బ్యాక్ డోర్ పాలిటిక్స్ లో దాదా కొత్త పాత్ర?

Update: 2017-10-15 05:30 GMT

రాజగురు..కింగ్ మేకర్...గాడ్ ఫాదర్..మార్గదర్శి..గైడింగ్ ఫోర్సు ..పేరేదైనా పోషించేది మాత్రం పెద్దన్న పాత్ర. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ దా పేరు ఇదే విషయమై తాజాగా చర్చల్లోకి వచ్చింది. ఎనభై రెండు సంవత్సరాల వయసు, 60 ఏళ్ల రాజకీయ జీవితాన్ని చవిచూసిన ముఖర్జీ ప్రస్తుతం విశ్రాంత దశలో ఉన్నారు. రాష్ట్రపతిగా పదవీ విరమణ అనంతరం జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ పుస్తకాలు రాసుకుంటున్నారు. జవసత్తువలు ఉడిగిపోయిన కాంగ్రెసుకు నవజీవం పోయాలంటూ ఆయనను కాంగ్రెసు అధినేత్రి సోనియాగాంధీ అభ్యర్థించినట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. 132 ఏళ్ల గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెసు భవిష్యత్తు ఏమవుతోందనే ఆదుర్దా కంటే పార్టీ అధ్యక్షునిగా పట్టాభిషిక్తుడవుతున్న రాహుల్ భవితవ్యం ఏమిటోనన్న బెంగే సోనియాను ఎక్కువగా వేధిస్తోంది. ప్రత్యర్థి మహాబలుడు, మాటల మరాఠి, హావభావాల అద్భుత విన్యాసకుడు, ఇటు చూస్తే కొంగు చాటు బిడ్డ. జయాపజయాల నీడలు పడకుండా ఇంతవరకూ పొదవి పట్టుకుని కాపాడినా ఇక సమయం ఆసన్నమైంది. యుద్ధరంగంలోకి దింపక తప్పదు. అయినా ఎక్కడో బెరుకు. అందుకే నెహ్రూ కాలం నుంచి దేశ రాజకీయాలను చూస్తూ ఇందిర హయాంలో ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగి, సోనియా నాయకత్వం వచ్చేసరికి దేశాధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన ప్రణబ్ ముఖర్జీని రాజగురు పాత్ర పోషించమని సోనియా కోరినట్లుగా పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. సకాలంలో సరైన సలహాలు, సూచనలు ఇవ్వడం, నాయకునిగా రాహుల్ పరిణతి చెందేలా తీర్చిదిద్దడం ప్రణబ్ కు అప్పగించబోతున్న బాధ్యతలు.

పార్టీ రుణం తీర్చుకోవాలనేనా?

కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలకు సంబంధించి 1996 నుంచి 2012 వరకూ తన అనుభవాలను విశదీకరిస్తూ తన ఆత్మకథ మూడో భాగం రాశారు ప్రణబ్. దీని ఆవిష్కరణకు యూపీఏ మిత్ర పక్షాలను మాత్రమే ఆహ్వనించారు. నిజానికి పుస్తకంలో ప్రస్తావించిన కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే 96 నుంచి 98 వరకూ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం పాలన సాగించింది. కాంగ్రెసు, బీజేపీ యేతర పక్షాల ప్రభుత్వమది. 98 నుంచి 2004 వరకూ ఎన్డీఏ పాలించింది. బీజేపీ మిత్రపక్షాల సంకీర్ణకాలమది. 2004 నుంచి బీజేపీయేతర కాంగ్రెసు, మిత్రపక్షాల యూపీఏ పాలన సాగింది. అందువల్ల ఈ పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొనడానికి దాదాపు దేశంలోని అన్ని రాజకీయ పక్షాలకు అర్హత ఉంది. అయినా ప్రణబ్ సెలక్టివ్ గా యూపీఏ పక్షాలనే పిలవడం ద్వారా ఒక రాజకీయ సంకేతాన్ని అందించినట్లుగా భావించాల్సి ఉంటుంది. పుస్తకావిష్కరణ విపక్షాల వేదికగా మారింది. కాంగ్రెసు బలపడుతుంది. తిరిగి జీవం పోసుకుంటుందంటూ తన అభిప్రాయాన్ని కూడా ప్రణబ్ ఒక ప్రముఖ చానల్ కు వెల్లడించారు. దీనిని బట్టి చూస్తే ప్రణబ్ రాజకీయాసక్తులు సజీవంగా ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. ఇందులో రెండు కోణాలు దాగి ఉన్నాయి. తనను పెంచి పోషించిన పార్టీ రుణం తీర్చుకోవాలనేది ఒకటైతే తన చేతుల మీదుగా ప్రధాని అభ్యర్థిని తయారుచేయాలనేది మరో కోణం. అసలు ప్రణబ్ ను ఈ కీలక బాధ్యతకు సోనియా ఎంచుకోవడంలోని ఆంతర్యం, అందుకుగల అర్హతలు ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అంశాలు.

పెద్దన్నే.. ప్రధాని కాలేకపోయారు....

అన్ని అర్హతలు ఉండీ అత్యున్నత రాజకీయ కార్యనిర్వాహక ‘ప్రధాని’ పదవిని అందుకోలేకపోయారు ప్రణబ్ ముఖర్జీ. మూడు సార్లు అవకాశం వచ్చి చేజారిపోయింది. యువకునిగా ఉన్న సమయంలోనే ప్రణబ్ పనితీరు నచ్చి ఇందిరాగాంధీ 1969 లోనే రాజ్యసభలో స్థానం కల్పించారు. 1970లలోనే కేంద్రమంత్రిని చేశారు. అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ప్రభుత్వం తరఫున కీలకంగా వ్యవహరించిన కేబినెట్ సభ్యుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఇందిర అభిమానాన్ని, విశ్వాసాన్ని చూరగొన్నారు. 1980 ల నాటికే ఇందిరాగాంధీ కోటరీలో ముఖ్యవ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1982 లో ఆర్థికమంత్రిగా ఇందిరాగాంధీ కేబినెట్ లో నెంబర్ టు స్థానం దక్కించుకోగలిగారు. ఐఎంఎఫ్ రుణాల చెల్లింపు వంటి విషయాల్లో దేశాన్ని ఒడ్డను పడేశారన్న ఖ్యాతి కూడా దక్కించుకున్నారు. నిజానికి దేశంలో ఆర్థిక సంస్కరణల తొలి పర్వం ఆయన హయాంలోనే మొదలైందని ఆర్థికవేత్తలు పేర్కొంటారు. మన్మోహన్ సింగ్ ను రిజర్వు బ్యాంకు గవర్నరుగా నియమించిది ప్రణబ్ ముఖర్జీనే. ఇందిరాగాంధీ మరణానంతరం ప్రధాని అయ్యే అవకాశాలు తనకే దక్కుతాయని భావించారు. కేవలం వారసత్వమే అర్హతగా అంతంతమాత్రం రాజకీయానుభవం ఉన్న రాజీవ్ ప్రధాని అయ్యారు. పీఎం పీఠం అందకుండా పోయిన తొలి ఘట్టం అది.

దూరం పెట్టిన రాజీవ్....

భారత ఆర్థికమంత్రిగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నా రాజీవ్ మాత్రం ప్రణబ్ ను దూరం పెట్టేశారు. దాంతో రాష్ట్రీయ సమాజ్ వాదీకాంగ్రెసు పేరిట సొంత కుంపటి పెట్టుకున్నారు. మళ్లీ మూడేళ్లకే 1989లో కాంగ్రెసులో చేరిపోయారు. 1991లో రాజీవ్ గాంధీ మరణం తర్వాత కూడా ప్రధాని రేసులో నిలిచారు. కానీ అనూహ్యంగా రాజకీయ సన్యాసం ప్రకటించిన పీవీ నరసింహారావును ఆ పీఠం వరించింది. ఇది ప్రణబ్ ముఖర్జీకి ప్రధాని రేసులో రెండో దెబ్బ. కాంగ్రెసు పరిస్థితి నానాటికీ దిగజారుతుండటంతో 1998లో సోనియాగాంధీని కాంగ్రెసు పగ్గాలు చేపట్టేలా చేయడంలో ప్రణబ్ తన వంతు పాత్ర పోషించారు. ఆ నమ్మకంతోనే 2004లో కాంగ్రెసు అధికారంలోకి వచ్చిన సందర్భంలో తాను ప్రధానిని అవుతానని ఆశించారు. సంకీర్ణ ప్రభుత్వం కావడం, సంప్రతింపులు జరిపి ఒకే మాటమీద విభిన్న పక్షాలను నడపాలంటే తనకున్న రాజకీయానుభవం ఉపయోగపడుతుందని దాదా భావించారు. కానీ సోనియా మరోలా తలచారు. 1990లలో పీవీ ఉదంతంతో తెలివి తెచ్చుకున్న సోనియాగాంధీ ప్రణబ్ ను పీఎం ను చేస్తే పార్టీని, ప్రభుత్వాన్ని చేజార్చుకున్నట్లవుతుందకున్నారు. ఆర్థిక విషయాలు తప్ప రాజకీయాల మచ్చ అంటని మన్ మోహన్ ను ప్రధానిని చేశారు. దీంతో ముచ్చటగా మూడోసారీ అవకాశం చేజారిపోయింది. ప్రధానిని చేయడానికి సాహసించలేదు కానీ ప్రణబ్ దా సలహాల విలువ సోనియాకు తెలుసు. అందుకే రాజకీయ పరమైన సంప్రతింపులు , నిర్ణయాల్లో ఆయన సేవలను వినియోగించుకున్నారు. యూపీఏ తొలిపాలనలో ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి ఏర్పాటైన తొలి కమిటీ సారథ్యం కూడా ఆయనకే అప్పగించారు. 1969 నుంచి అయిదుసార్లు రాజ్యసభ సభ్యునిగా, రెండు సార్లు లోక్ సభ సభ్యునిగా పనిచేసిన ప్రణబ్ ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, రక్షణ వంటి కీలకశాఖలన్నిటినీ నిర్వహించారు. పార్టీకి ప్రధాన కార్యదర్శిగా, వర్కింగు కమిటీ సభ్యునిగా చేశారు. 1980 నుంచి 85 వరకూ రాజ్యసభలో సభా నాయకునిగా 2004 నుంచి 2009 వరకూ లోక్సభలో సభానాయకునిగా వ్యవహరించారు. రాజకీయంగా, ప్రభుత్వ పరంగా ఇంతటి సుదీర్ఘమైన అనుభవం ప్రస్తుతం దేశంలోని మరే నాయకునికి లేదు. రాష్ట్రపతి పదవితో ఆయన రాజకీయ జీవితానికి ఒక రకంగా ముగింపు కార్డు పడింది.

రాహుల్ కు రాజగురువుగా ...

పురాణ, ఇతిహాస, చారిత్రక , ఆధునిక కాలం వరకూ పుటలు తిరగేస్తే కొత్త తరాన్ని తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర ఎంతటి ముఖ్యమో తెలుస్తుంది. అందులోనూ రాజకీయమంటేనే సకల శాస్త్ర సారం. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను బలఅతిబల విద్యలతో మహావీరులను చేశాడు. చాణుక్యుడు చంద్రగుప్తుడిని పీఠం కూర్చోబెట్టి మౌర్య సామ్రాజ్యానికి శకారంభం చేశాడు. తిమ్మరుసు శ్రీక్రుష్ణ దేవరాయలను తీర్చిదిద్దాడు. స్వాతంత్ర్యానంతరం ఈ అవకాశం కామరాజ్ నాడార్ కు దక్కింది. ఇద్దర్ని ప్రధానులుగా చేసిన ఖ్యాతి కామరాజ్ ది. తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసి పార్టీకి సేవ చేస్తానంటూ ఒక కొత్త చరిత్ర సృష్టించాడు కామరాజ్. అధికార భోగాలకు అలవాటు పడటంతో మంత్రులు ప్రజలకు , పార్టీకి దూరమవుతున్నారు. పార్టీ తన ప్రాబల్యాన్ని కోల్పోతోంది. అందువల్ల సీనియర్లు మంత్రి పదవులు విడిచిపెట్టి పార్టీకి సేవ చేయాలని పిలుపునిచ్చారు కామరాజ్. తాను ఆచరించి చూపించారు. దాంతో నెహ్రూ కామరాజ్ ను 1963లో ఏఐసీసీ అధ్యక్షుడిని చేశారు. నెహ్రూ మరణానంతరం లాల్ బహదూర్ శాస్త్రిని ప్రధాని చేయడంలోనూ , ఆయన మరణం తర్వాత 1966లో ఇందిరాగాంధీని ప్రధానిని చేయడంలోనూ కామరాజ్ మాటే చెల్లుబాటయ్యింది. మొరార్జీ దేశాయ్ వంటి సీనియర్లను పక్కనపెట్టి తాను చెప్పినట్లు వింటుందనే భావనతో ఇందిరకు మద్దతు కూడగట్టారు కామరాజ్. అందుకే ఇండియన్ పాలిటిక్స్ లో కింగ్ మేకర్ అనగానే కామరాజ్ నాడార్ గుర్తుకు వస్తారు. ఆతర్వాత కాలంలో ఇందిర, కామరాజ్ ల మధ్య విభేదాలు వచ్చాయి. అది వేరే సంగతి. దేశ రాజకీయాలను చదివేసిన అనుభవం, సందర్బాన్ని బట్టి అవసరమైనంత మేరకు మాత్రమే స్పందించే పరిపాలన పరిణతి ఉన్న ప్రణబ్ ఇప్పుడు రాహుల్ కు రాజగురు పాత్ర పోషించేందుకు సిద్దంగా ఉన్నారా? లేదా అన్నది అందరి మనసులను తొలిచేస్తున్న ప్రశ్న.

వారసుల కోసమేనా?

అయితే ఆయన అవసరాలు ఆయనకున్నాయి. ప్రణబ్ వారసులు అభిజిత్, షర్మిష్ఠ రాజకీయ రంగంలో ఉన్నారు. కాంగ్రెసులో వారు ఇంకా ఎదగాల్సి ఉంది. రాజకీయంగా తన ప్రస్థానం ముగిసినప్పటికీ పిల్లల భవిష్యత్తు కూడ కాంగ్రెసుతోనే ముడిపడి ఉండటంతో ఒక మార్గదర్శిగా, దిక్సూచిగా ప్రణబ్ తన బాధ్యతను నెరవేరుస్తారనే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవైపు రాజకీయ శిఖరంగా ఎదిగిపోయిన నరేంద్రమోడీ , మరోవైపు మాస్ లీడర్ గా ఎదగని రాహుల్ గాంధీ మధ్య సారూప్యతను, పోలికను తెచ్చి పోటాపోటీ వాతావరణాన్ని సృష్టించగల నైపుణ్యం ప్రణబ్ ముఖర్జీకి ఉందా? లేదా? అన్నది ఒక ప్రశ్న. అసలీ చారిత్రక బాధ్యత నిర్వర్తించేందుకు ఆయన అంగీకరిస్తారా? లేదా? అన్నది మరో ప్రశ్న. ప్రస్తుతం రాహుల్ చుట్టూ జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్, జితిన్ ప్రసాద, నవీన్ జిందాల్, మిలింద్ దియోరా వంటి యువనేతల కోటరీ కొనసాగుతోంది. ప్రణబ్ వంటి పాత తరం నాయకుని సలహాలు, సూచనలు స్వీకరించే ఓర్పు, సహనం ఈ కొత్త తరానికి ఉందా? అన్న సందేహమూ వెంటాడుతోంది. మొత్తమ్మీద సోనియా అభిలాష నెరవేరుతుందో లేదో కాలమే తేల్చాలి. క్రైస్తవ ఇతిహాసంలో సామ్యూల్ అనే రాజగురువు డేవిడ్ అనే కుర్రాడికి మార్గనిర్దేశం చేస్తూ ఉంటాడు . గోలియత్ అనే మహాయోధుడిని ఈ డేవిడ్ జయిస్తాడు. ఇప్పుడు ఆదునిక ప్రజాస్వామ్య భారతానికి ఈ కథను అనువర్తింపచేసుకోవచ్చునేమో వేచి చూడాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News