మోడీతో మొహం మొత్తేసిందా...?

Update: 2018-01-20 15:30 GMT

ప్రధాని నరేంద్రమోడీని కలిసొచ్చి పదిరోజులు తిరగకుండానే సీఎం చంద్రబాబు నాయుడి స్వరం మారుతోంది. ఎన్నో ఆశలతో, రాజకీయ ఊసులు మోసుకెళ్లిన సీఎంకు తాజాగా పరిస్థితులు అవగతం అవుతున్నాయి. బీజేపీ,మోడీ,అమిత్ షా లు డ్యూయల్ గేమ్ ఆడుతున్నారేమోననే అనుమానం ముందుకొచ్చింది. దాంతో రాజకీయ అజెండాను పైకి తీసే ప్రయత్నాల్లో పడ్డారు తెలుగుదేశం పార్టీ అధినేత. ఏడాది దాటిన తర్వాత ప్రధానితో భేటీలో అనేక విషయాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ప్రత్యేకించి వచ్చే ఎన్నికల్లో లోక్ సభ స్థానాల విషయంలో బీజేపీకి అధిక ప్రాధాన్యం ఇవ్వాలనేది ప్రదాని కోరికగా విశ్వసనీయవర్గాల సమాచారం. గత ఎన్నికల్లో కేవలం నాలుగు లోక్ సభ స్థానాలతో బీజేపీకి సరిపుచ్చారు. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి సీట్లు తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో కొంతమేరకు ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవాలనే యోచనలో ఉంది . మిత్ర పక్షమే అయినప్పటికీ టీడీపీని పూర్తిగా విశ్వసించలేకపోతోంది. సొంతంగా తమ సభ్యులే పార్లమెంటులో ఉండాలనే భావనతో అధికసీట్లపై బేరసారాలు సాగిస్తోంది. ఇటీవల ముస్లిం మహిళల వైవాహిక హక్కుల పరిరక్షణ బిల్లు విషయంలో టీడీపీ, కేంద్ర ప్రభుత్వంతో విభేదించిన సంగతి తెలిసిందే. తెలుగుదేశంతో పొత్తులో భాగంగా కనీసం పది నుంచి పన్నెండు సీట్లు అడగాలని బీజేపీ స్థానిక నాయకత్వం డిమాండ్ చేస్తోంది. దీనికి కేంద్రనాయకత్వమూ సై అంటోంది. ఇదే విషయం ప్రధాని మోడీ, చంద్రబాబు నాయుడు చర్చల సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. దీనిపై క్యాడర్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. మోడీకి ఎటువంటి హామీ ఇవ్వకుండానే వచ్చేశారనేది టీడీపీ వర్గాల సమాచారం.

కోర్టు గుర్తొచ్చింది....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన సందర్బంగా ఇచ్చిన హామీలను అమలు చేయించుకునేందుకు కోర్టును ఆశ్రయిస్తామని చంద్రబాబు నాయుడు పదేపదే నొక్కిచెబుతున్నారు. పీఎం భేటీ తర్వాత నామమాత్రంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. కానీ మీడియా, రాజకీయ వర్గాలు పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా మరోసారి సీఎం అదే అంశాన్ని పేర్కొనడంతో సీరియస్ నెస్ అర్థమవుతోంది. ఎన్నికలకు ఏడాది మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో ఇకపై అన్ని చర్యలు పొలిటికల్ కోణంలోనే ఉంటాయి. 9,10 షెడ్యూలులోని సంస్థల విభజన, రెవిన్యూ లోటు భర్తీ, విద్యాసంస్థల ఏర్పాటు, రాజధాని నిర్మాణానికి ఆర్థిక సాయం వంటివన్నీ పునర్విభజన చట్టంలో పొందుపరిచారు. వీటితో పాటు పోలవరానికి జాతీయ హోదా కల్పించారు. పోలవరానికి సంబంధించిన బాధ్యతల విషయంలో కేంద్రం వెనక్కి పోవడం లేదు. నిర్మాణవ్యయం, పునరావాస ప్యాకేజీలు, భూసేకరణ ఖర్చుల అంశంలో విభేదాలున్నప్పటికీ సహకరించాలనే భావిస్తోంది. అయితే రాష్ట్రప్రభుత్వం కోరుకున్నంత వేగంగా నిధులు, ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాదని కేంద్ర జలవనరులు, ఆర్థిక శాఖలు అభిప్రాయపడుతున్నాయి. 2019 నాటికి ప్రాజెక్టు నుంచి నీళ్లు ఇవ్వకపోతే రాజకీయంగా దెబ్బతింటామనేది చంద్రబాబు నాయుడు ఆందోళన. ఈ నేపథ్యంలోనే తాము కేంద్రానికి అన్నివిధాలుగా సహకరిస్తున్నప్పటికీ ఏపీని ఆదుకోవడానికి, కనీసం పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాల అమలుకు ముందుకు రావడం లేదన్న విషయం ప్రజల ద్రుష్టిలో పెట్టేందుకే కోర్టుకు వెళతామని చంద్రబాబు ప్రకటిస్తున్నారు. రెండు మూడు నెలలు వేచి చూసిన తర్వాత ఆ నిర్ణయం తీసుకునేందుకు కూడా అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

సెంటిమెంటు చర్నాకోల్...

ఏపీ ప్రజల్లో నెలకొని ఉన్న ప్రత్యేక హోదా సెంటిమెంటు మరోసారి రగులుకునే అవకాశం కనిపిస్తోంది. జగన్, పవన్ కల్యాణ్ ఇప్పటికే దీనిపై ప్రజల్లో మరోసారి ఆలోచనలు, ఆవేశం రగిలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన తెలుగుదేశం ప్రభుత్వం ఇంతవరకూ నోరు విప్పడం లేదు. విదేశీ రుణ సాయంతో చేపట్టే ప్రాజెక్టులు, రెవిన్యూ లోటు , రైల్వేజోన్ విషయాల్లో కేంద్రం కనుక ముందుకు రాకపోతే కచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూడా మిగిలిన విపక్షాల పల్లవిని అందుకునే అవకాశం కనిపిస్తోంది. బీజేపీని ఒంటరిని చేయడానికీ వెనుకాడకపోవచ్చు. అందువల్ల ఈ పాయింట్ పై విపక్షాలు లాభం పొందకుండా చూసుకోవాలని తెలుగుదేశం యోచిస్తోంది. ప్రత్యేక ప్యాకేజీలో పేర్కొన్న అంశాలను అమలు చేయకపోవడం వల్లే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనే వివరణ కూడా టీడీపీ వద్ద సిద్ధంగా ఉంది. అయితే తెలుగుదేశం బ్లాక్ మెయిల్ ఎత్తుగడలకు లొంగిపోయే పరిస్థితి బీజేపీలో లేదు. ఆ పార్టీ అంతర్గత సర్వే ప్రకారం ఏపీలో ప్రస్తుతం టీడీపీ, వైసీపీ పార్టీల బలాబలాలు ఇంచుమించు సమానంగా ఉన్నాయి. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పలేరు. అదే సమయంలో లోక్ సభ స్థానాలు కూడా ఎవరికి ఎక్కువ లభిస్తాయో తేల్చలేని స్థితి. బీజేపీతో ఎన్నికలకు ముందు పొత్తు కుదుర్చుకునేందుకు వై.సి.పి ముందుకు రాదు. కానీ ఎన్నికల తర్వాత మద్దతిచ్చేందుకు రెడీ. రాష్ట్రంలోని రెండు పక్షాల్లోని ఈ బలహీనత కారణంగానే బీజేపీ ఒకవైపు టీడీపీని, మరోవైపు వైసీపిని లెక్కచేయడం లేదు. సెంటిమెంటు చర్నాకోల్ తీసినా రాష్ట్రంలో తమకంటూ సొంతంగా పెద్ద స్టేక్ లేదు కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.

రైల్వే జోన్ కు రెడీ....

బీజేపీ ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖపట్నంలో నూతన రైల్వే జోన్ ప్రకటించేందుకు బీజేపీ అగ్రనాయకత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పరిపాలన పరంగా ప్రధాని నిర్ణయమే తరువాయి అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తరాంధ్రలో రైల్వేజోన్ అంశం పెద్ద సెంటిమెంటుగా ఉంది. అందులోనూ విశాఖలో తమ పార్టీయే ప్రాతినిధ్యం వహిస్తోంది. టీడీపీతో పొత్తు ఉన్నా, లేకున్నా రైల్వేజోన్ ప్రకటిస్తే సొంతంగానే రెండు లోక్ సభ స్థానాలు గెలుచుకోవచ్చని బీజేపీ అంచనా. రాజకీయ కోణంలో ఆలోచించిన తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చారు. కానీ ఎన్నికలకు అయిదారు నెలల ముందు మాత్రమే జోన్ ప్రకటన ఉండొచ్చంటున్నారు. ముందుగా ప్రకటిస్తే ఎన్నికల నాటికే సెంటిమెంటు చల్లారిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల బీజేపీపై సానుకూల పవనాలు వీచేలా ఎన్నికల ముంగిట్లో రైల్వే జోన్ ప్రకటన చేసి కమలం ఎక్స్ ప్రెస్ ను కూత పెట్టించాలని చూస్తున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News