మిత్ర ధర్మం vs రాజధర్మం....!

Update: 2018-01-28 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మిత్రధర్మం, రాజధర్మం గొడవ మొదలైంది. పాలకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారిగా మాట తూలారు. భవిష్యత్తు రాజకీయాలపై సంకేతాలిచ్చారు. బీజేపీని మరెంతో కాలం భరించలేమంటూ సూచనప్రాయంగా తేల్చేశారు. ‘ఇంతకాలం మిత్రధర్మం పాటించాం. బీజేపీని విమర్శించకుండా మా నేతలను కంట్రోల్ చేశాను. కాదని మీరు ముందుకెళితే మీ ఇష్టం. మీకో దండం పెట్టి మా దారి మేము చూసుకుంటామం‘టూ చంద్రబాబు కుండబద్దలు కొట్టారు. పక్షం రోజుల క్రితం ప్రధానిని కలిసి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిలో అసహనం రోజు రోజుకీ పెరిగిపోతోంది. పీఎం స్పందన తక్కువగా ఉందో లేక సాచివేత ధోరణి కనిపించిందో సీఎం మాత్రం కొంత అసంతృప్తిని , ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై న్యాయపోరాటానికి సైతం మేం సిద్ధంగా ఉన్నామంటూ బహిరంగంగానే ప్రకటించారు. కేంద్రం, రాష్ట్రం మధ్య సత్సంబంధాలు కొనసాగుతుంటే ఇటువంటి ప్రకటన చేయాల్సిన అవసరం లేదు. కానీ ఏదో చెడింది. ఎక్కడో తేడా కొడుతోంది. అందుకే గుంభనంగా సాగాల్సిన కాపురం గుట్టురట్టవుతోంది. సీజన్డ్ పొలిటీషియన్ అయిన చంద్రబాబు నాయుడు సాధారణంగా తనలోని భావాలను బహిరంగంగా వ్యక్తం చేయరు. అందులోనూ బీజేపీ వంటి బలమైన శక్తితో పొత్తు విషయాలను మీడియా ముందు వెల్లడించేంత అమాయకుడు కాదు. కానీ మరెంతో కాలం ఈ పొత్తుల కుంపటి భరించలేమనే అంచనాకు వచ్చిన తర్వాతనే ఆయన ఈ ప్రకటన చేసి ఉంటారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

మిత్ర ‘మర్మం’.....

చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయి నాయకుడు. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా చాలా కీలకబాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెసు, బీజేపీయేతర రాజకీయ సంకీర్ణం కేంద్రంలో అధికారంలోకి రావడంలో ముఖ్య భూమిక పోషించారు. విభిన్నమైన వాదనలతో భిన్న లక్ష్యాలతో ఉన్న చిన్నాచితక పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించడమంటే మాటలు కాదు. ఆ భారాన్ని తన భుజస్కంధాలపై మోశారు. వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్డీఏలోనూ ఆయన చెప్పింది చెల్లుబాటయ్యింది. బీజేపీతో అనేక ఒడిదొడుకులు వచ్చినప్పటికీ సంయమనం కోల్పోలేదు. విశ్వాసపాత్రమైన మిత్రపక్షంగానే చివరి వరకూ కొనసాగారు. గోద్రా అల్లర్ల తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీని తొలగించాలని 2002లో చంద్రబాబు డిమాండ్ చేశారు. కానీ బీజేపీ ఆ సూచనను పట్టించుకోలేదు. తాము ఎన్డీఏకి మద్దతు ఉపసంహరించుకోవాల్సి వస్తుందని కూడా చంద్రబాబు హెచ్చరించారు. కానీ ఆ పని చేయలేదు. అప్పటి ఉప ప్రధాని అద్వానీ ఈ విషయంలో చంద్రబాబుకు సర్దిచెప్పారు. మీడియా మొఘల్ రామోజీరావు కూడా జోక్యం చేసుకుని తెగేదాకా లాగకూడదని బాబుకు హితవు పలికారు. మొత్తమ్మీద జయలలిత తరహాలో దుందుడుకుగా వ్యవహరించలేదు. తన వల్ల ఎన్డీఏ ప్రభుత్వం కుప్పకూలిందన్న చెడ్డపేరు తెచ్చుకోకుండా చంద్రబాబు జాగ్రత్త పడ్డారు. విశ్వాసపాత్రమైన మిత్రపక్షంగానే గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ మోడీ , అమిత్ షా ల సారథ్యంలోని బీజేపీతో ఈ రకమైన ఈక్వేషన్ కనిపించడం లేదు. మిత్రుల్లో ఎవరినీ లెక్కచేయని ధోరణి వారి వ్యవహారశైలిలో కనిపిస్తోంది. తనకంటే ఎంతో సీనియర్లయిన వాజపేయి, అద్వానీలు ఇచ్చిన గౌరవం ఇప్పుడు బాబుకు లభించడం లేదు. నిజానికి నరేంద్రమోడీ, అమిత్ షా చంద్రబాబు నాయుడు కంటే రాజకీయాల్లో చాలా జూనియర్లు. కానీ వారి హవా నడుస్తోంది. అడుగడుగునా అవమానాలు తప్పడం లేదు.ఇంతకాలం సహించినా ఇక ఎన్నికల ముంగిట్లో అటో ఇటో తేల్చుకోవాల్సిన తరుణం వచ్చిందని టీడీపీ సీనియర్లు చెవినిల్లు కట్టుకుని పోరుతున్నారు. ఏపీ పెండింగు సమస్యలను ప్రాతిపదికగా చూపిస్తూ బయట పడొచ్చనే ఉద్దేశంతోనే చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారనేది రాజకీయ వర్గాల అంచనా.

‘రాజ‘ రహస్యం ....

భారతీయ జనతాపార్టీ పొమ్మనకుండా పొగబెట్టే వైఖరిని కనబరుస్తోంది. వైసీపీ, టీడీపీల్లో ఎవరో ఒకరు ఎన్నికల తర్వాత అయినా సరే తమ పార్టీ వెంట నడవకతప్పదని బీజేపీ అగ్రనాయకత్వం విశ్వసిస్తోంది. అందువల్ల పార్టీ సొంతంగా బలపడే అవకాశాలను పరీక్షించుకోవాలని ఏపీ నాయకులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెసు పతనావస్థకు చేరుకున్న తర్వాత చాలామంది అగ్రనాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వారిలో చాలామంది చంద్రబాబు నాయుడికి రాజకీయ ఆగర్భ శత్రువులు. ఏమాత్రం అవకాశం దొరికినా విరుచుకు పడతారు. నిన్నామొన్నటి వరకూ అమిత్ షా అదుపు చేస్తుండటంతో వారందరి నోళ్లు కుట్టేసినట్లయింది. టీడీపీతో పొత్తు కొనసాగితే వీరందరికీ ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయించడం కష్టసాధ్యం. కర్ణాటక తర్వాత దక్షిణాదిన బలపడేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో బీజేపీకి అవకాశాలున్నాయని 1998,1999 నాటి పెర్ ఫార్మెన్స్ ఆదారంగా ఆ పార్టీ అంచనా వేస్తోంది. తెలంగాణలో టీడీపీతో సంబంధం లేకుండా ఒంటరిగా వెళ్లేందుకు లైన్ క్లియర్ అయిపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్ లోనే స్పష్టత రావాల్సి ఉంది. అది కూడా పూర్తయితే దక్షిణాదిన ఒంటరిగా బలపడేందుకు తమవంతు ప్రయత్నాలు చేసుకున్నట్లవుతుంది. ఏపీలో బీజేపీ పాగా వేసేందుకు అవకాశమున్న స్థానాలను పార్టీ పరంగా ఇప్పటికే గుర్తించారు. ప్రముఖ నాయకులు, సంఘ్ పరివార్ బలంగా ఉన్న స్థానాలు ఇందులో ఉన్నాయి. అయితే వాటిని కేటాయించేందుకు టీడీపీ సుముఖత వ్యక్తం చేయదన్న సంగతి బీజేపీ నాయకత్వానికి తెలుసు. ఈ నేపథ్యంలోనే మోడీ స్వయంగా ఈసారి పొత్తులో భాగంగా లోక్సభ స్థానాలు పెంచాల్సి ఉంటుందని చంద్రబాబు కు చెప్పినట్లు సమాచారం. అప్పట్నుంచే దూరం మరింత పెరిగింది. మిత్రధర్మం ప్రకారం విశ్వాసాన్ని పరిరక్షించుకోవడం ఎంత ముఖ్యమో రాజధర్మం ప్రకారం తాను ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రానికి అన్నివిధాలా ప్రయోజనం సమకూరేలా కేంద్రం మెడలు వంచడమూ అవసరమే. డిమాండ్లన్నీ పక్కనపెట్టి పెద్దన్న బీజేపీ చెప్పినట్లు నడుచుకుంటూ మిత్రధర్మంతో సంతృప్తి చెందుతారా? లేక పునర్విభజన చట్టం నిర్దేశించిన హక్కులను డిమాండ్ చేసి రాబట్టుకుంటూ రాజధర్మం నిలబెట్టుకుంటారా? ఈ విషయాలను రాబోయే కాలంలో చంద్రబాబే తేల్చుకోవాల్సి ఉంటుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News