మూడో ముచ్చట మెరిసేనా?

Update: 2018-03-05 15:30 GMT

మూడో ఫ్రంట్ అంటూ కేసీఆర్ తేనెతుట్టను కదిల్చారు. పెద్ద ప్రాంతీయ పార్టీలు, వామపక్షాలు చేతులెత్తేసిన పరిస్థితుల్లో లోక్ సభ బలంలో ముప్ఫైవ వంతు కూడా లేని ఒక చిన్న ప్రాంతీయ పక్షం టీఆర్ఎస్ ఈ పల్లవిని అందుకోవడం చర్చనీయమవుతోంది. దేశంలో పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయా? సహకరించేవారెవరు? కేసీఆర్ వంటి జూనియర్ సీఎం నాయకత్వాన్ని ప్రాంతీయ పార్టీల బడా నాయకులు అంగీకరిస్తారా?అన్నీ ప్రశ్నలే. కానీ తాను మాత్రం వెనకడుగు వేసేది లేదని జాతీయ అజెండాను రూపొందించి ముందుకు తీసుకువెళతానని కేసీఆర్ కుండబద్దలు కొట్టేశారు. అతనికున్న బలమదే. బలహీనతలతో సంబంధం లేకుండా మొండిఘటంగా అడుగు ముందుకు వేయడమే ఆయన ప్రత్యేకత. పధ్నాలుగేళ్లు పోరాటం జరిపి అలాగే తెలంగాణ సాధించారు. ఎత్తుగడలు, వ్యూహాలు, లాబీయింగులు, లాస్ట్ రిసార్టుగా ఆందోళనలు.. ఇలా సాగిన తెలంగాణ ఉద్యమమే ప్రేరణగా జాతీయ పాత్రకు సిద్ధమవుతున్నారు. జై తెలంగాణ స్థానంలో జై భారత్ చేరింది. కాంగ్రెసు ఏకచ్ఛత్రాధిపత్యంగా దున్నేస్తున్న స్థితిలో ఏడోదశకం చివర్లో సకలపక్షాల సమూహంగా జనతా ఆవిర్భవించింది. మూన్నాళ్ల ముచ్చటగా ముగిసింది. ఎనిమిదో దశకంలో మళ్లీ కాంగ్రెసుదే హవా అన్నట్లుగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఇంకా శైశవ దశలో ఉన్న పరిస్థితుల్లో నేషనల్ ఫ్రంట్ పురుడు పోసుకుంది. అదీ దీర్ఘకాలం మనుగడ సాగించలేకపోయింది. తాజాగా ఒకనాటి కాంగ్రెసు స్థానాన్ని బీజేపీ ఆక్రమించేస్తోంది. బలహీన విపక్షంగా హస్తం పార్టీ ఆపసోపాలు పడుతోంది. అందుకే ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయం ముచ్చట మళ్లీ తెరముందుకొచ్చింది. నిజానికి ఆర్థిక,పాలనపరమైన విషయాల్లో కాంగ్రెసు, బీజేపీలకు పెద్దగా తేడాలేదు. రాష్ట్రాల హక్కుల విషయంలోనూ రెంటిదీ ఒకటే ధోరణి. అధికారానికి వచ్చినా రాకపోయినా ఒక ఆల్టర్నేటివ్ అజెండాను దేశం ముందు పెట్టడంలో కచ్చితంగా ఈ ఫ్రంట్ ఉపయోగపడుతుందని ప్రజాస్వామ్య హితైషులు అభిలషిస్తున్నారు.

రాష్ట్రహక్కుల రాగాలాపన...

స్వాతంత్ర్యానంతరం కాంగ్రెసు పార్టీ ప్రాబల్యమైన శక్తిగా దేశవ్యాప్త ఆదరణ పొందడంతో ప్రాంతీయ ఆకాంక్షలు తొక్కిపెట్టేశారు. మెజార్టీ రాష్ట్రప్రభుత్వాలు కాంగ్రెసు పాలనలోనే ఉండటంతో సమాఖ్య వ్యవస్థలోని రాష్ట్రాల హక్కుల కోసం నినదించే వారు కరవయ్యారు. దీర్ఘకాలం అణచివేత తర్వాత ప్రాంతీయపార్టీలు పురుడు పోసుకున్నాయి. స్థానిక ఆకాంక్షలు, డిమాండ్లు పెరిగాయి. దాంతో కాంగ్రెసు పార్టీ బలహీనపడటం మొదలైంది. జనతా, నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ వంటి ప్రయోగాలతో కేంద్రంలో కూడా విపక్షాలు అధికారంలోకి రాగలిగాయి. ఇప్పుడు మళ్లీ ఒకనాటి కాంగ్రెసు స్థానంలో బీజేపీ అతిబలమైన పార్టీ గా రూపుదాల్చింది. దేశంలోని 29 రాష్ట్రాలకుగాను 20 రాష్ట్రాల్లో పాగా వేయగలిగింది. దీంతో రాష్ట్రాల హక్కులను బీజేపీ తొక్కేస్తుందనే భయాలు మొదలయ్యాయి. ప్రాంతీయ పార్టీల నాయకుల్లో అభద్రతాభావం ప్రారంభమైంది. ఈ అదను చూసుకుని కేసీఆర్ కాంగ్రెసు, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా తృతీయ ఫ్రంట్ ఏర్పడాలనే పల్లవి అందుకున్నారు. విద్య, వ్యవసాయం,ఆరోగ్యం, రిజర్వేషన్ల వంటి అంశాలపై పూర్తి హక్కులు రాష్ట్రాలకే ఇవ్వాలనే డిమాండ్ తో కొత్త అజెండాను తెరపైకి తెస్తున్నారు. ప్రధానంగా వర్గాల వారీ మద్దతు కూడగట్టడానికి ఈ అజెండా దోహదపడుతుందనే చెప్పవచ్చు. రిజర్వేషన్ల అంశంపై వివిధ పార్టీలను ఏకతాటిపైకి తేవచ్చనే వ్యూహం కూడా కేసీఆర్ అజెండాలో ప్రధానంగా ఉందనేది పరిశీలకుల అంచనా. ఉత్తరాది పార్టీలను కూడా కలుపుకోవాలనే యోచనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందన్న సెంటిమెంటును కూడా కేసీఆర్ పక్కన పెట్టడాన్ని ఈ సందర్బంగా గమనించవచ్చు.

రైతు సెంటిమెంటు...

చౌదరి చరణ్ సింగ్ తర్వాత జాతీయంగా రైతు నాయకునిగా ముద్ర పడినవారు పెద్దగా లేరు. దేశంలో 60 శాతం వరకూ ప్రజలు ఇంకా వ్యవసాయరంగంపై ఆధారపడి ఉన్నారు. వీరిని లక్ష్యంగా చేసుకుంటూ ఉమ్మడి ముసాయిదా రూపొందించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనివల్ల సొంతంగా పొలిటికల్ స్పేస్ క్రియేట్ చేసుకున్నట్లవుతుంది. ముందుగా తాను తన రాష్ట్రంలో అమలు చేసిన రైతాంగ ప్రయోజన పథకాలను ఇతర ప్రాంతాల ప్రజలకు వివరించడం ద్వారా రాజకీయంగా ఆయా వర్గాల్లోకి చొచ్చుకుపోవచ్చనేది వ్యూహం. రైతులకు 24 గంటలూ ఉచిత విద్యుత్తు, ఎకరాకు ఏడాదికి ఎనిమిదివేల రూపాయల పెట్టుబడి సాయం పథకం వంటివి కచ్చితంగా ప్రయోజనదాయకంగా నిలుస్తాయని టీఆర్ఎస్ భావిస్తోంది. వీటిని దేశవ్యాప్తంగా ప్రచారంలో పెట్టి చిన్నాచితక పార్టీల మద్దతు కూడగట్టవచ్చు. వీటిని కేంద్రప్రభుత్వం అమలు చేసే అవకాశం ఎలాగూ లేదు కాబట్టి సులభంగానే వ్యతిరేకతను రెచ్చగొట్టే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. రైతు ప్రయోజనాల అంశం బలమైన పొలిటికల్ టూల్ గా మారుతుందని భావిస్తున్నారు.

ఎన్టీయార్ ఆవాహన...

దక్షిణాది నుంచి సొంత ఇమేజ్ తో జాతీయ స్థాయికి ఎదిగిన నాయకుడు ఎన్టీయార్. నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్ గా వ్యవహరించి కాంగ్రెసు కు వ్యతిరేకంగా అన్నిపార్టీలను ఒకే వేదికమీదకు తేగలిగారాయన. కేంద్రం మిథ్య అంటూ తూలనాడినప్పటికీ రాష్ట్రాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం తర్వాత కాలంలో అనేక మార్పులకు దోహదం చేసింది. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు కూడా జాతీయ నేతగా రూపు దాల్చినప్పటికీ కన్వీనియన్స్ పాలిటిక్స్ నడిపారే తప్ప కేంద్రంతో పోరాట ధోరణి కనబరచలేదు. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు అంతే సులభంగా 1998లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో ఇమిడిపోయారు. 2004 వరకూ బీజేపీ కి మిత్రపక్షంగా వ్యవహరించారు. మళ్లీ 2009లో బీజేపీని వ్యతిరేకించారు. 2014లో అదే పార్టీతో కలిసి పోటీ చేశారు. సుస్థిరమైన అభిప్రాయం కాకుండా అవకాశాన్ని బట్టి పోయే గాలివాటం రాజకీయాలను చంద్రబాబు అనుసరిస్తారని ప్రత్యర్థులు ఆరోపించడానికి ప్రధాన కారణం ఇదే. ఇప్పుడు ఎన్టీయార్ ధోరణినే కేసీఆర్ అనుసరిస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీకి తెలంగాణలో పెద్దగా బలం లేదు. దాంతో పోరాడినా వచ్చే నష్టం లేదు. కాంగ్రెసు ప్రధాన ప్రత్యర్థిగా ఉంది పోరాడక తప్పదు. రాష్ట్రానికి రాజ్యాంగ బద్ధంగా రావాల్సిన నిధులు ఎలాగూ వస్తాయి. ఇతర పథకాల కోసం కూడా పెద్దగా కేంద్రంపై ఆధారపడాల్సిన అవసరం తెలంగాణకు లేదు. రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టంగా ఉంది. ఆర్థిక బలిమి కారణంగానే గుజరాత్ సీఎంగా మోడీ కేంద్రానికి వ్యతిరేకంగా నిలబడగలిగారు. ఈ ఈక్వేషన్స్ కూడా సరిచూసుకున్న తర్వాతనే కేసీఆర్ నేషనల్ రోల్ కు రంగం సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News