మోడీ సక్సెస్ రేట్ పెరిగిందా? తగ్గిందా?

Update: 2018-01-01 02:30 GMT

కొత్త సంవత్సరం ప్రవేశించింది. పాత స్మృతులు రివైండ్ అవుతున్నాయి. వ్యక్తులకు కొన్ని లక్ష్యాలు, వాటిని సాధించిన సంతృప్తి కనిపిస్తుంది. విధానపరమైన సక్సెస్ ప్రభుత్వాల పనితీరుకు, ప్రగతికి అద్దం పడుతుంది. యువజనాభాతో ఈ శతాబ్దం నాదే అని చాటుకుంటున్న భారత్ కు సంబంధించి ముచ్చటగా మూడు అంశాలు ఈ ఏడాది ప్రస్థానానికి నిర్వచనం చెబుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద పన్నుల సంస్కరణగా చెప్పుకోదగిన జీఎస్టీ అమలు, రక్షణ, విదేశాంగ విధానాల పరంగా చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో జట్టు కట్టడం, ఎన్డీఏ రాజకీయాధికారాన్ని సుస్థిరం చేసుకోవడం ఈ ఏడాది గమనించదగిన అంశాలు. 2014లో మొదలైన బీజేపీ విజయపరంపర ఈ ఏడాది కూడా కొనసాగింది. పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ తోపాటు మెజార్టీ ఎన్నికల విజయాలను భారతీయ జనతా పార్టీ తన కిట్టీలో వేసేసుకుంది. దక్షిణభారత్ ను మినహాయించి దేశంలోని మెజార్టీ రాష్ట్రాల పొలిటికల్ మ్యాప్ కమలదళంతో కాషాయరంగు పులుముకుంది. రాజకీయాధికారం గుత్తాధిపత్య నియంత్రణలోకి వెళుతున్న సూచనలకు ఈ సంవత్సరం సాక్షీభూతంగా నిలిచింది.

పటిష్ఠ కేంద్రం..పాక్ కు బల్లెం....

దృఢమైన కేంద్ర ప్రభుత్వం దేశంలో రాజ్యమేలుతుంటే సమాఖ్య స్ఫూర్తికి కొంతమేరకు నష్టం వాటిల్లే మాట వాస్తవం. కేంద్రంలో రాష్ట్రప్రభుత్వాల మాట పెద్దగా చెల్లుబాటు కాదు. కానీ అదే సమయంలో సంస్కరణల విషయంలో ముందంజ వేయడానికి, దీర్ఘకాలిక లక్ష్యంతో నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది. ప్రాంతీయ విద్వేషాలు, చిల్లర డిమాండ్లతో చిన్నాచితక పార్టీలు బ్లాక్ మెయిల్ చేసే అవకాశాలు తగ్గుతాయి. విదేశీ వ్యవహారాలు,రక్షణ విషయంలో దృఢంగా వ్యవహరించేందుకు, తద్వారా ప్రపంచంలో దేశం పలుకుబడి పెరిగేందుకు వీలుంటుంది. ఈ విషయంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ట్రాక్ రికార్డు యూపీఏ కంటే మెరుగైంది. డోక్లాం విషయంలో చైనా మెడలు వంచడంలోనూ, పాకిస్థాన్ను నియంత్రిస్తూ సర్జికల్ స్ట్రైక్స్ తో దాడులు చేయడంలోనూ దృఢమైన వైఖరి కనిపించింది. ఆర్థిక రంగంలో మందగమనం కొనసాగుతున్నా గత సంవత్సరం చివరలో తీసుకున్న నోట్ల రద్దు ప్రభావం నుంచి కొద్దిగా దేశం కుదుటపడింది. అయితే ప్రభుత్వమే నోట్ల రద్దు వల్ల ఎటువంటి ప్రయోజనం చేకూరిందో చెప్పలేమంటూ చేతులెత్తేయడం సర్కారీ దుందుడుకు వైఖరిని, వైఫల్యాన్ని బయటపెట్టింది. నెహ్రూ, ఇందిర కాలంలో కేంద్ర పెత్తనం రాష్ట్రాలపై కొనసాగుతూ ఉండేది. నెహ్రూ కొంత ప్రజాస్వామికంగా వ్యవహరించేవారని ప్రతీతి. ఇందిర మాత్రం ఉక్కు పిడికిలితో పాలించేవారు. రాష్ట్రాలను స్వతంత్ర ప్రభుత్వాలుగా భావించకుండా సామంతరాజ్యాలుగా చూసేవారు. మళ్లీ ఆ రకమైన ధోరణి మోడీ కనబరుస్తున్నారని రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. తమిళనాడు ప్రభుత్వాన్ని గుప్పెట పట్టడం, వ్యతిరేక శక్తులపై కేంద్రప్రభుత్వ దర్యాప్తు, నిఘా సంస్థలు విరుచుకుపడటం వంటి ఘట్టాలు ఈ ఏడాది ప్రత్యేకంగా నిలిచాయి. మొత్తమ్మీద దేశంలో కేంద్ర పెత్తనం స్థిరపడింది. రాష్ట్రాలు రాజకీయంగా బలహీనపడుతూ బీజేపీ సారథ్యంలోని కేంద్రం ముందు సాగిలపడాల్సిన పరిస్థితి ఈ సంవత్సరం కొనసాగింది.

పాన్ ఇండియా భాజపా...

భారతీయ జనతాపార్టీ దేశ వ్యాప్త విస్తృతి కలిగిన పాన్ ఇండియా పార్టీగా ఈ ఏడాదే రూపుదాల్చింది. దేశంలోని అతిపెద్ద రాష్ట్రంతో పాటు ఈశాన్యంలోని చిన్నాచితక రాష్ట్రాల్లోనూ తన ఆధిక్యాన్ని నిరూపించుకుంది. అసలు ఆనవాళ్లే లేని చోట్ల కాలూని బలమైన పక్షంగా నిలదొక్కుకోగలిగింది. సంఘ్ శక్తుల ప్రచారంతోపాటు మోడీ, అమిత్ షాల రూపంలోని నాయకత్వ పటిమ ఇందుకు దోహదం చేసింది. స్వాతంత్ర్యోద్యమానికి ప్రతీకగా నిలిచిన కాంగ్రెసు కొన్ని దశాబ్దాల పోరాటం తో తెచ్చుకోగలిగిన వ్యాప్తిని అతి తక్కువ కాలంలోనే బీజేపీ చేజిక్కించుకోగలిగింది. అజెండా ఏదైనప్పటికీ ఇప్పుడు దేశంలోని ప్రతిప్రాంతంలోనూ బీజేపీ తన అస్తిత్వాన్ని సగర్వంగా చాటుకోగలుగుతోంది. పశ్చిమబంగలో బలమైన ప్రతిపక్షంగా ఎదిగేందుకు ఉవ్విళ్లూరుతోంది. కేరళ వంటి రాష్ట్రాల్లోనూ నిత్యం సంఘర్షిస్తూ అధికార వామపక్షానికి తాను ప్రత్యామ్నాయమన్న రీతిలో దూకుడు ప్రదర్శిస్తోంది. ఒడిసాలో బిజూ జనతాదళ్ ను సవాలు చేసి అధికారంలోకి రావాలని ఎత్తుగడలు వేస్తోంది. మహారాష్ట్రంలో శివసేన , ఇతర పక్షాల కంటే పెద్ద పార్టీగా గతంలోనే నిరూపించుకోగలిగింది. ఆ విజయాలను ఈ ఏడాది కన్సాలిడేట్ చేసుకుంది. ఏతావాతా సిద్ధాంతం ఏదైనా బీజేపీ నిజమైన జాతీయపార్టీగా దేశంలోని మూలమూలలా విస్తరించింది. తన ఉనికిని చాటుకొంటూ ఎక్కడైనా సరే అధికారపక్షాలను సవాలు చేయగల స్థాయి తనకుందని నిరూపించుకోవడం ఈ ఏడాది బీజేపీకి పొలిటికల్ మైల్ స్టోన్.

పడి లేచిన కాంగ్రెసు...

జవసత్తువలు ఉడిగిపోయిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఘనత ఇక గత చరితే అనుకుంటున్న దశలో కాంగ్రెసు పార్టీ తిరిగి చిగురిస్తుందన్న నమ్మకాన్నిచ్చింది ఈ ఏడాది. ప్రధాని మోడీ గుజరాత్ కోటలో బాజపాను గంగవెర్రులెత్తించింది. అమిత్ షా అంచనాలను తలకిందులు చేసి కమలనాథులను ఓటమి అంచుల వరకూ తీసుకెళ్లి గజగజ వణికించింది. సై అంటూ సవాలు విసిరింది. మాటకు మాట బదులిచ్చింది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టేముందు తనకు తానే విసురుకున్న సవాల్ ను రాహుల్ సమర్థంగా ఎదుర్కొన్నారు. ప్రధానమంత్రే తడబడాల్సి వచ్చింది. పాకిస్థాన్ మొదలు మాజీ ప్రధాని మన్మోహన్ పై ఆరోపణల వరకూ మోడీ తన స్థాయిని తగ్గించుకుని ప్రాంతీయ నాయకునిగా మారాల్సి వచ్చింది. కాంగ్రెసు ఇక్కడ ఓడి గెలిచింది. బీజేపీ గెలిచి ఓడింది. 2019 నాటికి కాంగ్రెసు కనుచూపు మేరలో కనిపించదన్న వాతావరణం నుంచి బీజేపీకి గట్టి పోటీ తప్పదన్న సంకేతాలకు ఈ సంవత్సరం నాందిగా నిలిచింది. మోడీని దీటుగా ఎదుర్కొనే సామర్థ్యం రాహుల్ కు ఉందని రాజకీయ పరిశీలకులు సైతం అంచనా వేసే స్థాయికి కాంగ్రెసు చేరుకుంది. కాంగ్రెసులో జనరేషనల్ షిప్ట్ ఈ ఏడాది సాకారమైంది. నిర్ణయాధికారంతో కూడిన పార్టీ అధినేతగా రాహుల్ పట్టాభిషిక్తుడయ్యాడు. మొత్తమ్మీద రెండు బలమైన జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెసుల రూపంలో దేశానికి దిశానిర్దేశం చేయనున్నట్లు స్పష్టంగా తేలిన సంవత్సరమిది. నిన్నామొన్నటివరకూ జాతీయ పార్టీలుగా క్లెయిం చేసుకున్న మిగిలిన పక్షాలు క్రమేపీ ప్రాంతీయ స్థాయిలో కుదించుకుపోక తప్పని స్థితికి వెళ్లిపోయాయి. రెండు పెద్ద జాతీయ పార్టీలు, అస్తిత్వ ముద్రతో స్థానిక ఆకాంక్షలకు అద్దం పట్టే ప్రాంతీయ పక్షాల సమ్మేళనంగా భవిష్యత్తు రాజకీయాలు సాగనున్నట్లు నూతన పథ నిర్దేశానికి 2017 స్వాగత ద్వారాలు తెరిచింది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News