మహా శక్తిమంతుడు జిన్ పింగ్

Update: 2017-10-22 16:30 GMT

ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో అమెరికా, అప్పటి సోవియట్ యూనియన్ (ఇప్పటి రష్యా) అధినేతలే ప్రపంచాధినేతలుగా చెలామణీ అయ్యేవారు. వారి మాటే వేదవాక్కు. యావత్ ప్రపంచ వ్యవహారాలు వీరిచుట్టూ పరిభ్రమించేవి. 90వ దశకంలో సోవియట్ యూనియన్ పతనానంతరం ఒక్కసారిగా పరిస్థితి మారింది. ఏకధృవ ప్రపంచంలో అమెరికా చెప్పిందే వేదమయింది. ప్రపంచంపై పెద్దన్నదే పెత్తనమయింది. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక అమెరికా ప్రభావం అడుగంటుతోంది. అంతర్గత సమస్యలపై సతమతమవుతున్న ఆయన... అంతర్జాతీయంగా ప్రభావితం చేసే పరిస్థితిలో లేరు. ఇది చైనాకు అవకాశంగా మారింది.

అంతర్జాతీయ నేతగా.....

అమెరికా తర్వాత రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా గుర్తింపుపొందిన చైనా ఈ పరిస్థిితిని సద్వినియోగం చేసుకుంటూ తన స్థానాన్ని క్రమంగా పదిల పర్చుకుంటోంది. గతంలో జపాన్ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా, అతిపెద్ద దేశంగా, అతిపెద్ద జనాభాగల దేశంగా చైనా కూడా అంతర్జాతీయ యవనికపై ప్రభావింతమైన పాత్రను పోషిస్తోంది. అందువల్లే ఇప్పుడు యావత్ ప్రపంచం చైనా కమ్యునిస్టు పార్టీ మహాసభలపై ఆసక్తి ప్రదర్శిస్తుంది. అక్టోబర్ 18 నుంచి వారం రోజుల పాటు బీజింగ్ లో జరిగిన పార్టీ మహాసభల్లో అందరూ అనుకున్నట్లుగానే జిన్ పింగ్ చైనా అధినేతగా ఎన్నికయ్యారు. పార్టీపై, ప్రభుత్వంపై, సైన్యంపై పట్టుపెంచుకున్న ఆయన తద్వారా అంతర్జాతీయ నేతగా అవతరించారు.

విచిత్రంగా చైనా రాజకీయ వ్యవస్థ....

చైనా రాజకీయ వ్యవస్థ విచిత్రంగా ఉంటుంది. భారత్ మాదిరిగా అక్కడ ప్రజాస్వామ్యం లేదు. కమ్యునిస్టు పార్టీ, ప్రభుత్వ సైన్యం దేశరాజకీయ వ్యవస్థలో అత్యంత కీలకమైన విభాగాలు. చైనా కమ్యునిస్టు ప్రధాన కార్యదర్శి సహజంగా అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. 2012లో అధ్యక్షుడిగా ఎన్నికైన జిన్ పింగ్ గత ఐదేళ్లలో అటు పార్టీపై ఇటు ప్రభుత్వంపై తన పట్టు పెంచుకుంటూ వచ్చారు. అదే సమయంలో అంతర్జాతీయంగా కూడా చైనా ప్రాధాన్యం పెరిగేలా వ్యవహరించారు. జిన్ పింగ్ కేవలం దేశాధ్యక్షుడే కాదు. పార్టీ ప్రధాన కార్యదర్శి.. సైనిక బలగాల అధిపతి. తద్వారా యావత్ చైనాను తన కనుసన్నల్లో నడిపిస్తున్నారు. 2012లో అధికారపగ్గాలు అందుకున్న అనంతరం ప్రణాళిక బద్దంగా ముందుకు సాగుతూ పట్టు పెంచుకున్నారు. ముందు పార్టీలో అసమ్మతి వర్గీయులపై ఉక్కుపాదం మోపడం ద్వారా తన ఎదురులేకుండా చేసుకున్నారు. అవినీతి అంతానికి నాంది పలకడం ద్వారా ప్రజల్లో తన ఇమేజ్ ను పెంచుకున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అవినీతికి పాల్పడుతున్న కొందరు నాయకులను జైళ్లకు పంపడంలో సాహసోపేతంగా వ్యవహరించారు. అదే సమయంలో పార్టీలో తన వర్గీయులకు పెద్దపీట వేశారు. సైనికపరంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన చైనా సైన్యాన్ని నవీకరించారు. ఇటీవల రెండు అధునాతన యుద్ధ నౌకలను ప్రారంభించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా తీర్చిదిద్దారు. ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేశారు. గత ఐదేళ్లలో వృద్ధి రేటు సగటున 7.2 శాతంగా ఉంది. ఈ ఏడాది తొలి అర్థభాగంలో జీడీపీ 6.9శాతానికి చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఎగుమతులు 8.1 శాతం పెరిగాయి. ప్రపంచానికి ఎగుమతులు చేేసే దేశంగా తీర్చిదిద్దారు. అదే సమయంలో దిగుమతులను గణనీయంగా తగ్గించారు. చైనా బజార్లు నేడు భారత్ సహా అన్ని దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి.

ప్రత్యామ్నాయ ఆర్థిక సంస్థలు.....

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకులకు ధీటుగా ప్రత్యామ్నాయ ఆర్థికసంస్థలను ఏర్పాటు చేశారు. బీజింగ్ కేంద్రంగా ఏఐఐబి(ఆసియా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇనుస్ట్రుమెంట్ బ్యాంక్) ను ప్రారంభించారు. ఇందులో చాలా దేశాలకు సభ్యత్వం ఉంది. వాణిజ్య నగరమైన షాంగై కేంద్రంగా బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) బ్యాంకును ప్రారంభించారు. భారత్ లో ఐసీఐసీఐ బ్యాంకును తీర్చిదిద్దిన కామత్ ఈ బ్యాంక్ అధిపతిగా సేవలందిస్తున్నారు. అంతర్జాతీయంగా చైనా ప్రాధాన్యం పెరిగింది. దక్షిణ చైనా సముద్ర వివాదంపై గట్టిగా వ్యవహరించారు. దీనిపై అంతర్జాతీయ ట్రైబ్యునల్ తీర్పును అంగీకరించబోమని బహిరంగంగా ప్రకటించారు. అదేసమయంలో ఈ విషయంలో అమెరికా తదితర పాశ్చాత్య దేశాల జోక్యాన్ని అంగీకరించమని తేల్చి చెప్పారు. భారత్ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ వన్ బెల్ట్.. వన్ రోడ్డు (ఒబీఒఆర్) ప్రాజెక్టును ప్రారంభించారు. ఆక్రమిత కాశ్మీర్ గుండా ఈ రహదారిని నిర్మిస్తుండటంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అమెరికాకు ధీటుగా ఇరుగుపొరుగు దేశాలకు సహాయం చేస్తూ వాటిని చైనా మచ్చిక చేసుకుంటోంది. గత పదిహేనేళ్లుగా చైనా 140 దేశాలకు 354 బిలియన్ డాలర్ల సాయం అందించింది. అమెరికా అందించిన సాయం 395 బిలియన్ డాలర్లు కావడం గమనార్హం. మౌలిక రంగం, ఇంధనం, రవాణా రంగాలకు సాయం చేసింది. చైనా నుంచి భారీగా సాయం పొందిన పది దేశాల్లో భారత్ వ్యతిరేకి అయిన పాకిస్థాన్, శ్రీలంక ఉండటం గమనార్హం. గతంలో హూజింటావో, జియాంగ్ జెమిన్ మాదిరిగా జిన్ పింగ్ శక్తివంతమైన నాయకుడిగా చైనా పై చెరగని ముద్ర వేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం చైనాలో చక్రం తిప్పుతున్న జిన్ పింగ్ నేపథ్యం అత్యంత సాధారణమైంది. జిన్ పింగ్ తండ్రి జేజెంగ్జూన్ చైనా పీపుల్స్ రిపబ్లిక్ వ్యవస్థాపకుల్లో ఒకరు. చైనాలో సాంస్కృతిక విప్లవం నడుస్తున్న రోజుల్లో పదిహేనేళ్ల యువకుడైన జిన్ పింగ్ గ్రామీణ జీవితం గడుపుతున్నారు. ఆయన జన్మస్థలంో లియాన్ ఘ్జే కమ్యునిస్టులకు కంచుకోట వంటిది. జన్మ నేపథ్యం కారణంగా గ్రామాల్లోని ప్రజల స్థితిగతులు, అవసరాలపై స్పష్టమైన అవగాహన ఉంది. సంస్కృతి, సంప్రదాయాలన్నా ఆయనకు ఆసక్తి. క్షేత్రస్థాయి పరిస్థితులపై సంపూర్ణ అవగాహన కలిగిన జిన్ పింగ్ చైనాను కొంతవరకైనా ప్రజాస్వామీకరణ చేస్తే ప్రపంచం హర్షిస్తుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News