మోడీ, రాహుల్ కు ఈ తలనొప్పులేంటి?

Update: 2017-11-21 17:30 GMT

వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవడం కన్నా పార్టీలో ప్రస్తుతం నెలకొన్న అంతర్గత సమస్యలను అధిగమించడం గుజరాత్ బీజేపీ, కాంగ్రెస్ లకు కత్తిమీద సాములా మారింది. టిక్కెట్ల కేటాయింపు ఇరు పార్టీలకు సరికొత్త తలనొప్పులు సృష్టిస్తున్నాయి. ఎన్నికల్లో విజయాన్ని కాసేపు పక్కన పెడితే ముందు ఈ అసమ్మతి స్వరాలను సర్దిచెప్పడం ఉభయ పార్టీలకూ సంకటంగా మారింది. అంతర్గత ప్రజాస్వామ్యం ఒకింత ఎక్కువగా గల కాంగ్రెస్ తో పాటు, క్రమశిక్షణకు మారుపేరుగా, సిద్ధాంత నిబద్ధత గల బీజేపీ కూడా అసంతృప్త నేతలకు సర్దిచెప్పలేక సతమతమవుతోంది. మొదటి దశకే ఇలా ఉంటే మలి దశలో అభ్యర్థులను ఎలా ఎంపిక చేయాలో తెలియక పార్టీలు తల పట్టుకుని కూర్చున్నాయి. టిక్కెట్ల కేటాయింపు తీరుకు నిరసనగా స్వయంగా పీసీసీ అధ్యక్షుడు భరత్ సింగ్ సోలంకీ తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. టిక్కెట్ల కేటాయింపు తీరును ఎండగడుతూ గాంధీనగర్ లోని పార్టీ రాష్ట్ర శాఖ కార్యాలయమైన ‘కమలం’ఎదుట కమల శ్రేణులు ఆందోళనకు దిగడం అసమ్మతి తీవ్రతను తెలియజేస్తుంది.

పోటీ నుంచి తప్పుకున్న...

అంతర్గత విభేదాల కారణంగా స్వయంగా పీసీసీ అధ్యక్షుడు భరత్ సింగ్ సోలంకి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. పార్టీ నాయకత్వంపై అసంతృప్తే ఇందుకు కారణం. అలాంటిది ఏమీ లేదని సోలంకి చెబుతున్నప్పటికీ ఆయనను దగ్గరగా చూసిన వారు ఆ విషయాన్ని విశ్వసించడం లేదు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన పేరును ప్రకటించనందున ఆయన అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. ఈ విషయమై ఆయనను ప్రశ్నించగా అది అధిష్టానం ఇష్టమని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన ఎన్నికల కమిటీ సమావేశం నుంచి అర్థాంతరంగా వచ్చారుర. అక్కడి నుంచి నేరుగా స్వస్థలమైన బోర్సద్ కు వెళ్లారు. ముఖ్యమైన పని ఉన్నందునే సమావేశం నుంచి వచ్చానని, మూడున్నర నెలలుగా ఇంటికి దూరంగా ఉన్నందున నేరుగా స్వస్థలానికి వెళ్లానని సోలంకి చెబుతున్నప్పటికీ అసలు కారణం ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడమే కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అతి కష్టం మీద తొలి జాబితా....

తొలిదశలో 89 స్థానాలకు వచ్చే నెల 9వ తేదీన జరగనున్న ఎన్నికలకు సంబంధించి అతి కష్టం మీద అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. తమకు 20 స్థానాలను ఇవ్వాలని హార్థక్ పటేల్ సారథ్యంలోని పటీదార్ అనామత్ ఆందోళన సమితి కోరగా కాంగ్రెస్ పార్టీ అందులో సగానికి మించి ఇచ్చే పరిస్థిత కనబడటం లేదు. ఇక అల్ఫేశ్ ఠాకూర్ ఆధ్వర్యంలోని ఓబీసీ గ్రూప్ 12 స్థానాలను డిమాండ్ చేస్తుండగా ఏడెనిమిదికి మించి ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. మిత్రపక్షాల మెలికలు, సోలంకీ అసంతృప్తి కారణంగా పార్టీ జాబితా విడుదలలో అపరిమిత జాప్యం జరిగింది. పటేల్ సెక్సీ వీడియోల రచ్చపార్టీ పుట్టి ముంచుతుందన్న ఆందోళన కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొని ఉంది. హార్థిక్ పటేల్ పార్టీకి బలమా? బరువా? అన్న చర్చ కూడా అంతర్గతంగా నడుస్తోంది.

బీజేపీదీ సేమ్ సీన్...

అధికార బీజేపీ పరిస్థితి కూడా అనుకున్నంత గొప్పగా ఏమీలేదు. తొలిదశ అభ్యర్థుల జాబితాపై పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. గాంధీనగర్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద కార్యకర్తలు ఆందోళన చేసే వరకూ పరిస్థితి వెళ్లింది. క్రమశిక్షణకు మారుపేరైన పార్టీని ఈ పరిణామం నివ్వెర పరిచింది. మొత్తం 182 స్థానాలకు గాను 106 మంది పేర్లను ప్రకటించింది. కొందరు సిట్టింగ్ లకు మళ్లీ టిక్కెట్లు ఇవ్వడంపై పార్టీ కార్యకర్తలు కారాలు మిరియాలు నూరుతున్నారు. అభ్యర్థులను మార్చకపోతే ఓటమి ఖాయమని హెచ్చరిస్తున్నారు. తన కుమారుడికి టిక్కెట్ ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని పఠాన్ లోక్ సభ సభ్యుడు లీలా ధర్ వాఘేలా హెచ్చరించారు. నందోడ్ (ఎస్టీ), నికీల్, నరోద, భేరలు, అంక్లావ తదితర నియోజకవర్గాల నుంచి పెద్దయెత్తున వచ్చిన కార్యకర్తలు కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. నందోడ్ సిట్టింగ్ ఎమ్మెల్యే శబ్దశరణ్ తాడ్వికి మళ్లీ టిక్కెట్ ఇవ్వడంపై నర్మదా జిల్లా పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అతని అభ్యర్థిత్వాన్ని మార్చకపోతే పార్టీ ఓటమి ఖాయమని జిల్లా పార్టీ కార్యదర్శి కరణ్ సింగ్ పర్మర్ హెచ్చరించారు. పార్టీ ప్రకటించిన జాబితాలో పటేల్ సామాజిక వర్గం నుంచి 18 మంది, ఓబీసీ లనుంచి 16 మంది, ఎస్సీ ల నుంచి ముగ్గురు, ఎస్టీ ల నుంచి 11 మంది ఉన్నారు. ఈ జాబితాలో 49 మంది సిట్టింగ్ లకు మళ్లీ సీట్లివ్వగా, ముగ్గురిని తప్పించారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ నుంచి చేరిన ఐదుగురు సిట్టింగ్ లకు మళ్లీ సీట్లిచ్చారు. ముఖ్యమంత్రి విజయరూపానీ పశ్చిమ రాజ్ కోట్ నుంచి, ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ మెహ్సానా నుంచి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జీతూ వఘానీ భావ్ నగర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. మొత్తం 25 మంది మంత్రుల్లో 15 మందికి తొలి జాబితాలో చోటు దక్కింది.

కులాల కురుక్షేత్రమేనా.....?

మరోవైపు కులసమీకరణాలపై పార్టీలు దృష్టి పెట్టాయి. సుమారు 15 శాతం ఉన్న పటేల్ వర్గం, 10 శాతం గల బ్రాహ్మణ, వైశ్య వర్గం, దాదాపు 54 శాతం గల ఓబీసీ ఓట్ల పై పార్టీలు పావులు కదుపుతున్నాయి. సౌరాష్ట్రలో మెజారిటీ వర్గమైన పటేల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. బీజేపీ ఓబీసీలు, ఆదివాసీలు, క్షత్రియులపై దృష్టి సారించింది. క్షత్రియులు బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశముంది. వెనుకబడిన వర్గాల్లో ఒకటైన ‘కోలీ’లు దాదాపు 20 శాతం మంది. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఈ వర్గం వారే. వీరితో పాటు బ్రాహ్మణ, వైశ్య వర్గాలు కమలానికే కొమ్ము కాసే అవకాశం కనపడుతోంది. గుజరాత్ రణరంగం కులాల కురుక్షేత్రాన్ని తలపిస్తోంది. మరి గెలుపెవరిదో...!

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News