మోడీ మనసులో ఆలోచనే భయం పుట్టిస్తుందే..!

Update: 2017-11-08 16:30 GMT

‘పార్టీ విత్ డిఫరెన్స్‘ రాజకీయాల్లో మేం శుద్ధ పూసలం. మకిలం అంటని మాణిక్యాలం. అవినీతి ముద్ర ఎరుగని అకళంకిత నేతలం.‘ అంటూ ఇక ముందు బీజేపీ నాయకులెవరూ క్లెయిం చేసుకోలేని పరిస్థితి వచ్చేస్తోంది. అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు,వారసత్వ రాజకీయాలు, ఆశ్రితపక్షపాతాలతో సకల విధ భ్రష్టమైన కాంగ్రెసుకు దీటుగా, తామేం తీసిపోమన్నట్లుగా పార్టీని పయనింపచేసేందుకు పావులు కదుపుతున్నారు. ఏదో ఒక రాష్ట్రంలోనో, ఎమ్మెల్యే, ఎంపీ ,మంత్రుల స్థాయిలోనో ఈ తంతు సాగడం లేదు. అగ్రనాయకత్వమైన మోడీ, అమిత్ షా ద్వయమే రాజకీయ క్రీడలో భాగంగా అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు పాచికలు విసురుతున్నారు. పవర్ గేమ్ లో పొలిటికల్ కరప్షన్ అంతర్భాగం. నేరుగా అవినీతికే పాల్పడనవసరం లేదు. అందుకు అవసరమైన సహకారం అందించినా , ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం(క్రోనీ కాపిటలిజం)కి పాల్పడినా , అక్రమార్కులతో చేతులు కలిపి అధికారాన్ని కాపాడుకున్నా క్విడ్ ప్రో కో గా చూడాల్సి ఉంటుంది. రాజకీయ అవినీతికి ముసుగు వేసిన పేర్లు ఇవి. 2014 లో అప్రతిహత విజయం చవి చూసిన నరేంద్రమోడీ దేశ రాజకీయాల దశ,దిశ మార్చేయాలని చూస్తున్నారు. ఇందులో తప్పేం లేదు. కానీ ప్రతిపక్షమన్నది లేకుండా దేశం మొత్తాన్ని రాజకీయ ఏకచ్ఛత్రాధిపత్యంలోకి తేవాలన్న భావనే భయం పుట్టిస్తోంది. కేవలం ప్రతిపక్షాలకే కాదు. ప్రజాస్వామ్య హితైషులకు సైతం మోడీ, షా ల ఆలోచనలు కలవరం కలిగిస్తున్నాయి. 2019లో కూడా అధికారం దక్కించుకోవడానికి కాంబినేషన్లను వెదుకుతున్నారు. ఇందుకోసం ఎవరితోనైనా చేతులు కలిపేందుకు బీజేపీ అగ్రనాయకత్వం సిద్ధమవుతోంది.

మేమేం తక్కువ తినలేదు....

అయారాం గయారాం లను ప్రోత్సహించడం, ప్రతిపక్ష ప్రభుత్వాలను తొత్తులుగా మార్చేయడం, అదీ వీలుకాని పక్షంలో ఏదోసాకుతో రాష్ట్రపతి పాలన విధించడం వంటి పనుల్లో ఘన చరిత్ర సొంతం చేసుకుంది కాంగ్రెస్. అధికార సాధనలోనే కాదు, అవలక్షణాలను పుణికిపుచ్చుకోవడంలోనూ ప్రస్తుతం ఆ స్థానాన్ని భర్తీ చేస్తోంది బీజేపీ. ప్రత్యర్థులను చికాకు పెట్టేదుకు, చీల్చేందుకు ఇంతవరకూ తాము తీవ్రంగా విమర్శించిన పార్టీలకూ, నేతలకూ పెద్దపీట వేస్తోంది. నిన్నామొన్నటివరకూ పశ్చిమబంగలో అవినీతి కుంభకోణాలకు కింగ్ పిన్ గా తామే దుమ్మెత్తి పోసిన ముకుల్ రాయ్ ను తాజాగా బీజేపీలో కలిపేసుకున్నారు. మమతా బెనర్జీ ని ఏదో రకంగా ఎదుర్కోవాలన్న తాపత్రయమే తప్ప ముకుల్ కు పార్టీ తీర్థం ఇవ్వడంలో ఏ రకమైన సిద్ధాంత నిబద్దత కనిపించదు. క్యాష్ ఆన్ కెమెరా, చిట్ ఫండ్ స్కాం వంటి పెద్ద కేసుల్లో ముకుల్ పాత్రపై సాక్షాత్తు కేంద్రసంస్థలే దర్యాప్తు సాగిస్తున్నాయి.

2జీ స్కాం కేసులో....

2014 లో బీజేపీ అధికారంలోకి రావడంలో 2జీ స్కాం చాలా కీలకం. కొన్ని లక్షల కోట్లరూపాయల ప్రజాధనాన్ని యూపీఏ కొల్లగొట్టిందని బీజేపీ పార్లమెంటు వెలుపల,లోపల పెద్ద ఉద్యమమే చేసింది. దాదాపు యుద్దంలా పోరాడింది. బీజేపీ అధికారంలోకి రావడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం. కానీ ఈ కుంభకోణానికి ప్రధాన సూత్రధారి అయిన డీఏంకే తో తాజాగా జట్టు కట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దక్షిణాదిన కాంగ్రెసుకు మిగిలిన ప్రదాన మిత్రపక్షాన్ని దూరం చేస్తూ తమిళనాడులో పాగా వేయడమనే రాజకీయ లక్ష్యంతోనే డీఎంకే అవినీతికి కళ్లజోడు పెట్టేస్తున్నారు కమలనాథులు. మధ్యప్రదేశ్ లో వ్యాపం కుంభకోణం, రాజస్థాన్ ముఖ్యమంత్రి బంధుప్రీతి, కర్ణాటక నేత యడియూరప్ప అక్రమ భూకేటాయింపులు, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ కుమార్తెకు సంబంధించి అనుచిత లబ్ధి ..ఇలా అన్నిరకాలుగానూ బీజేపీ రాజీ పడిపోతోంది. కాంగ్రెసును వారసత్వ పార్టీ అంటూ దెప్పిపొడిచే బీజేపీలో వారసత్వ శకమూ ప్రవేశిస్తోంది. హోం మంత్రి కుమారుని రాజకీయ ప్రవేశాన్ని ఇందుకు ఒక జాతీయ స్థాయి ఉదాహరణగా చెప్పుకోవాలి. క్రోనీ కాపిటలిజానికి నిదర్శనగా అమిత్ షా కొడుకు జే షా వ్యాపారాన్ని పేర్కొనాలి. ఏతావాతా బీజేపీ అన్నిరకాలుగానూ కాంగ్రెసుతో పోటీ పడుతోందనే చెప్పుకోవాలి.

భవిష్యత్ సమీకరణలు....

దేశవ్యాప్తంగా ఎక్కడా తమ పట్టు చేజారిపోకుండా వ్యూహాత్మకమైన పొత్తులకు బీజేపీ నాయకత్వం పథక రచన చేస్తోంది. దక్షిణ భారతదేశంలో డీఎంకే కి మొదటి పాచిక విసిరింది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోతే వై.సి.పితో పొత్తు పెట్టుకునే దిశలో రంగం సిద్ధం చేయాలని కొందరు నాయకులకు సూచన చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జగన్ కు సంబంధించిన కేసుల విషయంలో కేంద్ర దర్యాప్తు బృందాల పరిశోధన వేగం తగ్గిందంటున్నారు. జగన్ ఆర్థికపరమైన కేసులు ఇతర దేశాలతో ముడిపడి ఉన్నందున ప్రత్యేక బృందాలను నియమించి విదేశాలకు పంపాల్సి ఉంటుంది. కానీ దేశీయ దర్యాప్తునే సాగదీస్తున్నారు. ఇందువల్ల వై.సి.పి. అధినేతకు రాజకీయంగా ఎన్నికల వరకూ ఎటువంటి ఢోకా ఉండని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ వ్యూహం భిన్నంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతు ఇస్తున్నప్పటికీ మైనారిటీ ఓట్ల దృష్ట్యా బీజేపీతో ఎన్నికల పొత్తు పెట్టుకోవడానికి కేసీఆర్ సిద్ధంగా లేరు. అందువల్ల తెలంగాణలో సాధ్యమైనంతవరకూ సొంతంగా బలపడటం, ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ తో మైత్రిని ఏర్పాటు చేసుకోవడమనే యోచనలో ఉన్నారు బీజేపీ అగ్రనాయకులు. అందుకే పార్టీ పరంగా విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రమంత్రులు తమ పర్యటనల్లో మాత్రం కేసీఆర్ పథకాలపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. టీఆర్ఎస్ తో పొత్తు, లేదా మద్దతు అవకాశాలను సజీవంగా ఉంచుకుంటున్నారు.

యూపీలో మాయోపాయం....

కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్ ను నామమాత్రం చేయడం లేదా తమకు అనుకూలమైన పక్షంగా మార్చుకోవడం వంటి వ్యూహాలను అమలు చేసేందుకు యత్నిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో బహుజనసమాజ్ పార్టీ అధినేత్రి మాయావతిని తమలో భాగం చేసుకునేందుకు సమాజ్ వాదీ, కాంగ్రెసుల కూటమి ప్రయత్నిస్తోంది. ఇదే జరిగితే బలమైన ప్రత్యర్థిగా ఈ కూటమి ఆవిర్భవిస్తుంది. దీనికి గండి కొట్టేందుకు మాయావతిపై ఉన్న కేసుల్లో దర్యాప్తు వేగాన్ని పెంచడం ద్వారా కట్టడి చేయవచ్చనే భావన కమలనాథుల్లో ఉంది. తప్పని సరైతే ఎన్నికల సమయానికి మాయావతితో పొత్తు పెట్టుకోవడం లేదా బీఎస్పీ స్వతంత్రంగా పోటీ చేసేలా ప్రోత్సహించాలని బీజేపీ స్ట్రాటజిస్టుల ఆలోచన. ఇలా ఇప్పట్నుంచే ఎన్నికల రాజకీయాలకు బీజేపీ నాయకులు తెర తీస్తున్నారు. దారులు తెరిచే ఉన్నాయి. స్వచ్ఛందంగా ప్రవేశించండి. లేదంటే బలవంతంగా నైనా లోపలికి లాక్కోవడం ఖాయం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News