మరో సమరానికి రెడీ అవుతున్నారా?

Update: 2018-01-01 17:30 GMT

రాజస్థాన్, పశ్చిమ బెంగాల్లో జరగనున్న ఉప ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ కు అగ్నిపరీక్షగా మారనున్నాయి. రాజస్థాన్ లోని అజ్మీర్, అల్వార్, పశ్చిమ బెంగాల్ లోని ఉలుబేరియా లోక్ సభస్థానాలకు, రాజస్థాన్ లోని మండలఘర్, పశ్చిమ బెంగాల్ లోని నౌపోర్ శాసనసభ స్థానాలకు జనవరి 29న జరగనున్న ఉప ఎన్నికలు అధికార పార్టీకి అత్యంత కీలకమైనవి. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల ఆకస్మిక మరణం కారణంగా జరిగే ఈ ఎన్నికల్లో ఉనికిని కాపాడుకునేందుకు విపక్ష కాంగ్రెస్ కూడా కఠిన పరీక్షను ఎదుర్కొనాల్సి ఉంది. బెంగాల్ లో మమత బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ కు కూడా ఈ ఎన్నికల్లో గెలుపు సాధించడం అత్యంత ముఖ్యమైంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర నాయకులతో పాటు, జాతీయ నాయకులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. మరో ఏడాదిన్నరలో సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో వీటి ఫలితాలు పార్టీలపై ప్రభావం చూపిస్తాయనడంలో సందేహం లేదు. 2018 డిసెంబరులో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో రాష్ట్రంలోని రెండు లోక్ సభ, ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక అధికార బీజేపీకి అగ్ని పరీక్ష వంటిదే. ముఖ్యమంత్రి వసుందర రాజేపై వ్యతిరేకత, గుజ్జర్ల రిజర్వేషన్ల ఉద్యమం, స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఫల్యం నేపథ్యంలో కమలనాధులకు ఈ ఎన్నికలు కఠిన పరీక్షే. అందుకే కేవలం రాష్ట్ర నాయకత్వానికే బాధ్యత వదిలేయకుండా జాతీయ నాయకత్వంకూడా జోక్యం చేసుకుని గెలుపునకు పకడ్బందీగా వ్యూహరచన చేస్తోంది.

రాజస్థాన్ లో కష్టమేనా?

అజ్మీర్ కు చెందిన బీజేపీ ఎంపీ సన్వర్ లాల్ జాట్ ఆకస్మిక మృతి కారణంగా ఉప ఎన్నిక అనివార్యమైంది. 14 లక్షలకు పైగా ఓటర్లు గల ఈ నియోజకవర్గాన్ని 2014లో బీజేపీ కైవసంచేసుకుంది. బీజేపీ అభ్యర్థికి 6,37,874 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 4,65,891 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2009లో కాంగ్రెస్, 2004 లో బీజేపీ ఇక్కడి నుంచి గెలిచాయి. ఈ లోక్ సభ స్థానంలో అజ్మీర్ నార్త్, అజ్మీర్ సౌత్, పుష్కర, కేక్రి, కిషన్ ఘర్, నసీరాబాద్, మసుద, డుడు అసెంబ్లీ స్థానాలున్నాయి. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్ సభ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ముస్లింల పవిత్ర పుణ్యక్షేత్రం అజ్మీర్ దర్గా ఇక్కడే ఉంది. బీజేపీకి చెందిన ఆల్వార్ ఎంపీ మహంత్ చంద్ నాథ్ జులై 22నమరణించడంతో ఈ ఎన్నిక తప్పనిసరి అయింది. 11 అసెంబ్లీ స్థానాలున్న ఈ నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో బీజేపీకి 6,42,278 ఓట్లు రాగా, కాంగ్రెస్ 3,58,383 ఓట్లతో సరిపెట్టుకుంది. ఇది ముస్లింలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం. అల్వాల్ అర్బన్, రూరల్ తో పాటు మరో 9 అసెంబ్లీ స్థానాలు ఈ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. మండల్ ఘర్ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కీర్తి కుమారి మృతితో ఇక్కడ శాసనసభకు ఎన్నిక జరగనుంది. ఇది కాంగ్రెస్ కు పట్టున్న స్థానం. 2003, 2008లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేసిన శివచరణ్ మాధుర్ ఎన్నికయ్యారు. 2013 లో మోడీ ప్రభావంతో ఇక్కడ బీజేపీ గెలిచింది. 2018 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ మూడు ఉప ఎన్నికలు ముఖ్యమంత్రి వసుందరరాజే, పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ కు ముఖ్యమైనవి. ఈ ఫలితాల ప్రభావం వచ్చే ఎన్నికలపై ఉంటుంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ బృందంలో కీలకంగా ఉన్న సచిన్ పెలెట్ కు ఈ ఎన్నికలు అగ్ని పరీక్ష లాంటివి. ఇక్కడ గెలిచి యువనేత రాహుల్ వద్ద ఢిల్లీలో తన పరపతిని నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. ఎంపీగా, ఎమ్మెల్యేగా నేరుగా సచిన్ పైలెట్ పోటీ చేసే అవకాశం కూడా లేకపోలేదు.

బెంగాల్ ఈ స్థానం ఎవరిది?

బెంగాల్ లోని ఉలుబేరియా లోక్ సభ ఉప ఎన్నిక కూడా టీఎంసీ, సీపీఎంకు ముఖ్యమైనవే. 2014లో ఇక్కడి నుంచి గెల్చిన టీఎంసీ నాయకుడు సుల్తాన్ అహ్మద్ మృతి చెందారు. అప్పట్లో ఆయనకు 5,70,785 ఓట్లు రాగా, ప్రత్యర్థి అయిన సీపీఎం అభ్యర్థి సబీరుద్దీన్ మొల్లాకు 3,69,563 ఓట్లు లభించాయి. 2009 లో ఇక్కడి నుంచి టీఎంసీ గెలవగా, 2004లో సీపీఎం విజయం సాధించింది. ఈ లోక్ సభ స్థానంలో ఉలుబెరియా ఉత్తర, దక్షిణ నియోజకవర్గాలతో పాటు శ్యాంపూర్, బగ్నాన్, ఉదయ్ నారాయణ్ పూర్, ఉలుబెరియా (పూర్వ) అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ స్థానాన్ని కాపాడుకునేందుకు టీఎంసీ, సీపీఎంలు కైవసం చేసుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డటం ఖాయం.

అసెంబ్లీ స్థానంలో కూడా పోటాపోటీ....

24 పరగణాల జిల్లాలోని నేపౌర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష కాంగ్రెస్ కు ఖచ్చితంగా అగ్నిపరీక్ష వంటిదే. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి మంజుబసు స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థఇ మధుసూదన్ ఘోష్ విజయం సాధించారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా ఇక్కడ నెగ్గాలని పట్టుదలతో ఉంది. అదే సమయంలో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు విపక్ష కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. లోక్ సభ, అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తే తృణమూల్ ప్రతిష్ట పెరుగుతుంది. రెండు చోట్ల విజయం సాధిస్తే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ తన ఉనికిని చాటుకుంటుంది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News