మా.... దేశం మాదే....?

Update: 2017-10-13 18:29 GMT

ప్రపంచంలోని ప్రజలు స్వేచ్ఛా స్వతంత్రతను కోరుకుంటున్నారు. తమను తామే పాలించుకోవాలని భావిస్తున్నారు. పరాయి పెత్తనాన్ని సహించలేమంటున్నారు. ఈ క్రమంలో ఎదరైన ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. ఏదో ఒకరోజు తమ లక్ష్యాన్ని సాధిస్తామన్న విశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. ఖండం ఏదైనా?...ప్రాంతం ఏదైనా..? అన్నిచోట్లా ఇదే పరిస్థితి. ప్రస్తుతం యూరప్ లోని స్పెయిన్ లో స్వయం ప్రతిపత్తిగల కాటలోనియా ప్రజలు ఇదే బాటలో నడుస్తున్నారు. అణిచివేతతో ప్రజాపోరాటాలను ఆపలేరని చెబుతున్నారు. తాత్కాలికంగా తగ్గినా అంతిమ విజయం తమదేనన్న ధీమాను వ్యక్త పరుస్తున్నారు కాటలోనియా ప్రజలు. కాటలోనియా ప్రజల పోరాటం ఈనాటిది కాదు. దీనికి దశాబ్దాల చరిత్ర ఉంది. వారిపై స్పెయిన్ పాలకులు ఉదాసీనత ప్రదర్శించిన మాట వాస్తవం. కేటలోనియాకు స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ అది నామమాత్రమే. 1977లో వాగ్దానం చేసిన స్వయం ప్రతిపత్తికి 2006లో మాత్రమే చట్టరూపం ఇచ్చారు. ఇందులోని కొన్ని అంశాలకు స్పెయిన్ అత్యున్నత న్యాయ స్థానం కొట్టేయడంతో కాటలోనియా వాసులకు మిగిలింది ఏమీలేదు. స్పెయిన్ లో భాగమయినప్పటికీ కాటలోనియా వాసుల వేషభాషలు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, పద్ధతుల్లో స్పష్టమైన విభజన ఉంది.

ఆదాయమంతా ఇక్కడ నుంచే.....

కేటలోనియాలో స్పానిష్ భాష లేదు. కాటలాన్ భాష మాత్రమే మాట్లాడతారు. స్పానిష్ కు భిన్నమైన సంస్కృతి వీరిది. అభిరుచులు, అలవాట్లు, పండగలు, పబ్బాలు, సంప్రదాయాల్లో అసలు ఏమాత్రం సారూప్యత లేదు. కేటలాన్ కేవలం ఈ ప్రాంతంలో మాట్లాడే భాషే కాదు. యూరప్ లో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో ఇది ఒకటి. కాని యూరోపియన్ యూనియన్ (ఈయూ) అధికారిక భాషల్లో కేటలాన్ లేకపోవడం వివక్షతతో కూడుకున్నదన్నది వారి ఆవేదన. ఏ రకంగా చూసినా కేటలాన్ శక్తిమంతమైంది. నిజం చెప్పాలంటే ఆ దేశమే కాటలోనియాపై ఎక్కువగా ఆధారపడి ఉంది. సహజ వనరులకు లోటు లేని ప్రాంతం. స్పెయిన్ ఆర్థిక వ్యవస్థలో సింహభాగం ఈ ప్రాంతానిదే. దేశ భూభాగంలో 6.3 శాతం, జనాభాలో 16 శాతం, జీడీపీలో 20 శాతం వాటాతో కాటలాన్ కీలక పాత్ర పోషిస్తుంది. కీలక సంస్థలు ఇక్కడే ఉన్నాయి. దేశం మొత్తంలో గల రసాయన ఉత్పత్తుల్లో సగం ఇక్కడే ఉత్పత్తి అవుతాయి. అధునాతన ఆసుపత్రులు, పరిశోధనా కేంద్రాలు ఇక్కడే ఉన్నాయి. ఫార్మారంగానికి కేంద్రంగా కాటలోనియాను చెప్పొచ్చు. స్పెయిన్ కు లభించే విదేశీ పెట్టుబడుల్లో సుమారు 25 శాతం ఈ ప్రాంతానికే వస్తున్నాయి. దేశంలో కన్నా ఈ ప్రాంతంలోనే నిరుద్యోగ రేటు తక్కువ. స్పెయిన్ కు వచ్చే పర్యాటకుల్లో 25 శాతం మంది కాటలోనియాను తప్పక సందర్శిస్తారు.

ఉద్యమాలను అణిచి వేసినా......

ఇంత సంపన్నమైన, ప్రత్యేకమైన, వైవిధ్యమైన ప్రాంతాన్ని వదులుకోవడానికి లేదా పట్టుకోల్పోవడానికి ఏ దేశమైనా ఒప్పుకోకపోవడం సహజమే. స్పెయిన్ కూడా ఈ బాటలోనే నడిచింది. ప్రజా పోరాటాలను, ఉద్యమాలను అణిచి వేసింది. పోలీసులను ప్రయోగించింది. ప్రభుత్వం, దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా వీరికి వ్యతిరేకంగా నిలిచాయి. 1978 నాటి రాజ్యాంగం రిఫరెండాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటిస్తోంది. 2014లో జరిగిన రిఫరెండాన్ని ప్రభుత్వం గుర్తించలేదు. కేటలోనియా నాయకులు చర్చకు వచ్చినా సర్కారు స్పందించలేదు. తాజా రిఫరెండాన్ని ప్రభుత్వమే అడ్డుకుంది. పోలీసులు లాఠీలు ఝులిపించారు. వందలాది మందిని అరెస్ట్ చేశారు. పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు గాయపడ్డారు. అయినప్పటికీ రిఫరెండంలో పాల్గొన్న ప్రజలు తమ ప్రత్యేక దేశ ఆకాంక్షను బలంగా విన్పించారు. కాటలోనియా స్వాతంత్ర్య కాంక్షను స్పెయిన్ ప్రభుత్వం, సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా ఖండించాయి. స్పెయిన్ రాజు ఫిలిప్ పరోక్ష సైనిక చర్యకు సంకేతాలిచ్చారు. ఇలాంటి అవాంఛనీయ పరిణామాలు అంతర్యుద్ధానికి దారితీస్తాయి. దీని ప్రభావం కేవలం స్పెయిన్ కే పరిమితం కాదు. మొత్తం యూరప్ పై ప్రభావం చూపుతుంది.

కొంత వెనక్కు తగ్గి.....

కారణాలు ఏమైనప్పటికీ ప్రస్తుతానికి కాటలోనియా నేతలు వెనక్కి తగ్గినట్లే కనబడుతోంది. రిఫరెండంలో తమకు అనుకూలంగా ప్రజాభిప్రాయం వచ్చినప్పటికీ ప్రస్తుతానికి స్వాతంత్ర్య ప్రకటనను రద్దు చేసుకుంటున్నట్లు కేటలోనియా అధ్యక్షుడు కార్లెస్ పుయిగ్జెమాంట్ ప్రకటించారు. స్పెయిన్ ప్రభుత్వంతో చర్చలు కోసమే స్వాతంత్ర్య ప్రకటన రద్దు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. రిఫరెండాన్ని గుర్తించేందుకే స్పెయిన్ అంగీకరించడం లేదు. దానిని అడ్డుకునేందుకు చేయగలిగింది అంతా చేస్తామని స్పెయిన్ ప్రధాని మారియానో రజోమ్ హెచ్చరించడం గమనార్హం. ఇప్పుడు కాకపోయినా మరికొద్ది కాలానికైనా కాటలోనియా ప్రజల ఆకాంక్షను గుర్తించక తప్పదు. ప్రజా ఉద్యమాలను పోలీసుల సాయంతో అణిచి వేయలేరని కాటలోనియా నాయకులు చెబుతున్నారు. అంతిమ విజయం తమదేనన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

అప్రకటిత రాజ్యాంగం ......

తమకల ఏనాటికైనా నిజమై తీరుతుందన్న నమ్మకంలో ఉన్న కాటలోనియా నాయకులు ఇప్పటికే తమకంటూ ఒక అప్రకటిత రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడం విశేషం. కాటలాన్, స్పానిష్ లు అధికార భాషలుగా కొనసాగుతాయని, యూరోపియన్ యూనియన్ లో కొనసాగుతామని, యూరో కరెన్సీ ఉంటుందని ఇప్పటికే కాటలాన్ నేతలు స్పష్టం చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు పుయిగ్జెమాంట్ తొలి అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంది. ద్వంద పౌరసత్వాన్ని అంగీకరిస్తారు. పౌరులు కాటలాన్, స్పానిష్ పాస్ పోర్టులు కలిగి ఉండవచ్చు. ఈ నేపథ్యంలో కాటలోనియా ప్రజల ఆకాంక్ష సాకారం కావడానికి ఎక్కవ రోజులు పట్టకపోవచ్చని తాజా పరిస్థితులు తెలియజేస్తున్నాయి.

 

- ఎడిటోరియల్ డెస్క్

Similar News