బ్లాక్ బస్టర్ ‘విన్’ కోసం ఇలా చేయాలా?

Update: 2018-01-03 16:30 GMT

దక్షిణ భారతంలో మరోసారి సినీ రాజకీయాల జడి మొదలైంది. పెద్ద రాష్ట్రమైన తమిళనాడుతోపాటు ఆంధ్రప్రదేశ్ లోనూ అగ్రతారలు సాధించే రాజకీయ విజయాలపై అంచనాలు మొదలయ్యాయి. రజనీకాంత్ రూట్ క్లియర్ చేసేశారు. వచ్చేస్తున్నానంటూ ప్రకటించేశారు. పవన్ కల్యాణ్ పక్కా అని తేల్చేశారు. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులతోపాటు వారికున్న వ్యక్తిగత ఆదరణ, వ్యక్తిత్వ చిత్రణలపై ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. ఆధ్యాత్మిక భావాలతో కూడిన రజనీకాంత్ స్పిరిచ్యువల్ పాలిటిక్స్ అంటూ తన పంథాను ప్రకటించారు. ఇక పవన్ కల్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న మంచిపనులపై సానుకూలంగా స్పందిస్తున్నారు. ప్రత్యామ్నాయం ప్రతిపాదించకుండా కొత్త ధోరణిని కనబరుస్తున్నారు. అందుకే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ల్లో అత్యధిక ఆదరణ కలిగిన ఈ సినీ రాజకీయవేత్తల ప్రస్థానం ఎటువంటి మలుపు తీసుకుంటుందనే విషయంలో రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇప్పటికే తమిళనాట రజనీకాంత్ వస్తే తమ మనుగడకు నష్టం వాటిల్లుతుందనే భావనలో ఉన్న పార్టీలు మతం రంగు పులిమేందుకు పూనుకుంటున్నాయి. బీజేపీకి బీ పార్టీగా రజనీ కొనసాగుతారని ప్రచారం మొదలు పెట్టేశారు. అటు పవన్ కల్యాణ్ ను తెలుగుదేశానికి బీ పార్టీగా ముద్ర వేసేస్తున్నారు. రెండు రకాలుగానూ ఈ నాయకులకు అనేక ప్రతిబంధకాలు, ఆటంకాలు ఎదురవుతున్నాయి. రాజకీయ పంథాపై స్పష్టతతో పాటు పోరాట వైఖరితో ముందడుగు వేస్తేనే ఈ పార్టీలు జనబాహుళ్యంలోకి చొచ్చుకుపోయే అవకాశాలుంటాయి.

ఆధ్యాత్మికత అర్థమిదేనా...?

ఫలితాన్ని ఆశించకుండా యుద్దం చేయి. అది నీ ధర్మం అంటుంది భగవద్గీత. నిన్ను నువ్వు నిమిత్తమాత్రుడిగా భావించుకుంటూ లోకంలోని వ్యవహారాలకు ప్రేక్షకునిగా ఉండిపోవడమే అసలైన ఆధ్యాత్మికత అంటాయి ఉపనిషత్తులు. ఇప్పుడు రజనీకాంత్ చెబుతున్న ఆధ్యాత్మిక రాజకీయాలు ఇందులోని ఏ కోవకు చెందుతాయో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కేవలం ఏడాది కాలంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మనస్తాపం చెంది పార్టీ పెడుతుంటే అంతకుమించిన ఆలోచనరాహిత్యం ఉండదు. ఏదో ఒక పార్టికి మద్దతిచ్చి దానిని గెలిపిస్తే సరిపోతుంది. ప్రత్యామ్నాయ విధానాలతో ప్రజాప్రగతికి, సంక్షేమానికి కృషి చేయాలన్న తపన ఉన్నప్పుడు మాత్రమే రాజకీయాల్లో రాణించడం సాధ్యమవుతుంది. ఫలితాన్ని ఆశించకుండా పని చేస్తే అది స్వచ్ఛందసంస్థగానే మిగిలిపోతుంది. లోకవ్యవహారాలతో సంబంధం లేకుండా బతికేస్తే సన్యాసం అవుతుంది. ఈ రెండు కూడా ఆధునిక రాజకీయాలకు అతికే వ్యవహారాలు కావు. పైపెచ్చు తమిళనాట హేతువాద పునాదులపై ఏర్పడిన ద్రవిడ రాజకీయం గడచిన యాభై సంవత్సరాలుగా రాజ్యం చేస్తోంది. దానినుంచి విడివడి ఒక్కసారిగా ఆధ్యాత్మిక రాజకీయాలు అనగానే ఇదేదో మతాన్నిపులిమే వ్యవహారమనే భావన చాలామంది ఓటర్లలో నెలకొనే ప్రమాదం ఉంది. నిజానికి నిష్కామకర్మత్వం తరహాలో పరిపాలన సాగించేందుకు అవసరమైన ప్రాతిపదికను ఏర్పాటు చేయాలనేది రజనీ ఉద్దేశంగా సన్నిహితులు చెబుతున్నారు. అవినీతి, అక్రమాలకు తావులేని స్వచ్ఛమైన రాజకీయమనేది ఆయన ఆంతర్యం. తాను ఏమీ ఆశించకుండా ప్రజలిచ్చిన అధికారాన్ని వారి యోగక్షేమాలకే వినియోగించాలనేది రజనీ గమ్యంగా పేర్కొంటున్నారు. కులము, మతము, ప్రాంతీయాభిమానము, ధనము కీలక పాత్ర పోషిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో రజనీ స్వప్నిస్తున్న పవిత్ర రాజకీయాలకు అవకాశం ఉందా? అంటే అనేకమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

బాబా..బహు పరాక్....

తమిళనాట రాజకీయాలపై ప్రజలు విసిగిపోయి అలసిపోయి ఉన్నమాట నిజం. సంక్షేమం, రాయితీలు, అనుచిత లబ్ధి చేకూర్చే పథకాలతో రకరకాల ప్రలోభాలతో పార్టీలు ఓటర్లను మత్తులో ముంచేశాయి. రజనీపై ఎంతటి అభిమానం ఉన్నప్పటికీ ఆ మత్తు నుంచి బయటపడి ఎన్నికల రథాన్ని గట్టెక్కిస్తారా? అంటే అనుమానాలున్నాయి. కేవలం రజనీ అభిమానులు మాత్రమే ఓట్లేస్తే అధికారంలోకి వచ్చేయడం సాధ్యం కాదు. సామాన్య ఓటర్లు కూడా స్పందించాలి. వారికి ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇస్తున్న పథకాల కంటే మెరుగైన సంక్షేమం, వ్యక్తిగత లబ్ధి చూపించగలగాలి. అప్పుడు బ్లాక్ బస్టర్ విజయం సాధ్యమవుతుంది. రుచించని సినిమానే చూడని ప్రజలు తమకేమిస్తుందో తెలియని ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారనుకోవడం అమాయకత్వమే. రజనీ గ్లామర్ పతాక స్థాయిలో ఉన్నప్పుడు విడుదలైన బాబా సినిమా అట్టర్ ప్లాఫ్ అయ్యింది. తమ హీరో నుంచి తాము ఆశించిన వినోదం లభించక తిప్పికొట్టారు తమిళ తంబిలు. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి వంటి నేతలు నిరంతరం కొత్త పథకాలు రూపొందిస్తూ ప్రభుత్వ ఖజానాను పప్పు బెల్లాలుగా పంచిపెడుతూ తమ పాపులారిటీని కాపాడుకుంటూ వచ్చారు. ప్రజలకు అనుచిత పథకాలను అలవాటుగా మార్చేశారు. మొత్తంగా ఈ ప్రక్రియను రివర్స్ గేర్ లో నడపటం సాధ్యం కాదు. స్పిరిచ్యువల్ పాలిటిక్స్ అయితే ఫర్వాలేదు కానీ ప్రాక్టికల్ పాలిటిక్స్ నుంచి దూరమైతే అధికారం అందని ద్రాక్షగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. రాజకీయాల్లో మార్పు అన్నది ఒక్కసారిగా రాదు. కొంచెం కొంచెంగా దానిని అలవాటు చేయాలి. సంప్రదాయ తమిళ రాజకీయాలకు కొత్త నడక నేర్పడం అంత సులభం కాదు. అందువల్ల రజనీ ఓటర్ల దారిలో నడుస్తూనే తన దారికి వారిని తెచ్చుకుంటే కొత్తమార్పునకు మార్గనిర్దేశం చేయగలుగుతాడు.

పాజిటివ్ పాలిటిక్స్ ...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టిన పవర్ స్టార్ శైలి అనూహ్యంగా కనిపిస్తోంది. ప్రశంసలు, విమర్శలు అప్పటికప్పుడు పవన్ తీసుకుంటున్న వైఖరిని బట్టి ఆధారపడి ఉంటున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తిగా నిన్నామొన్నటివరకూ కనిపించిన పవన్ కల్యాణ్ ఒక్కసారిగా ఆ ట్రెండును రివర్స్ చేసేశారు. పోరాడి సాధించుకునే విషయంలో కేసీఆర్ ను మించిన వారు లేరంటూ సర్టిఫికెట్ ఇచ్చేశారు. అటు చంద్రబాబుతోనూ నెయ్యం నెరపుతున్నారు. పవన్ చేస్తున్న విమర్శలు, పొగడ్తలు, ఆరోపణలు అన్నీ కూడా సందర్భోచితంగా ఉండేలా చూసుకుంటున్నారు. మంచి ఎక్కడున్నా తానుంటాననే ఇమేజ్ సృష్టించుకునే క్రమంలో పవన్ తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అవసరం లేకపోయినా ప్రగతి భవన్ కు వెళ్లి మరీ కేసీఆర్ ను అభినందించడంలో ఆంతర్యమిదే. కేవలం నెగిటివ్ పాలిటిక్స్ మీద ఆధారపడకుండా పాలు,నీళ్లు మాదిరిగా మంచి చెడ్డలను బేరీజు వేసి స్పందించాలనేది తమ అధినేత ఉద్దేశంగా జనసేనానికి సన్నిహితంగా మెలిగేవారు చెబుతున్నారు. నొప్పించక తానొవ్వక అన్నట్లుగా వ్యవహరిస్తున్న పవన్ తెలివైన రాజకీయవేత్తగానే ప్రస్తుతానికి కనిపిస్తున్నారు. తాడోపేడో తేల్చుకోవాల్సిన తరుణం వచ్చినప్పుడు తనను , పార్టీని ఏ దిశలో నడుపుతాడనే దానిపైనే జనసేన భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ఉత్తమ రాజకీయాలు ఆశిస్తున్న ఈ ఇద్దరు సినీ రాజకీయవేత్తలు సమయాన్ని, సందర్భాన్ని బట్టి వ్యూహాలు, ఎత్తుగడలతో బలపడితేనే సీజన్డ్ పొలిటీషియన్లకు బదులు చెప్పగలుగుతారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News