మోడీ బుల్లెట్ గుజరాత్ కోసమేనా?

Update: 2017-11-03 16:30 GMT

జపాన్ ప్రధాని షింజో అబే సెప్టంబరు రెండో వారంలో అహ్మదాబాద్ లో బుల్లెట్ రైలు పథకానికి శంకుస్థాపన చేసినప్పుడు జరిగిన హడావిడి, ఆర్భాటం అంతా ఇంతా కాదు. అహ్మదాబాద్-ముంబయి బుల్లెట్ రైలు పథకం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ తన స్వరాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశంలోనే ఇది తొలి బుల్లెట్ రైలు. లక్ష కోట్లకు పైగా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు వల్ల సురక్షిత, చౌ ప్రయాణం రెండు ప్రధాన వాణిజ్య నగరాల మధ్య అనుసంధానత మరింత పెరిగి అభివృద్ధి చెందుతుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. మొత్తం వ్యయంలో 88 వేల కోట్లను జపాన్ 0.1శాతం చౌక వడ్డీకి అందజేస్తుంది. మిగిలిన మొత్తాన్ని భారత్ భరిస్తుంది. రెండు నగరాల మధ్య 12 చోట్ల ఆగే ఈ రైలు ప్రాజెక్టును 2022 ఆగస్టు 15నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం. భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ బృహత్తర ప్రాజెక్టు కార్యరూపం దాల్చాలన్నది మోడీ ఆకాంక్ష. ప్రాజెక్టు కోసం 825 హెక్టార్లను సేకరించనున్నారు. పది బోగీలు గల ఈ రైలులో 750 మంది ప్రయాణించగలుగుతారు. క్రమంగా 16 బోగీలకు పెంచుతారు. ఫలితంగా 1250 మంది ప్రయాణించే అవకాశం ఉంది. ఇందులో ఎగ్జిక్యూటివ్, ఎకానమి క్లాస్ లుంటాయి. రెండో తరగతి ఏసీ టిక్కెట్ ధర ఉంటుంది.

ఖాళీగా నడుస్తున్న రైళ్లు....

ఇంతవరకూ బాగానే ఉంది. కాని అలసు బుల్లెట్ రైలు పథకం విశ్వసనీయతను దెబ్బతీసే వాస్తవాలు వెల్లడయ్యాయి. అహ్మదాబాద్ -ముంబయి మధ్య ప్రస్తుతం నడుస్తున్న రైళ్లు 40 శాతం ఖాళీగా నడుస్తున్నాయి. ప్రయాణీకుల ఆక్యుపెన్సీ శాతం చాలా తక్కువగా ఉంది. గత మూడు నెలల్లో రైల్వే ఈ మార్గంలో 29.9 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. జులై 1 నుంచి సెప్టెంబరు 30 వరకూ వచ్చిన ఆదాయం ఇది అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ మార్గంలో ఒక్క శతాబ్ది ఛైర్ కార్ మాత్రమే లాభదాయకంగా నడుస్తుంది. ఇవి అనధికార అంచనాలు కావు. విశ్వసనీయ సమాచారం కానే కాదు. రైల్వే శాఖ కమర్షియల్ మేనేజర్ వెల్లడించిన చేదు నిజం ఇది. సమాచార హక్కు చట్టం కింద అనిల్ గల్గలీ అనే కార్యకర్త అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇచ్చిన సమాచారం ఇది. ఈ వాస్తవం తెలిశాక అసలు బుల్లెట్ రైలు అవసరం ఉందా? అన్న ప్రశ్న ఉత్పన్నమవ్వక మానదు. సాధారణ రైలు ఛార్జీలే భరించలేని ప్రయాణికులు బుల్లెట్ రైలుకు వసూలు చేసే రెండో తరగతి ఏసీ ఛార్జీలను ఎంతవరకూ మోయగలరన్నదీ అనుమానమే. ముంబయి-అహ్మదాబాద్ మధ్య ఆక్యుపెన్సీ 40 శాతం తక్కువగా ఉండగా అహ్మదాబాద్-ముంబయిల మధ్య 44 శాతం తక్కువగా ఉంది. పశ్చిమ రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్ మనగెర్ మంజీర్ సింగ్ వెల్లడించిన ఈ సమాచారంతో ప్రజలు అవాక్కయ్యారు. రెండు నగరాల మధ్య 32 రైళ్లు నడుస్తున్నాయి.

ఎంత నష్టం... ఎంత కష్టం....?

ముంబయి-అహ్మదాబాద్ ల మధ్య ప్రయాణించే రైళ్లలో ఈ మూడు నెలల్లో 7,35,630 సీట్లుండగా, 4,41,795 మంది మాత్రమే ప్రయాణించారు. మొత్తం రూ.44,29కోట్లు ఆదాయం రావాల్సి ఉండగా, రూ.30.16 కోట్లు మాత్రమే లభించింది. అంటే దాదాపు 14 కోట్ల రూపాయల నష్టాన్ని రైల్వేశాఖ భరించాల్సి వచ్చింది. అదేవిధంగా అహ్మదాబాద్-ముంబయిల మధ్య ప్రయాణించే రైళ్లలో గత మూడు నెలల్లో 7,06,446 సీట్లకు గానుకేవలం 3,98,002 మంది మాత్రమే ప్రయాణించారు. మొత్తం రూ. 42 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని అంచనా వేయగా కేవలం 26 కోట్లు మాత్రమే వచ్చింది. ఇది రైల్వే వర్గాలను నివ్వెరపర్చింది. రైల్వేకు దాదాపు పదిహేనున కోట్ల నష్టం వాటిల్లింది. ఈ మార్గంలో శతాబ్ది ఎక్స్ ప్రెస్ ఆక్యుపెన్సీ రేట్ కూడా గొప్పగా ఏమీ లేదు. జులై-సెప్టంబరు మధ్య కాలంలో ముంబయి-అహ్మదాబాద్ రూట్ లో 72,696 సీట్లకు 36,117 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అహ్మదాబాద్-ముంబయి మార్గంలో ఇదే మూడు నెలలకు 67,392 సీట్లకు కేవలంల 22,982 సీట్లు మాత్రమే భర్తీ అవ్వడం చూసి రైల్వే వర్గాలు కంగుతిన్నాయి. ఈ గణాంకాలు చూశాక ఈ మార్గంలో కొత్త రైళ్ల ఆవశ్యకత ఉందా. అనుమానం కలగక మానదు. మరీ ముఖ్యంగా లక్షల కోట్ల రూపాయల బుల్లెట్ రైలు పథకాన్ని పట్టాలకు ఎక్కించాల్సిన అవసరం లేదని ఘంటాపథంగా చెప్పొచ్చు.

బోగీలు పెంచమంటే....?

కేవలం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకునే ఓటర్లను ఆకట్టుకునేందుకు మోడీ ఈ పథకాన్ని తెరపైకి తీసుకొచ్చారన్న విమర్శలను తోసిపుచ్చలేం. ఆక్యుపెన్సీ రేటు తగ్గిందన్న వార్తలను రైల్వే మంత్రి ఖండించడం హాస్యాస్పదంగా ఉంది. ప్రభుత్వ గణాంకాలను ప్రభుత్వమే తోసిపుచ్చడాన్ని ఏమనుకోవాలి? లక్షల కోట్ల పథకాలను రాజకీయ ప్రయోజనాల కోసం చేపట్టడం బదులు ఆ మొత్తాన్ని ప్రయాణికుల భద్రత, సామర్థ్యం పెంపు, అవసరం ఉన్న రూట్లలో కొత్త రైళ్లను నడపటం వంటి కార్యక్రమాలు చేపడితే ప్రభుత్వ ప్రతిష్ట పెరుగుతుంది. ఇప్పటికే ఎన్నోరైళ్లు బోగీల కొరతను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా దక్షిణాదిన ప్రయాణించే రైళ్లలో కాలు పెట్టడానికి కూడా చోటు ఉండటం లేదు. బోగీలు కిక్కిరిసిపోతున్నాయి. కేవలం నాలుగైదు సాధారణ బోగీలను మాత్రమే వేయడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రైల్వే బడ్జెట్ నే ఎత్తివేసి దాని ఉనికిని రూపు మాపిన ప్రభుత్వం నుంచి ఇలాంటి సౌకర్యాలను ఆశించడం అత్యాశే అవుతుంది. ఈ వాస్తవాన్ని అధికార పార్టీ నాయకులే అంతరింగిక సంభాషణల్లో ఒప్పుకుంటున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News