మోడీని గుజరాత్ గజగజలాడిస్తుందా?

Update: 2017-10-10 18:29 GMT

ప్రధాని నరేంద్ర మోడీకి ఎన్నికల జ్వరం పట్టుకుంది. కళ్లు మూసుకున్నా, తెరచినా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలే గుర్తుకు వస్తున్నాయ. అందుకే అదే పనిగా గుజరాత్ పర్యటనకు వెళుతున్నారు. ఎడాపెడా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. చిన్నా చితకా అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు కానిస్తున్నారు. ప్రధానమంత్రిగా ఊపిరి సలపని పనులతో తీరికలేకుండా ఉన్నప్పటికీ ఏ మాత్రం అవకాశం దొరకినా అహ్మదాబాద్ లో వాలిపోతున్నారు. తన రాష్ట్రంలో ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో ఈ విషయం స్పష్టంచేస్తోంది. గత నెల 12 నుంచి ఈ నెల 9వ దరకూ మూడుసార్లు మోడీ గుజరాత్ పర్యటనకు వెళ్లారంటే ఎన్నికలపై ప్రధాని ఎంత ఆసక్తి కనబరుస్తున్నారో అర్ధమవుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే ఒక దఫా ప్రచారాన్ని పూర్తి చేస్తున్నారు. ఒక్కసారి నోటిఫికేషన్ వెలువడితే ఎన్నికల నిబంధనావళి అమల్లోకి వస్తుంది. ఫలితంగా ఓటర్లను ఆకట్టుకునే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అవకాశం ఉండదు. అందువల్లే నోటిఫికేషన్ రాకముందే వీలైనన్ని అభివృద్ధి పథకాలను ఆవిష్కరించాలన్న పట్టుదలతో పనిచేస్తున్నారు. బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. పీఠాధిపతులునూ కలుస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మసీదుల సందర్శనకు కూడా వెళ్లడం విశేషం.

జపాన్ ప్రధాని పర్యటన ఒక రాష్ట్రానికే పరిమితం.....

జపాన్ ప్రధాని షింజో అబే పర్యటనను పురస్కరించుకుని సెప్టంబరు 12, 13 తేదీల్లో మోడీ గుజరాత్ ను సందర్శించారు. ప్రతిష్ఠాత్మకమైన అహ్మదాబాద్-ముంబయి రైలు మార్గానికి శంకుస్థాపన చేశారు. సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. విమానాశ్రయం నుంచి ఇద్దరు నేతలు ర్యాలీగా రావడం విశేషం. అన్నింటికీ మించి మోడీ మసీదును సందర్శించడం విశేషం. ప్రధాని పదవి చేపట్టాక మోడీ మసీదును సందర్శించడం ఇదే ప్రధమం. రంజాన్ మాసంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఇఫ్తార్ విందుకు కనీసం హాజరు కాని మోడీ ఇప్పుడు మసీదును సందర్శించడానికి వెనక గల కారణం వచ్చే ఎన్నికలే అనడంలో ఎలాంటి సందేహం లేదు. బుల్లెట్ రైలు పథకం కూడా ఎన్నికల నేపథ్యంలో పుట్టుకొచ్చిందే. మధ్యతరగతి ప్రజలు, వ్యాపారవర్గాలను ఆకట్టుకునేందుకు దానిని తెరపైకి తీసుకువచ్చారు. వాస్తవానికి ఈ వర్గాల ప్రజలు చాలామంది ఇటీవల కాలంలో విమానయానంపైనే ఆసక్తి చూపుతున్నారు. ఒక విదేశీ అధినేత దేశ రాజధాని కాకుండా పూర్తిగా ఒక రాష్ట్రంలోనే పర్యటించడం కూడా ఇదే ప్రధమం. ఎన్నికల నేపథ్యంలోనే స్వయంగా మోడీ జపాన్ ప్రధాని పర్యటనను కేవలం గుజరాత్ కే పరిమితం చేశారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. నిర్మాణం పూర్తి చేసుకుని 2022 ఆగస్టు 15న తొలి రైలు నడవాల్సి ఉంది.

ఎప్పుడో శంకుస్థాపన చేస్తే.....

ఈ పర్యటన అనంతరం నెల తిరక్కముందే తన జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టంబరు 17,18 తేదీల్లో రెండోసారి రాష్ట్రాన్ని సందర్శించారు. ప్రతిష్టాత్మకమైన సర్దార్ సరోవర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఇది దేశంలోని అత్యంత భారీ ప్రాజెక్టు. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ లకు దీనివల్ల ప్రయోజనం కలుగుతుంది. వాస్తవానికి ఇది నిన్న మొన్నటి ప్రాజెక్టు కాదు. దశాబ్దాల చరిత్ర ఉంది. విద్యుత్తు, సాగు, తాగునీటి అవసరాలను తీర్చే ఈ ప్రాజెక్టును ప్రధమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 1961 ఏప్రిల్ 5వ తేదీన శంకుస్థాపన చేశారు. గతంలో గుజరాత్ ను పాలించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా ఈ ప్రాజెక్టు పూర్తికి తమ వంతు ప్రయత్నాలు చేశారు. అయితే కేవలం ఇద తన ఘనతే అని మోడీ ప్రచారం చేయగలిగారు. ఎన్నికల నేపథ్యంలోనే హడావిడిగా ప్రారంభోత్సవం చేశారన్న విమర్శలను ఎదుర్కొన్నారు.

ఎన్ని ప్రారంభోత్సవాలు......

ముచ్చటగా మూడోసారి ఈ నెల 7,8 తేదీల్లో మోడీ రాష్ట్రాన్ని సందర్శించారు. ఈ దఫా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆధ్మాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ద్వారకాదీష్ ఆలయాన్ని సందర్శించిన అనంతరం అక్కడ బహిరంగ సభలో పాల్గొన్నారు. ద్వారక గుజరాత్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం. ఓఖా-బైట్ ద్వారక మధ్య నాలుగు వరుసల తీగ ఆధారిత వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సురేంద్రనగర్ జిల్లా చోటేలా పట్టణ సమీపంలోని హిరాసర్ లో కొత్త గ్రీన్ ఫిల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హిరాసర్ లో రూ.1405 కోట్లతో 2,534 ఎకరాల్లో విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుత రాజ్ కోట్ విమానాశ్రయం విస్తరణకు అవకాశంలేదు. దీంతో అక్కడికి 27 కిలోమీటర్ల దూరంలో దీనిని నిర్మిస్తున్నారు. రూ.2893 కోట్ల వ్యయంతో అహ్మదాబాద్ - రాజ్ కోట్ మధ్య ఆరువరుసల జాతీయ రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సురేంద్రనగర్ పరిధిలో జొరావర్ నగర్, రత్నాపూర్ లకు తాగునీటి గొట్టపు మార్గం, యాంత్రిక పారిశుద్ధి ప్యాకేజీ కేంద్రాన్ని కూడా మోడీ ప్రారంభించారు. అనంతరం గాంధీనగర్ లో ఐఐఐటీ కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రజల్లో అక్షరాస్యత వ్యాప్తి లక్ష్యంగా చేపట్టిన ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరతా అభియాన్ కింద నిర్వహించిన కోర్సులను పూర్తి చేసిన వారికి ప్రధాని ధ్రువపత్రాలు అందజేశారు. ఇవన్నీ ఎన్నికల నేపథ్యంలో అప్పటికప్పుడు రూపకల్పన చేసిన కార్యక్రమాలని ప్రత్యేకంగా పేర్కొనక్కరలేదు.

నాటకీయతను ప్రదర్శిస్తూ.....

పర్యటనలో రెండోరోజైన అక్టోబర్ 8న మోడీ తన స్వస్థలమైన వాద్ నగర్ సందర్శించారు. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ఇక్కడకు రావడం ఇదే ప్రధమం. తాను విద్య నభ్యసించిన బీఎన్ ఉన్నత పాఠశాలకకు వెళ్లి అక్కడి మట్టిని తన నుదుటికి అద్దుకుని నాటకీయతను ప్రదర్శించారు. ఇక్కడి రైల్వే స్టేషన్లో టీ అమ్ముకుని జీవనం సాగించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. రోడ్ షోలో పాల్గొన్నారు. ఇక్కడ నూతనంగా నిర్మించిన జీఎంఈఆర్ఎస్ వైద్య కళాశాలను, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమమైన ఇంటన్సిఫైడ్ మిషన్ ఇంధ్రధనుష్, సెల్ ఫోన్ల ద్వారా గర్భిణులు, చిన్నపిల్లలకు సేవలు అలందించే మొబైల్ ఫోన్ టెక్నాలజీ ఫర్ కమ్యూనిటీ హెల్త్ ఆపరేషన్ కార్యక్రమాన్ని మోడీ ప్రారంభించారు. రూ.4,337 కోట్ల వ్యయంతో భడ్ బూత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. నర్మదానదీ తీరంలోని భూముల్లో ఉప్పునీరు చేరకుండా ఉండటం కోసం దీనిని నిర్మించనున్నారు. గుజరాత్ నర్మదా వ్యాలీ ఫెర్టిలైజర్స్ కంపెనీ ఆధ్వర్యంలో వేపపూరిత యూరియా ప్రాజెక్టులను ప్రారంభించారు.

జాతీయ స్థాయిలో ప్రభావం చూపే.....

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే ఈ కార్యక్రమాలను చేపట్టే అవకాశం ఉండదు. ఆలోపే చేయాలన్న ఉద్దేశంతో హడావిడిగా ప్రారంభించారు. వేల కోట్ల రూపాయల పథకాలకు శంకుస్థాపన కేవలం ఎన్నికల నేపథ్యంలో చేసినవే కావడం గమనార్హం. గుజరాత్ ఎన్నికలు పార్టీకి సంబంధించినవి కావు. మోడీ వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించినవి. ఇక్కడ గెలుపోటములు కేవలం ఈ రాష్ట్రానికి పరిమితం కావు. జాతీయ స్థాయిలో ప్రభావం చూపుతాయి. వచ్చే ఏడాది జరిగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2019 నాటి సాధారణ ఎన్నికలకు దిక్సూచీ అవుతాయి. అందుకే అదే పనిగా గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు మోడీ. పర్యటనల ఫలితం ఉంటుందా అన్నది తేలడానికి డిసెంబరు వరకూ వేచి చూడక తప్పదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News