మోడీ అపాయింట్ మెంట్ కి అదీ కారణం ...!

Update: 2018-01-15 14:30 GMT

ఏడాదికాలంగా ఏపీ సీఎం చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా లభించని మోడీ అపాయింట్ మెంట్ తాజాగా లభించడం ఇరువురు భేటీ కావడం పై ఇంకా హాట్ హాట్ గానే ఆంధ్రప్రదేశ్ లో చర్చ నడుస్తుంది. వీరిద్దరి కలయికపై విభిన్న కధనాలు వినిపిస్తున్నాయి. ఈ వైనంపై మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ కుమార్ తెలుగు పోస్ట్ కి ప్రతినిధి అడిగినప్పుడు తన అభిప్రాయాలు వెల్లడించారు.

ట్రిపుల్ తలాక్ తో ...

ట్రిపుల్ తలాక్ అంశం పై పార్లమెంట్ లో వాడిగా వేడిగా చర్చలు నడిచాయి. ముఖ్యంగా రాజ్యసభలో విపక్షాలు ట్రిపుల్ తలాక్ బిల్లులో సవరణల కోసం పట్టుబట్టాయి. బిల్లును సెలెక్ట్ కమిటీ కి పంపాలని రాజ్యసభను స్తంభింప చేశాయి. కీలకమైన ఆ సమయంలో బిజెపి మిత్రపక్షం గా వున్న తెలుగుదేశం కాంగ్రెస్ తో జత కట్టింది. ఈ పరిణామాలు మోడీ కి ఇబ్బందిగా పరిణమించాయి. బిల్లును పార్లమెంట్ సెలెక్ట్ కమిటీకే పంపాలన్న టిడిపి ఆ వైఖరికి ఎందుకు టర్న్ అయ్యిందో తెలుసుకోవడానికే మోడీ బాబును ఢిల్లీ పిలిపించి ఉంటారని చెప్పారు ఉండవల్లి.

తమిళనాడు ఫార్ములా...

ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు లు ఒకరిని మించి మరొకరు మహానటులని వారిద్దరి ముఖా ముఖీ చర్చలో రాజకీయ అంశాలు తప్ప రాష్ట్ర సమస్యలు చర్చకు రావు. రాబోయే ఎన్నికల్లో ఏపీలో రెండు పార్టీలు అనుసరించాలిసిన వ్యూహాలు చర్చించి వుంటారన్నారు. అలాగే పార్లమెంట్ స్థానాలు 25 తమ పార్టీ పోటీ చేస్తుందని 175 అసెంబ్లీ స్థానాల్లో టిడిపి పోటీ చేయాలని తమిళనాడు తరహా ఫార్ములా మోడీ తెచ్చి వుంటారు. ఉత్తరాదిలో వచ్చే ఎన్నికల్లో మోడీకి సీట్లు తగ్గే అవకాశాలు వున్నాయి. దాంతో ఇప్పటినుంచి కొత్త వ్యూహంతో మోడీ ముందుకు వెళుతున్నారు. అక్కడ తగ్గే సీట్లు దక్షిణాదితో భర్తీ చేసుకోవాలన్నది ప్రధాని ముందస్తు ఆలోచన. దానికి అనుగుణంగా ఆయన టిడిపి దూరం కాకుండా ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నారు. రాష్ట్ర సమస్యలపైనే ఇద్దరి భేటీ లో అధికారులు కూడా వెంట వుండే వారు. ఇద్దరు ముఖా ముఖీ కూర్చుంటున్నారు అంటే రాజకీయాలే చర్చించుకునే అవకాశాలు ఎక్కువ. చివరిలో సమస్యలపై చంద్రబాబు ప్రస్తావించినా చూద్దాం లే అని మోడీ చెప్పి ఉండటం తప్ప వీరి భేటీలో అంతకన్నా జరిగేది ఏమి ఉండదు అన్నారు ఉండవల్లి.

భేటీ తరువాత బాబు డల్ అయ్యారు ...

ప్రధాని మోడీని కలిసివచ్చాక చంద్రబాబు మీడియా సమావేశం పెట్టారు. ఆ సమావేశంలో ఆయన లో ఎక్కడా జోష్ లేదు. ఇప్పుడు వున్న చంద్రబాబు పాత చంద్రబాబు కాదు. ఆయన మోడీకి ఎక్కడ భయపడుతున్నారో ఇప్పటికి అర్ధం కావడం లేదు. వాస్తవానికి మోడీకి భయపడేంత కారణం కానీ ఆయన చేసే వ్యాపారాల్లో దొరికేసే అంశాలు నాకైతే కనపడలేదు. విభజన తరువాత రెవెన్యూ లోటు ఇప్పటికి కేంద్రం భర్తీ చేయలేదు చట్టంలో పెట్టిన పోలవరం పరిస్థితి దయనీయంగానే వుంది. రాజధాని నిర్మాణం పూర్తి కాకుండా ఎలాంటి సౌకర్యాలు లేకుండా అమరావతి వచ్చి ఉద్యోగులను ఇబ్బంది పాలు చేశారు. ఇప్పుడు పండగ రోజులు చూస్తే హైదరాబాద్ ఎడారిగా మారిపోయింది. అక్కడి వారు అక్కడే వున్నారు. ఈయన మాత్రం జెండా పీకేశారు. పదేళ్ళపాటు హైదరాబాద్ రాజధానిగా ఏపీ ఉండి ఉంటే విభజన సమస్యలు చక్కగా పరిష్కారం అయ్యేవి. కానీ చంద్రబాబు తొందరపడ్డారు. రాష్ట్ర విభజన జరిగాకా కేంద్రంలో మోడీ సర్కార్ వచ్చి తీరుతుందని దేశవ్యాప్తంగా అందరికి తెలిసింది. ఆ నేపథ్యంలో బిజెపితో జత కట్టిన చంద్రబాబు గెలవాలని కోరుకున్నా. అనుభవజ్ఞుడు క్లిష్ట దశలో ఏపీ ని గాడిన పెట్టగలిగేది జగన్ కన్నా ఆయనే అని భావించా. ఈ రోజు పరిస్థితి అలా లేదు. చంద్రబాబు ఏ సమస్యను పరిష్కరించలేక పోయారు. దానికి కారణాలు ఎంత వెతికినా కనిపించడం లేదు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో చంద్రబాబును పోల్చడం సరికాదు. కేసీఆర్ అధికారంలోకి వచ్చేటప్పటికి ఆయనకు వడ్డించిన విస్తరి లా ఖజానా నిండుగా వుంది. కానీ ఏపీ 16 వేలకోట్ల రూపాయల రెవెన్యూ లోటు లో వుంది. ఈ లోటు భర్తీ చేయాలని విభజన చట్టంలో వున్నా ఎందుకనో కేంద్రం నుంచి అది నాలుగేళ్లు అవుతున్నా బాబు సాధించలేక విఫలం అయ్యారు. కేంద్రం అవి మంజూరు చేయకపోవడానికి రాష్ట్రం తప్పుడు లెక్కలు ఇవ్వడమే కారణమని అనిపిస్తుంది. అమరావతిలో అనేక నిర్మాణాలు చేపట్టకుండానే కేంద్రం నుంచి 1500 కోట్ల రూపాయలు ఇప్పటివరకు రాష్ట్రం తీసుకుంది. ఇక్కడ చూస్తే ఏమి లేవు. ఇలా వున్నప్పుడు కేంద్రం అన్ని పరిశీలించే మొండి చెయ్యి చూపిస్తుంది. ఎక్కడో ఏదో వీక్ నెస్ మీద మోడీ సర్కార్ బాబు ను బంధించింది. దాన్ని నుంచి బయటపడి ప్రజలకు నిజాలు చెప్పడం చంద్రబాబు మొదలు పెట్టాలి. రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టు పెడితే ఎలా అని అన్నారు ఉండవల్లి.

దేశంలో న్యాయ వ్యవస్థ ఏనాడో దిగజారింది ...

ఇక తాజాగా ప్రకంపనలు సృష్టిస్తున్న సుప్రీం కోర్టు వ్యవహారంపై ఉండవల్లి ఇలా విశ్లేషించారు. దేశంలో ఏనాడో న్యాయ వ్యవస్థ దిగజారింది. న్యాయమూర్తులు ఇప్పుడు బయటకు వచ్చి చెప్పిన అంశాలు వాస్తవమే. డబ్బున్న వారే దేశంలో న్యాయాన్ని కొనుక్కునే పరిస్థితి అనేక కేసుల్లో కనిపిస్తుంది. రాజకీయం న్యాయ వ్యవస్థను గుప్పిట బిగించిందన్నది తమిళనాడు వ్యవహారంలో స్పష్టంగా కనిపిస్తుంది. తీర్పు రాకుండానే తీర్పు ఎవరి పక్షాన అందరికి తెలిసిపోతుందంటే మన వ్యవస్థ తీరు చెప్పనవసరం లేదు. కొలీజియం స్థానంలో ఐఏఎస్ ఐపీఎస్ లకు వున్నట్లే స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు కావాలి. గతంలో ఇందిరాగాంధీ తనకు వ్యతిరేకంగా తీర్పు చెప్పిన జడ్జి పై తీసుకున్న చర్యలతో భంగపడ్డారు. అలాంటి రాజ్యాంగ వ్యతిరేక చర్యలే ఆమెను తరువాత అధికారానికి దూరం చేశాయి. ఇప్పడు మోడీ ప్రభుత్వం అంత కన్నా ఎక్కువే న్యాయవ్యస్థలో జోక్యం చేసుకుంటుంది. చంద్రబాబు ఓటుకు నోటు కేసుపై నేరుగా ఒకాయన అభిశంసించినా ఫర్వాలేదు బెండకాయలు అమ్ముకుని అయినా బతికేస్తా అని వ్యాఖ్యానించారు. కోర్టు కి వెళ్ళి అక్కడ వ్యవహారాలు చూస్తే న్యాయవ్యవస్థ ను మార్చుకోవాలని ఎవరైనా కోరుకుంటారు. ఆంగ్లేయులు వదిలి వెళ్ళినదే ఇప్పటికి మనం పాటించాలా ? అంతా తెలుగు మాట్లాడుతూ ఇంగ్లిష్ వ్యవహారికం ఏమిటి ? అన్నారు ఉండవల్లి.

 

ఉండవల్లి వ్యూస్ పార్ట్-2 మరికాసేపట్లో....

Similar News