మోడీకి ముచ్చెమటలు పట్టిస్తున్న కాషాయకోట

Update: 2017-09-28 17:30 GMT

నరేంద్రమోడీ ఢిల్లీ నాయకత్వాన్ని అందుకున్నాక జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒంటిచేత్తో ఎదుర్కొన్నారు. దశాబ్దాల తరబడి విపక్ష స్థానానికే పరిమితమైన పలు రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగుర వేయించ గలిగారు. పునాదులే లేని చోట పార్టీని అధికార తీరాలకు చేర్చగలిగారు. మహారాష్ట్రలో మొట్టమొదటి సారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. హర్యానా, జార్ఘండ్, మణిపూర్, గోవా, జమ్మూకాశ్మీర్ ల్లో బీజేపీ ప్రభుత్వాలు, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. ఒకప్పుడు కాశ్మీర్ లో కనీస ఉనికే లేని బీజేపీ ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామి. ఈశాన్యాన అతి పెద్ద రాష్ట్రమైన అస్సోంలో కాషాయ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ ప్రాంతంలోని మణిపూర్ లో కూడా విజయఢంకా మోగించింది. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, బీహార్ లలో పరాజయాలు ఎదురైనప్పటికీ మోడీ ప్రభ పెద్దగా తగ్గలేదు.

ఈ ఇద్దరికే సవాల్......

కాని గుజరాత్ లో ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు మోడీ, షా ద్వయానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయని చెబుతున్నారు. ప్రధాని, పార్టీ అధ్యక్షుడు ఇద్దరూ ఈ రాష్ట్రానికి చెందిన వారే కావడం వల్ల ఇక్క విజయం సాధించడం వారికి ప్రాణవసరం. గుజరాత్ లో ఓడినా, గెలిచినా ఆ లాభనష్టాలు నేరుగా వారి ఖాతాలోకే వెళతాయి. ఇతర పార్టీ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాని కన్నా వీరిద్దరి పైనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందన్నది వాస్తవం. గుజరాత్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసి, అభివృద్ధికి నమూనాగా చూపించి 2014 లోక్ సభ ఎన్నికల్లో అప్రతిహ విజయాన్ని నమోదు చేసి నరేంద్ర మోడీకి గుజరాత్ లో గెలుపు ద్వారా దానిని కాపాడుకోవడం అత్యవసరం.

రాహుల్ పర్యటనతో.....

ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే స్వరాష్ట్రంలో విజయం సాధించడం అనుకున్నంత తేలికకాదని మోడీ, షా ద్వయానికి ఇప్పటికే అర్ధమైందని చెబుతున్నారు. రెండు దశాబ్దాల పాలన ఫలితంగా సహజంగా ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకత, పార్టీలో బయటపడిన అంతర్గత కలహాలు, కుంభకోణాలు పార్టీని కలవరపరుస్తున్నాయి. మరోపక్క కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విస్తృత పర్యటన ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతుంది. రాహుల్ కు హార్థిక్ పటేల్ మద్దతు పలకడం సానుకూలఅంశం. పటేల్ వర్గానికి బీసీల రిజర్వేషన్ కల్పించాలంటూ హార్థిక్ పటేల్ గత ఏడాది చేసిన ఉద్యమం రాష్ట్రాన్ని అట్టుడికించింది. దీని సెగ ఢిల్లీకి కూడా తాగింది. రాహుల్ కు స్వయంగా హార్ధిక్ పటేల్ ద్వారకలో స్వాగతం పలికి మద్దతు ప్రకటించడం కీలక పరిణామం. రాహుల్ గాంధీ సౌరాష్ట్రలోని ద్వారక, జామ్ నగర్, రాజ్ కోట్, సురేంద్రనగర్, మోర్చి తదితర ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ప్రజల నుంచి లభించిన స్పందన సంతృప్తికరంగానే ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 182 స్థానాలు గల రాష్ట్ర అసెంబ్లీకి సౌరాష్ట్ర ప్రాంతం నుంచి 58 మందిని ఎన్నుకుంటారు. హార్ధిక్ పటేల్ సామాజిక వర్గానికి చెందిన పట్టేదార్లు ఈ ప్రాంతంలో పెద్దసంఖ్యలో ఉన్నారు. ప్రస్తుతం వారు బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. ఉక్కుమనిషి సర్దార్ పటేల్ ను దేశానికి అందించింది మీరే....రిజర్వేషన్ల ఉద్యమాన్ని సాకుగా చూపి మీపైనే కేసులు ప్రభుత్వం పెట్టిందని అంటూ రాహుల్ వారిని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించారు. ధరోల్ నుంచి రాజ్ కోట్ వరకూ జరిగిన పర్యటనలో పట్టేదార్ అనామత్ ఆందోళన సమితి అందించిన జై సర్దార్..... జై పట్టేదార్ అని రాసి ఉన్న టోపీని రాహుల్ ధరించడం విశేషం.

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు.....

రాహుల్ పర్యటన విజయవంతం కావడాన్ని కాషాయ పార్టీ జీర్ణించుకోలేక పోతోంది. మరో పక్క గత మూడేళ్లలో వెలుగు చూసిన కుంభకోణాలు పార్టీ పుట్టి ముంచుతాయన్న ఆందోళన నెలకొంది. గుజరాత్ స్టేట్ సజ్జన్ సర్పంచ్ కమిషన్ తోపాటు గ్రీన్ వుడ్ రిజార్డ్, మెట్రో, సుజలాం - సుఫలాం తదితర పథకాల్లో చోటు చేసుకున్న అవినీతి ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని కమలనాధులు ఆందోళన చెందుతున్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ ప్రతికూల ప్రభావం చూపుతాయన్న గుబులు పార్టీ వర్గాల్లో నెలకొని ఉంది. ఈ రెండింటి వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, పన్నుల భారం అధికమైందని, ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయని వస్తున్న వార్తలు, విశ్లేషణలు కమలనాధులకు కంటి మీద కునుకు పుట్టనీయడం లేదు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన వివిధ హామీలు సంపూర్ణంగా అమలు కాలేదు.

కమిటీ పరిశీలనలో తేలిందేమిటి?

ఎన్ని ఇబ్బందులున్నా కాషాయ కోటను కాపాడుకోవాలన్న పట్టుదలతో మోడీ-అమిత్ షా ద్వయం పనిచేస్తోంది. మోడీకి నమ్మిన బంటైన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సారధ్యంలో ఎన్నికల కమిటీని ఏర్పాటు చేశారు. రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్, రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ఇందులో సభ్యులు. ఈ కమిటీ సభ్యులు ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించి సానుకూల, ప్రతికూల అంశాలపై సమగ్రంగా సమీక్షించింది. ఓట్ల చీలిక, విపక్షాల అనైక్యతపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శంకర్ సంఘ్ వాఘేలా పార్టీకి రాజీనామా చేయడం తమకు లాభిస్తుందని అంచనా వేస్తోంది. కాంగ్రెస్ పార్టీ తనను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించనందుకు నిరసనగా రాజీనామా చేసి బయటకు వచ్చిన వాఘేలా జన్ వికల్ప్ అనే పార్టీని ప్రారంభించారు. కాంగ్రెస్, బీజేపీలను వ్యతిరేకించే వారు తన పార్టీలో చేరతారని వాఘేలా అంచనా వేస్తున్నారు. కాని ఆయన ప్రభావం పరిమితమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికి, తద్వారా లబ్ది పొందడానికి బీజేపీ ఆయనను పావుగా వాడుకుంటోందని కాంగ్రెస్ ధ్వజమెత్తుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల విపక్షాల ఓట్లలో చీలిక వచ్చి లబ్దిపొందవచ్చని పార్టీలో కొందరు అంచనా వేస్తున్నారు. ముస్లిం, దళితుల్లో వ్యతిరేకతను అధిగమించేందుకు పార్టీ కసరత్తు చేస్తుంది. మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని కూడా మర్చిపోలేదు. రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల పర్యవేక్షకుడిగా నియమితుడైన రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లెట్ వ్యూహాలు, ఎత్తుగడలను పసిగడుతూ పై ఎత్తులు వేస్తోంది. గత నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం సాధించిన సీట్లలో పెద్దగా మార్పులేదు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా.... ఓటు బ్యాంకును కాపాడుకుంటూ వస్తోంది. ఈ వాస్తవాన్ని కాషాయ పార్టీ గుర్తించింది. గుజరాత్ గెలుపు, ఓటమి ఏదైనా మోడీ, షాలదే బాధ్యత అవుతుంది. అంతే తప్ప పార్టీది కాదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News