మోడీ....కి అన్నీ బెడిసి కొడుతున్నాయా?

Update: 2017-10-22 15:30 GMT

ఏ చిన్న విషయాన్నైనా బోర విరుచుకుని సగర్వంగా ప్రకటించే ప్రధాని నరేంద్రమోడీ తన పంథా మార్చారు. విజయానికి మాత్రమే తాను తండ్రి ,అపజయానికి అందరూ బాధ్యులే అన్నట్లుగా మాట మార్చారు. ఒకవైపు ప్రభుత్వపరమైన ప్రధాన నిర్ణయాలు బెడిసికొడుతున్నాయి. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి రెండు సంవత్సరాలు అనుభవించిన హనీ మూన్ పీరియడ్ ముగిసిపోయింది. తన ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న ఆశలూ ఆవిరైపోయాయి. ఏడాది క్రితం అమల్లోకి తెచ్చిన నోట్ల రద్దు దేశంలోని ప్రతి పౌరునిపైనా ప్రభావం చూపింది. అసంఘటిత రంగం కుదేలై పోయింది. వ్యవసాయ కార్మికులు, కూలీలు, చిన్నాచితక పనులతో కాలం వెళ్లదీసే వారు ఉపాధి లేక రెండు నెలలపాటు అల్లాడిపోయారు. జాతీయోత్పత్తి పడిపోయింది. ఇక ఈ సంవత్సరం అమల్లోకి తెచ్చిన వస్తుసేవల పన్ను పారిశ్రామిక, వ్యాపార రంగాలను దెబ్బతీసింది. ఈ రెండు సందర్భాల్లో ప్రధాని దేశ ప్రజలకు సెంటిమెంటు టచ్ ఇచ్చారు. ఎమోషన్ ను అటాచ్ చేశారు. నోట్ల రద్దుతో నల్లకుబేరుల పని అయిపోయిందంటూ బీరాలు పలికారు. ఇక రేపటి నుంచి నోట్లను గంగానదిలో కలిపేసుకోండి అంటూ దెప్పిపొడిచారు. దీంతో ప్రజలంతా కూడా కష్టనష్టాలెదురైనా ప్రభుత్వానికి సహకరించారు. బ్యాంకు క్యూ లైన్లలో నిలుచుని ప్రాణాలు పోగొట్టుకున్నారే తప్ప ఎక్కడా తిరగబడలేదు. సహనం, సంయమనానికి దేశ ప్రజలు పెట్టింది పేరని నిరూపించుకున్నారు. విశ్వసిస్తే స్వార్థ ప్రయోజనాలను పక్కన పెట్టడానికీ సంసిద్ధమని రుజువు చేశారు.

ప్రింటింగ్ ఖర్చు తప్ప.....?

కానీ నిజానికేమి జరిగింది?. నల్లధనం అంటూ ప్రభుత్వం గొప్పగా ప్రకటించిన సొమ్మంతా బ్యాంకులకు వచ్చి చేరింది. కొత్త నోట్ల ప్రింటింగు ఖర్చులు కూడా ఖజానా నుంచి చెల్లించాల్సి వచ్చింది. అప్పటికీ వచ్చిందంతా వైట్ మనీ కాదని బొంకడం, బ్యాంకుల్లో ద్రవ్యలభ్యత పెరిగిందని మాట దాటవేయడం, డిజిటల్ ఎకానమీ వైపు మళ్లుతున్నామంటూ గప్పాలు కొట్టడం.. ఇలా కాలం వెళ్లబుచ్చారు ఘనమైన కేంద్రమంత్రులు, ప్రధాని సహా. జులై నెలలో దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి తెచ్చినప్పుడూ ఇదే తంతు . ఒకే దేశం .ఒకే పన్ను . దేశానికి ఇదో ఆర్థిక స్వాతంత్ర్యం అంటూ ప్రధాని తన శైలిలో ప్రకటించేశారు. ఎన్ని పార్టీలను రాజకీయంగా ఒత్తిడి చేసి ఈ జీఎస్టీకి ఒప్పించారన్న విషయాన్ని పక్కనపెడితే ప్రతి నిర్ణయంలోనూ ప్రధాని ప్రచారార్భాటం కనిపించింది. పాలకునిగా ఒక నిర్ణయం చేసి విజయం సాధిస్తే ఫలితాన్ని తాను క్లెయిం చేసుకోవడంలో ఎటువంటి తప్పూ లేదు. కానీ మొదటి అడుగులోనే ఏదో బ్రహ్మాండం బద్దలైపోతోందన్నట్లు ఊహల ఉయ్యాలలో ఊరేగిస్తున్నారు. పలితం తిరగబడితే ఒక్కసారిగా ప్రజలు నిరాశకు లోనవుతున్నారు. అదే సమయంలో మోడీ ప్రతిష్ట కూడా మసక బారుతోంది.

తిలా పాపం తలా పిడికెడు

మోడీ ఇప్పుడొక కొత్త శైలిని అలవరుచుకుంటున్నారు. ఎన్నికల లాభం కోసం వ్యవస్థాపరంగా జరిగిన లోపాలు, పొరపాట్లు , ప్రభుత్వ తప్పిదాలకు ప్రతిపక్షాలనూ బాధ్యులను చేసే వ్యూహం అమలు చేస్తున్నారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెసు ప్రభుత్వం చేయలేని పనిని తాము సాధించామని జీఎస్టీ విషయంలో ఘనంగా ప్రకటించుకున్నారు. నిన్నామొన్నటి వరకూ దిగువస్థాయి నేతల నుంచి కేంద్రమంత్రుల వరకూ ఇదే అంశాన్ని ఊదరగొట్టారు. క్షేత్ర స్థాయిలో సీన్ రివర్స్ కొడుతోందని, తమ ఘనతర జీఎస్టీ పై ప్రజలు గుర్రుగా ఉన్నారని కమలనాథులు తాజాగా గ్రహించారు. ప్రత్యేకించి వ్యాపార వర్గాలకు నిలయమైన గుజరాత్ లో మోడీ కొంప మునిగేలా ఉంది. ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో జీఎస్టీ ప్రకంపనలు కనిపించే ప్రమాదం గోచరిస్తోంది. ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఈ రాష్ట్రం నుంచే ప్రాతినిధ్యం వహించడంతో ఈ ఎన్నికల ఫలితం దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుంది. 1995 నుంచి రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ఈ దఫా ఓడిపోతే ప్రధాని గా మోడీకి తీవ్రమైన అవమానం. 2019 లోక్ సభ ఎన్నికకు గట్టి సవాల్ ఎదురవుతుంది. అందుకే బీజేపీ నాయకత్వం గుజరాత్ ఎన్నికను ఒక సవాల్ గా భావిస్తోంది.

గుర్రుగా వాణిజ్య వర్గాలు.....

నిన్నామొన్నటివరకూ మోడీకి గుజరాత్ ప్రజలిచ్చిన మద్దతు అంతా ఇంతా కాదు. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ సీఎంగా ఆయనకే పట్టం కడుతూ వచ్చారు. మౌలిక వసతులు, నాణ్యమైన విద్యుత్తు వంటి అవసరాల విషయంలో అధిక వ్యయం భరించేందుకు సైతం ఆ రాష్ట్రప్రజలు సిద్ధంగా ఉంటారు. అదే మోడీకి కలిసొచ్చింది. అభివృద్ధి అజెండాతో రాష్ట్రంలో బీజేపీ రాజకీయాధికారాన్ని స్థిరపరచగలిగారు. కానీ జీఎస్టీ అమలు విషయంలో నెలకొన్న గందరగోళం వ్యాపారులకు చుక్కలు చూపిస్తోంది. వ్యాపార రంగం తీవ్రంగా దెబ్బతింది. మన మనిషని అందలమెక్కిస్తే మంచి గుణపాఠమే నేర్పాడంటూ మోడీ గురించి మెటికలు విరుస్తున్నాయి గుజరాతీ వ్యాపార వర్గాలు. వస్తు,సేవల పన్నువంటి దీర్ఘకాల ప్రభావం చూపగల సంస్కరణ విషయంలో అన్నివిధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దుందుడుకుగా ముందుకెళ్లడం వల్ల ప్రభుత్వాలకు నష్టం వాటిల్లింది. వ్యాపారాలు కుదేలైపోయాయి. అసలు పన్ను విధానమే ఇంతవరకూ ఎవ్వరికీ పూర్తిస్థాయిలో అర్థం కాలేదు. అందుకే ఇప్పుడు జీఎస్టీ అనేది బీజేపీ పథకం కాదు. కాంగ్రెసు కూడ సమ భాగస్వామి అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ప్రత్యేకించి గుజరాత్ పర్యటనల్లో పార్టీ శ్రేణులకు ఇదే విషయాన్ని నూరి పోస్తున్నారు. ‘మా తప్పేమీ లేదు. కాంగ్రెసు ఎప్పట్నుంచో ఈప్రయత్నాలు చేస్తోంది. పార్లమెంటులోనూ మద్దతు పలికింది. మేము ఇంప్లిమెంటు చేశామంతే. ‘ అన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మోడీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఓట్ల రాజకీయంలో తిలాపాపం తలా పిడికెడు అంటే ఇదే.

నాటకీయత...నవ్వులపాలు...

విషయాన్ని విశ్లేషించి ప్రజలభాషలో ఆకట్టుకునే విధంగా చెప్పడంలో మోడీ దిట్ట.మంచి వక్త. ఏ సందర్భాన్నైనా కాలమాన,ప్రాంత, పరిస్థితులతో ముడిపెట్టి ప్రజలకు చేరువ చేయడంలో అసమానమైన ప్రతిభ కనబరుస్తారాయన. కానీ ఒక చిక్కొచ్చిపడింది. థియెట్రిక్స్, మెలోడ్రామా అత్యంత కీలకమైన సన్నివేశాలు, సందర్బాలకు అతికినట్లు సరిపోతుంది. ప్రజలను కట్టి పడేస్తుంది. ప్రతి సందర్భంలోనూ అంతటి తీవ్రస్థాయి భావోద్వేగం, నాటకీయత కనబరిస్తే ఎక్సట్రా చేస్తున్నారు బాబోయ్ అంటూ మొహం మొత్తుతుంది. ప్రధాని నరేంద్రమోడీ విషయంలో ఇప్పుడు జరుగుతున్నదదే. అంతంతమాత్రం పరిణతి ఉన్నా రాహుల్ చెప్పే మాటలు, చేసే ఉపన్యాసాలే గుజరాతీలను ఆకట్టుకుంటున్నాయట. మోడీ మాట్లాడిన ప్రతి మాటకు , విన్యాసానికి సామాజిక మాధ్యమాల్లో చెణుకులు పేలుతున్నాయి. ఒకవైపు పటేళ్ల ఉద్యమం, దళిత వర్గాల అసంతృప్తి, వ్యాపార వర్గాల ఆగ్రహం ఈ సారి మోడీ ఎదురీదుతున్నారు. అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న చర్చ ఎక్కడా తలెత్తడం లేదు. మోడీ గట్టెక్కిస్తారా? లేదా ? అన్నదే ప్రశ్న. గుజరాతీ ఆత్మాభిమానం వంటి సంప్రదాయ నినాదాలు కూడా పేలడం లేదని ప్రచారమాధ్యమాలు కోడై కూస్తున్నాయి. అయితే పోల్ మేనేజ్ మెంట్ అనేక అంశాలు, ప్రాతిపదికలపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో మాత్రం కాంగ్రెసు కంటే బీజేపీ దే పైచేయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News