మళ్లీ సైకిల్ ఎక్కేస్తాడా?

Update: 2018-01-11 15:30 GMT

భారీ బడ్జెట్ తో , క్రేజీ కాంబినేషన్ తో తెరకెక్కిన అజ్ణాతవాసి విడుదలైంది. రాజకీయ వాసనలేమీ లేకుండా ఫక్తు మాస్ ఎంటర్ టైనర్ గా తీసేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు పవర్ స్టార్ పవన్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. అయితే ఈ చిత్రంలోని ఒక డైలాగ్ మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకాభిమానుల చెవులను గింగుర్లెత్తిస్తోంది. ఏపీ రాజకీయ వాతావరణం, సందర్భం ఈ డైలాగ్ కు అనుకూలమైన పరిస్థితుల్లో ఉండటంతో ఈ పంచ్ డైలాగ్ ను సినిమాలో పెట్టడంలో ఉద్దేశం ఏమై ఉంటుందోననే చర్చ మొదలైంది. త్రివిక్రమ్, పవన్ ల మధ్య అనుబంధం కేవలం సినిమా సంబంధమైనదే కాదు. వారు సన్నిహితులు, ఆత్మీయులు కూడా. సినిమాలకే పరిమితం కాకుండా వ్యక్తిగత జీవితంలో సలహాలు, సూచనలు ఇచ్చిపుచ్చుకుంటుంటారు. రాజకీయ రంగంలో కూడా పవన్ కు త్రివిక్రమ్ మార్గదర్శకత్వం వహిస్తారనేది సినీ వర్గాల సమాచారం.

ప్లాన్ బీ.. ఆలోచన ఉన్నట్లేనా?...

అజ్ణాత వాసి పవన్ కెరియర్ లో చివరి సినిమా కావచ్చని చాలామందిలో అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. తాను సినిమా రంగంలో సంపాదించుకుని రాజకీయాల్లో ఖర్చు పెడుతున్నానని గతంలో అనేకసార్లు చెప్పిన దృష్ట్యా ఇంకా సినిమాలు కొనసాగిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ రెంటిలో ఏదో ఒకటి మాత్రమే నిజమయ్యేందుకు అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలస్థాయి నాయకత్వానికి రూపురేఖలు దిద్దుతున్నారు. అయితే ఇంకా ఒక రాజకీయ పార్టీగా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అంతటా సంచలనం సృష్టించగల స్థాయికి చేరుకోలేదనేది రాజకీయ పరిశీలకుల అంచనా. అందులోనూ తెలుగుదేశం, వై.సి.పి. రెండు పార్టీలు బలంగా ఉన్న నేపథ్యంలో జనసేనకు మూడో స్థానమే తప్ప అధికారానికి చేరుకునే అవకాశం కూడా లేదంటున్నారు విశ్లేషకులు. గతంలో ఒకానొక సందర్బంలో తన బలమెంత? ఎన్నిస్థానాలకు పోటీ చేయగలనన్న అంశాన్ని అంచనా వేసుకుంటున్నానంటూ పవన్ పేర్కొన్నారు. అజ్ణాత వాసి సినిమాలో బొమన్ ఇరానీ దగ్గర్నుంచి పవన్ కల్యాణ్ వరకూ స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా పని అవ్వని సందర్బాల్లో ప్లాన్ బీ అమలు చేస్తుంటారు. తాము నిలదొక్కుకోవడం, అనుకున్నది సాధించడమే ఈ ప్లాన్ బీ ఆంతర్యం. 2019 ఎన్నికల నాటికి సొంతంగా పోటీ చేయగల స్థాయిలో ఆర్థిక, అంగ బలాలను సమకూర్చుకోలేకపోతే ఒక రాజకీయపార్టీగా నిలబడటానికి,స్థిరపడటానికి పొత్తులు కుదుర్చుకోవాల్సిన అవసరం తలెత్తుతుంది. ఒంటరిగా జనసేన పోటీ చేసి విజయం సాధించడం ప్లాన్ ఎ, సైకిలెక్కి లేదా పంఖా గాలిలో పట్టు నిలుపుకోవడం ప్లాన్ బి. నేరుగా పోటీకి పరిస్థితులు అనుకూలించకపోతే ప్లాన్ బీ వైపు కూడా చూసేందుకు అవకాశాలున్నాయంటున్నారు. మరి త్రివిక్రమ్ ఉద్దేశపూర్వకంగా నే ఈ దిశలో పార్టీని డైరెక్టు చేస్తాడేమో వేచి చూడాలి.

పొలిటికల్ ప్రాతిపదిక ఎక్కడ? ...

సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలో ప్రవేశించేవారు సాధారణంగా తమకున్న మాధ్యమాన్ని విస్తృతంగా వినియోగించుకుంటారు. ప్రజానాయకులుగా, సంఘ సంస్కర్తలుగా, సమస్యల పరిష్కర్తగా తమను తాము ఆవిష్కరించుకునేందుకు సినిమాను చక్కగా వాడుకుంటారు. ఎంజీఆర్ ఈరకమైన ఇమేజ్ తో అనేక సినిమాలు తీసి ఏఐఏడీఎంకే ను ప్రజల పార్టీగా , తనను తాను విప్లవనాయకునిగా ప్రజల ముందు ఆవిష్కరించుకోగలిగారు. ఎన్టీరామారావు సైతం తన కెరియర్ చివరి దశలో సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి, మనదేశం, వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర వంటి సినిమాలతో పొలిటికల్ ఇమేజ్ కు ప్రాతిపదికను నిర్మించుకోగలిగారు. మెగాస్టార్ చిరంజీవి కూడా టాగూర్, స్టాలిన్ వంటి సినిమాలతో ఒక బలమైన మార్పును కోరుకునే నాయకునిగా , అవినీతి వ్యతిరేక పోరాట యోధునిగా ప్రజల ముందు కనిపించే ప్రయత్నం చేశారు. కానీ పవన్ కల్యాణ్ అటువంటి ప్రయత్నాలు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. తన అభిమానులు కోరుకునే మాస్ ఎంటర్ టైనర్ల వైపే మొగ్గు చూపుతున్నారు. రాజకీయాన్ని, సినిమాను వేరువేరుగానే చూడాలనుకుంటున్నట్లు కనిపిస్తోంది. తన సిద్ధాంతాలను ప్రజల్లోకి పంపేందుకు ఒక బలమైన మాధ్యం చేతుల్లో ఉన్నప్పటికీ దానికి దూరంగా ఉండటమంటే సాధారణ విషయం కాదు. తన ప్రేక్షకులను నిరాశపరచడం ఇష్టం లేకపోయి కావచ్చు. లేదా ఆ రకమైన ప్రచారంపై నమ్మకం లేకపోయి కూడా కావచ్చు.

అంతా కోరుకునే ఉన్నత స్థాయి...

అజ్ణాత వాసి విడుదల సందర్భంగా జరిగిన వేడుకలో దర్శకుడు త్రివిక్రమ్ తన మిత్రునికి ఆశీస్సులు అందచేస్తూ ఒక హింట్ ఇచ్చారు. మీరందరూ(అభిమానులు, ప్రజలు) కోరుకునేంత ఉన్నతస్థాయి కి కల్యాణ్ ఎదగాలని తాను భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. అదే సమయంలో సినిమాల పరంగా ఆయనతో కలిసి నడవాలనుకుంటున్నానన్నారు. ఈ రెంటినీ సమన్వయ పరిచి చూసుకునే అభిమానులు, పరిశీలకులు అరుదైన విశ్లేషణ చేస్తున్నారు. సినిమాలు కొనసాగిస్తూ రాజకీయ రంగంలో ఉన్నతస్థానానికి ఎదిగేందుకు ప్రయత్నిస్తారనేది అభిమానుల వాదన. అంటే పుల్ టైమ్ పొలిటీషియన్ గా మారేందుకు మరికొంత టైమ్ పడుతుందన్నమాట. అదే నిజమైతే మళ్లీ సైకిలెక్కేస్తాడా? అన్న త్రివిక్రమ్ డైలాగ్ లో దాగి ఉన్న ప్రశ్న పునరావృతమవుతుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News