ముందుక్కో..వెనక్కో...?

Update: 2017-11-01 16:30 GMT

సంక్షోభం సమస్యల సవాలే కాదు, సమర్థతను నిరూపించుకునే అవకాశం కూడా. అందుకే సంక్షోభ సమయాల్లో నాయకులు పుట్టుకొస్తుంటారు. నూతన నాయకత్వం స్థిరపడుతుంటుంది. ప్రపంచరాజకీయాల్లో ఇది నిరూపితమైన సత్యం. కాంగ్రెసు పార్టీకి సంబంధించి ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు వంటి వారు తీవ్రసంక్షోభ పరిస్థితుల్లో నాయకత్వాన్ని చేపట్టి పార్టీని, దేశాన్ని ముందుకు నడిపించారు. యువనేత రాహుల్ గాంధీ దశాబ్దకాలంగా పార్టీ పిలుస్తున్నా వాయిదా వేస్తున్నారు. ప్రత్యేకించి గడచిన మూడు సంవత్సరాలుగా పార్టీని వేధిస్తున్న నాయకత్వ లోపాలు, సమర్థ ప్రతిపక్ష పాత్ర పోషించలేక డీలాపడుతున్న తీరు చూసినవారికి పూర్తి స్థాయిలో పార్టీకి జవజీవాలు కల్పించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. అందుకు పార్టీ పరంగా రాహుల్ తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. అయినా ఎప్పటికప్పుడు పార్టీ అధ్యక్షునిగా పగ్గాలు చేపట్టాల్సిన శుభముహూర్తాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఒకవైపు అధ్యక్షురాలి ఆరోగ్యం క్షీణించడం, మరోవైపు పార్టీ పవర్ సెంటర్లు మారకపోవడం తాజాగా సందిగ్ధ పరిస్థితికి దారి తీస్తున్నాయి.

ఎన్నాళ్లిలా..?

నిజానికి 2014 ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీకి పట్టాభిషేకం చేయాలని సోనియా భావించారు. ఒకవేళ పార్టీ కనుక లోక్ సభలో అత్యధిక సీట్లు సాధించినా, సంకీర్ణాన్ని ఏర్పాటు చేయదలచినా పార్టీ పగ్గాలతోపాటు ప్రభుత్వాన్ని కూడా ఆయన చేతిలో పెట్టాలనుకున్నారు. ఆ ఎన్నికల్లో చరిత్రలో ఎరుగని విధంగా కాంగ్రెసు కుదేలైపోయింది. దీంతో కొంతకుదుట పడేవరకూ అధ్యక్ష స్థానం నుంచి రాహుల్ ను దూరంగా ఉంచారు. ప్రధాని మోడీని ఎదుర్కొనేందుకు సమర్థ ప్రత్యామ్నాయంగా ప్రతిపక్ష కూటమిని నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. దాంతో వివిధ పార్టీలతో వ్యవహారాలు నడపటంలో అనుభవజ్ణురాలైన యూపీఐ ఛైర్ పర్సన్ సోనియానే కాంగ్రెసు అధ్యక్షురాలిగా కొనసాగారు. పార్టీలోని వృద్ధ నేతల సలహాలే ఇందుకు దోహదం చేశాయి. జనరేషన్ షిఫ్ట్ జరిగితే రాహుల్ తమ మాట వినరని, కొత్త తరం చేతిలోకి పార్టీ వెళితే తమకు భవిష్యత్తు శూన్యమని అహ్మద్ పటేల్ , గులాం నబీ, దిగ్విజయ్ వంటివారు ప్రతి సందర్బంలోనూ మోకాలడ్డుతూ వచ్చారు. రాహుల్ కు శ్రేయోభిలాషులుగా నటిస్తూనే తమ పెత్తనాన్ని పొడిగించుకుంటూ పట్టాభిషేకాన్ని వాయిదా వేయిస్తూ వచ్చారు. పార్టీ ఏదేని ఘనవిజయం సాధించి ఉత్సాహంగా ఉన్న పరిస్థితుల్లో పార్టీని యువనేత చేతుల్లో పెడితే అతని కార్యాచరణ సులభమవుతుందని చెప్పేవారు. కానీ 2014 నుంచి చెప్పుకోదగ్గ విజయం ఒక్కటీ లేకపోవడంతో ఏఐసీసీ ఛైర్మన్ ఇన్ వెయిటింగ్ గానే ఉండిపోయారు రాహుల్. సీనియర్ పొలిటీషియన్లు మమతాబెనర్జీ, శరద్ పవార్, శరద్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి వారు సోనియాకు ఇచ్చిన ప్రాధాన్యం రాహుల్ కు ఇవ్వరు. వీరిని కలుపుకొని పోవాల్సిన తప్పని పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకుని సోనియా కుమారుడిని బలవంత పెట్టలేదు. అయితే తాజా పరిస్థితుల్లో యువతరం నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఆరోగ్యరీత్యా పార్టీ కార్యకలాపాలను నిర్వహించలేని స్థితికి చేరుకున్నారు సోనియా.

మళ్లీ గుజరాత్ గండం....

గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో తక్షణం కాంగ్రెసు అధ్యక్షునిగా రాహుల్ ను నియమించాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో అన్నీ తానై ప్రచారం నిర్వహిస్తున్నారాయన. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపడానికి నాయకులు సమష్టిగా పనిచేయడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుందంటున్నారు. గడచిన మూడు సంవత్సరాల్లో రెండు సందర్బాల్లో రాహుల్ పట్టాభిషేకం వాయిదా పడింది. బీహార్ ఎన్నికలు, ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత ఆయనకు పదవిని, పార్టీని అప్పగించాలనుకున్నప్పటికీ సంస్థాగత సమస్యలు వెన్నాడాయి. ఈ ఏడాది అక్టోబర్ చివరి వారంలో ముహూర్తం ఖాయమనుకున్నారు. ఈ మేరకు వివిధ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీల నుంచి తీర్మానాలు కూడా తెప్పించేశారు. పీసీసీల ఆమోదం తో కాంగ్రెసు రాజ్యాంగం ప్రకారం సీడబ్ల్యుసీ తో సంబంధం లేకుండానే అధ్యక్షురాలు తన వారసునిపై నిర్ణయం తీసుకోవచ్చు. తర్వాత ఎండార్సుమెంట్ చేసుకోవచ్చు. ఇందుకు ఏరకమైన ఆటంకాలు లేవు. అయినా అక్టోబర్ గడువు ముగిసిపోయింది. గుజరాత్ ఫలితాలు ఎలా ఉంటాయో తెలియదు. ఒకవేళ పార్టీకి అధికారం దక్కితే రాహుల్ కు తిరుగుండదు. అధ్యక్ష స్థానం చేపట్టడం క్షణాల్లో పని. కానీ ఫలితం రివర్స్ అయితే నైతికంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. అందుకే ఎన్నికలు ముగిసే వరకూ ఆలోచించకుండా అధ్యక్ష నియామకాన్ని ముగించాలని పార్టీ శ్రేయోబిలాషులు సూచిస్తున్నారు. అహ్మద్ పటేల్ వంటి సోనియా రాజకీయ సలహాదారుల ఆలోచన మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. నూతన అధ్యక్షుని నియామకం తర్వాత అహ్మద్ పటేల్ చేసేందుకేమీ ఉండదు. రెండు దశాబ్దాలుగా పార్టీపై ఆయన చెలాయించిన పెత్తనానికి తెర పడుతుంది. ఆయన సూచనలు, సలహాలు రాహుల్ స్వీకరిస్తారన్న గ్యారంటీ లేదు. సో...రాహుల్ పదవీ స్వీకారాన్ని సాధ్యమైనంత జాగు చేయడంలో అహ్మద్ నేతృత్వంలోని ఓల్డ్ గార్డు నేతల పాత్ర ఉందేమోనని పార్టీ వర్గాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఏదేమైనప్పటికీ రావడం ఖాయం. అంతా ఖరారై పోయింది. ఎన్నికలకు ముందా? తర్వాతా? అన్నదే ఇప్పటి ప్రశ్న.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News