‘మండలి’లో సభ్యత్వం ఇక ఆశమాత్రమేనా?

Update: 2017-10-21 16:30 GMT

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తులు, వ్యవస్థలు,సంస్థలు మారినప్పుడే మనుగడ ఉంటుంది. లేనిపక్షంలో కాలక్రమంలో కనుమరుగయ్యే ప్రమాదముంది. ఉనికిని కోల్పోయి క్రియా రహిత సంస్థలుగా, అలంకారప్రాయ సంస్థలుగా కొనసాగుతాయి. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఇందుకు నిలువెత్తు నిదర్శనం. 20వ శతాబ్దంలో నాటి అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఆవిర్భవించిన ఈ సంస్థ ఇప్పటికీ అదే విధంగా ఉంది. ఎలాంటి మార్పులు, చేర్పులకు లోనవలేదు. అంతర్జాతీయ వ్యవహారాలు అనూహ్య వేగంగా మారుతున్నా అందుకు అనుగుణంగా ‘మండలి’ ముఖచిత్రం మారడం లేదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తనను తాను ఆవిష్కరించుకోలేక పోవడం ‘మండలి’ అతిపెద్ద వైఫల్యం. ఇందులో సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మనస్ఫూర్తిగా మద్దతు పలకడంలో సభ్యదేశాలు తటపటాయిస్తున్నాయి. ముఖ్యంగా పొరుగు దేశమైన చైనా మోకాలడ్డుతోంది. 1946 జనవరి 17న బ్రిటన్ రాజధాని లండన్ లోని చర్చిహౌస్ లో మండలి తొలి సమావేశం జరిగింది. అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా ఇందులో శాశ్వత సభ్య దేశాలు. మండలి నిర్ణయాలను ఏ ఒక్క శాశ్వత సభ్యత్వ దేశం వీటో (తిరస్కరణ) చేసినా ఆ నిర్ణయం అమల్లోకి రాదు. వీటిల్లో మూడు మరో ప్రాంతానికి చెందినవి. ఆసియా ఖండం నుంచి చైనా ప్రాతినిధ్యం వహిస్తుంది. అగ్రరాజ్యమైన అమెరికా సంగతి చెప్పక్కర్లేదు. రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్..... ఐరోపాలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు. బ్రిటన్, ఫ్రాన్స్ పశ్చిమ ఐరోపా ప్రాంతానికి చెందినవి. రష్యా తూర్పు ఐరోపా దేశం.

సంస్కరణలు ఏవీ?

అతి చిన్నదైన ఐరోపా ఖండం నుంచి మూడు దేశాలకు మండలిలో ప్రాతినిధ్యం లభించగా, అతి పెద్ద ఖండమైన ఆసియా నుంచి ఒక్క చైనానే సభ్యత్వం లభించడం గమనార్హం. అసలు‘మండలి’ కూర్పులోనే సమగ్రత లోపించిన సంగతి స్పష్టంగా కనపడుతోంది. అసలు ఆఫ్రికా ఖండానికి ప్రాతినిధ్యమే లేదు. అరబ్ దేశాల పరిస్థితీ అంతే. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నాలు జరగలేదన్నది చేదునిజం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భద్రతామండలిలో సంస్కరణలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని సభ్యదేశాలు చెప్పడం తప్ప ఆ దిశగా అడుగులు వేయడం లేదు. మండలి ఆవిర్భావ సమయంలో ఈ అయిదూ శక్తిమంతమైన దేశాలే. అయితే అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. మండలిలోని బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఇప్పుడు అత్యంత సాధారణ దేశాలు. ప్రపంచ రాజకీయాలను ఏ మాత్రం ప్రభావితం చేసే స్థితిలో లేవు. అంతర్గత సమస్యలతో అవి కొట్టుమిట్టాడుతున్నాయి. వాటి ఆర్థిక వ్యవస్థలు కూడా అంత గొప్పగా ఏమీలేవు. అయినా మండలి సభ్యత్వం వదులు కోవడానికి లేదా విస్తరించి ఇతర దేశాలకు సభ్యత్వం ఇవ్వడానికి ముందుకు రాలేకపోతున్నాయి. అదే సమయంలో గత రెండు దశాబ్దాల్లో కొన్ని దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతూ అంతర్జాతీయ వ్వవహారాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి. భారత్, జపాన్, జర్మనీ, దక్షిణాఫ్రికా వంటి దేశాలు శాశ్వత సభ్యత్వం కోసం ఎప్పటి నుంచో గళం విప్పుతున్నాయి. ప్రపంచంలో అతి పెద్ద ఖండమైన ఆసియాలో భారత్, జపాన్ ఉన్నాయి. ఈ ఖండం నుంచి కనీసం ఒక్క దేశానికి అయినా సభ్యత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇతర నాలుగుదేశాలు భారత్ సభ్యత్వానికి సుముఖంగా ఉన్నా.. పాకిస్థాన్ ఒత్తిడి కారణంగా చైనా అడ్డుపడుతోంది.

అన్నీ అర్హలున్నా కాని.....

వాస్తవానికి శాశ్వత సభ్యత్వం పొందేందుకు అవసరమైన అన్ని అర్హతలు భారత్ కు పుష్కలంగా ఉన్నాయి. ఈ విషయాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. భారత్ ప్రపంచంలోనే అతి ప్రజాస్వామ్య దేశం. పూర్తి శాంతికాముక దేశం. భిన్న మతాలు, కులాలు, వర్గాలు, భాషలు, తెగలు గల భారత్ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. జనాభా పరంగా చూస్తే చైనా తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశం. పౌరుల ప్రాధమిక హక్కులు, మానవ హక్కులకు ఇక్కడ పెద్దపీట వేస్తారు. స్వతంత్ర న్యాయవ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ ఉంది. భిన్న పార్టీల ప్రాతినిధ్యం ఉంది. దేశ ఆర్థక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతుంది. రాజ్యాంగం కేంద్రం, రాష్ట్రాల మధ్య వ్యత్యాసం చూపకుండా సమాఖ్య వ్యవస్థకు పట్టం కడుతోంది. విదేశీ పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. ఇరుగుపొరుగు దేశాలతో పాటు ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తోంది. ప్రపంచంలోని అతి పెద్ద సైనిక వ్యవస్థల్లో ఒకటి. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలకు ఉదారంగా విరాళాలు అందిస్తుంది. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక బృందంలో భారత సైనికులు విశేష సేవలు అందజేస్తున్నారు. 2011లో మండలి తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికైన భారత్ ఆ బాధత్యలను సమర్ధవంతంగా నెరవేర్చింది. ఇంతటి విస్తృత నేపథ్యం ఉన్న భారత్ మండలి సభ్యత్వానికి సంపూర్ణంగా అర్హురాలు. ఈ విషయంలో రెండో మాటకు తావులేదు. చైనాకు ఈ విషయాలు తెలియనివి కావు. అయినా భారత్ కు మద్దతు ప్రకటించలేక పోవడానికి దాని అభిజాత్యం అడ్డువస్తోంది.

నెహ్రూ హయాంలోనే....

వాస్తవానికి మండలి ఆవిర్భావ సమయంలో శాశ్వత సభ్యత్వానికి భారత్ కు అవకాశం లభించింది. కానీ నాటి ప్రధాని పండిట్ నెహ్రూ ఆ అవకాశాన్ని చైనాకు చేజార్చారు. అయినప్పటికీ భారత్ శాశ్వత సభ్యత్వం పొందాలంటే అయిదు శాశ్వత సభ్యత్వ దేశాల మాదిరిగా ‘వీటో’ అధికారానికి పట్టుబట్టిందని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిని నిక్కీ హేలీ సూచించడం హాస్యాస్పదంగా ఉంది. వీటో అధికారం లేని సభ్యత్వం ఉన్నా ఒకటే... లేకపోయినా ఒకటే. పెద్ద తేడా ఏమీ లేదు. వీటో హక్కుపై సరళంగా వ్యవహరిస్తే శాశ్వత సభ్యత్వం పొందడం కష్టంకాదన్న నిక్కీ హేలీ ప్రతిపాదనను భారత్ నిర్మొహమాటంగా తోసిపుచ్చింది. అయిదు శాశ్వత దేశాల మాదిరిగా బాధ్యతలు, విధులు, విశేష అధికారాలు కలిగి ఉండాలన్న పూర్వ వైఖరికే భారత్ కట్టుబడి ఉంది. భారత్ తో పాటు జపాన్, జర్మనీ, దక్షిణాఫ్రికా కూడా సభ్యత్వం కోసం పోటీ పడుతూ తమ వాదనలను వినిపిస్తూ, అర్హతలను చెబుతున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, అంతర్జాతీయ సమాజం ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా మండలిని తీర్చిదిద్దడం అయిదుగురు పెద్దన్నల బాధ్యత. ఈ దిశగా అవి ఎంతమేరకు చొరవ చూపగలవన్నదే ప్రస్తుతం అతి పెద్ద ప్రశ్న.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News