మోడీది ఎమోషనల్ బ్లాక్ మెయిలింగేనా?

Update: 2018-02-08 15:30 GMT

ఇంకా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమే. ఎదుటివాడిని నాలుగు తిట్టిపోసి మా కంటే మీరే పెద్ద వెధవాయిలు అంటూ ఆడిపోసుకునే ఎత్తుగడే. ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా వెలువరించిన ప్రసంగంలోని ప్రతిమాటా పక్తురాజకీయ విన్యాసమే. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ఆగ్రహావేశాలతో అట్టుడికి పోతోంది. జరిగిన అన్యాయానికి కుమిలిపోతోంది. ప్రత్యేక హోదా లేదు. ప్యాకేజీ ఊసు పెదవి దాటింది తప్ప పని కావడం లేదు. మిత్రపక్షమూ, సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామి టీడీపీ ఎంపీలే నిరసన గళం తో పార్లమెంటును ప్రతిధ్వనింపచేస్తున్న పరిస్థితి. ప్రధాని స్పందించారు. రాజకీయాలు నొల్లుకున్నారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీపై నోరు రాలేదు. పైసలు విదిల్చేందుకు మాట పెగలలేదు. ప్రతిపక్ష కాంగ్రెసు పై మాత్రం మాటల తూటాలు పేల్చేశారు. మరుగున పడిన మలిన విషయాలను వెలికి తెచ్చి ఆత్మరక్షణ ఛత్రం నిర్మించుకునే ప్రయత్నం చేశారు.

కంకాళాలతో కవచం...

ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మూడు రోజులపాటు లోక్ సభలో ఆందోళన చేశారు. ఇది కేంద్రప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా మారింది. సొంత మిత్రపక్షమే నిరసనలు, అసంతృప్తి గళం వినిపిస్తుండటంతో విపక్షాలకు బీజేపీ అలుసై పోతోంది. అటు ఎంపీలను సస్పెండ్ చేయలేక ఇటు సర్దుబాటు చేయడం చేతకాక అధికార బీజేపీ సతమతమవుతోంది. నిజానికి ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వమే అయినప్పటికీ మిగిలిన మిత్రపక్షాలేమీ కూడా ఈ గొడవతో తమకేమీ సంబంధం లేదన్నట్లుగా మౌనం వహిస్తున్నాయి. కొండొకచో తెలుగుదేశంపార్టీకి సహకరించేందుకు కూడా అకాలీదళ్ , శివసేన వంటి పార్టీలు సిద్దమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తన పార్టీని, కేంద్రాన్ని విమర్శల దాడి నుంచి రక్షించుకునే బాధ్యతను ప్రధాని మోడీయే స్వయంగా స్వీకరించాల్సి వచ్చింది. ‘కేంద్రం నుంచి నిధులు రావడం లేదు. ప్రత్యేకహోదా ఇవ్వలేదు. ప్యాకేజీకి నిధులివ్వలేదు.’ అంటూ ఏపీలోని పార్టీలు,ప్రజలు ఆందోళన చేస్తుంటే వాటికి సమాధానం ఇవ్వకుండా తెలివిగా దాటవేశారు ప్రధాని. ‘రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెసు పార్టీ రాష్ట్రాన్ని విభజించింది. అందుకే సమస్యలం’టూ తప్పంతా ప్రతిపక్షం మీదకు తోసేసే ప్రయత్నం చేశారు. కాంగ్రెసు పార్టీ గతంలో చేసిన పాత తప్పులను తవ్విపోసి ఎక్కడో మరుగున పడిన అస్థిపంజరాలవంటి విషయాలతో బీజేపీని, కేంద్రాన్ని రక్షించే ప్రయత్నం చేశారు. ప్రస్తుత సమస్యను ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్నఇబ్బందులకు కేంద్రం సూచించే పరిష్కారాలను, పునర్విభజన చట్ట హామీలను ప్రస్తావించకుండా ప్రధాని వాక్చాతుర్యం ప్రదర్శించారు. దీనివల్ల ఏపీకి ఒరిగేదేమీ ఉండదు. ఆంధ్రప్రదేశ్ లో అస్తిత్వమే కనుమరుగవుతున్న కాంగ్రెసును తిట్టిపోస్తే శ్రవణానందమే తప్ప టీడీపీకి కనీసం రాజకీయ ప్రయోజనం కూడా ఉండదు. పునర్విభజన చట్టం ఆమోదంలో కాంగ్రెసుతోపాటు ప్రధాన భాగస్వామి అయిన బీజేపీనే కేంద్రప్రభుత్వ రూపంలో ఇప్పుడు పరిష్కర్త పాత్రలో ఉంది. దీనిని మాటల ముసుగులో మాయ చేయచూడటం దురదృష్టకరమే.

తెదేపాకు ఇరకాటం...

ఆందోళన చేస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రధాని ప్రసంగం అనగానే గప్ చుప్ అయిపోవడం టీడీపీని రాజకీయంగా ఇరకాటంలోకి నెట్టేసింది. ప్రధాని ప్రసంగంపై కాంగ్రెసు ఆందోళన వ్యక్తం చేస్తూ నినాదాలు చేస్తుంటే టీడీపీ మాత్రం ప్రేక్షక పాత్రకు పరిమితమైపోయింది. నేరుగా ప్రధానికి నిరసన తెలిపే అవకాశాన్ని చేజేతులారా టీడీపీ కోల్పోయింది. విషయ తీవ్రతను కేంద్రం గుర్తించి తక్షణం స్పందించాల్సిన అవసరం ఏర్పడి ఉండేది. హోం మంత్రి కోరారనే సాకుతో టీడీపీ ఆందోళన విరమించి కేంద్రానికి సంపూర్ణంగా సహకరించింది. రాజకీయంగా బ్రహ్మాండమైన అవకాశాన్ని జారవిడుచుకుంది. ప్రధాని కూడా వ్యూహాత్మకంగా తన ప్రసంగంలో ఎన్టీరామారావును ప్రస్తావిస్తూ,తెలుగుదేశం పార్టీ ఏర్పాటుకు కాంగ్రెసు పార్టీ ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడమే కారణమంటూ తనపక్షంలోకి టీడీపీని లాగేసే ఎత్తుగడ వేశారు. మురళీమోహన్ వంటి వారైతే చప్పట్లతో ప్రధాని ప్రసంగానికి ఆమోదం తెలిపారు. ఇదంతా ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళ్లేందుకు కారణమైంది. సభను స్తంభింపచేసే స్థాయిలో టీడీపీ విస్పష్టమైన వైఖరి తీసుకోకపోతే ఎలక్టోరల్ పాలిటిక్స్ లో మూల్యం చెల్లించాల్సి రావచ్చు. ఏపీలో వామపక్షాలు, విపక్షాలు కేంద్రవైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ బంద్ చేస్తుంటే తెలుగుదేశం పార్టీగా ఇందులో భాగస్వామ్యం వహించకపోవడం కూడా రాజకీయంగా వ్యూహాత్మక తప్పిదమే. మొత్తమ్మీద పోరాటం లో రాజీ పడిపోతున్నారన్న భావన తెలుగుదేశానికి ఇబ్బందికరమే. ఇంతవరకూ ప్రధానమంత్రికానీ, కనీసం ఆర్థికమంత్రి కానీ చట్టసభలో ఏపీ నిధులకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయలేదు. కేంద్రంలో కదలిక వచ్చిందంటూ తమకు తామే సర్టిఫికేట్ ఇచ్చుకుని రాజీ పడితే పొరపాటును సరిదిద్దుకునే అవకాశం కూడా దొరకదు. నిధులు, పునర్విభజన చట్టంపై సాధికార ప్రకటన సాధించకుండా తెలుగుదేశం తన వైఖరిని సవరించుకున్నా , కేంద్రంలో భాగస్వామిగా కొనసాగినా ఎన్నికల నాటికి రాజకీయ మూల్యం భారీగానే ఉంటుందనేది విశ్లేషకుల అంచనా.

అప్రస్తుత ప్రసంగం ...

‘పీవీ నరసింహారావును కాంగ్రెసు అవమానించింది. దళిత ముఖ్యమంత్రి అంజయ్యను రాజీవ్ గాంధీ అవమానించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా నీలం సంజీవరెడ్డి కి కాంగ్రెసు వెన్నుపోటు పొడిచింది. ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని కాంగ్రెసు దెబ్బతీసింది. రాష్ట్రాల్లో 90 సార్లకు పైగా రాష్ట్రపతి పాలన విధించింది’ ఇదీ ప్రధాని ప్రసంగ తీరు. నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత సమస్యకు, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కు , బీజేపీ ఇచ్చిన హామీల అమలుకు ఏమాత్రం సంబంధం లేని ఊకదంపుడు ఉపన్యాసాన్ని దంచేశారు. తన మాటల వాగ్ధాటితో బురిడీ కొట్టించడంలో మోడీ చాలా చాణక్యం కనబరుస్తారు. కానీ పార్లమెంటు వేదికగానే కాంగ్రెసు ను లక్ష్యంగా చేసుకుంటూ రాజకీయ ఉపన్యాసం చేయడంపై విమర్శలు తలెత్తుతున్నాయి. ప్రధాన మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ ఆందోళన చేస్తోంది. గాయపడిన ఆంధ్రప్రదేశ్ నిధుల కోసం గగ్గోలు పెడుతుంటే మాటల మందు పూయాలని ప్రయత్నించారు. ప్రత్యేక ప్యాకేజీ, రైల్వేజోన్, రాజధాని నిర్మాణానికి నిధుల కేటాయింపు అంశాల జోలికి పోకుండా టీడీపీని జోకొట్టే ప్రయత్నం చేశారు. తాత్కాలికంగా చప్పట్లుకొట్టించుకోవచ్చునేమో గానీ సమస్య పరిష్కారం కాకపోతే మోడీ విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అంశంగానే చూడలేం. పార్లమెంటు సాక్షిగా రూపుదిద్దుకున్న చట్టం అమలుకు సంబంధించిన విషయం . ప్రజాస్వామ్య ప్రమాణాలనే పరిహాసాస్పదం చేసే అంశం. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ దీనిని గమనించి నిర్ణయాలు తీసుకుంటే చట్టసభ గౌరవం ఇనుమడిస్తుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News