మోడీతో ఇక అమీతుమీనేనా?

Update: 2017-12-16 07:30 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం క్రమేపీ తేటతెల్లమవుతోంది. సందిగ్ధత మబ్బులు తొలగిపోతున్నాయి. 2019 ఎన్నికలకు మైత్రీ బంధాలకు అవకాశమున్న పక్షాలపై రాజకీయ అంచనాలు జోరందుకుంటున్నాయి. రాష్ట్రప్రభుత్వానికి అంతంతమాత్రంగానే సహకారం అందిస్తున్న కేంద్రంలోని బీజేపీని వదిలించుకునేందుకు మానసికంగా శ్రేణులను సిద్ధం చేసే పనిలో పడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అలాగని ఇప్పటికిప్పుడు పొత్తు బరి తెంచుకుని బహిరంగంగా ప్రకటించే అవకాశాలు లేవు. అయితే అందుకు సన్నాహకంగా ప్రాతిపదికను నిర్మించడంలో అగ్రనాయకత్వం వ్యూహ రచన చేస్తోంది. పార్టీ అమలు జరపనున్న వ్యూహం సంగతి మాత్రం ఎవరికీ అంతుచిక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలను ముందు వరసలో పెట్టి ప్రజాప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాల సంగతిని ప్రశ్నించడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టడమనే పథకాన్ని అమలు చేసేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అమరావతిలో తాజాగా జరిగిన టీడీపీ సమన్వయ సమావేశంలోనూ, ఢిల్లీలో నిర్వహించిన పార్లమెంటు సభ్యుల సమావేశంలోనూ ఇందుకు సంబంధించిన సూచనలు చేశారు అధినేత. కేంద్రంలోని పెద్దలతో వ్యక్తిగత స్థాయిలో సంబంధాలు నడుపుతూనే చట్టసభలను వేదికగా చేసుకుంటూ పోరాటం చేయాలనేది టీడీపీ ఆలోచన. ఈ విషయంలో కొంచెం కఠినంగానే వ్యవహరించాలని పార్టీ నేతలకు నిర్దేశించారు.

రెండంచెల వ్యూహం...

రాష్ట్ర ప్రయోజనాలను ప్రధానం చేసుకుంటూ కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టాలని టీడీపీ ఎంపీలకు సీఎం నుంచి ఆదేశాలు అందాయి. అవసరం దొరికిన ప్రతిసందర్బాన్ని ఇందుకు వినియోగించుకోవాలన్నారు. ఒక రకంగా చెప్పాలంటే పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు, ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత విషయంలో ఈ సెషన్ పార్లమెంటు సమావేశాల్లోనే అమీతుమీ తేల్చుకోవాల్సి ఉంటుంది. వచ్చే సంవత్సరం మొదట్లో జరిగే పార్లమెంట్ సమావేశాలు బడ్జెట్ కు ఉద్దేశిస్తారు. అందువల్ల రాష్ట్ర సమస్యలు, ఇతరత్రా అంశాలు ప్రధానం కాబోవు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కేంద్రంపై ఒత్తిడి చేయలేకపోతోందని తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఒకవైపు వై.సి.పి. కేంద్రంలోని టీడీపీ మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. 2014 ఎన్నికల మిత్రపక్షమైన జనసేన కూడా పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. అటు కేంద్రంలోని బీజేపీకి, ఇటు రాష్ట్రంలోని వై.సి.పి , జనసేనలకు సమాధానం చెప్పేలా ఎంపీలు ప్రతిస్పందించాలని నిర్ణయించారు. ఈ సందర్బంగా నష్టపోయిన తమ రాష్ట్రం కోసమే పోరాడుతున్న భావన మాత్రమే ప్రజల్లోకి వెళ్లాలి. రాజకీయాల కోసం మాట్లాడుతున్నారన్న లేశమాత్రమైన అనుమానం, సందేహం రాకూడదని టీడీపీ ఎంపీలకు జాగ్రత్తలు చెప్పారు. ఈ బాద్యతను నిర్వహించడం ద్వారా ఎంపీలు ఇంతవరకూ తమపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టినట్లవుతుంది. అదే సమయంలో ప్రజల కోసం తాము శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామన్న ప్రచారం ప్రజల్లోకి వెళుతుంది.

ఒత్తిడి పెంచుతున్న వై.సి.పి....

రాజకీయంగా ఏపీలో తెలుగుదేశంపై ఆధిక్యం సాధించడానికి లోక్ సభను వినియోగించుకోవాలని వై.సి.పి ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అనంతపురం జిల్లాలో నిర్వహించిన పార్టీ పార్లమెంటు సభ్యుల సమావేశంలో అధినేత జగన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాజీనామా సహా దేనికైనా సిద్ధమేనని ఎంపీలు పార్లమెంటు సాక్షిగానే ప్రజలకు చెప్పాలని జగన్ సూచించినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ పార్లమెంటు సభ్యులు రాజీనామా చేస్తారని గతంలో జగన్ ప్రకటించారు. ఏడాది గడచినా ఇందుకు సంబంధించి ముందడుగు పడలేదు. రాజకీయంగా ఏ పర్యటన జరిపినా ఇందుకు సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక హోదా పోరాటాన్ని మరోసారి లోక్ సభలో చేయాల్సిందేనని తమ సభ్యులకు జగన్ సూచించారు. తీవ్రమైన పరిస్థితులు ఏర్పడితే అప్పటికప్పుడు రాజీనామాలు ప్రకటించినా పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదన్నట్లుగా అధినేత భరోసా ఇచ్చారు. ఇంకో ఏడాదిలో ఎలాగూ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ లోపుగా లోక్ సభ స్పీకర్ రాజీనామాలు ఆమోదించే అవకాశం అంతంతమాత్రమే. ఒకవేళ ఉప ఎన్నికలే వస్తే ఒక కాజ్ కోసం నిలబడ్డామన్న మంచి పేరు మిగులుతుంది. 2019 ఎన్నికలకు మంచి ఊపు వస్తుందనే అంచనా తో కఠిన నిర్ణయాలకు కూడా వై.సి.పి సాహసిస్తోంది. సాంకేతికంగా రాజీనామా పత్రాలు అందచేయక పోయినా ఢిల్లీలో ఒత్తిడి పెంచడం వల్ల ప్రస్తుతం రాష్ట్రంలో నిర్వహిస్తున్న పాదయాత్రకు ప్రజామద్దతు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

మంచి తరుణం మించకుండా...

వై.సి.పి వ్యూహాలు టీడీపీకి ముందుగానే లీక్ అయిపోతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రతిపక్షం పాయింట్లు గెయిన్ చేయకుండా చూసుకోవాలంటే తమ సభ్యులూ పోరాటపంథానే అనుసరించాలని చంద్రబాబు నాయుడు ఆదేశించడంలోని ఆంతర్యమిదే. రాజ్యసభలో కాంగ్రెసు కూడా ఏపీ ప్రయోజనాలు, పోలవరంపై ప్రయివేటు బిల్లు ప్రవేశపెడుతోంది. వీటిని రాజకీయంగా తిప్పికొట్టకుండా మౌనం వహిస్తే టీడీపీ నష్టపోవాల్సి వస్తుంది. కేంద్రం చేసే తప్పులకు టీడీపీ మూల్యం చెల్లించాలి. ఇంకోవైపు బీజేపీ, టీడీపీలను రెంటినీ ఒకే గాటన కట్టి ప్రతిపక్షం వైసిపి ప్రచారం చేసే ప్రమాదం ఉంది. ఇందుకు జాతీయస్థాయిలో కాంగ్రెసు తోడ్పాటు ఎలాగూ ఉంటుంది. అందుకే ఇకపై ప్రతి నిర్ణయమూ పొలిటికల్ యాంగిల్ లోనే ఉండాలని టీడీపీ భావిస్తోంది. అయితే ఇందుకు రాష్ట్ర ప్రయోజనాల ముసుగు తొడుగుతారు. ఇందులో భాగంగానే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు విశాఖపట్నం రైల్వే జోన్ పై ప్రయివేటు బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి సంపాదించారు. నిజానికి విశాఖ నుంచి బీజేపీ సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ బాధ్యతను మాత్రం టీడీపీ తీసుకోవడం ద్వారా గట్టి సంకేతమే పంపాలని భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన తమతో కలిసి రావాలంటే కూడా బీజేపీ ని దూరం పెట్టక తప్పదు. ఈ దిశలోనే టీడీపీ అడుగులు పడుతున్నాయి. ఈ కోణంలో చూస్తే ఈ సారి పార్లమెంటు సమావేశాలు కొంచెం హాట్ హాట్ గా బీజేపీ, టీడీపీల మధ్య దూరం పెంచే రీతిలో జరగవచ్చు. అదే సమయంలో పోలవరం వంటి ప్రాజెక్టులకు గరిష్ఠంగా నిధులు రాబట్టేందుకు గాను చంద్రబాబు నాయుడి స్థాయిలో సంయమనం పాటిస్తున్నట్లు కనిపించేలా పక్కా పథకం అమలవుతోంది. సాంకేతికంగా చట్టసభల వేదికగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని నిలదీసే క్రమంలో టీడీపీ మిగిలిన పక్షాలకు తీసిపోని రీతిలో స్పందించేలా తొలిసారిగా గళమెత్తనుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News