బ్లడ్ తాగేస్తున్న అల్ షబాబ్

Update: 2017-10-17 18:29 GMT

ఆకలి...అశాంతి.. అస్థిరతలకు మారుపేరు ఆఫ్రికా ఖండం. ఈప్రాంతంలోని ఏదో ఒక దేశం నిత్యం ఇలాంటి సమస్యలతో సతమతమవుతుంటాయి. పేదరికాన్ని రూపుమాపడానికి బదులు పరస్పర హననానికి పాల్పడటం ఇక్కడ సాధారణం. ఈ ఖండంలోని సోమాలియా కూడా అదేకోవలోకి వస్తుంది. ఈశాన్యాన జిబౌటి, నైరుతిన కెన్యా, ఉత్తరాన యెమెన్, అజెన్ జలసంధి, తూర్పున హిందూ మహాసముద్రం, పశ్చిమాన ఇథియోపియా సరిహద్దుగల సోమాలియా ఆఫ్రికా ఖండంలోని ఇతర దేశాల మాదిరిగా ఇది కూడా నిరుపేద దేశమే. ముస్లింల ఆధిపత్యం గల ఈ తీరదేశం నిత్యం అశాంతితో సతమతమవుతుంది. తాజా తాడుల్లో 231 మంది మృతి చెందడం ఇక్కడ తీవ్రవాద మూలాలు ఎంత బలంగా ఉన్నాయో తెలియజేస్తుంది. దేశ చరిత్రలో అత్యధిక మంది హతులవ్వడం ఇదే తొలిసారి. ఈ మారణహోమానికి ఏ సంస్థా తనదే బాధ్యతని ఇంతవరకూ ప్రకటించనప్పటికీ అల్ ఖైదా అనుబంధ సంస్థ ‘‘అల్ షబాబ్’’ పనేని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో ఈ సంస్థ దాడులకు పాల్పడి వందలాది మందిని పొట్టనపెట్టుకుంది. దేశ రాజధాని నగరం మొగదిషులో ప్రభుత్వ కార్యాలయాలు, హోటళ్లతో రద్దీగా ఉండే ప్రాంతంలో శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించింది. రక్షణ మంత్రి, సైనికాధిపతి రాజీనామా చేసిన రెండు రోజులకే ఈ ఘటన జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన దేశాధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్లాహి మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు.

రాజకీయ అస్థిరత కారణంగానే.....

రాజకీయ అస్థిరత కారణంగానే ఉగ్రవాదం వేళ్లూనుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ అస్థిరత కారణంగా ప్రభుత్వాలు సమర్ధంగా వ్యవహరించలేకపోవడంతో ఉగ్రవాదం విస్తరిస్తోంది. 1991లో అప్పటి నియంత సయ్యద బర్రేని పదవీచ్యుతిడిని చేసినప్పటికీ సుస్థిరప్రభుత్వం ఏర్పడలేదు. అప్పటి నుంచి కొనసాగుతున్న అంతర్యుద్ధం 2004లో మరింత తీవ్రరూపం దాల్చింది. పలు ఉగ్రవాద సంస్థలు ఉన్నప్పటికీ అల్ షబాబ్ పట్టు సాధించింది. విదేశాల్లో ఉన్న ఉగ్రవాదులు దీనికి అండదండగా నిలిచారు. చివరకు ఈ సంస్థ అల్ ఖైదాకు అనుబంధ సంస్థగా ప్రకటించుకుంది. క్రమంగా ప్రజల మద్దతు పొందింది. దేశంలోని పలు పట్టణాలు, ఓడరేవులపై ఆధిపత్యం సాధించింది. వీటిని స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వ దళాలు ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నాయి. ఉగ్రవాద సంస్థ అల్ షబాబ్ అధిపతి అహ్మద్ ఉమర్ అలియాస్ ఉబైదా ఆచూకీ తెలిపితే ఆరు మిలియన్ డాలర్ల (సుమారు 39 కోట్లు) బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. అల్ షబాబ్ ఛాందసవాద ఉగ్రవాదసంస్థ. వహాబీ సిద్ధాంతాలతో ప్రభావితమైన సంస్థ ఇది. అనాగరికంగా వ్యవహరిస్తోంది. ఇస్లామ్ కు తనదైన భాష్యం చెబుతుంది. కఠినంగా సంప్రదాయాలను అమలుచేస్తోంది. దొంగతనాలు చేసే వారిని చేతులు నరకడం, అక్రమ సంబంధాలు పెట్టుకునే మహిళలను రాళ్లతో కొట్టి చంపుతుంది. ప్రస్తుత ప్రభుత్వాన్ని పడగొట్టడమే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తుంది. అందుకే అదేపనిగా తరచూదాడులకు పాల్పడుతోంది. అమాయక ప్రజలను హననం చేస్తోంది.

ప్రత్యేక సైన్యం ఏర్పాటు చేసుకుని....

అల్ ఖైదా అధినేత అల్ జవహరి అండదండలు పుష్కలంగా ఉండటంతో దాని అరాచకాలకు అడ్డే ఉండటం లేదు. అల్ ఖైదా, ఐఎస్ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థలకు ఇరాక్, సిరియాల్లో ఇటీవల కాలంలో గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రభుత్వ దళాల ధాటికి అవి తట్టుకోలేక పోతున్నాయి. పలాయనం చిత్తగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాద సంస్థలు తమ ఉనికిని కాపాడుకునేందుకు గాను అల్ షబాబ్ వంటి సంస్థలను ప్రోత్సహిస్తున్నాయని అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం. దీని ఆగడాలు ఒక్క సోమాలియాకే పరిమితం కావడం లేదు. సైనిక చర్యల కారణంగా అప్పుడప్పుడూ సంస్థ బలహీన పడుతున్నట్లు కనపడుతున్నప్పటికీ వెంటనే పుంజుకోవడం అల్ షబాబ్ ప్రత్యేకత. సుమారు ఏడు నుంచి తొమ్మిది వేల మంది సాయుధులైన, సుశిక్షితులైన సైనికులు ఈ సంస్థ తరుపున పనిచేస్తున్నారు. అమెరికా, బ్రిటన్ వంటి పాశ్చాత్య దేశాలు దీనిని ఎప్పుడో నిషేధించాయి. నిషేధాలు పెరిగే కొద్దీ దానిని సవాల్ గా తీసుకుని ఈ సంస్థలు బలపడటం తప్ప బలహీనపడక పోవడం గమనార్హం. ప్రస్తుతం సోమాలియాలో సరైన ప్రభుత్వం లేదు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఉన్నా... సమర్ధమైన పాలన అందించలేకపోతుంది. సుమారు 20 వేల మంది సైనికులు గల ఆఫ్రికన్ యూనియన్ శాంతిదళం ప్రభుత్వానికి అండగా ఉన్నా పెద్దగా ఫలితం లేకుండా పోతోంది.

పరిష్కారం ఇలాగేనా?

ఒక్క ఆఫ్రికా ఖండమే కాదు యావత్ ప్రపంచం ఉగ్రవాద భూతంతో సతమతమవుతుంది. అయితే ఆఫ్రికాలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. పేదరికం, అశాంతి, సత్పరిపాలన అందివ్వలేని ప్రభుత్వాల కారణంగా ఉగ్రవాదం నానాటికీ వేళ్లూనుకుంటుంది. ప్రభుత్వాలు కూడా ఉగ్రవాదాన్ని అణిచి వేయాలనే కోణంలో ఆలోచిస్తున్నాయి తప్ప, దాని మూలాలను, పరిష్కార మార్గాలపై దృష్టి పెట్టడం లేదు. ఇక అణిచివేతలో కూడా పాశ్చాత్య దేశాల సహకారం తీసుకోవడం పుండుమీద కారం రాసినట్లవుతుంది. ఇది సమస్యను పరిష్కరించకపోగా మరింత తీవ్రరూపం దాల్చడానికి దోహదపడుతుంది. సత్పరిపాలనే శాంతికి దారి చూపిస్తుంది తప్ప అణిచివేత పరిష్కారం కాదు. అదే సమయంలో ఒక దేశ అంతరింగిక విషయాల్లో ఇతర దేశాలు జోక్యం చేసుకున్నంత కాలం సమస్య పరిష్కారం కాదన్నది చేదు నిజం. చరిత్ర చెబుతున్న సత్యాలివి. ....!

 

- ఎడిటోరియల్ డెస్క్

Similar News