పార్టీ టీఆర్ఎస్ ఇప్పుడు అందుకు పూర్తిగా దూరమైంది. రామ్ విలాస్ పాశ్వాన్, సారథ్యంలోని లోక్ జనశక్తిపార్టీ, జనతాదళ్ (యు) చీలిక వర్గం నాయకుడైన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లాంటి వాళ్లు కూడా మోడీ నిజస్వరూపం ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది. ప్రయివేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు, దేశవ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో దళితులకు 75 శాతం రిజర్వేషన్లపై మోడీ మౌనం ఆ పార్టీకి అసంతృప్తిని తెప్పిస్తుంది. లాలూపై కేసుల విషయంలోనే కొంత చొరవ చూపింది. బీహారకు 2.5 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ, ఇతర హామీల విషయంలో మోడీ సర్కారు సాచివేత ధోరణి కొత్త మిత్రుడైన నితీష్ కుమార్ కు ఎంతమాత్రం మింగుడుపడటం లేదు.

ట్రబుల్ షూటర్లు ఏరీ....?

సంకీర్ణ సర్కార్ ను నడపటం ఒక కళ. మిత్రపక్షాలను గౌరవించడం.. వారి డిమాండ్లను సావధానంగా వినడం, రాజకీయంగా వారూ బలపడేందుకు అవకాశం ఇవ్వడం వంటి లక్షణాలు సంకీర్ణ సర్కార్ సారధికి ఉండాలి. సంక్షోభాలను పరిష్కరించే లౌక్యం నాయకులు అవసరం. మోడీ సర్కార్ లో ఇవి కొరవడినాయి. వాజ్ పేయి హయాంలో మిత్రపక్షాలకు ఢిల్లీలో మంచి గౌరవం లభించేదని ఇప్పటికీ పాతతరం నాయకులు గుర్తు చేసుకుంటారు. జార్జి ఫెర్నాండజ్ వంటి సంక్షోభ పరిష్కర్తలు అప్పట్లో ఉండేవారు. యూపీఏ ప్రధాని మన్మోహన్ కూడా మిత్రులను సమాదరించేవారు. ఆయన హయాంలో ప్రణబ్ ముఖర్జీ ‘ట్రబుల్ షూటర్’ గా ఉండేవారు. మోడీ వద్ద సంక్షోభ పరిష్కర్తలకు బదులు సంక్షోభ సృష్టికర్తలు ఉన్నారు. కనీసం మంత్రి వర్గ విస్తరణ వంటి ముఖ్య కార్యక్రమం సమాచారం కూడా మిత్రులకు చెప్పలేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్డీఏ సమావేశాల్లో తమ మాటకు విలువ లేదన్న రామ్ విలాస్ పాశ్వాన్ వంటి సీనియర్ నేతలు వ్యాఖ్యలను తోసిపుచ్చలేం. ఎన్డీఏ ఇదే వైఖరితో ముందుకెళితే వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడం ఎన్డీఏకు అంత తేలిక కాదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News