మోడీ ముందున్న సవాల్ ఇదే....!

Update: 2018-02-17 16:30 GMT

ఎన్నికల ఏడాది బీజేపీ ప్రభుత్వంపై కొత్త బాధ్యత ఉరిమి చూస్తోంది. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామన్న హామీ ఎలాగూ నెరవేరే సూచనలు కనిపించడం లేదు. కనీసం రైతులు వివిధ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను రద్దు చేసేందుకు కేంద్రప్రభుత్వం చొరవ తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. దేశంలోని 19 రాష్ట్రాల్లో అధికారం చెలాయిస్తున్నామని ఘనంగా ప్రకటించుకుంటున్న బీజేపీకి అంతే స్థాయిలో ఒత్తిడి కూడా మొదలైంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలంటే తప్పనిసరిగా అన్నదాతలను సంతృప్తిపరచాల్సిందేనని డిమాండ్లు మొదలయ్యాయి. యూపీఏ ఒన్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసిన కారణంగానే తిరిగి 2009 లో అధికారంలోకి రాగలిగింది. ఎన్డీఏ కూడా రుణమాఫీని నమ్ముకోవాలని కమలనాథులకు క్షేత్రస్థాయి నుంచి ఒత్తిడి మొదలైంది. ఈ సిద్ధాంతాన్ని పూర్తిగా వ్యతిరేకించే మోడీ ఇప్పుడు ఏం చేస్తారనేదే ఆసక్తి. సంస్కరణలంటూ ఊరేగితే ఫలితాలెలా ఉంటాయో సొంతరాష్ట్రం గుజరాత్ చుక్కలు చూపించింది. చావు తప్పికన్నులొట్టబోయింది. మోడీ మీద ప్రేమ, జాలి, కరుణ కొద్దీ గుజరాత్ ప్రజలు వాత పెట్టి వదిలేశారు. ఇతర రాష్ట్రాల పరిస్థితి భిన్నం. అందుకే ఎన్నికల స్ట్రాటజీలో రుణమాఫీ పేరిట కాకపోయినా వేరే రూపంలో రైతులకు వరాలు కురిపిస్తారా? నేరుగా అకౌంట్లలో నిధులు జమచేస్తారా? అనే చర్చ మొదలైంది.

అందరిదీ అదే బాట...

వ్యవసాయ సంక్షోభాన్ని, ఓట్ల రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కో రాష్ట్రం సంక్షేమం బాట పడుతోంది. రైతు రుణమాఫీ అస్త్రాన్ని ఎన్నికల్లో గెలుపునకు రాజమార్గంగా ఎంచుకుంటున్నాయి. నిన్నామొన్నటివరకూ బిగించుకు కూర్చున్న రాష్ట్రాలు సైతం దిగి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణతోపాటు కాంగ్రెసు పాలనలోని కర్ణాటక, పంజాబ్, బీజేపీ పాలనలోని ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఇప్పటికే రైతు రుణమాఫీని కొన్ని షరతులతో అమలు చేయడం ప్రారంభించాయి. ఏడో రాష్ట్రంగా రాజస్థాన్ తాజాగా ఈ జాబితాలో చేరింది. అటు ఈశాన్య రాష్ట్రాల నుంచి ఇటు తమిళనాడు వరకూ రుణమాఫీ డిమాండు హోరెత్తుతోంది. ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే ఈ పద్దుకింద 36 వేల కోట్ల రూపాయలు కేటాయించాల్సి వస్తుందని అంచనా వేశారు. తొలి విడతగా 7 వేల కోట్లరూపాయలను రాష్ట్రప్రభుత్వం విడుదల చేసింది. లబ్ధిదారుల సంఖ్య 86 లక్షల వరకూ ఉంటుంది. లక్ష రూపాయల వరకూ చిన్నసన్నకారు రైతుల రుణాలు ఇక్కడ రద్దు చేస్తున్నారు. రాజస్థాన్ ప్రభుత్వం 50 వేల రూపాయల పరిమితి పెట్టుకుంది. నాలుగేళ్ల క్రితమే రుణమాఫీ అమల్లోకి తెచ్చిన తెలంగాణలో పరిమితి లక్షరూపాయలు , ఆంధ్రప్రదేశ్ లో పరిమితి లక్షన్నర రూపాయలు ఈరెండు రాష్ట్రాలపై పడిన అదనపు భారం 41 వేల కోట్ల రూపాయలు. పంజాబ్, మహారాష్ట్ర,కర్ణాటక, రాజస్థాన్ లలో ఈ రైతు రుణమాఫీ పద్దు 85 వేల కోట్ల రూపాయల వరకూ ఉండొచ్చని అంచనా. ఎన్నికల లోపు మరికొన్ని రాష్ట్రాలు ఈ మార్గాన్నే అనుసరించవచ్చని తెలుస్తోంది. మాఫీ అంశం రాజకీయ అజెండాగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

తెలంగాణ మోడల్ ...

2014లో ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు రైతు రుణమాఫీని పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పొరుగు రాష్ట్రాలకు ఇది గుబులు పుట్టిస్తోంది. ఏటా ఎకరానికి ఎనిమిది వేల రూపాయల పెట్టుబడి సాయం చేయాలనేది పథకం లక్ష్యం. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది నుంచే దీనిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు ఎకరాల భూమి ఉండే సన్నకారు రైతుకు ఏడాదికి 16 వేల రూపాయలు. అంటే అయిదేళ్ల కాలవ్యవధిని పరిగణనలోకి తీసుకుంటే 80 వేల రూపాయలకు పైగానే రైతుకు ప్రభుత్వ సాయం అందుతుంది. ఇది రుణమాఫీని మించి వర్కవుట్ అవుతుందని టీఆర్ఎస్ భావిస్తోంది. రాజకీయంగా ఓట్ల వర్షం కురిపించే ఈ స్కీమ్ పై ఇప్పటికే సర్వత్రా ఆసక్తి నెలకొంది. తమ రాష్ట్రాల్లో కూడా ఈ డిమాండు తలెత్తుతుందేమోనని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు భయం పట్టుకుంది. కేంద్రప్రభుత్వం కూడా ఈ పథకం చాలామంచిదని ఇప్పటికే ప్రశంసించింది. ఇటువంటి పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తే బాగుంటుందనే సూచనలు కూడా వినవస్తున్నాయి.

మోడీకి తలపోటు...

ఈ ఏడాది బడ్జెట్ లో రైతుకు వరం ప్రకటిస్తున్నామని ఉత్పత్తివ్యయంపై 150 శాతం కనీస మద్దతు ధర ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. నిజానికి ఇది మోసపూరితమైన ప్రకటన అంటూ రైతు సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. కేవలం కూలీలకు, ఎరువులకు, క్రిమిసంహారక మందులకు వెచ్చించే మొత్తంపై కనీస మద్దతు ధర నిర్ణయించాలని ప్రభుత్వం చూస్తోంది. కూలీల రేట్ల విషయంలో సైతం వివిధ రాష్ట్రాల మధ్య అంతరం కొనసాగుతోంది. మొక్కుబడిగా తమకు తోచిన విధంగా ఆయా రేట్లను పెట్టి మద్దతు ధర ప్రకటించే ప్రయత్నాలు చేస్తోందని రైతు నాయకులు ఆరోపిస్తున్నారు. రైతు భూమి కౌలు విలువ, పెట్టుబడిగా తీసుకునే రుణంపై వడ్డీ, రైతు కుటుంబ సభ్యుల శ్రమ విలువ, ఇతర ఖర్చుల మొత్తాన్ని కలిపి లెక్కిస్తేనే న్యాయం జరుగుతుందంటున్నారు. కేవలం ఉత్పత్తి ఖర్చును మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే రైతు నష్టపోతాడు. ఈ ప్రాతిపదికపైనే మద్దతు ధర అనడంతో మోడీ ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. మరోవైపు సొంత పార్టీ నుంచే రుణమాపీ డిమాండ్ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా రైతులకు లక్ష రూపాయల లోపు రుణ మాఫీ అమలు చేస్తే మూడు లక్షల కోట్ల రూపాయల వరకూ అవసరమవుతాయని అంచనా. అంటే జీడీపీలో ద్రవ్యలోటు రెండు శాతం అదనంగా పెరుగుతుంది. దీనిని తట్టుకోవడం సాధ్యం కాదు. అందుకే బీజేపీ పాలిత రాష్ట్రప్రభుత్వాలతో తమంతతాము రుణమాఫీ చేయించేందుకే బీజేపీ అగ్రనాయకత్వం మొగ్గు చూపుతోంది. కానీ ఆయా రాష్ట్రప్రభుత్వాలు కూడా ఏదో ఒక రూపంలో ఈ నిధులను భర్తీ చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నాయి. మొత్తమ్మీద ఎన్నికల ఏడాది మోడీకి మరిన్ని తలనొప్పులు తప్పకపోవచ్చు. జనాభాలో అత్యధికశాతం ప్రజలు ఆధారపడి ఉన్న వ్యవసాయ రంగంలోని వారి జీవనప్రమాణాలు మెరుగుపడకపోతే రాజకీయ సమస్యలూ ముదరవచ్చు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News