భవిష్యత్తులో బాబుగారి ఇబ్బందులు తప్పవా?

Update: 2017-10-22 14:30 GMT

అధికార వికేంద్రీకరణ నియంతృత్వానికి దారితీస్తుంది. అభివృద్ధి కేంద్రీకరణ అసంతృప్తికి కారణమవుతుంది. ఈ రెండూ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. పంచాయతీ సర్పంచ్ నుంచి ప్రధాని వరకు అధికారాలు, విధుల పంపిణీ స్పష్టంగా ఉంది. అందుకే ఈ విషయంలో పెద్దగా ఇబ్బందులు ఎదురు కాలేదు. కానీ అభివృద్ధి కేంద్రీకరణ అత్యంత ప్రమాదకరమైంది. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల నియోజకవర్గాలకు ప్రత్యేకంగా నిధులు అందించే విధానం, ప్రత్యేక అభివృద్ధి సంస్థలు ఉండేవి. అమేధీ, కుప్పం, పులివెందుల, పీలేరు... ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి నియోజకవర్గం గజ్వేల్ కోసం ప్రత్యేక సంస్థలు ఏర్పాటు చేశారు. ఈ విధానం అప్పటికప్పుడు బాగున్నట్లు అనిపించినప్పటికీ భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. విభజిత రాష్ట్రం ఏపీలో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంది. అభివృద్ధి అంతా రాజధాని పరిసరాలకే పరిమితమైంది. విజయవాడ, గుంటూరు, తెనాలి చుట్టూనే వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు ఏర్పాటవుతున్నాయి. రాజధాని అమరావతిలో అధునాతన సచివాలయం, రాజ్ భవన్, అసెంబ్లీ, శాసనమండలి భవన నిర్మాణాలకు కసరత్తు జరుగుతోంది. ఇది హర్షణీయమే. ఆహ్వానించదగ్గ పరిణామమే.

ఏ రాష్ట్రాన్ని చూసినా......

కాని హైకోర్టు కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలన, అందుకు అవసరమైన అధునాతన భవనాన్ని నిర్మించాలన్న నిర్ణయం అన్ని ప్రాంతాల ప్రజలకు ఎంతవరకూ ఆమోదయోగ్యం అన్న ప్రశ్న ఎదురవ్వక మానదు. పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా హైకోర్టును మరో ప్రాంతంలో ముఖ్యంగా రాయలసీమలో ఏర్పాటు చేస్తే సముచితంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదేవిధంగా వెనకబడిన ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మక సంస్థలను ఏర్పాటు చేస్తే సమతూకం పాటించినట్లు అవుతుంది. అన్ని కార్యాలయాలను రాజధానిలోనే ఏర్పాటు చేయాలన్న నిర్దిష్ట నిబంధన అంటూ ఏమీ లేదు. ముఖ్యంగా హైకోర్టు రాజధానిలోనే ఉండాలన్న చట్టం కూడా ఏమీ లేదు. దేశంలో మొత్తం 24 హైకోర్టులు ఉండగా వాటిల్లో కొన్ని రాష్ట్ర రాజధానుల్లో కాకుండా ఇతర నగరాల్లో ఉండటం గమనార్హం. దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కు హైకోర్టు రాజధాని లక్నోలో లేదు. అలహాబాద్ లో అత్యున్నత న్యాయ స్థానం ఉంది. లక్నోలో హైకోర్టు బెంచ్ మాత్రమే ఉంది. మరో పెద్ద రాష్ట్రమైన మధ్యప్రదేశ్ హైకోర్టు దాని రాజధాని భోపాల్ నగరంలో లేదు. జబల్ పూర్ నుంచి అది పనిచేస్తుంది. అదే సమయంలో గ్వాలియర్, ఇండోర్ లలో హైకోర్టు బెంచ్ లు ఉన్నాయి. దక్షిణాదిన అభివృద్ధి చెందిన, అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రంగా గుర్తింపు పొందిన కేరళలో హైకోర్టు దాని రాజధాని నగరం తిరువనంతపురంలో లేదు. కోచి నగరం నుంచి అది న్యాయసేవలు అందిస్తుంది. ఒడిషా హైకోర్టు కూడా రాజధాని భువనేశ్వర్ లో లేదు. కటక్ నగరం నుంచి న్యాయపాలన సాగుతోంది. ఉత్తరాఖండ్ హైకోర్టు కూడా దాని రాజధాని డెహ్రడూన్ లో లేదు. నైనిటాల్ నగరంలో న్యాయపాలిక కొలువై ఉంది. ఛత్తీస్ ఘడ్ హైకోర్టు కూడా రాజధాని రాయపూర్ నుంచి కాకుండా బిలాస్ పూర్ నుంచిపనిచేస్తుండటం గమనార్హం. ఇన్ని రాష్ట్రాల హైకోర్టులు రాజధానుల్లో కాకుండా వేర్వేరు ప్రాంతాల నుంచి పనిచేస్తున్నప్పటికీ పాలనాపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. విజయవంతమైన ఈ విధానాన్ని అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటో అర్ధం కాదు. నిజానికి రాజధానుల్లో కాకుండా వేరే ప్రాంతంలో హైకోర్టుల ఏర్పాటు చేయడం వల్ల ఆయా ప్రాంతాల ప్రజల్లో ఒకరకమైన భరోసా, సానకూల భావన కలుగుతుంది. న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయస్థానాల సిబ్బంది అక్కడే నివసిస్తుండటం వల్ల ఆయా నగరాలు కూడా అభివృద్ధి చెందే అవకాశముంది.ఏపీ ప్రభుత్వ పెద్దలకు ఇవన్నీ తెలియని విషయాలు కావు.

మరోచోట పెడితే ఇబ్బందేమిటో?

వాస్తవానికి తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు రాయలసీమ ప్రాంతానికి చెందిన కర్నూలు రాజధానిగా ఉండేది. కర్నూలు రాజధాని అయినందున ప్రత్యామ్నాయంగా కోస్తాంధ్రలోని గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేశారు. 1956 లో గుంటూరు కేంద్రంగా ఆంధ్ర హైకోర్టు పనిచేసింది. దిగ్గజాలైన న్యాయవాదులు అప్పట్లో ఇక్కడే తయారయ్యారు. 1956లో ఆంధ్ర, తెలంగాణ విలీనమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు హైకోర్టు హైదరాబాద్ కు మారింది. ఆ తర్వాత కూడా గుంటూరు లేదా విశాఖపట్నంలో బెంచ్ లను ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు విన్పించాయి. ఈ దిశగా కొద్దిరోజుల పాటు ఉద్యమాలు సాగాయి. రాష్ట్ర విభజనకు ముందు రోజుల్లో తీవ్రమైన ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా, పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా హైకోర్టును రాజధానిలో బదులు మరో ప్రాంతంలో ఏర్పాటు చేయడం ఉత్తమం.

హైకోర్టు బెంచ్ లు ఎన్నో....

న్యాయపాలన వికేంద్రీకరణలో భాగంగా దేశంలో 24 హైకోర్టులకు అనుబంధంగా హైకోర్టు బెంచ్ లు పనిచేస్తున్నాయి. మద్రాస్ హైకోర్టు కు అనుబంధంగా మధురైలో బెంచ్ ఉంది. కర్ణాటక హైకోర్టుకు అనుబంధంగా థార్వాడ, గుల్బర్గాల్లో బెంచ్ లు ఉన్నాయి. బాంబే హైకోర్టుకు అనుబంధంగా నాగపూర్, పనాజీ, ఔరంగాబాద్ ల్లో బెంచ్ లు ఎప్పటి నుంచో ఉన్నాయి. రాజస్థాన్ హైకోర్టు రాజధాని జైపూర్ తో పాటు జోధ్ పూర్ లో కూడా బెంచ్ పనిచేస్తుంది. కోల్ కత్తా హైకోర్టుకు అనుబంధంగా పోర్ట్ బ్లెయిర్ లో బెంచ్ పనిచేస్తోంది. దేశవ్యాప్తంగా గల వివిధ హైకోర్టు బెంచ్ లు చక్కటి పనితీరును కనబరుస్తున్నాయి. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా విజయవంతమైన ఈ విధానాన్ని పాటించడంలో తప్పేముంది. చంద్రబాబు గారూ... కొంచెం ఆలోచించండి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News