‘మూడు’ మారింది..ఇక చూడు తడాఖా

Update: 2018-03-15 15:30 GMT

అసలే చీకటి..ఆపై దారంతా గోతులు.. అంటూ మొదలు పెట్టిన రాజకీయ ప్రస్థానం వెలుగుల వైపు పయనిస్తోంది. కాసింత క్లారిటీతో అప్పోజిషన్ రోల్ కు ఆయత్తమవుతోంది. నాలుగేళ్ల జనసేన నడకలో చంచలత్వం, చపలత్వం, చాదస్తం మాత్రమే ఇంతవరకూ కనిపిస్తూ వచ్చింది. ఆ ఒరవడికి స్వస్తి చెపుతూ పవన్ నిర్దిష్ట అజెండాతో ముందుకు కదులుతున్నట్లుగా స్పష్టమవుతోంది. పార్టీ ఆవిర్భావ సమావేశంలో పాయింట్ టు పాయింట్ జనసేన అజెండా ఎలా ఉండబోతుందో స్పష్టం చేసే ప్రయత్నం చేశారు పవన్ కల్యాణ్. తెలుగుదేశం పార్టీకి బీ టీమ్ గా జనసేన మారిపోయిందంటూ వెలువడుతున్న విమర్శలకు బదులు చెప్పాల్సిన అవసరాన్ని గుర్తించారు. దగా పడుతున్న ఆంధ్రప్రదేశ్ సమస్యలకు అధికార టీడీపీదే బాధ్యతంటూ ఘాటుగా, గట్టిగా, ధాటిగా ధ్వజమెత్తారు. 2019 ఎన్నికలకు కొత్త రాజకీయ శక్తిగా స్వతంత్రంగా జనసేన నిలబడుతుందన్న స్పష్టతనిచ్చారు. జాతీయ పార్టీలు మట్టిగొట్టుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంలో మూడో శక్తిగా జనసేన తలపడటం ఖాయమైంది. అది టీడీపీకి లాభిస్తుందా? వైసీపీకి లాభిస్తుందా? జనసేన కింగ్ మేకర్ గా ఆవిర్భవిస్తుందా? అన్నది ఓటర్లు తేల్చాల్సిన పాయింటు. పోటీమాత్రం సుస్పష్టం. అదీ ఒంటరిగా (వామపక్షాల వంటి చిన్నాచితక శక్తుల తో కలిపి) అన్నది బహిరంగ సభ సాక్షిగా తేల్చి చెప్పేశారు. తన రాజకీయ పంథా, జనసేన పథం, భవిష్యత్ ప్రస్థానాల కలబోతగా నిర్వహించిన సభ కీలకమైన రాజకీయ ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.

టీ‘ఢీ’పీ...

ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందన్న ఒకే మాటను జపం చేస్తూ పాలన వ్యవహారాలను గాలికొదిలేసి తెలుగుదేశం అవినీతికి అగ్రతాంబూలమిస్తోందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రతి చిన్న సమస్యకూ పునర్విభజన చట్టం లోపాలు, కాంగ్రెసు పాపాలనే సాకుగా చూపుతూ పబ్బం గడిపేసుకోవాలని చంద్రబాబు చూస్తున్నారనేది ప్రత్యర్థుల ఆరోపణ. తాజాగా కేంద్రప్రభుత్వంలోని బీజేపీని కూడా ఈ లంపటంలోకి లాగి టీడీపీ పాలన వైఫల్యాలు, అవినీతిని సెంటిమెంటుతో సరిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనేది కూడా ఒక విమర్శ. 2014లో మద్దతిచ్చిన జనసేన సైతం టీడీపీ జట్టులో భాగంగానే ఉంటూ లోపాలను నిలదీయడం లేదనే భావన వ్యాపించింది. తెలుగుదేశం పార్టీ తీవ్రమైన సంకటపరిస్థితిని ఎదుర్కొన్న ప్రతి సందర్బంలోనూ పవన్ కల్యాణ్ రంగప్రవేశం చేసి దానిని చల్లబరిచేస్తున్నారనే వాదనా ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కుమారుడు లోకేశ్ పైనే నేరుగా విమర్శలు చేయడం ద్వారా పార్టీ అగ్రనాయకత్వాన్ని పవన్ టార్గెట్ చేయడం తో గతంలో వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పినట్లయింది. ఉద్యమాలను అణచివేస్తూ మహిళలను జైళ్లలో పెట్టడం, రైతులనుంచి ప్రభుత్వం భూముల స్వాధీనం, ఇసుక మాఫియా వంటి అనేక అంశాల్లో నేరుగా ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడినే నిందించడం గమనించాల్సిన అంశంగా పరిశీలకులు పేర్కొంటున్నారు. ఈ రెండు పార్టీలు 2019లో కలిసి నడిచే అవకాశాలే మాత్రం లేవనేందుకు ఇవే సూచికలుగా చెబుతున్నారు.

ఏపీ కాదు..పార్టీ పునర్నిర్మాణం..

తెలుగుదేశానికి తాను మద్దతిచ్చిన కారణాన్ని, ఇప్పుడు విభేదిస్తున్న అంశాన్ని విడదీసి చూపుతూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఆలోచింపచేసేవే. 2004 నుంచి 2014 వరకూ అధికారానికి దూరంగా ఉన్నతెలుగుదేశం ఆర్థికంగా, అంగబలం రీత్యా చాలావరకూ దెబ్బతింది. 2014 ఎన్నికలకు వచ్చేటప్పటికి రాజశేఖరరెడ్డి సెంటిమెంటుతో వైసీపీ మంచి ఉత్సాహం గా ఉంది. ఆ ఎన్నికల్లో టీడీపీకి పునరధికారం సిద్ధించకపోతే పార్టీ పతనం ఖాయమే. కానీ అనూహ్యంగా రాష్ట్రవిభజన, పవన్, మోడీలతో జట్టు కట్టడం తో చంద్రబాబు నాయుడి నాయకత్వం, అనుభవం పట్ల ఏపీ ప్రజలు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అధికార ప్రాప్తి తర్వాత టీడీపీ ఆర్థికంగా నిలదొక్కుకోగలిగింది. పార్టీ శిథిలం కాకుండా కాపాడుకోగలిగింది. ఈవిషయాన్నే పవన్ ప్రస్తావించారు. విభజిత ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి చంద్రబాబు పాలనానుభవం ఉపయోగపడుతుందనే మద్దతిచ్చాను. రాష్ట్ర పునర్నిర్మాణానికి కాకుండా టీడీపీ పునర్నిర్మాణానికి అధికారాన్ని వినియోగించుకున్నారని పవన్ తార్కికంగా విమర్శించారు. ఇప్పుడీ అంశమే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయమవుతోంది. గతంలొ టీడీపీకి మద్దతు, ఇప్పుడు వేరుపడుతున్న విషయాల్లో జనసేన ఒక హేతుబద్ధతను సృష్టించుకోగలిగింది.

జేఎఫ్ సీ రూటర్లు...

కుటుంబసభ్యుల సహా ఎవరి మాటా పవన్ కల్యాణ్ అంతసులువుగా వినేరకం కాదు. తాను నమ్మిందే చెబుతాడు. చేస్తాడు. తాజాగా ఆంధ్రప్రదేశ్ , కేంద్రం మధ్య నిధుల వివాదం విషయంలో జాయింట్ ఫాక్ట్ ఫైండింగు కమిటీని వేశారు. ఇందుకు రాజకీయ, పాలన మేధావులను ఎంపిక చేశారు. వారిపట్ల పవన్ కు అపారమైన భక్తి ప్రపత్తులున్నాయి. వారితో కొన్ని రోజులపాటు మంతనాలు కూడా జరిపారు. ఏపీకి అన్యాయం జరిగిన విషయాన్ని సాధికారికంగా తేల్చిచెబుతూనే జనసేన రూటు మార్చవలసిన రాజకీయ అవసరాన్ని వారు నూరిపోశారనేది పార్టీ వర్గాల సమాచారం. రాజకీయాలను అపోశన పట్టిన ఉండవల్లి, జయప్రకాశ్ వంటివారు ఈ విషయంలో పవన్ కు హితబోధ చేసినట్లు తెలిసింది. పవన్ చిత్తశుద్ధిని గుర్తించిన వారిరువురూ టీడీపీని వెనకేసుకు రావడం వల్ల జనసేన ఎప్పటికీ ఎదగకుండా పోతుందన్న సంగతిని సహేతుకంగా చెప్పారు. దాంతోపాటుగా టీడీపీ ప్రభుత్వ అక్రమాలకు సంబంధించి తమ వద్ద ఉన్న సమాచారాన్ని కూడా చేరవేశారు. ఆ తర్వాతనే పవన్ తన రూటు మార్చుకుని స్వతంత్ర పంథాను అనుసరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల జనసేన ఒక తోకపార్టీగా మిగిలిపోకుండా ఒక మార్గం ఏర్పడింది. 1980 లలో టీడీపీ రంగప్రవేశం చేసింది. నూతన రాజకీయ తరం వచ్చింది. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకూ అదే రాజకీయం సాగింది. ప్రతి 30 సంవత్సరాలకు రాజకీయం దశదిశ మార్చుకొంటూ నూతన తరం రావాలి. అందుకు జనసేన ఆలంబనగా నిలుస్తుందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News