మేఘాలయ మకుటం ఎవరిది?

Update: 2018-01-22 17:30 GMT

వచ్చే నెలలో జరగనున్న మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మేఘాలయ అత్యంత ముఖ్యమైనది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, ప్రాంతీయ పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీ మధ్య త్రిముఖ పోటీ జరగనుంది. అధికారాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్, అధికారాన్ని సాధించేందుకు బీజేపీ, నేషనల్ పీపుల్స్ పార్టీ లక్ష్యంగా పనిచేస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇక్కడ రంగంలోకి దిగనుంది. 2011 లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 29,66,889 మంది. 1972 జనవరిలో ఆవిర్భవించిన రాష్ట్ర విస్తీర్ణం 22429 చదరపు కిలోమీటర్లు. 11 జిల్లాల రాష్ట్రంలో గిరిజనుల ప్రాబల్యం ఎక్కువ. మొత్తం 17.68 లక్షల ఓటర్లలో మహిళా ఓటర్లు 8.93 లక్షలు. 74.89 శాతం మంది క్రిస్టియన్లు, 11.53 శాతం మంది హిందువులున్నారు. సిక్కులు, ముస్లింలు, బౌద్ధులు ఉన్నప్పటికీ వారి జానాభా శాతం చాలా తక్కువ.

అధికారాన్ని కాపాడుకునేందుకు....

అరవై స్థానాలు గల అసెంబ్లీలో 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ 29 స్థానాలు సాధించింది. ఏడు స్థానాలు గల మిత్రపక్షం మద్దతుతో అయిదేళ్లుగా అధికారంలో కొనసాగుతోంది. ఈ నెల మొదటి వారంలో అయిదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి విపక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీ లో చేరడం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ. ఇందుకు ప్రతిగా ఎన్సీపీకి చెందిన ఒక ఎమ్మెల్యేను, నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని ప్రభుత్వాన్ని కాపాడుకుంది. ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా పార్టీకి పెద్ద దిక్కు. 2010 నుంచి ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. సంగ్మాపై వ్యతిరేకతను పార్టీ అధిష్టానం పట్టించుకోనందునే ఇటీవల ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 2 లోక్ సభ స్థానాల్లో ఒకటి కాంగ్రెస్, రెండోది నేషనల్ పీపుల్స్ పార్టీ గెలుచుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నడిసంద్రంలో నావలా ఉంది. అంతర్గత తిరుగుబాట్లు, ప్రభుత్వ వ్యతిరేకత ప్రతిబంధకాలుగా మారాయి. ఇక నిరుద్యోగం, తీవ్రవాదం, మౌలిక వసతుల కొరత, పెరుగుతున్న మాదక ద్రవ్యాల వినియోగం తదితర అంశాలు గెలుపుపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. అందువల్లే పార్టీ జాతీయ నాయకత్వం రాష్ట్రంపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో ఓటమితో నిరాశతో ఉన్న కాంగ్రెస్ మేఘాలయలో అధికారాన్ని కాపాడుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఒకప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో అధికారాన్ని చెలాయించిన కాంగ్రెస్ ఇప్పుడు ఒక్క మేఘాలయలోనే అధికారంలో ఉండటం గమనార్హం. నాగాలాండ్, త్రిపురల్లో కూడా ఎన్నికలు జరుగతున్నప్పటికీ మేఘాలయపైనే పార్టీ ఎక్కువగా దృష్టిపెట్టింది. పార్టీ అధినేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. దీంతో ఆయనే అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.

పొత్తు నిరాకరించడంతో....

ప్రధాన ప్రతిపక్షం నేషనల్ పీపుల్స్ పార్టీ పరిస్థితి అంతగొప్పగా ఏమీ లేదు. మాజీ లోక్ సభ స్పీకర్ పీఎ సంగ్మా కుమారుడు కాన్ రడ్ సంగ్మా పార్టీ సారధిగా ఉన్నారు. వాస్తవానికి నేషనల్ పీపుల్స్ పార్టీ కేంద్రంలోని ఎన్డీఏ భాగస్వామి. కాని రాష్ట్రంలో బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు ఇష్టపడటం లేదు. బీజేపీతో జట్టు కడితే క్రిస్టియన్ ఓట్లు దూరమవుతాయన్నది దాని భయం. గత ఎన్నికల్లో కేవలం 2 సీట్లు గెలిచిన పార్టీ ఈసారి ఏకంగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇది ఎంతవరకూ సాధ్యమన్నది ప్రశ్నార్థకమే. 2014 లో తుర లోక్ సభ స్థానం నుంచి పార్టీ అభ్యర్థి, లోక్ సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా ఎన్నికయ్యారు. ఆయన మృతితో 2016లో జరిగిన ఉప ఎన్నికల్లో పార్ీ భారీ మెజారిటీని సాధించింది. ఓటర్లలో వస్తున్న మార్పులకు ఇదే నిదర్శనమని పార్టీ వ్యాఖ్యానిస్తోంది. ఈ ఊపుతో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని పార్టీ అధినేత కాన్ రడ్ సంగ్మా ధీమాగా చెబుతున్నారు. మూడు రాష్ట్రాల్లో మేఘాలయపైనే ఎక్కువగా బీజేపీ ఆశలు పెట్టుకుంది. త్రిపురలో సీపీఎం, నాగా లాండ్ లో నాగా పీపుల్స్ ఫ్రంట్ ను ఓడించడం కన్నా మేఘాలయలో కాంగ్రెస్ ను ఓడించడమే తేలికన్నది కమలనాధుల భావన. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లే సాధించినప్పటికీ ఇప్పుడు తమ బలం పెరిగిందని బీజేపీ భావిస్తోంది. మొదట మిత్రపక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీతో పొత్తు పెట్టుకుందామని అనుకుంది. కాని అందుకు ఆ పార్టీ వ్యతిరేకంచడంతో ఒంటరిగానే పోటీచేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు షిబున్ లింగ్డో చెబుతున్నారు. క్రిస్టియన్ వర్గానికి చెందిన కేంద్ర మంత్రి కె.జె. అల్ఫోన్స్ ను రాష్ట్ర ఇన్ ఛార్జిగా నియమించారు. కేరళకు చెందిన మీజీ ఐఏఎస్ అధికారి అయిన అల్ఫోన్స్ ఇటీవల రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ను ఓడించడం ఎంతవరకూ సాధ్యమన్నది ప్రశ్నార్థకమే.....!

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News