మోడీకి ఈ వర్గాలు దూరమవుతాయా?

Update: 2017-10-09 17:30 GMT

వృద్ధిరేటు, జీడీపీ, కరెంట్ ఖాతా లోటు వంటి అంశాలు సామాన్యుడికి కొరుకుడుపడని అంశాలు. కాస్తోకూస్తో మధ్యతరగతి ప్రజల్లో కొద్ది మందికి ఓ మోస్తరు అవగాహన ఉండవచ్చు. మేధావుల చర్చల్లో మాత్రం ప్రతిధ్వనిస్తుంటాయి. సాధారణ, మధ్యతరగతి ప్రజలు, మేధావులు ఎవరైనా కావచ్చు.... అంతిమంగా ధరలు, మరీ ముఖ్యంగా నిత్యావసర సరకుల ధరలు తగ్గాయా? లేదా? అన్నదే ప్రధానం. అదే విధంగా స్థిరాస్థి క్రయవిక్రయాలు, ఆర్థిక లావాదేవీలు సాఫీగా జరుగుతున్నాయా? లేదా? అన్నదే ముఖ్యం. ఇవన్నీ బాగా ఉంటే దేశ ఆర్థిక రథం సాఫీగా సాగిపోతున్నట్లే.

ప్రజలు బాధను పంటిబిగువున భరించినా......

కానీ గత కొంతకాలంగా దేశ ఆర్థిక పరిస్థితి నాయకులు చెబుతున్నంత దివ్యంగా అయితే ఏమీ లేదన్నది వాస్తవం. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశాయి. మళ్లీ ఎప్పట్లోగా కోలుకుంటామా అన్న సందేహాలను కలిగిస్తున్నాయి. సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకూ ప్రభావితం చేసిన ఈ నిర్ణయాలపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నోట్ల రద్దుపై మొదట్లో ప్రజల్లో కొంత సానుకూల అభిప్రాయం ఉండేది. గత ఏడాది నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని యావత్ జాతి హర్షించింది. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, భవిష్యత్తు బంగారుమయంగా ఉంటుందని విశ్వసించింది. అవినీతిని అంతం చేస్తుందని, నల్లధనాన్ని నియంత్రిస్తుందని ఆశించింది. భవిష్యత్ పై ఆశతో తాత్కాలిక ఇబ్బందులను ప్రజానీకం పంటిబిగువన భరించింది. ఇప్పుడు దానిపై భ్రమలు పూర్తిగా తొలిగిపోయాయి. నోట్ల రద్దు వల్ల ప్రజలకు ఎంతమాత్రం మేలు జరగకపోగా వారిని మరింత ఇబ్బందుల పాల్జేసింది. నగదు రహిత లావాదేవీలు నినాదంగానే మారిపోయాయి. దక్షిణాదిన తొలి నగదరు రహిత గ్రామంగా ప్రకటించిన తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట జిల్లాలోని ఇబ్రహీంపూర్ లో ఈ పథకం ఘోరంగా విఫలమయింది. నగదు రహిత లావాదేవీలతో గతంలో అనేక అవార్డులు పొందిన ఈ గ్రామంలో ప్రస్తుతం నగదు రహిత లావాదేవీలు నామమాత్రంగానే సాగుతున్నాయి. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ఇతర గ్రామాల వారు కూడా తొలుత నగదు రహిత లావాదేవీలపై ఆసక్తి కనబర్చారు. ప్రస్తుతం ఆయా గ్రామాల్లో నగదు రహిత లావాదేవీలు దాదాపుగా నిలిచిపోయాయి.

నల్ల ధనం లెక్కలు తీయలేదే?

నోట్ల రద్దు వల్ల నల్లధన కుబేరుల ముందరి కాళ్లకు బంధం పడిపోతుందని ఎంతోమంది ఆశించారు. కానీ ఆచరణలో అది అవాస్తవమని తేలింది. ఏ సంపన్నుడూ ఇబ్బంది పడిన దాఖలాలు లేవు. తమ దగ్గరున్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు డొల్ల కంపెనీలను సృష్టించి వాటి ఖాతాల్లో జమ చేశారు. మిత్రులు, బంధువుల పేర్లతో బినామీ ఖాతాలు తెరచి నల్లడబ్బును తెల్లధనంగా మార్చుకున్నారు. నోట్ల రద్దు అనంతరం 5800 డొల్ల కంపెనీల్లో 4,574 కోట్లు జమ అయింది. కొద్ది రోజుల్లోనే ఇందులోనుంచి 4,574 కోట్లు ఉపసంహరించుకోవడం విశేషం. ఇది అనధికారిక సమాచారం కాదు. స్వయంగా కేంద్రమంత్రి వెల్లడించిన గణాంకాలు ఇవి. నోట్ల రద్దు వల్ల కలిగిన ఇబ్బందులపై ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహ్మాన్ ప్రత్యేక గీతాన్ని రూపొందించడం విశేషం. ‘ద ఫ్లయింగ్ లోటస్’ పేరుతో ఈ గీతాన్ని విడుదల చేశారు. నోట్ల రద్దుపై హర్షం, వ్యతిరేకత, సాధారణ ప్రజలపై ప్రభావాన్ని పాటలో పొందుపర్చారు.

సామాన్యుడి జేబుకి చిల్లు.....

మోడీ ప్రభుత్వం తీసుకున్న మరో అతిముఖ్యమైన నిర్ణయం జీఎస్టీ. దీనివల్ల మేలు జరుగుతుందని సామాన్య ప్రజలు భావించారు. కాని ఆచరణలో ఆ ఛాయలు కన్పించడం లేదు. లేకపోగా జీఎస్టీ పేరుతో సామాన్యుడి జేబుకి చిల్లు పెడుతున్నారు. మధ్య తరగతి ప్రజలు, వ్యాపార అనుకూల పార్టీగా ముద్రపడిన బీజేపీ పట్ల ఆ వర్గాల్లోనే తీవ్ర వ్యతిరేకత కన్పిస్తోంది. వివిధ రకాల నిబంధనలతో చిన్న, మధ్యతరగతి ప్రజలు పడుతున్న పాట్లు వర్ణనాతీతం. జీఎస్టీ ప్రకారం వ్యాపారులు వే బిల్లులు జారీ చేయాల్సి ఉంటుంది. వాటిని అధికారులు సరుకు గమ్యం చేరక ముందే తనిఖీ చేయాల్సి ఉంటుంది. కానీ ఆచరణలో ఇలా జరగక పోవడం వల్ల అవినీతికి ఆస్కారం ఏర్పడుతుంది. జీఎస్టీ వల్ల ధరలు తగ్గుతాయని సర్కారు మొదట్లో ఊదరగొట్టింది. ఇతర సరుకుల మాట ఎలా ఉన్నా... పెట్రోలు ధర రోజురోజుకూ పెరగడం సామాన్యుడు జీర్ణించుకోలేకపోతున్నాడు. జీఎస్టీ నుంచి పెట్రోలు, డీజిల్ ను మినహాయించడమే ఇందుకు కారణం. మరొకపక్క అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నా, ఆమేరకు ప్రయోజనాన్ని లబ్దిదారుడు పొందలేకపోతున్నాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి పెట్రోలు, డీజిల్ పై ప్ను విధించడమే ఇందుకు కారణం. మద్యం, పొగాకు ఉత్పత్తుల ను జీఎస్టీ నుంచి మినహాయించడం వల్ల వాటి ధరలకు పట్టపగ్గాలు ఉండటం లేదు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక 11 సార్లు ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం గమనార్హం. బ్యారెల్ చమురు ధర 120 డాలర్లు ఉన్నప్పుడు దేశంలో లీటరు పెట్రోలు దర రూ.73లుగా ఉండేది. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధర బాగా తగ్గినప్పటికీ లీరు పెట్రోలు ధర రూ.74గా ఉంది. అదే పనిగా ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ తన ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటోంది. గత మూడేళ్లలో కేంద్రం ఎక్సైజ్ ఆదాయం 29 వేల కోట్ల రూపాయల నుంచి సుమారు 2.44 లక్షల కోట్లకు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో......

జీఎస్టీ అమల్లోకి వచ్చి మూడు నెలలయింది. దీనిపై వ్యాపార వర్గాలు ముఖ్యంగా చిన్న, మధ్యతరగతి వర్గాలు గగ్గోలు పెట్టడంతో కేంద్రం దిగివచ్చి కొన్ని మార్పులు చేసింది. మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో టెక్స్ టైల్ రంగం బాగా విస్తరించి ఉంది. ఎక్కువ మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. వడోదర, సూరత్, గాంధీనగర్ తదితర నగరాల్లో పరిశ్రమ విస్తరించి ఉంది. జీఎస్టీకి వ్యతిరేకంగా వారు ఇటీవల కాలంలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కొద్దిరోజుల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దిగివచ్చిన కేంద్రం చట్టంలో మార్పులు తీసుకువచ్చింది. మొత్తం 27 వస్తువులపై పన్ను తగ్గించింది. రిటర్న్ ల దాఖలు, పన్నుల చెల్లింపుల్లో వెసులుబాటును కల్పించింది. మహిళ ఓటర్లను దృష్టిలో పెట్టుకుని బంగారు కొనుగోళ్లపై సడలింపులు చేసింది. బంగారం కొనుగోలుకు పాన్ కార్డు అవసరం లేదని స్పష్టం చేసింది. యాభై వేలకు మించి బంగారాన్ని కొనుగోలు చేస్తే గతంలో పాన్ కార్డు చూపించాలన్న నిబంధన ఉండేది. అంతేకాకుండా ఆ సమాచారాన్ని ఆర్థిక నిఘా సంస్థలకు తెలియజేయాల్సి వచ్చేది. ఇది వ్యాపారులకూ ఇబ్బందిగా మారింది. బంగారు కొనగోళ్లు గణనీయంగా తగ్గాయి.

మోడీ కాదు... ప్రజలు చెప్పాలి.....

కొనగోళ్లు, అమ్మకాలు, సేవలపై పన్నులు విధించడం సర్వ సాధారణం. కాని అభివృద్ధి పనులపై కూడా పన్ను విధించడాన్ని ఎన్డీఏ హయాంలోనే చూస్తున్నాం. తెలంగాణలో 1.25 లక్షల కోట్ల విలువైన తాగు, సాగునీరు, రహదారుల ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. వీటిపై ఇప్పటి వరకూ 12 శాతం పన్ను ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్ధన మేరకు జీఎస్టీ సమావేశం దీనిని 5 శాతానికి తగ్గించింది. ఫలితంగా మిషన్ కాకతీయ కింద చేపట్టే పనులకు కొంత వరకూ ఉపశమనం కలుగుతుంది. అభివృద్ధి పనులకు ఊతమివ్వాల్సింది పోయి వాటిపై పన్నులు వేయడం ప్రజా ప్రభుత్వాలకు ఎంత వరకూ సమంజసమన్న ప్రశ్నకు సమాధానం లభించదు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో నిన్న మొన్నటి 22వ జీఎస్టీ మండలి సమావేశం అనంతరం ప్రధాని మోడీ జీఎస్టీకి కొత్త నిర్వచనం చెప్పారు. జీఎస్టీ అంటూ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని...ఇక నుంచి గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అని పిలవాలన్నారు. ఆ మాట ప్రజల నుంచి వచ్చినప్పుడే దానికి సార్ధకత ఉంటుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News