మోడీ సర్కార్ తప్పులు ప్రశ్నించకూడదా?

Update: 2017-10-02 16:30 GMT

‘పెద్దల మాట చద్ది అన్నం మూట’ అంటుంటారు. కాయకష్టం చేసే శ్రమజీవుల కడుపు నింపడంతోపాటు వడదెబ్బ లాంటివి తగలకుండా కాపాడుతుంది. నోట్ల రద్దు, వస్తుసేవల పన్ను అమలుతో దేశార్థిక రంగానికి వడదెబ్బ తగిలింది. ఇటువంటి సంక్షుభిత పరిస్థితుల్లోనే పెద్దల మాట ఆసరాగా తీసుకోవాలి. ఉపయోగ పడే ప్రతి ఆలోచననూ వినియోగించుకోవాలి. మంచి చెడులు బేరీజు వేసుకుని దేశానికి హితం చేసే దిశలో మార్పులు చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ నాయకుల్లో ఈ తెలివిడి కొరవడుతోంది. పాలకులపై అనేక విమర్శలు వస్తుంటాయి. అందులో కొన్ని సహేతుకమైనవి ఉంటాయి. మరికొన్ని కేవలం రాజకీయ ఆరోపణలు, ఆక్షేపణల స్థాయికే పరిమితమవుతుంటాయి. ఇందులో విలువైన విమర్శ ఏది? విచక్షణ రహితంగా చేసిన ఆరోపణ ఏది? అన్న అంశాన్ని బేరీజు వేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. తాము తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టిన ప్రతి ఒక్కరినీ ఒకే గాటన కట్టి ప్రతి విమర్శలు చేస్తే అమూల్యమైన సూచనలను చేజేతులారా జారవిడుచు కున్నట్లవుతుంది.

విచక్షణ కొరవడిందా?

140 లక్షల కోట్ల భారత ఆర్థిక వ్యవస్థలో జీడీపీ వ్రుద్ధి రేటు 7.5 నుంచి 5.7 శాతానికి పడిపోయింది. నోట్ల రద్దు ప్రకటించిన పక్షం రోజుల్లోనే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. కానీ అప్పట్లో ఆయన అంచనాను గేలి చేశారు. ఎగతాళిగా మాట్లాడారు. నోట్ల రద్దు వంటి అతి కీలకమైన నిర్ణయం విషయంలో ముందుగా మన్మోహన్ తో మాట్లాడటానికి సాంకేతికమైన , రాజకీయ పరమైన ఆటంకాలు ఉన్నమాట సహజం. కానీ ఆచరణలోకి తెచ్చిన తర్వాత అయినా పరిస్థితిని మదింపు చేసుకోవడానికి , ప్రత్యామ్నాయ అంశాల ద్వారా ఆర్థిక రంగాన్ని పునరుజ్జీవింపచేయడానికి సలహాలు తీసుకోవడం తప్పుకాదు. కానీ ఫాల్స్ ప్రిస్టేజీకి పోయి మన్ మోహన్ తో కాంగ్రెసు పార్టీ చిలుక పలుకులు పలికిస్తోందంటూ రాజకీయాన్ని రంగరించారు. మాజీ ప్రధాని మాటలను పెడచెవిన పెట్టారు. ఆయన చెప్పిందే నిజమని ఇప్పుడు నిరూపిత మవుతోంది. అప్పట్లో మన్మోహన్ పై బురద జల్లిన నేతలకు ప్రస్తుతం నోరు పెగలడం లేదు. ప్రజల జీవన విధానంలో మార్పు తీసుకురావాలనే ఆశయంతో ప్రభుత్వం ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు. సరైన అంచనా వేయలేకపోవడం వల్ల తప్పులు కూడా జరుగుతుంటాయి. కానీ గుణపాఠం నేర్చుకుని దిద్దుబాటు చేసుకోవాలనే ఆలోచనే రాకపోవడం మాత్రం ఆక్షేపణీయం. ఎవరు విమర్శించినా వదిలిపెట్టేది లేదన్న అహంకారం, అసహనం కేంద్రమంత్రుల్లో కనిపిస్తోంది. ప్రత్యేకించి అరుణ్ జైట్లీ ఈ విషయంలో తన పరిధి, పరిమితులను దాటి వ్యక్తిగత విమర్శలకు కూడా వెనకాడటం లేదు. ఈ విషయంలో కేంద్ర నాయకులకు విచక్షణ కొరవడుతోంది. రాజకీయం, ఆర్థిక రంగం రెండూ పొలిటికల్ ఎకానమీ, అడ్మినిస్ట్రేటివ్ పాలిటిక్స్ లో అంతర్భాగాలు. అందువల్లనే ఈ రెంటి మేళవింపుతో రాజకీయాలను నడపాల్సి ఉంటుంది. విమర్శ చేసే వ్యక్తుల ఉద్దేశాలను ప్రాతిపదికగా చేసుకుంటూ స్పందించడం ప్రభుత్వానికి మేలు చేస్తుంది.

అసామాన్య ఆర్థికవేత్తలనూ ఆలకించరా?

ప్రతి విషయానికి రాజకీయ కోణంలో చూసే వారు కొందరుంటారు. వీరు రాజకీయ ఆర్థికవేత్తలు. ఆర్థిక అంశాలకంటే వారికి కావాల్సింది రాజకీయమే. ప్రభుత్వం ఏ చిన్న తప్పు చేసినా భూతద్దంలో చూపి ఆరోపణలు గుప్పించడమే వీరిపని. మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఇందుకు ప్రత్యేక ఉదాహరణ. ఆయన చేసే విమర్శల్లో ఆర్థిక అంశాల కంటే రాజకీయమే తొంగి చూస్తుంది. ఆయన విషయంలో ప్రభుత్వం కూడా రాజకీయ కోణంలో స్పందించడంలో తప్పులేదు. ఆర్థిక రాజకీయ వేత్తలు మరి కొందరుంటారు. దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా వీరు చేసే సూచనలు, హితోక్తులు, విమర్శలకు కొంత విలువ ఉంటుంది. రాజకీయ ప్రయోజనాలకంటే దేశ హితం అంతర్లీనంగా వీరి విమర్శల్లో దాగి ఉంటుంది. మన్మోహన్ సింగ్ ను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవాలి. పరిస్థితుల కారణంగా దేశ అవసరాల నిమిత్తం యాధృచ్ఛికంగా రాజకీయవేత్తగా మారాల్సి వచ్చింది తప్ప నిజానికి ఆయన ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక వేత్త. మన్మోహన్ వైఖరిని ఆర్థిక కోణంలోనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తన జీవితంలో అయిదు దశాబ్దాలు ఆర్థిక రంగానికి సేవలందించిన ఖ్యాతి ఆయన సొంతం. కేంబ్రిడ్జి ,ఆక్స్ఫర్డ్ వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో అభ్యసించి ఆర్థికశాస్త్రంలో డాక్టరేట్ చేసిన మన్మోహన్ ఐక్యరాజ్యసమితి సహా అంతర్జాతీయ సంస్థల్లో పనిచేసి దేశానికి ఎంతో పేరు తెచ్చిన వ్యక్తి. 1972-76 ల్లోనే దేశానికి ముఖ్య ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. 1982-85 ల మధ్య రిజర్వు బ్యాంకు గవర్నరుగా పనిచేశారు. 1985-87 ల్లో ప్రణాళికసంఘం ఉపాధ్యక్షునిగా బాధ్యత నిర్వర్తించారు. 1990-91 ల్లో వీపీ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనకు ఆర్థిక సలహాదారుగా వ్యవహరించారు. దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు గట్టునపడేయడానికి రాజకీయాలకు అతీతంగా పీవీ నరసింహారావు మన్మోహన్ ను ఆర్థిక మంత్రిని చేశారు. ఆర్థిక రంగంలో తనకున్న అర్హతల ద్వారానే రాజకీయంగా ఉన్నత పదవులు సాధించారు. పర్మిట్ రాజ్ కు చెల్లుచీటీ, దిగుమతులపై పన్నుల తగ్గింపు, ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ కుదింపు వంటి సంస్కరణలతో దేశాన్ని ఉరుకులు పెట్టించారు. అందుకే భారత సామ్యవాద ఆర్థిక వ్యవస్థ లో మన్మోహన్ ముద్ర కీలకమైనది. అంతటి వ్యక్తి అనుభవాన్ని, సలహాలను తీసుకోవడానికి ప్రభుత్వం ఇష్టపడకపోవడం స్వీయతప్పిదమే.

యశ్వంత్ దేశం హితం కోరే కదా?

సొంతపార్టీకి చెందిన మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా సలహాలను కూడా తోసిపుచ్చుతున్నారు. చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్న సమయంలోనే యశ్వంత్ సిన్హా ఆర్థిక మంత్రిగా పని చేశారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు 1998 నుంచి 2002 వరకూ ఆర్థికమంత్రిగా వ్యవహరించారు. ప్రస్తుతం అద్వానీతోపాటు బీజేపీ మార్గదర్శకమండలి సభ్యునిగా కొనసాగుతున్నారు. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దేశ హితం కోరి హెచ్చరికతో కూడిన సలహా నిస్తే సొంతపార్టీ కి చెందిన ఆయనపైనా అరుణ్ జైట్లీ విరుచుకుపడ్డారు. ఎనభై ఏళ్ల వయసులో రాజకీయ నిరుద్యోగి చేసే విమర్శగా కొట్టిపారేశారు. నిజానికి అరుణ్ జైట్లీ అనుభవం ఆర్థికరంగంలో మన్మోహన్, యశ్వంత్ సిన్హాలతో పోలిస్తే అంతంతమాత్రమే. పాలసీ పరంగా వారి సూచనలు ఎంతవరకూ ఉపయోగపడతాయని యోచించకుండా వ్యక్తిగతంగా దాడి చేయడమనేది ఆడలేక మద్దెల ఓడు అన్న ముతక సామెతను తలపిస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News