మాకో విలన్ కావాలి

Update: 2018-03-20 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అర్జెంటుగా ఒక ప్రతినాయకుడు కావాలి. అస్తవ్యస్తమైన పరిస్థితులకు అతడినే కారణంగా చూపుతూ అందరూ గట్టెక్కేయాలి. వచ్చే ఎన్నికలలో వరద ప్రవాహంలా ఓట్లు సాధించాలి. ఇదే వ్యూహం ఇప్పుడు అమలవుతోంది. ఎదుటివాడివైపే విలన్ గా చేయి చూపుతూ తమలోని విలన్ ను రహస్యంగా దాచేస్తున్నారు. నాలుగేళ్లుగా బీజేపీపై నోరెత్తని చంద్రబాబు, చంద్రబాబుతో కలిసి నడిచిన పవన్, కమలంతో కలవడానికే ఎత్తులు వేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ అందరూ ఇప్పుడు తమకు తాము హీరోలే. ప్రత్యర్థి పక్కా విలన్. ఈ చదరంగంలో రాజకీయ విశ్వసనీయత, సత్యసంధత, వ్యక్తిగత ప్రతిష్ట మట్టిగొట్టుకుపోతున్నాయి. ఎన్నికల పర్వం రాకముందే ప్రజల దృష్టిలో పలచనై పోతున్నారు. 2014 ఎన్నికలకు ముందు రాష్ట్రవిభజన చేసిన కాంగ్రెసు పార్టీ ఏపీకి శత్రువుగా మారిపోయింది. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో బీజేపీపై కూడా అదే ముద్ర పడిపోయింది. నిజానికి ఇప్పుడు కాంగ్రెసు, బీజేపీలకు పెద్దగా ఏపీ ప్రజల మనస్సులోనూ, అక్కడి లోక్ సభ స్థానాల్లోనూ పెద్దగా వాటా లేదు. ఈ రెండు పార్టీలనూ విలన్లుగా చూపించడం వల్ల రాజకీయాల్లో వచ్చేసే మార్పులు కూడా లేవు. అందుకే వీరితో అంటకాగుతున్నారనే నెపంతో ప్రత్యర్థిపై బురదజల్లుడు కార్యక్రమం ఊపందుకుంది. తాజా సంఘటనలు, సమీకరణలు, సమీక్షలు చాటిచెబుతున్న సత్యమిదే.

యూ టర్న్ ...ఉత్పాతం...

రాష్ట్రం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. కేంద్రం చంక నెక్కితే తప్ప ముందుకు సాగని నడక. దీంతో కేంద్రంతో చంద్రబాబు నెయ్యం చక్కగా కుదిరింది. నోట్లరద్దు, జీఎస్టీ ల వంటి సంస్కరణలు అమలు చేసిన సందర్బంలో తానే స్వయంగా కీర్తించిన కేంద్రాన్ని, ప్రధానిని తాజాగా తూలనాడక తప్పనిస్థితి. యూటర్న్ ఈజీ గానే తీసుకున్నారు. కేంద్రం మిథ్య అన్న ఎన్టీయార్ కంటే గట్టిగా, ఘాటుగానే విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ జగన్, పవన్ వేసిన ట్రాప్ లో పడిపోయారనే వాదన వినవస్తోంది. ప్రత్యేక హోదా అంటూ పాడి పాడి ప్రజల మెదళ్లలోకి ఎక్కించిన జగన్ దానిపై పేటెంటు సాధించినట్లే. దీనిని కౌంటర్ చేయడానికి కొన్ని వందల సార్లు చంద్రబాబు ప్రత్యేక హోదా వల్ల పెద్దగా ప్రయోజనమేమీలేదని మాట్టాడాల్సి వచ్చింది. ఇప్పుడు అదే అంశం అవిశ్వాసం స్థాయికి చేరింది. దానిపై పట్టుపట్టి కూర్చొన్నారు చంద్రబాబు నాయుడు. తమ దారికే టీడీపీ వచ్చిందని వైసీపీ చెబుతోంది. దీనిని తోసిపుచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. నిన్నామొన్నటివరకూ బీజేపీని వెనకేసుకుని వచ్చి ప్రత్యేక ప్యాకేజీ చాలన్న చంద్రబాబుపైనే జగన్ పార్టీ విమర్శన బాణాలు ఎక్కుపెడుతోంది. యూటర్న్ ఫలితం దక్కకుండా అడ్డుపడుతోంది. చంద్రబాబుకిది కష్టకాలమే. ఏడాది వ్యవధిలో బీజేపీ చుక్కలు చూపిస్తుందని పొలిటికల్ పండిట్స్ చెబుతున్నారు. మామకు వెన్నుపోటు వంటి సెంటిమెంటు డైలాగులు మొదలు పోలవరంలో అవినీతి వరకూ అంతాకెలికి తీస్తున్నారు. రాజకీయ ఈక్వేషన్లు చూసుకున్న చంద్రబాబు తనలోని లోపాన్ని మరిచిపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. తాను చేసిన వ్యాఖ్యలు, గడచిన నాలుగేళ్ల ప్రవర్తన పక్కనపెట్టి కొత్త అవతారంలో కనిపించాలనుకోవడమే కాసింత ఎబ్బెట్టుగా నల్లపూస తంతును తలపిస్తోంది.

పవన్ పల్టీ...

ఇటీవలి తెలుగు రాజకీయాల్లో అత్యంత సంచలనం సృష్టించిన వ్యక్తిగా పవన్ కల్యాణ్ ను చెప్పుకోవాలి. చంద్రబాబుకు సహకరిస్తున్నారని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యం నుంచి ఒక్కసారిగా బద్ధ వ్యతిరేకిగా మారిపోయారు. ఆయన విమర్శలు, ఆరోపణలకు తెలుగుదేశం పార్టీయే మొదటి టార్గెట్ గా మారింది. ఇప్పటికిప్పుడు ఏం మార్పులొచ్చాయి? అంతగా విరుచుకుపడాల్సిన అవసరమేమొచ్చిందంటే సమాధానం లేదు. కేంద్రం నిర్లక్ష్యంతో నిరాదరణ ను ఎదుర్కొంటున్న రాష్ట్రానికి న్యాయం చేయమని కోరుతూ అందరూ కలిసి నడవాల్సిన తరుణంలో పవన్ ఒంటెత్తు పోకడ పోతున్నారనే భావన మొదలైంది. పవన్ ఇంటిగ్రిటీ, ఆంధ్రప్రదేశ్ పట్ల ఆయన ఆవేదనకు సంబంధించి ఇంతవరకూ పెద్దగా సందేహాలేమీ లేవు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పవన్ పై గతంలో విమర్శలు చేసినా ప్రజలు వాటిని రాజకీయ కోణంలోనే చూస్తుండేవారు. అరచేతి దూరంలో ఉన్న అధికారాన్ని కాకుండా చేశాడనే దుగ్ధతోనే వైసీపీ శ్రేణులు విరుచుకుపడుతున్నాయని సరిపుచ్చుకునేవారు అభిమానులు. ఇంతకాలం పల్లెత్తు మాట అనకుండా ఒక్కసారిగా టీడీపీ ప్రభుత్వం, లోకేశ్ పై విరుచుకుపడటం రాజకీయ దుమారాన్ని లేపుతోంది. ఇంతవరకూ సూచన ప్రాయంగా కూడా టీడీపీ పై ధ్వజమెత్తని పవన్ ఒక్కసారిగా నిప్పులు చెరగడంలోని ఆంతర్యమేమిటనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. కేంద్రప్రభుత్వం నుంచి టీడీపీ మంత్రులు రాజీనామా చేసి బయటికి వచ్చేసిన పరిస్థితుల్లో ఈ విమర్శలు చర్చనీయమవుతున్నాయి. టైమింగ్ పవన్ చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తోంది. ప్రత్యేక హోదా కోసం ప్రాణార్పణ చేస్తానని ప్రకటించి అంతలోనే జాతీయ మీడియాతో సాయం చాలనడమూ సందేహాలకు కారణమవుతోంది. చెప్పేమాటలోని తడబాటు, చంచలత్వం , ఎవరో వెనక ఉండి నడిపిస్తున్నారన్న భావన వెరసి తనలోనూ ఒక ప్రతినాయక స్వభావాన్ని తేటతెల్లం చేస్తోంది.

జగన్ జర సోచ్ లో...

బీజేపీకి వ్యతిరేకంగానే ఆంధ్రప్రదేశ్ లో ఉద్యమం సాగుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఇందులో ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంది. బీజేపీని ప్రధాన శత్రువుగా చూపిస్తే వైసీపికి కలిసొచ్చేదేమీ లేదు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఆ పని చేస్తోంది. తనకు ప్రధాన ప్రత్యర్థి అయిన టీడీపీని టార్గెట్ చేస్తేనే పొలిటికల్ మైలేజీ సాధ్యమవుతుంది. దీనినే అనుసరించి, ఆచరించి చూపిస్తోంది వైసీపీ. కానీ బీజేపీని పూర్తిగా విస్మరించడం వల్ల కేంద్రంతో కుమ్మక్కైపోయారనే విమర్శలు ఎదుర్కొంటోంది. దీనినుంచి బయటపడకుండా పక్కా వలవేయగలిగింది తెలుగుదేశం. విజయసాయి రెడ్డి వంటి వారు చూపించే అత్యుత్సాహం, ప్రదానిపై విశ్వాసాన్ని వ్యక్తం చేయడం, కలిసి మంతనాలు జరపడం వంటివి వైసీపీ క్రెడిబిలిటీపై మచ్చ పడేలా చేస్తున్నాయి. టీడీపీ, బీజేపీ రెంటినీ ఒకే గాటన కట్టినా ఫర్వాలేదు. కానీ బీజేపీపై విమర్శల విషయంలో తమలపాకు తరహా సున్నితత్వము, టీడీపీని తాటిమట్టతో బాదేయడంలోనే వైసీపీ పాక్షిక దృష్టి కోణం వెల్లడవుతోంది. పాదయాత్రలతో ప్రజల్లోకి వెళుతున్న జగన్ పొలిటికల్ నాడిని పట్టుకోవడంలో కొంత వైఫల్యం చెందుతున్నారు. కాంగ్రెసు తరహాలోనే బీజేపీపై కూడా ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. ఈ ట్రెండును సరిగా పట్టుకోలేకపోతే రాజకీయంగా దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి. తెలిసో తెలియకో బీజేపీకి సహకరిస్తున్నారనే ముద్ర వేసుకోవడమూ ఏపీలో జగన్ ఇమేజ్ పై ప్రతినాయక ముద్ర వేస్తాయి. మొత్తమ్మీద రాజకీయంగా పోటీ పడుతున్న ముగ్గురు అగ్రనాయకులూ ఎదురీదుతున్నారనే చెప్పాలి. ఇక బీజేపీ , సంఘ్ శక్తులు రంగంలోకి దిగి వీరిపై ఏరకమైన ప్రచారముద్ర వేస్తాయో ముందు ముందు ఎదురుచూడాలి. 2014లో మెయిన్ విలన్ గా కాంగ్రెసు పార్టీ బూచిని చూపించారు. 2019లో బీజేపీ ఆ బాధ్యతను తీసుకోవాల్సి వస్తుందనే అంచనాలు ఇప్పటికే వెలువడుతున్నాయి. మిగిలిన మూడు పార్టీల్లో నాయక, ప్రతినాయక పాత్రల ఎంపిక ప్రజల చేతుల్లోనే ఉంటుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News